Monday, July 26, 2010

మా టీవీ తో మరో మధురానుభూతి

ఈ నెల (జూలై ) ఇరవై నాలుగున మా టీవీ యాజమాన్యం ' మా డే సెలబ్రేషన్స్ ' ని నిర్వహించింది . అవి ఎంత గొప్ప గా ఉన్నాయంటే ఒక్కొక్క ఐటెం గురించి ఐదేసి నిముషాల పాటు ప్రత్యేకం గా చెప్పొచ్చు . మ్యాట్రిక్స్ ప్రసాద్ గారు , అల్లు అరవింద్ గారు , చలసాని రమేష్ గారు , నాగార్జున గారు , సి. రామకృష్ణ గారు , శరత్ మరార్ గారు వీరి ఆధ్వర్యం లో , మా టీవీ వైస్ ప్రెసిడెంట్ సాయి ప్రసాద్ గారి నేతృత్వం లో జరిగిన ఆరోజు జరిగిన కార్యక్రమాలలో నా గురించి కూడా ఓ క్లిప్పింగ్ ని ప్రదర్శించడం నా జీవితానికి మిగిలిన మరో మంచి అనుభూతి . ఈ క్లిప్పింగ్ ని మా టీవీ లోని సీనియర్ మానేజర్ విక్టర్ షూట్ చేయగా , వరప్రసాద్ ఎడిట్ చేసారు . వీరందరికీ నా కృతఙ్ఞతలు . జత పరిచిన క్లిప్పింగ్ చూసి నాతో పాటు మీరు కూడా ఆనందిస్తారని ఆశిస్తూ ...

Monday, July 19, 2010

మా టీవీ మిగిల్చిన అద్భుత జ్ఞాపకాలు ...






















మా టీవీ నిర్వహించిన సూపర్ సింగర్స్ ఐదవ విభాగం ఫైనల్స్ నాకెన్నో మంచి మంచి జ్ఞాపకాలను మిగిల్చింది. కార్యక్రమం ద్వారా సినీ సంగీత ప్రపంచం లోని ప్రముఖుల్ని మరోసారి కలిసే అదృష్టం కలిగింది . వర్ధమాన గాయనీ గాయకులతో ముచ్చటించే అవకాశం వచ్చింది . సినీ సంగీతానికి సంబంధించి నాలోని ప్రతీ కణం - ప్రతీ క్షణం రగిల్చే
తపనకు ఆ ప్రోగ్రాం షూటింగ్ జరిగిన రెండు రోజులూ స్వాంతన లభించింది . మా టీవీ ప్రోగ్రామింగ్ డిపార్ట్ మెంట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ సాయి ప్రసాద్ నాకు కొన్నిబాధ్యతలను అప్ప చెప్పారు . అక్కినేని నాగేశ్వర రావు , మణిశర్మ లను ఆ కార్యక్రమానికి గెస్ట్ లు గా పిలవడం ఆ బాధ్యతల్లో ఓ భాగమే అయినా అది ఓ ఘనత గా నా ఎకౌంటు లో పడిపోయింది . అలాగే ఆ ఫైనల్స్ లో కీరవాణి గారి పక్కన కూర్చోవడం కూడా . ఆ ప్రముఖులతో నాకున్న పరిచయాలు వేరు . వారితో టీవీ లో కనిపించడం వేరు . ఆ ఘనతల వెనక నా కున్న అర్హతల మాటెలా వున్నా , వాటిని ఆ సమయంలో గుర్తించింది మాత్రం సాయి ప్రసాద్ గారే . మణిశర్మ తో నేను వున్న ఫోటోలలో ఆ పక్కనే ఎల్లో షార్ట్ లో ఫ్రెంచ్ బియర్డ్ తో వున్నది ఆయనే .. ఈ సందర్భం గా శ్రీ సాయి ప్రసాద్ గారికి నా కృతఙ్ఞతలు .

భవిష్యత్ లో చెప్పుకోడానికి గొప్ప గా ...


మా టీవీ నిర్వహించిన 'సూపర్ సింగర్స్ ' కార్యక్రమం గురించి మీ అందరికీ తెలిసే వుంటుంది . ఆ సీరీస్ లోని ఐదవ విభాగం లో నేను పాలు పంచుకునే అవకాశం వచ్చింది . ఈ ఫోటో ఆ ప్రోగ్రాం ఫైనల్స్ లో తీసినది . నా పక్కన వున్నది - శ్రీనిధి , అంజనా సౌమ్య , ప్రణవి . ముగ్గురూ మంచి గుర్తింపు ని పొందిన సింగర్ లే . ఈ ఫోటోని చూసుకుంటూ నేను మురిసిపోతూ , గొప్పగా చెప్పుకోదగ్గ స్టాయికి చేరే అర్హత ఈ ముగ్గురికీ వుంది . అంతే కాదు ప్రతిభను మించిన వినయ సంపద ముగ్గురిలోనూ వుంది . అదే వాళ్ళను పైకి తీసుకు వస్తుంది , కాపాడుతుంది కూడా . ఈ ఫోటో ని నాకు ఇస్తూ " మీ అమ్మాయిలా సార్ ? " అని అడిగారు - వాళ్ళతో ముఖ పరిచయం లేని వాళ్ళు . ఒక విధం గా అది కరక్టే . నిజానికి నాకు ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరూ అద్భుతంగా కాకపోయినా , బాగా పాడతారు . సింగింగ్ ని ప్రొఫెషన్ గా తీసుకోక పోవడం వల్ల అద్భుతం గా పాడే స్థాయి వాళ్లకి రాలేదు . ' ఒక విధం గా అది కరక్టే ' అని ఎందుకన్నానంటే - బాగా పాడుతూ ఆ వయసులో వున్న ఏ సింగర్ ని చూసినా నాకు నా కూతుళ్ళని చూసినట్టే వుంటుంది . వాళ్ళతో మాట్లాడుతూ వుంటే నాకు నా పిల్లలతో మాట్లాడినట్టే వుంటుంది . సూపర్ సింగర్ ద్వారా అందరికీ బాగా తెలిసిన శ్రావణ భార్గవి ఆంటే నాకు మరీ మరీ ఇష్టం . "మా ఇంటికి రామ్మా " అని మనసారా పిలిచాను కూడా . ఆ అమ్మాయి తో ఫోటో తీయించుకునే రోజు ఎప్పుడొస్తుందో ఏమో ... ఆ అమ్మాయి కి కూడా సింగర్ గా చాలా మంచి భవిష్యత్ వుందని నా నమ్మకం .

Thursday, July 15, 2010

ప్రకృతి ధర్మం


గుండెల్లో బడబాగ్నిని దాచుకుంటే

బైటికుబికే నీరు

ఉప్పగానే వుంటుంది

అది మనిషైనా సరే

సముద్రమైనా సరే ... !!

Saturday, July 3, 2010

అనుభవైకవేద్యం


బిడ్డకు తల్లి స్పర్శ

భార్యకు భర్త స్పర్శ

కవికి రస స్పర్శ

ఒకరు బోధించేవి కావు