Sunday, March 25, 2012

National award for Vidya Balan again విద్యాబాలన్ కి మరోసారి జాతీయ అవార్డు 




విద్యాబాలన్ కి 2012 సంవత్సరానికి జాతీయ స్థాయి లో ఉత్తమ నటిగా అవార్డు వస్తే ఈసారి ప్రతివారూ మెచ్చుకుంటారు - రాకపోతేనే బాధ పడతారు - అంత బాగా చేసింది 'కహానీ' లో... విద్యాబాలన్ అవార్డు తో పాటు మరో మూడు అవార్డులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను - బెస్ట్ బ్యాగ్రౌండ్ స్కోర్, బెస్ట్ స్క్రీన్ ప్లే , బెస్ట్ డైరెక్షన్. అన్నివిధాలా ఎంతో బాగుందీ సినిమా. అనవసరపు డ్యూయెట్లు లేవు.. ఐటం సాంగ్ ఒక్కటీ లేదు. సినిమా బిగినింగ్ నుంచీ ఎండింగ్ వరకూ ఏ డీవియేషన్లూ లేకుండా ఒకటే పాయింట్ మీద వెళ్తుంది. చూస్తుంటే ఎంత తృప్తి గా వుందో !? చూస్తున్నంత సేపూ మన సౌందర్య లేకుండా పోయిందే అని ఎన్ని సార్లు అనిపించిందో !? ఉంటే కచ్చితంగా తెలుగులో ఈ సినిమా ప్లాన్ చేసే వాళ్ళమేమో ... మళ్ళీ అంతలోనే అనిపించింది - గగనం ని ఆదరించామా , రామరాజ్యాన్ని ఆదరించామా ... ప్రస్తుతం మనకే అర్హత వుందని ఇలాంటి సినిమాని తెలుగుకి ఊహించడానికి !? వద్దు లెండి ... మనందరిలోనూ మార్పు వస్తే తప్ప మన సినిమాల ధోరణి మారదు. 
 

As a jury member for Nandi Awards నందీ అవార్డుల జ్యూరీ మెంబర్ గా ...



ఉగాది రోజున నందీ అవార్డుల జ్యూరీ మెంబర్ గా నందిని అందుకున్నాను. 2010 సంవత్సరం లో రిలీజైన సినిమాలకి సంబంధించి న్యాయ నిర్ణయం చేసినందుకు లభించిన మెమెంటో ఇది. నిజం చెప్పాలంటే అంతకు ముందు సంవత్సరాల జడ్జ్ మెంట్ కొన్నిచోట్ల విమర్శలకు గురైంది. 2010 జడ్జ్ మెంట్ కి మంచి పేరే తెచ్చుకున్నాం. ఈ సందర్భం గా గతం ఒక్కసారి గుర్తు చేసుకుంటే - 1976 నుంచి 1980 టైం లో నందీ అవార్డుల ఫంక్షన్స్ ని కవర్ చెయ్యడానికి జర్నలిస్ట్ గా వెళ్ళేవాడిని. ఆ తర్వాత వివిధ పత్రికలలో నా రచనలు చూసి నందీ అవార్డుల ఫంక్షన్లో స్టేజ్ మీద కామెంటరీ కి కొన్ని సంవత్సరాల పాటు నా చేత ఎఫ్ డీ సి వారు రాయించేవారు. 

ఓ సారి నందీ అవార్డుల ఫంక్షన్ కి షావుకారు జానకి గారు యాంకర్. ఆవిడ చెప్పాల్సిందంతా నేను రాయాలి. నేను రాయాల్సింది రాసిచ్చేసి వెళ్ళిపోయాను. ఆవిడ అంతా చదివి, "ఇది రాసినవారిని పిలిపించండి.వారితో నేను మాట్లాడాలి" అన్నారు. ఆవిడ ఆర్డర్ వేస్తే తిరుగేముంది ? వెంటనే నాకు కబురు పెట్టారు. ప్రతీ వాక్యాన్ని  ఆవిడ చదువుతూ, నేనెందుకలా రాసానో తెలుసుకుంటూ, రకరకాల మాడ్యులేషన్లలోపలుకుతూ ఉంటూ వుంటే  - ఆమె ప్రతిభకీ, కమిట్మెంట్ పట్ల ఆమెకి గల ఆసక్తికీ మనసులోనే నమస్కరించుకున్నాను. అంతటితో ఆగలేదావిడ . ప్రోగ్రాం చివర్లో " మీరందరూ నా కామెంటరీకి మెచ్చుకుని ఈ దండ వేసారే ... ఇది నేను రాసుకున్నది కాదు. దీన్నిచదివానంతే ... రాసినవారు వేరే వున్నారు ... ఈ మాటలూ ఈ భావాలూ అన్నీ ఆయనవే .." అంటూ పబ్లిక్ గా ప్రేక్షకులకి నిజం చెప్పేసి నన్ను స్టేజ్ మీదికి పిలిచేసి తన మెడలో వున్న దండ నాకు వేసేవరకూ ఊరుకోలేదు. అదీ ఆవిడ వ్యక్తిత్వం .

మరోసారి ఇలాంటి అనుభవమే ఎల్బీ శ్రీరాం తో ... అది కూడా నందీ అవార్డులకే ... రచన నాది. యాంకరింగ్ ఆయనది. షూటింగ్ లలో వుండడం  వల్ల క్షణం తీరికలేదాయనకి. ఫంక్షన్ కి ఓ అరగంట ముందు వచ్చి నేను రాసింది చదువుకోవడం మొదలు పెట్టాడు. " బొత్తిగా టైం లేకుండా పోయింది. ఎలా వస్తుందో ఏమిటో" అన్నాడు బెరుగ్గా . " మీరు రైటరు కాబట్టి మానేజ్ చెయ్యగలరు" అని చెప్పి కొన్ని మాడ్యులేషన్లు నేననుకున్నవి వివరించాను. స్టేజ్ మీద చెలరేగిపోయాడాయన. 

చాలాసార్లు చప్పట్లు పడ్డాయి ఆయన యాంకరింగ్ కి . ప్రోగ్రాం పూర్తయ్యాక ఆనందంతో నన్ను కౌగలించుకున్నాడు ఎల్బీ శ్రీరాం. ఆ తర్వాత నేను బిజీగా ఉండడంవల్ల క్లిప్పింగ్స్ పర్యవేక్షణ వరకూ కొన్ని నందీ అవార్డుల ఫంక్షన్ లకి నేను నా వంతు సాయం చేసాను. మాటీవీ లో చేరాక దర్శకుడి గా నేను తీసిన 'గుర్తుకొస్తున్నాయి' కార్యక్రమానికి ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా టీవీ అవార్డుల్లో నందీ అవార్డు ని అందుకున్నాను. ఇదిగో ... ఇప్పుడు జ్యూరీ మెంబర్ గా ... అదీ సినిమా విభాగానికి .... ఇదీ ఆంద్ర ప్రదేశ్ నందీ అవార్డులతో నా ప్రస్థానం.
ఈ జ్యూరీ అవార్డ్ ని అందుకునే టైం లోనే 2009 కి తన అవార్డులని అందుకోడానికి వచ్చాడు ఎల్బీ శ్రీరాం. అప్పటి సంగతులు తల్చుకున్నాం. " ఆ రోజు ఒరిజినల్ గా ఎంతో భయంగా వుంది.  మీ ధైర్యం చూస్తే మరింత భయం వేసింది " అన్నాడు నిర్మొహమాటం గా. "అయితేనేం ... మొత్తానికి చప్పట్లు పడ్డాయి గా" అన్నాను. మళ్ళీ మరోసారి కౌగలించుకున్నాడాయన మనస్పూర్తి గా .. ఎల్బీ తో స్నేహం కూడా అవార్దంత గొప్పదే !!

Friday, March 16, 2012

A Tribute to Music Director Bombya Ravi ఆయన సంగీతం - స్వర రాగ గంగా ప్రవాహం


గురుదత్ భార్య పాట పాడిన ఏయన్నార్ సినిమా ఏది  ?
ఎస్పీ కోదండపాణి సంగీతంలో వచ్చిన సినిమాలో గీతాదత్ పాడిన పాట ఏది ?

ఏ మ్యూజిక్ క్విజ్ లోనైనా ఇలాంటి ప్రశ్నలడిగితే ఆన్సరిచ్చే వాళ్ళు దొరకడం కష్టం. వీటికి ఆన్సరుందా అంటే అక్కినేని నటించిన 'మంచి కుటుంబం' సినిమాకి సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి. ఆ సినిమాలో  గీతాదత్ పాడిన 'డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డింగ్ లల్ల' అనే పాటుంది - అని జవాబు చెప్పొచ్చు.  అసలివి నిజమైన ప్రశ్నలేనా అని  లోతులకెళితే మాత్రం కరెక్ట్ కాదని ఒప్పుకోవలసి వస్తుంది.                                                                             జెమిని వాళ్ళు హిందీ లో తీసిన  'గృహస్తి' సినిమాలోదా పాట. ఆ పాటని ట్యూన్ చేసింది రవి. ఆ సినిమాని అటు తమిళం లో 'మోటార్ సుందరం పిళ్ళై' గా, తెలుగులో 'మంచి కుటుంబం' గా తీసినప్పుడు సందర్భానికి సూట్ అవుతుందని ఈ పాటని యధాతధం గా సీన్ తో సహా వాడుకున్నారు. అలా రవి పాట తెలుగు సినిమాలోకి డైరెక్ట్ గా వచ్చేసిందన్న మాట.  కాకపోతే అంతకు ముందూ, ఆ తర్వాతా రవి చేసిన ట్యూన్లు తెలుగు సినిమాల్లోకి వచ్చేసిన     సందర్భాలు చాలా వున్నాయి .                                                                                                                  నిన్ను చూడనీ  నన్ను పాడనీ  (మనుషులు - మమతలు) -  (ఎ ఖామోషియా ఎ తన్ హాయియా - యే రాస్తే హై      ప్యార్ కి), ఈ వేళ నాలో ఎందుకో ఆశలు (మూగనోము) - (తుమ్హారీ నజర్ క్యోం కఫా హోగయీ - దో కలియా), అన్నా అన్నా విన్నావా చిన్నీ కృష్ణుడు వచ్చాడు (ఇలవేల్పు) - చందామామా దూర్ కి (వచన్), అందచందాల ఓ  తారకా (వరుడు కావాలి) -(ముస్కురాతీ హుయీ చాంద్ నీ - అల్బేలీ), నీలిమేఘ మాలవో నీలాల  తారవో (మదన కామరాజు కథ) (చౌద్ వీ క చాంద్ హో - చౌద్ వీ కా చాంద్)                                                                                 ఇవిలా వుండగా ఒరిజినల్ సినిమాని పూర్తిగా హక్కులతో సహా కొనుక్కోవడం వల్ల ఆయా సినిమాల్లో రవి చేసిన ట్యూన్లు ( కొన్ని) తెలుగులో పాపులరైనవి వున్నాయి. అలా  'మా బాబు' లోని 'బాబూ నిద్దుర పోరా ' , 'చల్ చలో యని స్వారి చేసెను' పాటలకి 'చిరాగ్ కహా రోష్ని కహా' లోనూ, 'భలే తమ్ముడు' లోని 'ఎంతవారు గాని' , 'గోపాల బాల నిన్నే కోరి' , 'గుమ్మా గుమ్మా గుమ్మెత్తించే ముద్దుల గుమ్మా' పాటలకి 'చైనా టౌన్' లోనూ, 'భలే అబ్బాయిలు' లోని   'గులాబీలు పూసేవేళ' , 'ఎవరో నా మది లో' , 'ఏమౌనో ఈవేళలో' పాటలకి 'వక్త్' లోనూ 'మొనగాళ్ళకి మొనగాడు' లోని 'నేనున్నది నీలోనే' , 'వచ్చామే నీ కోసం' పాటలకి 'ఉస్తాదోం కె ఉస్తాద్' లోనూ వున్న ఒరిజినల్స్ ని చెప్పుకోవచ్చు.                                                                                                                                                   ఇదిలా వుండగా 'భక్త జయదేవ' లోని 'నీ మధు మురళీ గానలీల' పాటకి ('స్వర్ణ మంజరి' లోని 'ఝనన ఝనన ఝణ  నాదమే నాట్యం' పాటక్కూడా) 'నర్సీ భగత్' లోని 'దర్శన్ దో ఘన్ శ్యామ్' పాటా, 'పెద రాయుడు' లోని 'కదిలే కాలమా' పాటకి 'హమ్ రాజ్' లోని 'యే నీలే గగన్ కి తలే' పాటా - ఇన్స్పిరేషన్ అని విశ్లేషించే వారు కూడా లేకపోలేదు. ఇవి కూడా రవి ట్యూన్లే. ('ఉస్తాదోం కె ఉస్తాద్' లో 'మైనే కహాతా ఆనా సన్ డే  కో సన్ డే కో' పాటని మనవాళ్ళు 'గూఢచారి 116 ' లో 'మనసుతీరా నవ్వులె నవ్వులె నవ్వాలి' పాటకి వాడుకున్నరనే వాళ్ళున్నారు. కాకపోతే ఈ రెండిటికీ మూలం 'నెవర్ ఆన్ సన్ డే' అనే ట్యూనుంది కనుక రవికి పూర్తి క్రెడిట్ ఇవ్వడం న్యాయం కాదు.)                                                                                                                                                              ఇలా మన తెలుగు ప్రేక్షకులు 'ఇవి రవివి ' అని తెలిసో తెలియకో చాలా ట్యూన్ లు ఆయన చేసినవి ఎంజాయ్ చేసేసారు. ఇక రవి సంగీతాన్నిచ్చిన హిందీ సినిమాల్ని వాటిలోని పాటల్నీ ఉత్తరాది ప్రేక్షకులతో  సమానం గా ఆదరించిన దక్షిణాది ప్రేక్షక శ్రోతలు కోకొల్లలు. సి యే టి క్యాట్ - క్యాట్ మానె బిల్లీ, హమ్ కో మోహోబ్బత్ కరేగా (దిల్లీ  కా థగ్), చౌద్ వీ కా చాంద్ టైటిల్ సాంగ్,  యే హవా యే హవా, ఆజా ఆజారే తుఝ్ కో మేరా ప్యార్ పుకారే, చలో ఇక్ బార్ ఫిర్ సే, ఆప్ ఆయే తో ఖయాలే (గుమ్ రాహ్ - తెలుగులో అభినందన),  నీల్ గగన్ కి ఉడ్ తీ బాదల్ (ఖాన్ దాన్  - తెలుగులో కలసి వుంటే కలదు సుఖం ),  జబ్ చలీ టండీ హవా (దో బదన్), న ఝట్ కో జుల్ఫ్ కె పానీ (షెహనాయి), తోరా మన్ దర్పన్ కేహలాయే , మేరె భయ్యా మేరె చందా , చూలేనేదో నాజుక్ హోటోం కో, యే జుల్ఫ్ అగర్ జుల్ఫే (కాజల్ - తెలుగులో మా ఇంటి దేవత ), షిశిసే పీ, యే పైమానే సే పీ ( ఫూల్ ఆర్ పత్తర్ - తెలుగులో నిండుమనసులు తుజ్ కో పుకారే మేరా ప్యార్, బాబుల్ కి దువాయే ( నీల్ కమల్ ),  ఇవి కాక హమ్ రాజ్, వక్త్ లాంటి అల్ సాంగ్స్  హిట్ సినిమాలు ఎన్నో వున్నాయి రవికి.                                                                                                     1926 మార్చ్ 3 న  ఢిల్లీ లో పుట్టిన రవికి తండ్రి పాడే భజనల నుంచే సంగీతం అబ్బింది. తనకు తాను గా హార్మోనియం వాయించడం నేర్చుకున్నాడు. కుటుంబాన్ని పోషించడం  కోసం కొన్నాళ్ళు ఎలక్ట్రీషియన్ గా  పని చేసాడు. సింగర్ గా సెటిలవుదామని 1950 లో బొంబాయికి వచ్చేసాడు. ఇల్లు లేదు వాకిలి లేదు రోడ్ల మీదే మకాం. అలా హేమంత్ కుమార్ దృష్టిలో పడ్డాడు. 'ఆనంద్ మఠ్ ' లో 'వందే మాతరం' పాటలో  కోరస్ పాడడానికి తీసుకుపోయాడు హేమంత్.  ఆ తర్వాత కథ అతని పాటల ద్వారా అందరికీ తెలిసిందే . అటు మహేంద్ర కపూర్ కి, ఇటు ఆశా భోంస్లే కి  రవి పాటలే కొత్త లైఫ్ ఇచ్చాయని హిందీ సినీ సంగీత చరిత్ర తెలిసిన ప్రతివారూ ఒప్పుకుంటారు. ఆల్మోస్ట్ రిటైరింగ్ స్టేజ్ అని అందరూ అనుకుంటూ వుండగా మ్యూజిక్ చేసిన 'నిక్కా' సినిమాలోని 'దిల్ కె అర్ మా' పాటతో సల్మా ఆగా బెస్ట్ సింగర్ గా ఫిలిం ఫేర్ అవార్డ్ తెచ్చేసుకుంది. ఆ తర్వాత బాంబే రవిగా మళయాళ చిత్రాలకు సంగీతం ఇస్తే రెండు సార్లు ( 'నక్షత్రంగల్' సినిమాలోని 'మంజల్ ప్రసాదవుమ్ ' పాటకి,  'వైశాలి' లోని 'ఇందుపుష్పం' పాటకి)  చిత్ర నేషనల్ అవార్డ్ వచ్చింది.  మధ్యలో 'మహాభారత్' టీవీ సీరియల్ టైటిల్ సాంగ్ తో ప్రాంతీయ బేధాల్లేకుండా దేశం మొత్తం ఇంటింటా రవి పేరు మార్మోగి పోయింది. అప్పటివరకూ ఆయన సంగీతాన్ని వేరే దారుల్లో తీసుకున్న తెలుగు చలన  చిత్ర పరిశ్రమ 'సరిగమలు' చిత్రంతో నేరుగా స్వాగతం పలికింది. ఆ సినిమాలో జేసుదాసు పాడిన 'స్వర రాగ గంగా ప్రవాహమే' పాట ఔత్సాహిక గాయకులకి , మంచి పాటల కోసం ఎదురు చూసే శ్రోతలకి ఓ వరం లా నిలిచిపోయింది. 'ఎవరీ రవి ? ' తెలుగు వాళ్ళందరూ అడిగేలా చేసింది. 'సరిగమలు' సినిమాకి పాటలు రాసిన వేటూరి - ఆ పాటల గురించి , రవి గురించి ఇలా అన్నారు .                                                                                  " ఇహానికి పరానికి పనికొచ్చే సాహిత్యం సృష్టించే ఆవకాశం వున్న సినిమాలు ఎప్పుడో గాని రావు. సంగీత సాహిత్య భరితమైన 'సరిగమలు' చిత్రం - పాటల రచయితగా నాకెంతో తృప్తిని , మంచి పాటలు రాశానన్న నమ్మకాన్ని కలిగించిన చిత్రం. దానికి కారణం - అన్నీ ట్యూన్ కి రాసిన పాటలైనప్పటికీ - ఇచ్చిన ట్యూన్ లు సందర్భానికి పనికి వచ్చేవిగా , సాహిత్యానికి ఉపకరించేవిగా , ప్రేరణ కలిగించే విధంగా వుండడం.  ఈ చిత్రం లోని పాటలు ఇంత ప్రసిద్ధి పొందడానికి మూల కారకుడు - మహా సంగీత విద్వాంసుడు -  మా అందరికీ పూజనీయుడు అయినటువంటి రవి. ఆయన ఇచ్చిన ట్యూన్లలోని శక్తే నాచేత అటువంటి పాటలు రాయించింది. రవి గారు ఇచ్చిన ట్యూన్ల వల్ల నేను రాసిన సాహిత్యం అక్కరకొచ్చింది. 'సరిగమలు' లో  నేను రాసిన ప్రతీ పాటకీ నా మది లో గూడు కట్టుకున్న భావాలు అక్షరాలుగా మారి అమృతోపమానమైన సంగీత ప్రవాహంలో పూల పడవల్లా తేలి మీ హృదయ తీరాలకు చేరాయి ".   సర్వలోకాలకు చెందిన ఆ రవి కి అస్తమయం లేనట్టే స్వరలోకాలకు చెందిన ఈ రవికీ అస్తమయం లేదు.  మరణం మరు జన్మకి శ్రీకారం అనుకుంటే మనం చెప్పే ఈ వీడ్కోలే వేడుకోలై స్వాగత వచనం  పలుకుతుంది.  అందుకు మన వేటూరి వారి వాక్యాలే సాక్ష్యం, నివాళీ కూడా ...