Thursday, November 29, 2012

యస్. జానకి పాటల్లో అతి గొప్ప పాట




ఆ మధ్య ఓ పని మీద గాయని శ్రీమతి యస్. జానకి గారిని కలవడం జరిగింది. ఆవిడతో నా పరిచయం 23 ఏళ్ళు. చెన్నై లో వాళ్ళింట్లో ఆవిడ స్వయంగా నేతి తో చేసిన అట్లు తిన్న అదృష్టం నాది. 'సప్తపది' సినిమాలోని  'గోవుల్లు తెల్లన' పాటని అచ్చం అవిడ లాగే పాడుతోందని మురిసిపోయి స్వయంగా మా ఇంటికి వచ్చి (అప్పటికి రెండేళ్ళ) నా పెద్ద కూతుర్ని ఆడించారు. ఆ రోజు ఆవిడ ఇచ్చిన కుంకుమ భరిణ ఇవాళ్టికీ మా ఆవిడ వాడుతుంది. .
'విశాఖపట్నంలోని మా బంధువులలో మీ అభిమానులు చాలా మంది వున్నారండీ' అని అంటే వైజాగ్ వచ్చినప్పుడు గుర్తు పెట్టుకుని మా వాళ్ళింటికి వచ్చి సాయంత్రం ఏడు నుంచి రాత్రి పన్నెండు వరకూ వుండి ఎవరేం పెట్టినా కాదనకుండా తిని, ఎవరేది అడిగినా పాడి, పాడించుకుని అందర్నీ ఆనందాశ్చార్యాలలో ముంచి వెళ్ళిన సంస్కారి, స్నేహశీలి ఆవిడ.
ఆవిడ పాడిన పాటల్లో కన్నడ సినిమా ' హేమవతి ' లో 'శివ శివ యన్నదె' పాట నాకెక్కువ ఇష్టం. నా దృష్టిలో ' నీ లీల పాడెద దేవా ' కన్నా గొప్ప పాట అది. ఈ కన్నడ పాట రికార్డింగ్ లో వయొలిన్ వాయించిన ఎమ్మెస్ గోపాలకృష్ణ గారి వయొలిన్ తో సమానంగా చివర్న ఆవిడ వేసిన స్వరాలకి మతిపోతుంది. ఇది బాగా రిహార్సిల్స్ చేసి పాడిన పాట కాదు. అప్పటికప్పుడు నేర్చుకుని పాడిన పాట. ఈ ఒక్క పాటకే ఆవిడకి పద్మ అవార్డుల్లో దేన్నైనా ఇవ్వొచ్చు. ఈ తరం సింగర్లలో ఈ పాటని టచ్ చేయగల సామర్ధ్యం ఒక్క  శ్రీనిథి లోనే వుందని నా అభిప్రాయం. ఆ పాట లింకు జత పరుస్తున్నాను. కేవలం ఆడియో మీదే మనసు లగ్నం చేసి వినండి.
http://www.youtube.com/watch?v=rGLLevDBwDU

Monday, November 26, 2012

ప్రియతమా మనసు మారునా పాట ఒరిజినల్స్

1956లో భానుమతి , ఎమ్జీయార్ తో  ఆలీబాబా  40 దొంగలు అనే  డబ్బింగ్  సినిమా  వచ్చింది.   అందులోని '  ప్రియతమా  మనసు మారునా ' పాట  ఇవాళ్టికీ మర్చిపోలేని  వాళ్ళున్నారు . ఆ  పాట తమిళ మూలం ' మాసిలా  ఉన్మై కాదలే  ...' ఈ తమిళ మూలానికి  హిందీ  మూలం ' ఏ సభా ఉన్  సె  కెహ్  జరా '... (1953) లింకులు క్లిక్ చేసి చూడండి .

మాసిలా ఉన్మై కాదలే                            
http://www.youtube.com/watch?v=MBepNZJjK-4
ఏ సభా ఉన్ సె కెహ్ జరా                                             
http://www.youtube.com/watch?v=whKlS5OH36w