Tuesday, December 27, 2011

ఆనందం తో ఆశ్చర్య పోయిన హేమా మాలిని

నిన్న  (డిసెంబర్ 26th ) ఏయన్నార్ నేషనల్ అవార్డు హేమామాలిని కి ఇచ్చారు. సాధారణంగా నాగేశ్వరరావు గారు చేసే ఫంక్షన్ లన్నిటికీ  వారి అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి గా  నాకు ఇన్విటేషన్ వస్తుంది . అది నిజంగా నా భాగ్యమే . అలాగే ఈ ఫంక్షన్ కి కూడా వచ్చింది. ఏయన్నార్ గారి మీద రీసెర్చ్ చేసిన జర్నలిస్ట్ గా, ఆయన మీద 74 ఎపిసోడ్ లు
తీసిన డైరెక్టర్ గా నన్ను హేమా మాలిని కి పరిచయం చేశారు. ఒకే వ్యక్తి మీద 74 ఎపిసోడ్ లు తీయగలగడం మీద , ఏయన్నార్ గారి మీద రీసెర్చ్ చెయ్యడం మీదా ఆవిడ ఆనందం తో ఆశ్చర్య పోయింది . " ఇట్స్ గ్రేట్ " అంది. ఆ సందర్భం గా యధా ప్రకారం మన ఫోటో జర్నలిస్ట్ మిత్రుడు శివ కెమెరా క్లిక్ మనిపించాడు . రాత్రికి రాత్రే నా ఈ మెయిల్ కి పంపించాడు. శివ గనుక వెంటనే ఈ ఫోటో పంపించక పోయి వుంటే ఈ ఆనందాన్ని మీతో ఇంత త్వరగా పంచుకునే అదృష్టం నాకుండేది కాదు.


Wednesday, October 12, 2011

థాంక్ యూ రేడియో మిర్చి ...

రేడియో మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ 2010 కి న్యాయ నిర్ణేతలలో ఒకడిగా వ్యవహరించానని ఈ బ్లాగు రెగ్యులర్ గా చూస్తున్నవారికి బాగా తెలుసు. ఆ ఫంక్షన్ సెప్టెంబర్ 10 న చెన్నై లో అత్యంత వైభవం గా జరిగింది. నన్ను సకల మర్యాదలతో తీసుకువెళ్ళి ఎంతగానో గౌరవించి పంపించారు. థాంక్స్ టూ రేడియో మిర్చి టీమ్. ఆ కార్యక్రమం మా టీవీ లో అక్టోబర్ 9  న  ప్రసారమయింది. ఆ ప్రోగ్రామ్ లో నాకు సంబందించిన క్లిప్పింగ్స్ ని జత పరుస్తున్నాను. నా గురించి ఎంతో బాగా చెప్పిన రేడియో మిర్చి భార్గవి కి, హేమంత్ కి, ఈ క్లిప్పింగ్స్ ని నా పై అభిమానం తో ప్రత్యేకం గా ఎడిట్ చేసి ఇచ్చిన మా ఎడిటర్ వెంకట్ అచ్చి గారికి పేరు పేరునా నా కృతఙ్ఞతలు అందజేయకుండా ఉండలేను. క్లిప్పింగ్స్ చూసి మీ అభిప్రాయం రాయండి.


Saturday, August 13, 2011

సి ఎమ్ ని కలిసిన గురుతులు ....
2010 సంవత్సరానికి నందీ అవార్డుల జ్యూరీ మెంబర్ గా  దిగువన రాసినవి చదివారనీ చూసారనీ అనుకుంటూ మరొక మరిచిపోలేని అనుభవం గురించి చెప్తున్నాను . అవార్డుల నిర్ణయం అయిపోయాక సి యమ్ దగ్గిరికి వెళ్ళడానికి ముందు సభ్యులందరం కలిసి ఎఫ్ డీ సీ మేనేజింగ్ డైరెక్టర్ , ఐ ఎ ఎస్ ఆఫీసర్ వెంకటేశం గారితో ఫోటో తీయించుకున్నాం . ఆ తర్వాత సీ ఎం కిరణ్ కుమార్ రెడ్డి గారిని కలవడం అవన్నీ దిగువన రాసాను. ఐతే ఆ సంఘటనలను అన్నిటినీ ఫోటోల రూపం లో నాకు అందజేసింది ఎఫ్.డీ.సీ. లో మేనేజర్ మూర్తి గారు. ఆయన ఎంత డైనమిక్కో చెప్పలేను . మనకిది కావాలీ అని ఆయనతో అంటే చాలు . ఆ పని అయిపోయినట్టే . అలాగే ఎఫ్ డీ సీ లో అసిస్టెంట్ మేనేజర్ వెంకటేశ్వర్లు గారు. ఈయన మూర్తి గారికి కుడి భుజం . మూర్తి గారు ఎవరికైనా సరే కుడి భుజం లా వ్యవహరిస్తారు. ఈ రెండు భుజాలూ ప్లస్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేశం గారూ మొత్తం ముగ్గురూ ఓ త్రిభుజం లా ఏర్పడి మా చేత ఈ జ్యూరీ కార్యక్రమాన్ని నడిపింప చేసి మాకీ గౌరవం దక్కడానికి కారకులయ్యారు . సభ్యులందరం తీయించుకున్న ఫోటోలో కూర్చున్న వారిలో నా పక్కన బ్లూ షర్ట్ వేసుకుకుని కూర్చున్నది ఎఫ్ డీ సి ఎం డీ వెంకటేశం గారు. నిల్చున్న వారిలో కుడి వైపు వున్నది మూర్తి గారు (ఆయన రైట్ పర్సన్ కాబట్టి రైట్ సైడ్ నిలుచున్నారు). వెంకటేశ్వర్లు గారికి మొహమాటం ఎక్కువ . ఫోటో టైం కి మొహం చాటేశారు. ఎనీ వే మంచి మంచి గుర్తుల్ని భద్రపరుచుకోవడానికి వీలుగా ఫోటోల రూపం లోనూ , సీ డీ ల రూపం లోనూ వీలైంత త్వరగా నాకు అందజేసిన మూర్తి గారికి పదే పదే థాంక్స్ చెబుతూ ......  

Thursday, August 11, 2011

నందీ అవార్డుల జ్యూరీ మెంబర్ గా ....

2010 సంవత్సరానికి నందీ అవార్డుల జ్యూరీ సభ్యుడి గా వ్యవహరించానని దిగువన రాసాను. చదివారనుకుంటాను. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని కలవడం , ఆ తర్వాత జరిగిన ప్రెస్ మీట్ ... వీటన్నిటిలో నాకు
సంబందించిన వీడియో క్లిప్పింగ్ లని టీవీ 5 ముందుగా ఆగస్ట్ 5 న ప్రసారం చేసింది. నా సహోద్యోగి , మా టీవీ సినిమా పీఆర్వో రఘు ఆ క్లిప్పింగ్ లని సంపాదించి నాకు ఇచ్చారు . నా వరకు ఇవి అమూల్యమైనవి . అందుకే మీ అందరితో పంచుకోవాలని ఆశిస్తూ జత పరుస్తున్నాను.


Friday, August 5, 2011

నందీ అవార్డుల జ్యూరీ మెంబర్ గా ....


గత నలభై రోజులుగా బ్లాగ్ లో రాయకుండా వున్నవిషయం ఒకటుంది. అదేమిటంటే - 2010 సంవత్సరం నందీ అవార్డుల కమిటీ జ్యూరీ మెంబర్ గా ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం నన్ను నియమించింది.  మరో 15 మంది తో కలిసి గత నలభై రోజులుగా సుమారు 60 సినిమాలు చూసాను. పుస్తకాలు , వ్యాసాలకు సంబంధించి 2000 పేజీలు చదివాను ... అదీ ఈ నలభై రోజుల్లోనే ... సినీ పరిశ్రమ , తెలుగు ప్రేక్షకులు విపరీతంగా ఎదురుచూసే అవార్డ్ కమిటీ లో న్యాయ నిర్ణయ స్టానం లో వుండడం , (ఇవాళే) ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని కలిసి మా అభిప్రాయాలను చెప్పడం , ఆ తర్వాత ప్రెస్  మీట్ లో పాల్గొనడం ఇవన్నీ ఓ వింత అనుభూతినిచ్చాయి. సినిమా రీ రికార్డింగ్ కి ప్రత్యేకంగా ఓ అవార్డ్ వుండాలని గత పదేళ్ళు గా నా వ్యాసాలలో రాస్తూ , ఇంటర్వ్యూ లలో రీ రికార్డింగ్ ఇంపార్టెన్స్ ని చెబుతూ  రిప్రజెన్టేషన్ లు పెడుతూ వచ్చాను.భగవంతుడు నా మొర ఆలకించాడు . ఇన్నాళ్ళకు అవకాశం వచ్చింది . ఈ అవార్డుల సందర్భంగా నా సూచనను పరిశీలించడానికి ప్రభుత్వం అంగీకరించింది. నాకు చాలా ఆనందంగా, గర్వంగా వుంది . ప్రెస్ మీట్ ఫోటోలు జత పరుస్తున్నాను. టైం కి ఫోటో లు పంపిన మిత్రుడు , ఫోటో జర్నలిస్ట్ శివ కి , జ్యూరీ మెంబర్ గా వ్యవహరించడానికి అనుమతినిచ్చిన మా టీవీ కి ఎన్నిసార్లు కృతజ్ఞతలని చెప్పినా తక్కువే .... 
                

Sunday, July 10, 2011

Manisharma Birth Day Special మణిశర్మ పుట్టినరోజు సందర్భంగా ...

సంగీత దర్శకుడు  మణిశర్మతో నా పరిచయం దాదాపు 17 ఏళ్ళు గా.అతనికి నేనంటే ఎంతో అభిమానం, గౌరవం. నాక్కూడా అతనంటే ఎంతో ఇష్టం,ప్రేమ,అభిమానం,గౌరవం,వాత్సల్యం. ఫోన్ చేసి దేని గురించి అడిగినా ఏ భేషజం లేకుండా చెప్పేస్తాడు. ఈ మధ్యనే హైదరాబాద్ షిప్ట్ అయిపోయాడు. మొట్టమొదటి ఇంటర్వ్యూ నాకే ఇచ్చాడు . అదీ జూలై 11న తన పుట్టినరోజు సందర్భంగా.సినీ సంగీతాన్ని విపరీతంగా ప్రేమించే నాకు ఇంతకన్నా ఇంకేం కావాలి ? మణిశర్మ ఎన్నెన్నో మంచి మంచి ట్యూన్లు స్వరపరచాలని కోరుకుంటూ ... మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ...

Friday, July 8, 2011

As a Jury Member for Radio Mirchi Awards రేడియో మిర్చి అవార్ద్స్ కి జ్యూరి మెంబర్ గా ...

నా జీవితం లో మరొక అనందించదగ్గ, గౌరవప్రదమైన సంఘటన - రేడియో మిర్చి వారు ప్రతిష్టాత్మకంగా ఈ నెల 23న చెన్నై లో నిర్వహించబోతున్న 2010 మ్యూజిక్ అవార్ద్స్ జ్యూరీ సభ్యులలో ఒకనిగా వ్యవహరించడం. ఒక వారం పదిరోజులుగా ఆ వర్క్ లో వున్నాను. దాదాపు 590 పాటలు విన్నాను. నా వంతు జడ్జిమెంట్ ఇచ్చాను.అంతే కాదు లైఫ్ టైం ఎచీవ్ మెంట్ అవార్డ్ కి కూడా నా సలహాని వాళ్ళు స్వీకరించారు. అన్ని రిజల్ట్సూ తెలిసేది 23నే. ఈ సందర్భంగా జూలై 8న జరిగిన ప్రెస్ మీట్ కవరేజ్ ని, ఫొటోల్ని జతచేస్తున్నాను. నన్ను జ్యూరీ మెంబర్ గా ఎన్నిక చేసిన రేడియో మిర్చి చీఫ్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ తపన్ సేన్,మిగిలిన స్టాఫ్ లో ప్రముఖులైన శేఖర్, ప్రశాంత్,హేమంత్, భార్గవి వీరందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు. రియల్లీ అయాం వెరీ వెరీ హ్యాప్పీ అండ్ ఫీలింగ్ ప్రౌడ్ ఫర్ దిస్ ఆపర్ట్యూనిటీ.


Thursday, June 23, 2011

కె.విశ్వనాథ్ గారి సంస్కారం


 జూన్ 19 న జరిగిన మా టీవీ అవార్దుల కార్యక్రమం కి సంబందించి సుహాసిని ని,  కె. విశ్వనాథ్ గారిని లోనికి నేను తీసుకువస్తుండగా మిత్రుడు, ఫొటో జర్నలిస్ట్ శివ తీసి పంపించిన ఫొటోలివి. సుహాసిని గురించి ఆల్రెడీ రాసేశాను కాబట్టి ఆవిడతో నా పరిచయం విషయమై మళ్ళీ మళ్ళీ ప్రస్థావించడం లేదిక్కడ.  ఈ ఫంక్షన్ కి విశ్వనాథ్ గారు రావడంలో నా పాత్ర చాలా వుంది. నిజానికి జూన్ 16 నుంచి 23 వరకు ఓ తమిళ సినిమాలో నటించడానికి ఆయన డేట్ లు ఇచ్చేశారు. పైగా విక్రమ్ తో కాంబినేషన్. 'ఈ అవార్డ్ ఫంక్షన్ లో బాలూ గారికి  మీరే స్వర్ణకంకణ ధారణ చెయ్యాల'ని మా టీవీ తరఫున విశ్వనాథ్ గారిని రిక్వస్ట్ చేశాను. ఆయన ఆ తమిళ సినిమా వాళ్ళని ఒప్పించి 19 న ఫంక్షన్ కి రావడానికి చాలా శ్రమ తీసుకున్నారు. చెన్నై నుంచి రావడానికి , తిరిగి వెళ్ళడానికి మా టీవీ టిక్కెట్లు బుక్ చేసింది.ఆ తమిళ సినిమా షూటింగ్ డేట్లు కొంచెం అటూ ఇటూ అవడం వల్ల ఆయన చెన్నై వెళ్ళనే లేదు. 'మీ టిక్కెట్లు వేస్ట్ అవుతాయి. ముందు గానే కాన్సిల్ చేసుకోండి' అంటూ నాకు ఎన్నిసార్లు ఫోన్ చేశారో లెక్కలేదు. దీన్ని బట్టి చూస్తే ఇంత సిన్సియర్ మనుషులు ఈ రోజుల్లో కూడా వుంటారా అని అనిపించడం లేదూ ? 

Monday, June 20, 2011

మై ఫేవరెట్ స్టార్ ఆర్టిస్ట్

జూన్ 19 న మా టీవీ అవార్డ్స్ కార్యక్రమం జరిగింది . ఆ కార్యక్రమం మిగతా వివరాలు తర్వాత రాస్తాను. అనుకోకుండా అద్భుత నటి సుహాసిని ని కలిసే ఆవకాశం కలిగింది.  డబ్బింగే అయినా తెలుగు ప్రేక్షకులు సుహాసిని ని చూసింది 'మౌన గీతం ' (1981 ) సినిమాలో.  మొదటి సినిమాయే అయినా అప్పట్నించీ ఆమె అభిమానిని
అయిపోయాను. ఆమె నటించిన సినిమాలేవీ మిస్ కాలేదు నేను.  జూనియర్ ఎన్టీయార్ నటించిన రాఖీ లో  గానీ  శేఖర్ కమ్ముల తీసిన లీడర్ లో గానీ ఆమె నటన చూపించి  film institutes లో ఓ స్పెషల్ క్లాసే పెట్టొచ్చు. జంధ్యాల తీసిన ముద్దుల మనవరాలు టైం లో జంధ్యాల తో నాకున్న చనువు వల్ల  ఆమె తో కొన్ని సార్లు ముచ్చటించే ఆవకాశం కలిగింది. ఆ తర్వాత మణిరత్నం గారి దగ్గర assosiate director గా పని చేసిన పాణి గారితో నాకున్న పరిచయం వాళ్ళ సుహాసిని వ్యక్తిత్వం గురించి మాట్లాడుకునే వాళ్ళం . ఇవన్నీ ఆమె మీద నాకున్న గౌరవాన్ని మరింత గా పెంచాయి. వీటన్నిటి గుర్తుగా ఆమె తో ముచ్చటపడి తీయించుకున్న ఫోటో ఇది.

Tuesday, June 7, 2011

బాలూ గారి సత్కార సభ లో ...
చాలా రోజులయింది బ్లాగులో విశేషాలు రాసి. రాయకపోవడానికి కారణం ఒక్కటే అయినా రాయడానికి మాత్రం ఎన్నో వున్నాయి. ఇకముందు రెగ్యులర్ గా ఉండడానికి ప్రయత్నిస్తాను.  ఎగైన్ టు బిగిన్ విత్ ...
అందరికీ తెలిసినదే జూన్ 5 న హైదరాబాద్ లో బాలూ గారికి జరిగిన  సత్కారం గురించి ... వెళ్ళకుండా ఎలా
ఉండగలను ?  అత్యంత వైభవం గా జరిగింది. ప్రత్యక్షం గా     కళ్ళారా చూడగలగడం నా అదృష్టం ...
అదీ  సినారె , విశ్వనాథ్ వంటి మహా మహుల తో .. వారి సరసన కూచుని..!  జతపరిచిన ఫోటోలు అవే .           ఫోటో జర్నలిస్ట్ శివ ప్రత్యేకం గా తీసి పంపారు. థాంక్స్ టు హిమ్.  ఆ ఫోటోలలో నవ్వుతూ వున్నఫోటో
వెనుక ఓ చిన్నచమత్కారం వుంది. వ్యాఖ్యానం చేస్తున్న సునీత  ' ఇప్పుడు మరో నారాయణ రెడ్డి గారి పాట' అంటూ ఎనౌన్స్ చేసింది. " మరో నారాయణ రెడ్డి గారి పాటేంటి ... నారాయణ రెడ్డి గారి మరో పాట అనాలి
గాని ... ? ఇంకొకరెవరైనా నా పేరు తో పాటలు రాసేస్తున్నారా ? " అన్నారు సినారె . జర్నలిస్ట్ గా                       వున్నప్పుడు ఇలాంటి పద ప్రయోగాల్ని ఎన్నిటినో దిద్దాను  కాబట్టి వెంటనే వచ్చే సింది నవ్వు. అదీ కథ ...    

Monday, January 24, 2011

ఏయన్నార్ ఆవార్డ్ టు బాలచందర్


జనవరి 11 న ఏయన్నార్ ఆవార్డ్ టు బాలచందర్ ఫంక్షన్ జరిగింది. (ఈ న్యూస్ ఇంతకు ముందే పెట్టాల్సింది కానీ ఫోటో , వీడియో క్లిప్ నాకు అందే సరికి లేట్ అయింది)  ఆ ఫంక్షన్ లో బాలచందర్ గారిని చానల్  తరఫునుంచి సత్కరించే ఆవకాశం మా టీవీ నాకు ఇచ్చింది. దీనిక్కూడా కారణం మా టీవీ వైస్ ప్రెసిడెంట్ సాయి ప్రసాద్ గారే . బాలచందర్ గారి దగర కెళ్ళి శాలువా కప్పడం ఒక ఎత్తు. ఆయన కి షేక్ హ్యాండ్ ఇవ్వడం ఒక్కటీ ఒక ఎత్తు. పులకించి పోయాను ఆ క్షణం లో. ఎవరి తెలివి తేటలకి చిన్నప్పట్నుంచీ జోహార్లు అపించే వాళ్ళమో ఎవరి సినిమాలను చూడడం మేధో వర్గం కి సంబందించిన ఓ అదృష్టం గానూ, ఓ గొప్పతనం గానూ  భావించే వాళ్ళమో  అటువంటి వ్యక్తి తో చేయి  కలపడం - అన్నమయ్య భాషలో చెప్పాలంటే   - ఇది గాక సౌభాగ్యమిది కాక తపము మరి ఇది కాక  వైభవమ్మింకొకటి  కలదా ?  ఈ ఫంక్షన్ లోనే మరొక సంఘటన ఏమిటంటే  సుమ నన్ను పబ్లిక్ గా 'బాబాయ్ ' అనడం . సుమ నాకు తను యాంకర్ కాక ముందు నుంచీ పరిచయం . నన్ను తన తండ్రి లా  భావిస్తుంది.  నేనూ తనని ఎంతో అభిమానం గా చూసుకుంటాను. ఎంత బిజీ గా వున్నానేను అడిగితే తను కాదనదని మా టీవీ లో అనుకుంటూ వుంటారు . అలా అనుకోవడం నాక్కూడా ఇష్టం  కనుక ఆ అభిప్రాయాల్ని ఖండించను . సుమ అంటే నాకు ఎంత అభిమానమో అంతకన్నా ఎక్కువ గౌరవం . అంత తెలివైన, మర్యాద తెలిసిన - అమ్మాయిని నా జీవితంలో ఇప్పటి వరకూ చూడలేదు.  సుమ గురించి చాలా రాయాలనుంది. ఏదో ఓ రోజు ఆమె కి చాలా పెద్ద గౌరవం లభిస్తుంది. ఆ రోజు ఎక్కువ గా మాట్లాడేదీ , రాయాల్సొస్తే పేజీలకు  పేజీలు  రాసేది బహుశా  నేనే అవుతానేమో ?

Sunday, January 23, 2011

ఈవీవీ జ్ఞాపకాలు - 1


సాధారణంగా నాకు నిద్ర పడితే మధ్యలో మెలకువ రావడం బహు అరుదు - ఒంట్లో బాగులేక పోతేనే తప్ప.  ఈ జనవరి 21 న   మాత్రం రాత్రి పన్నెండు గంటలకోసారి, తెల్లవారు ఝామున మూడు గంటలకోసారి, మళ్ళీ నాలుగు గంటలకోసారి తెలివి వచ్చింది. ఎందుకిలా అవుతోంది అనుకుంటూ బలవంతాన పడుకున్నాను. పొద్దున్నే లేచే సరికి ఈవీవీ లేరన్న వార్త . ఏం చెయ్యాలో తోచలేదు. మనసుని జ్నాపకాల ముసుర్నుంచి తప్పించడం నా వల్ల కాలేదు.
నేను జంధ్యాలతో కలిసి తిరిగే రోజుల్లో ఆయనకి అసిస్టెంటు డైరెక్టర్ గా పరిచయ్యమయ్యాడు ఈవీవీ.  "సత్యం" అని పిలిచే వాళ్ళం. జంధ్యాల అంటే అతనికి విపరీతమైన గౌరవం. ఓసారి అవుట్ డోర్ షూటింగ్ లో చూడ్డానికి వచ్చిన వాళ్ళెవరో జంధ్యాల గురించి బ్యాడ్ గా కామెంట్ చేశారని వాళ్ళని కొట్టబోయేంత పని చేశాడు. అంత ఆవేశం మళ్ళీ అతనిలో ఎప్పుడూ చూడలేదు. జంధ్యాలకి సినిమాల్లేక ఖాళీ గా వున్నప్పుడు తను డైరెక్టర్ గా చాలా బిజీగా వున్నాడు. ఆ టైమ్ లో  జంధ్యాల ద్వారా పైకొచ్చిన వాళ్ళంతా కేవలం లిప్ సింపతీ చూపించారే తప్ప ఎవ్వరూ ఏమీ చెయ్యలేదు. తను మాత్రం ఓ పళ్ళెంలోలక్ష రూపాయల క్యాష్ పట్టు బట్టలతో సహా పెట్టి మరీ వచ్చాడు. అంత గడవని పరిస్థితేం కాదు జంధ్యాలది. ఐనా ఈవీవీ చేసిన ఈ పని జంధ్యాలకి ఓ మోరల్ సపోర్ట్ లాంటిది. జంధ్యాలే గనుక బ్రతికుంటే ఆయనకి ఆత్మ స్థైర్యం కలిగించడానికి తను నిర్మాతగా జంధ్యాల దర్శకత్వంలో ఓ సినిమా తీసి వుండేవాడేమో . (పై నున్న ఫోటో 31 డిసెంబర్ 2000 న తీసినది) .


ఈవీవీ జ్ఞాపకాలు - 2


"నీకూ నాకూ పెళ్ళంట " సినిమా తీస్తున్నప్పుడు జంధ్యాల ఓ గమ్మత్తు చేశాడు. తన స్నేహితులందరి చేతా ఆ సినిమాలో ఏదో ఓ వేషం వేయించాడు. అతనికా ఆలోచన వున్నట్టు నాకు తెలీదు. అర్జెంటుగా  ఫ్యామిలీతో సహా రమ్మంటే వెళ్ళాను. తీరా వెళ్ళే సరికి ఇలా యాక్ట్ చెయ్యాలీ అన్నాడు. యాక్టింగ్ అస్సలు చేత కాదు నాకు. పక్కనే బ్రహ్మానందం, నూతన్ ప్రసాద్ వాళ్ళ పోర్షన్లతో రెడీగా వున్నారు. జంధ్యాలతో వున్న చనువు వల్లో, యాక్టింగ్ రాకపోవడం వల్లో  కో ఆపరేట్ చెయ్యలేకపోయాను. అప్పుడు జంధ్యాల ఒకతన్ని పిలిచి నాతో యాక్ట్ చేయించే బాధ్యతని అప్పగించాడు. అతను చాలా సులువుగా తనకు కావలసిన ఎక్స్ ప్రెషన్ ని నానుంచి రాబట్టుకున్నాడు. అతనే ఈవీవీ.


ఈవీవీ జ్ఞాపకాలు - 3


టీవీ రచనల్లో నా చేత బాగా రాయించుకుని కొందరు డబ్బులు ఎగ్గొట్టేవారు. ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది పడే
వాణ్ణి.  ఈసంగతి తెలుసుకుని ఆ టైమ్ లో ఓ సినిమాకి (పేరు చెప్పడం భావ్యం కాదు) నా చేత రెండు సీన్లు , కామెడీ ట్రాక్ రాయించుకుని పదివేల రూపాయలు ఇచ్చాడు. ఆ రోజుల్లో పదివేలంటే ఇవాళ లక్ష్ కింద లెక్క . టైటిల్స్ లో పేరు పడని రైటర్ గా వుండడం ఇష్టం లేక ఆయన గ్రూప్ నుంచి బైటికి వచ్చేశాను. ఆ తర్వాత నుంచీ అతను తన దగ్గరుండే రైటర్ల పేర్లు రచనా సహకారం అంటూ టైటిల్స్ లో వెయ్యడం మొదలు పెట్టాడు.నేనన్నా, నేను రాసే కామెడీ అన్నా, సినీ సంగీతం పై నాకున్న అవగాహన అన్నా ఈవీవీకి చాలా గౌరవం.సినిమాలకి షూటింగ్ లని విదేశాల్లో ప్లాన్ చేసేవాడు.  "వరల్డ్ మ్యాప్ ముందరేసుకుని ఏయే ప్లేసులకెళ్ళలేదో వాటిని టిక్కు పెట్టుకుంటూ కథ రాసుకుంటున్నట్టుంది " అంటూ కామెంట్ చేశాను. గట్టిగా నవ్వేశాడు.


ఈవీవీ జ్ఞాపకాలు - 4


ప్రతి డిసెంబర్ 31 కీ జర్నలిస్ట్ లందరికీ విష్పర్ వ్యాలీలో పార్టీ ఇచ్చేవాడు. అప్పట్లో విష్పర్ వ్యాలీ అంటే ఊరవతల
కిందే లెక్క . "మీకేం .పార్టీ తర్వాత పైకెళ్ళి మీ రూమ్ లో హాయిగా పడుకుంటారు. వచ్చిన జర్నలిస్ట్ లు ఇంత చలిలో
అర్ధరాత్రి ఎలా వెళ్తారనుకున్నారు ? స్కూటర్లకి పంక్చర్ పడితే తోసుకుంటూ పోవడం తప్ప వాళ్ళకింకో గతి లేదు. మీరు పోసే ఆ రెండు పెగ్గులకి ఇంత అవస్త అవసరమా ? " అని అడిగాను అతనితో వున్న చనువు కొద్దీ. ఆ మాటల్ని
సీరియస్ గా తీసుకున్నాడతను.  కోపం రాలేదతనికి. మరుసటి సంవత్సరానికి జర్నలిస్ట్ లందరూ తిరిగి వెళ్ళడానికి
వెహికిల్స్ అరేంజ్ చేయించాడు.


ఈవీవీ జ్ఞాపకాలు - 5


ఓ సినిమాకి ఓ రెండు సీన్లు నాతో రాయించుకున్నాడని చెప్పాను కదా ... ఆ రెండు సీన్లలోనూ అతనితో విభేదించాను.
స్టాండర్డ్ దిగి రాయకూడదన్నాను. అతని బలవంతం మీద అతనికి కావలసినట్టు రాసిచ్చాను. " చూస్తూ వుండండి ... జనం వీటినే ఎంజాయ్ చేస్తారు." అన్నాడు. నిజంగా థియేటర్లో వాటికే క్లాప్స్ పడ్డాయి.  అలా రెండు మూడు సార్లు ఓడిపోయాను. కానీ ఒకే      ఒక్క సారి గెలిచాను. అదేమిటంటే ....
ఆర్యన్ రాజేష్ ని నటుడిగా పరిచయం చేస్తున్నప్పుడు  ప్ర్రెస్ మీట్ పెట్టాడు  మీటింగ్ అయిపోయాక సరదాగా కబుర్లు చెప్పుకుంటూకూచున్నాం. నరేష్ (అల్లరి నరేష్) ఎందుకో అక్కడికి వచ్చాడు . " మా రెండో వాడు " అంటూ పరిచయం చేశాడు.           "ఆడి కన్నా ఈడే మీకు పనికొచ్చేట్టున్నాడే ... ఫేస్ లో కామెడీ అదీ బాగా పలికేట్టుంది " అన్నాను. (ఈవీవీ తో మాట్లాడేటప్పుడే నా భాష మారిపోతూ వుంటుంది). " లేదు లేదు ...రాజేష్ మీద నాకు నమ్మకం వుంది " అన్నాడతను. తర్వాత కొన్నాళ్ళకి కలిసినప్పుడు ఈ ప్రస్థావన గుర్తుచేశాను. " అదే .. అదే " అన్నాడు జంధ్యాలని ఇమిటేట్ చేస్తూ...(ఒరిజినల్ గా ఈ మేనరిజమ్ మిస్సమ్మ లో యస్వీ రంగారావుది. దాన్ని జంధ్యాల సరదాగా అనుకరించేవాడు)

ఈవీవీ జ్ఞాపకాలు - 6


నేను హాసం పత్రిక నడిపిన మూడున్నర సంవత్సరాల్లో  తన సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా యాడ్ తప్పనిసరిగా ఇచ్చేవాడు. పేమెంట్ కూడాప్రామ్ట్ గా పే చేసేవాడు. తన సినిమా "ఆరుగురు పతివ్రతలు" పోయినప్పుడు " ఆ టైటిల్ కి నా పేరు బ్యాడ్ అయిపోయింది. అదే విశ్వనాథ్ గారి పేరు వుండి వుంటే తెగ మెచ్చుకునేవారు. నా పేరుతో వచ్చే సరికి వెకిలిగా ఫీల్ అయ్యారు " అన్నాడు నాతో పర్సనల్ గా.   అంతగా తనని తాను ఆత్మవిమర్శ చేసుకునేవాడు. " ఒక్కోసారి రాత్రి నిద్ర పట్టదు. భయం వేస్తూ వుంటుంది. నన్ను నమ్ముకుని యాభై కుటుంబాలు మద్రాసు నుంచి వచ్చేశాయి. ఫెయిలయినా సరే వాళ్ళ కోసమైనా సినిమాలు తీస్తూ వుండాలి నేను " అనేవాడు.


ఈవీవీ జ్ఞాపకాలు - 7


చివరగా ఈవీవీ తో మాట్లాడింది ఈ జనవరి ఆరున. . కొత్త సంవత్సరం లో కారు మార్చానని , ప్రస్థుతం ఓ ప్రాజెక్ట్ స్వంతంగా చేస్తున్నానని, అది అతి త్వరలో చెప్తానని ,  ఆ సందర్భం గా కలుస్తానని అన్నాను.  " సరుకు లేని వాళ్ళెంతో మంది సొమ్ము చేసుకుంటున్నారు. విషయం వుండి, పరిచయాలుండి, అనుభవం కూడా వుండి  మీరే ముందుకి రావటం లేదు. ధైర్యం చెయ్యండి. అంతా వున్నాంగా " అన్నాడు. కొండంత స్ఫూర్తినిచ్చాయి ఆ మాటలు. ఎందరి జీవితాల్లోనో వెలుగు నింపిన అతనిలోని దీపం - నా మనసులోని  ఆ ప్రాజెక్ట్ ఏమిటో వినకుండానే  కొండెక్కి పోయింది.


Monday, January 3, 2011

గొంతు కి 'చెక్ ' పెట్టిన మిరపకాయ్

రవితేజ , రిచా గంగోపాధ్యాయ నటించిన 'మిరపకాయ్ ' సినిమా 2011 సంక్రాంతి కి విడుదల కాబోతోంది.ఆ సినిమా ఆడియో
ఈ మధ్యనే రిలీజ్ అయింది. అందులోని పాటల్ని వింటుంటే నాకో డౌట్ వచ్చింది. వెంటనే ఆ సినిమా సంగీత దర్శకుడు తమన్ కి ఫోన్ చేస్తే క్లారిఫై చేసాడు .ఆ క్లారిఫికేషన్ చాలా ఇంటలిజెంట్ గా వుంది. ఈ విషయాన్ని నా జర్నలిస్ట్ మిత్రుడు , సాక్షి సినిమా పేజి ఇన్ఛార్జ్ ఎల్ . బాబూరావు గారితో చెప్పాను. అదే మేటర్నిసాక్షి సినిమా పేజి లో వేసాడాయన . ఆయనకు నా కృతఙ్ఞతలు. మీరు కూడా చదివి చూడండి.