Sunday, December 6, 2009

ఒక హిందీ - రెండు తెలుగులు

1957 లో హిందీలో ' బడాభాయ్ ' అనే సినిమా వచ్చింది. అందులో రెండు పాటలు బాగా పాప్యులర్. రెండో పాట గురించి , సినిమా గురించి, ఆ సినిమా సంగీత దర్శకుడి గురించి తర్వాత చెప్పుకుందాం. పాప్యులర్ అయిన మరో పాట ' చోరి చోరి దిల్ కా ' . బడాభాయ్ అధారం గా తెలుగులో 1959 లో ' శభాష్ రాముడు ' వచ్చింది. కనుక హిందీ లోని ' చోరి చోరి దిల్ కా ' పాట ట్యూన్ ని ' కల కల విరిసి జగాలే పులకించెలే ' కి వాడుకున్నారు.అదే సంవత్సరం విడుదలైన ' మాంగల్యబలం ' సినిమాలోని ' ఆకాశ వీధిలో అందాల జాబిలి ' పాటకి కూడా ఆ హిందీ సినిమా ట్యూన్ ని చాలా తెలివిగా వాడుకున్నారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఒరిజినల్ ఆధారం గా తీసుకుని చేసిన ' కల కల విరిసి ' పాట కన్నా - ఏ సంబంధం లేకుండా తీసుకుని చేసిన ' ఆకాశ వీధిలో ' పాట హిట్ అవడం. ఇక ' ఆకాశ వీధిలొ ' పాటను సుశీల తో పాడిన ఘంటసాలే ' కల కల విరిసి ' పాటకు సంగీత దర్శకుడు అవడం, ఈ రెండు తెలుగు పాటల్నీ శ్రీ శ్రీ యే రాయడం మరో విచిత్రం .
0

Tuesday, December 1, 2009

' అనగనగా ఆకాశం వుంది ' పాట గురించి ...


మలయాళ గాయకుడు జయచంద్రన్ గురించి తెలుగు వాళ్ళకి చాలా తక్కువ తెలుసు. జాతీయ స్థాయిలో తమిళ , మలయాళ సినీ రంగాల నుండి బహుమతులనందుకున్న గాయకుడాయన. సంగీత దర్శకుడు చక్రవర్తి 1980లలో ఈయనతో ఓ రెండు పాటలు పాడించారు. ఇక్కడ చెప్పొచ్చేదేమిటంటే సెంటిమెంట్స్ తెలుగు వాళ్ళకు తెగ ఎక్కువ కదా అది వర్కవుట్ అయ్యేసరికి ఆయన మన వాళ్ళకి ఓ పాట విషయం లో కంపల్సరీ అయిపోయాడు. ఉషా కిరణ్ వారి ' నువ్వే కావాలి ' సినిమా అందరికీ గుర్తుండే వుంటుంది. అందులో ' అనగనగా ఆకాశం వుంది ' పాట పెద్ద హిట్టు. ' నువ్వే కావాలి ' ఒరిజినల్ వెర్షన్ మలయాళం లో 'నిరం', అందులోని ఆ కాలేజి వార్షికోత్సవాల గీతాన్ని జయచంద్రనే పాడడం, అది పెద్ద హిట్ అవడం తో తెలుగులో కూడా ఆయనతోనే పాడించారు. జత పరిచిన వీడియోలను చూడండోసారి.

Sunday, November 22, 2009

రాజా కు అక్కినేని ప్రశంసలు

జీవితాంతం గుర్తుంచుకొదగ్గ సంఘటన ఇటీవల నా జీవితం లో జరిగింది. మా టీవీ లో ఉద్యోగం చేస్తున్నాను కనుక అక్కడ 'గుర్తుకొస్తున్నాయి ' అనే ప్రోగ్రాం గత మూడున్నర సంవత్సరాలుగా చేసేను. 2006 సంవత్సరానికి ఆంధ్రప్రదెశ్ ప్రభుత్వం మొదటి బహుమతినిచ్చి నందీ అవార్డు తో సత్కరించింది. ఆ తర్వాత ఆ కార్యక్రమాన్ని అక్కినేని నాగేశ్వరరావు గారితో కొనసాగించడం జరిగింది.ఆయన జీవితం లోని అన్ని అంశాలను స్పృశిస్తే సుమారు 74 ఎపిసోడ్ లు అయ్యాయి. ఆవన్నీ కలిపి 25 సీడీలు గా విడుదల అయ్యాయి. ఆ సీడీల ఆవిష్కరణ సభలో శ్రీ అక్కినేని నాగెశ్వర రావు గారు నా గురించి ఎంతో గొప్పగా చెప్పారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ,ప్రేక్షకులు గర్వించే ఓ లెజెండ్ నా గురించి మాట్లాడడం, ఎక్నాలెడ్జ్ చెయ్యడం నాకు నందీ అవార్డ్ కన్నా గొప్పగా అనిపించాయి.ఏయన్నార్ గారి ద్వారా ప్రశంసలు అందుకోవడం మాటలు కాదని పరిశ్రమలోని వారందరికీ తెలుసు. ఇన్నాళ్ళుగా నేను పడిన శ్రమకి భగవంతుడు ఈ రూపంలో గుర్తింపునిచ్చాడనిపించింది.నా ఆనందంలో పాలుపంచుంటారిని ఆశిస్తూ ఏయన్నార్ ప్రసంగం లో కొంత భాగాని వీడియోగా జతపరుస్తున్నాను.చూస్తారు కదూ ?

Tuesday, October 13, 2009

రాజా గురించి హెచ్ ఎం టీవి లో రామజోగయ్య శాస్త్రి

రామజోగయ్య శాస్త్రి గురించి ఇవాళ్టి సినీ శ్రోతలకు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అతి తక్కువ కాలంలో సింగిల్ కార్డ్ లిరిక్ రైటర్ గా ఎదిగిన వినయశీలుడైన ప్రతిభావంతుడు. ఇటీవల ఆయన్ని హైదరాబాద్ లో వున్న మరో శాటిలైట్ చానల్ హెచ్ ఎం టీవి ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూ లో నా గుంచి చెప్పి నన్ను ఎక్నాలెడ్జ్ చెయ్యడం నా జీవితం లో మరొక మరపురాని సంఘటన. సినీ పరిశ్రమ లో నాతో ప్రత్యక్ష సంబంధాలు గలవారున్నారు. పరోక్ష సంబంధాలు వున్నవారున్నారు. కొద్దో గొప్పో ఇప్పటికీ నన్ను సంప్రదించే వారున్నారు. మీ సలహా నా కెరియర్ కి , నా నాలెడ్జ్ కి వుపయోగపడిందన్నవారున్నారు. ఇవన్నీ తెర వెనుకే. సినిమా వారితో ముడిపడిన ముప్పై ఐదేళ్ళ నా కెరియర్ లో నన్ను పబ్లిక్ గా ఒక చానెల్ ద్వారా ఎక్నాలెద్జ్ చేసింది ఒక్క రామజోగయ్య శాస్త్రి గారు మాత్రమె . అందుకు ఆయనకు నా ప్రత్యేక కృతజ్ఞతలు . ఓ జ్ఞాపకంగా చూసుకోడానికి ఆయన ఇచ్చిన అర గంట ఇంటర్వ్యూ లో నా వరకు వున్న భాగాన్ని, నా మాటలతో సహా జత పరుస్తున్నాను.

Monday, August 17, 2009

భాష తెలిసినా పాడడానికి , రాయడానికి కష్టమైన పాట ఇది...

ఓ సారి వృత్తి రీత్యా ఓ ఇంటర్వ్యూ కోసం సంగేత దర్శకుడు కీరవాణి గారిని కలవడం జరిగింది.ఆయన కున్న టైట్ షెడ్యూల్ వల్ల కారులోనే ఇంటర్వ్యూ చేయక తప్పలేదు. ఇంటర్వ్యూ అయ్యాక, జర్నీ ఇంకా వుండడం చేత ఆయన తన దగ్గరున్న ల్యాప్ ట్యాప్ ని ఆన్ చేశారు. అప్పుడు వినిపించింది ఓ తమిళ గీతం. వినడానికి ఎంత గొప్ప గా అనిపించిందో పాడడానికి అంత కష్టం గా వుంటుందంపించిందా పాట.ఇది సుమారు ఏడు సంవత్సరాల క్రితం సంగతి. అప్పట్నుంచి సుమారు ఓ రెండేళ్ళ పాటు సాగింది వేట - ఆ పాట వివరాలు కనుక్కోడానికి. మా టీవీ లో ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగ రీత్యా చెన్నై వెళ్ళడం జరిగింది. అక్కడ కనబడ్డ ప్రతి వీడియో షాపులోనూ ఎంక్వైరీ చేయడం జరిగింది. ఒక షాపులో మాత్రం నా అవస్థ గమనించి ఆ పాటని ముత్తైతరు పాట అని అంటారని , అది అరుణగిరి నాదర్ 'సినిమాలోనిదని, ఆ వీడియో కాపీ తన దగ్గర ఒక్కటి మాత్రమే వుందని,దాని ఖరీదు రెండు వందల డబ్భై అయిదు అయినా హైద్రాబాద్ నుంచి వచ్చాను కనుక నూటా యాభై కి ఇస్తానని అన్నాడు. (మూసార్ బేర్ కంపెనీ రాకముందు వీసీడీల ధరలు అలాగే వుండేవి). అదికూడా మర్నాడు పదిన్నరకి వస్తేనే ఇస్తానన్నాడు. మర్నాడు సరిగ్గా అదే సమయానికి మణిశర్మతో ఇంటర్వ్యూ షూటింగ్.షెడ్యూల్ ప్రకారం ఆయన ఇంటికి వెళ్తే తెమలడానికి మరో అరంగంట కావాలన్నారు లక్కీగా.ఆ అరగంట నాకోసమే అన్నట్టుగా సెట్ అయింది. వెంటనే వెళ్ళి అ వీడియోని చేజిక్కించుకున్నాను. తిరిగి వచ్చాక చేతిలో ఉన్న వీడియోని చూసి, జరిగిన కథని మొత్తం విన్నాడు మణిశర్మ." ఆ ముత్తైతరు పాటని ప్రాక్టీస్ చెయ్యడాని చచ్చేవాళ్ళమండీ బాబూ ...."అంటూ ఆ పాటలో ఎక్కడెక్కడ కష్టం గా వుంటుందో వాటన్నిటినీ పాడి వినిపించాడాయన." ఇంత కష్టమైన సాహిత్యాన్ని తెలుగులో ఇప్పుడెవరైనా రాయగలరా ? " అని అడిగాను. దానికాయన " వేటూరి గారు ఒక్కరే రాయగలరు . ఐనా సంగీతం మీద ఇలాంటి ప్రయోగాలు ఇవాళ ఎవరు చెయ్యనిస్తారు ?" అన్నారు. విన్నాక మీకూ అనిపిస్తుంది ఇలాంటివి పాడడం ఎంత కష్టమో... అన్నట్టు ఈ పాటను పాడిందీ, పాటకు నటించిందీ తమిళ నాట అలనాటి ప్రముఖ గాయకుడు టి.యం.సౌందర్రాజన్.

Wednesday, August 5, 2009

ప్రే 'రణ ' రంగం లో సృజనాత్మకత


ఈ ఫొటోలో వున్నావిడ పేరు లీలానాయుడు. ఈ మధ్యనే చనిపోయింది. ఆ రోజుల్లో మంచి అందగత్తె గా ఈవిడ గురించి చెప్పుకునేవారు. ఈవిడ నటించిన సినిమాల్లో అందరికీ తెలిసిన సినిమా - ' ఏ రాస్తే హై ప్యార్ కి ' . అందులో రఫీ , ఆశా పాడిన ' ఎ ఖామోషియా ఎ తన్ హాయియా ' పాట చాలా పెద్ద హిట్. ఈ పాట ట్యూన్ ని కూడా మనవాళ్ళు వదలలేదు. 'మనుషులు - మమతలు ' సినిమాలో 'నిన్ను చూడనీ నన్ను పాడనీ ' పాటకి వాడుకున్నారు. కాకపోతే అప్పట్లో ఇటువంటి విషయాల్లో కొంత నిజాయితీ కూడా చూపే వారు. పల్లవినో, చరణాన్నో ప్రేరణగా తీసుకున్నా మిగతా భాగాన్ని అధ్భుతంగా స్వంతం గా చేసి, ప్రేరణగా తీసుకున్న భాగం తో కలిపి టోటల్ గా వచ్చిన అవుట్ పుట్టే ఒరిజినల్ అవుట్ పుట్టేమో అన్నంత బాగా పాటని తయారు చేసే వారు. అందుకు వుదాహరణ గా ' ఎ ఖామోషియా ' , 'నిన్ను చూడనీ ' పాటల్నే చెప్పుకోవాలి. రెండు పాటల్నీ మొత్తం గుర్తుకు తెచ్చుకునో లేదా డవున్ లోడ్ చేసుకుని వినో చూడండి. ప్రస్తుతానికి పల్లవులని మాత్రం క్లిక్ చెసి చూడండి.

Monday, July 13, 2009

' ఐయామ్ వెరీ సారీ ' పాట గురించి ...

ఇదివరకు ఏదైనా ఒక పాటని ఇన్ స్పిరేషన్ గా తీసుకుంటే ఆ ఒరిజినల్ సాంగ్ తెలియడానికి సంవత్సరాలు పట్టేది. గ్లోబలైజేషన్ పుణ్యమా అని ఇవాళ అందరికీ అన్నీ త్వరగానే తెలిసిపోతున్నాయి. అదీ కాక నేటి యువత కూడా మ్యూజిక్ పట్ల అప్ దేట్ గానే ఉంటున్నారు. ఒక అడాప్టేషన్ వినగానే ఒరిజినల్ ని క్షణాల మీద చెప్పేస్తున్నారు. ఐనా సరే కొన్ని రికార్డ్ కోసమైనా చెప్పక తప్పదు. పాప్ గాయని షకీరా పాడిన ' వేరెవర్ వెనెవర్ ' సాంగ్ చాల పాపులర్. దాన్ని ' నువ్వే నువ్వే ' సినిమాలో 'ఐయామ్ వెరీ సారీ ' పాట కోసం చాలా బాగా అడాప్ట్ చేశారు. ఎంత బాగా అడాప్ట్ చేశారో జతపరిచిన క్లిప్పింగ్స్ చూసి తెలుసుకోండి.

Saturday, July 11, 2009

' రావె రాధా రాణీ రావే ' పాట గురించి ...

పంతొమ్మిది వందల అరవై లో వచ్చిన 'శాంతి నివాసం ' సినిమాలో నాలుగు పాటలకి ట్యూన్ లు వేరే భాష నుండి తీసుకున్నారని ఇదివరకు చెప్పుకున్నాం . అందుకు ఉదాహరణ గా ' చక్కని దానా చిక్కని దానా ' పాట గురించి కూడా చెప్పుకున్నాం . అలాగే ఆ సినిమాలోని ఇంకో పాట ' రావే రాధా రాణీ రావే ' గురించి ఇప్పుడు ... ఈ పాటకి ఇప్పటికీ తిరుగులేదు. అంత హిట్ అయిందీ పాట . ఐతే అంతకు ఓ సంవత్సరం ముందు అంటే యాభై తొమ్మిది లో ' ఉజాలా' అనే సినిమా వచ్చింది . షమ్మీ కపూర్ , మాలాసిన్హా హీరో హీరోయిన్ లు . ఆ సినిమాలో సంగీత దర్శకులు శంకర్ - జైకిషన్ స్వరపరిచిన ' జూమ్ త మౌసమ్ మస్త్ మహీనా ' పాట చాలా పెద్ద హిట్ . అంతే కాదు ఆ పాత - గాయకుడు మన్నాడే కి ఓ వెరైటీ కూడా . ఆ పాట ట్యూన్ ని ఇంటర్లూడ్స్ తో సహా యధాతధం గా అనుకరించారు - ' రావే రాధా రాణీ రావే ' పాట కి. అందుకే ఆ హిందీ పాటనీ , మన తెలుగు పాట నీ కలిపి మరీ జత చేశాం. చూసి ఆనందించండి .

Friday, July 10, 2009

' ఖుషీ ఖుషీ గా నవ్వుతూ ' పాట గురించి ...

అన్నపూర్ణా వారి 'ఇద్దరు మిత్రులు ' లో 'ఖుషీ ఖుషీ గా నవ్వుతూ ' పాట అందరికీ గుర్తుండే వుంటుంది. ఆ పాట ట్యూన్ ని ' టామ్ డూలీ ' ఆల్బమ్ నుండి తీసుకున్నారు. ఐతే పల్లవి వరకు మాత్రమే తీసుకున్నారు. చరణాలన్నీ మన ట్యూన్ లే . ఫల్లవి వరకు ఉన్న రెండు ట్యూన్ లనీ కంపేర్ చేసుకుని చూడండి.

Tuesday, July 7, 2009

' వస్తా నీ వెనక ' పాట వెనక లింకులు

మహేష్ బాబు నటించిన ' నానీ ' లో 'వస్తా నీ వెనక ' పాట రెహమాన్ హిట్స్ లో ఒకటి. ఐతే ఈ పాట తమిళ వెర్షన్ కి మాత్రం ఓ తమాషా చేశారు. అంతకు కొన్నేళ్ళ క్రితం ఎంజీయార్, బి.సరోజా దేవి నటించిన 'పడగోట్టి ' అనే చిత్రం విడుదలైంది. అందులోని ' తొట్టాల్ పూమలరుం ' పాట ఆ రోజుల్లోనే కాదు నేటికీ తమిళ నాట పెద్ద హిట్ . ఆ పాట పల్లవిని తీసుకున్నారు. ఆ పల్లవి ఎలా వుంటుందంటే - తొట్టాల్ పూమలరుమ్ - తొడామల్ నాన్ మలర్దేన్ - సుట్టాల్ పొణ్ణ్ శివక్కుమ్ - సుడామల్ కణ్ శివన్ దేన్ - కంగల్ పడామల్ - కైగల్ తొడామల్ - కాదల్ వరువదిల్లై - నేరిల్ వరామల్ - నెంజిల్ తరామల్ - ఆశై విడువదిల్లై ' . బాగా గమనించి వినండి. 'నానీ ' తమిళ వెర్షన్ (సినిమా పేరు న్యూ ) పాటకి , ' పడగోట్టి ' లోని హిట్ సాంగ్ కి పల్లవి వరకూ సాహిత్యం ఒకటే. కానీ ఈ తమాషాల పర్వం ఇక్కడితో ఆగలేదు. 'ఫడగోట్టి ' లోని ' తొట్టాల్ పూమలరుం ' ట్యూన్ ని మనవాళ్ళు 'హాయ్ ' సినిమా లోని 'తంతే పడిపోయా 'అఏ పాట కోసం తీసుకున్నారు. జతపరిచిన క్లిప్పింగ్ లని చూడండోసారి మీకే అర్ధమైపోతుంది.

Monday, July 6, 2009

' శాంతినివాసం ' లో ' చక్కనిదానా చిక్కనిదానా ' పాట గురించి ...

శాంతినివాసం ' సినిమా పంథొమ్మిది వందల అరవై లో వచ్చింది . అందులోని పాటలలో ఓ నాలుగింటికి మాతృకలు వేరే భాషలో ఉన్నాయి . ఒకపాటకైతే రెండు మాతృకలున్నాయి. పిఠాపురం నాగేశ్వర రావు , స్వర్ణలత పాడగా రేలంగి, సురభి బాలసరస్వతి పై చిత్రీకరించిన ' చక్కనిదానా చిక్కనిదానా ఇంకా అలుకేనా ' అనే పాటకు సరైన ఒరిగినల్ గా - ' దిల్ దెకే దేఖో ' చిత్రం కోసం ఉషాఖన్నా స్వరపరచగా షమ్మీకపూర్ పై చిత్రీకరించిన ' దిల్ దేకే దేఖో ' టైటిల్ సాంగ్ ని చెప్పుకోవాలి. ఇది పంథొమ్మిది వందల యాభై తొమ్మిది లో వచ్చింది. ఐతే దీనికి ఇన్ స్పిరేషన్ గా ఓ పాటుంది. పంథొమ్మిది వందల యాభై ఎనిమిది లో మాక్ గ్వయిర్ సిస్టర్స్ (వీరు ముగ్గురు) పాడగా - విడుదలైన కొద్ది రోజుల్లోనే వన్ మిలియన్ రికార్డులు అమ్ముడు పోయిన ' షుగర్ ఇన్ ద మార్నింగ్, షుగర్ ఇన్ ద ఈవినింగ్ ' అనే 'షుగర్ టైమ్స్ ' పాట శ్రీమతి ఉషాఖన్నా కు ఇన్ స్పిరేషన్ . ఆ పాట పల్లవిని మాత్రం తీసుకొని, స్పీడు పెంచి, చరణాలకు ఇంటర్లూడ్ లకు సెపరేట్ ట్యూన్ ని 'దిల్ దేకే దేఖో 'పాటకు చేసిందామె. ఆ ట్యూన్ నే యధాతధం గా మనం 'శాంతినివాసం' లోని 'చక్కనిదానా ' పాటకి వాడేసుకున్నాం .

Sunday, July 5, 2009

ధరణికి గిరి భారమా పాట గురించి ...

చాలా కాలం క్రితం ' మంచి మనసుకు మంచి రోజులు ' అనే సినిమా వచ్చింది. అలా అనే కంటే ' ధరణికి గిరి భారమా ' అనే పాట ఉన్న సినిమా వచ్చింది అంటే ఎవరికైనా సరే వెంటనే అర్ధం అవుతుంది - అంత హిట్ అయింది ఆ పాట . ఆ ' మంచి మనసుకు మంచి రోజులు ' సినిమాకి సంగీతం ఘంటసాల . ఐతే ఈ పాట పల్లవి కి మాత్రం ట్యూన్ ని కె.వి. మహదేవన్ స్వరపరిచిన ఓ తమిళ పాట నుంచి తీసుకున్నారు. అసలేం జరిగిందంటే - తమిళం లో అంతకుముందు వచ్చిన ' తై పిరందాల్ వై పిరక్కుమ్ ' ఆధారంగా ' మంచి మనసుకు మంచి రోజులు ' సినిమాని తీశారు . ఆ ' తై పిరందాల్ ' లోని ' మణ్ణ్ క్క్ పరమ్ భారమా ' పాట ని పాడుకోని తల్లి ఆ రోజుల్లో తమిళ నాట లేదనే చెప్పాలి. అంచేత ఆ పాట ట్యూన్ ని పల్లవి వరకు నిర్మాతల కోరిక మేరకు అడాప్ట్ చెయ్యక తప్పలేదు ఘంటసాల గారికి. ఇక్కడ ఇంకో కొస మెరుపు ఏమిటంటే తెలుగు పాట ' ధరణి కి గిరి భారమా ' లో తల్లిగా నటించింది - ఒకనాటి హీరోయిన్ జయచిత్ర తల్లి అమ్మాజీ . ఈమె రోజులు మారాయి లో అక్కినేని కి చెల్లెలు గానూ , దైవబలం లో ఎన్టీయార్ కి హీరోయిన్ గానూ నటించింది.

Thursday, July 2, 2009

' వయస్సునామి ' పాట వెనుక రేగిన సునామి

' కంత్రీ ' సినిమాలో 'వయస్సునామి ' అనే పాటొకటుంది. ఈ పాటకి ట్యూన్ ని మణిశర్మ తమిళం నుంచి తీసుకున్నాడు. అంటే కాపీ కొట్టాడని కాదు. తెలుగులో హిట్టయిన ' పోకిరి ' సినిమాని తమిళంలో ' పోక్కిరి 'గా తీసినప్పుడు ఆ సినిమాకి సంగీత దర్శకుడి గా మన మణిశర్మని పెట్టుకున్నారు. అందులో ఆయన స్వరపరిచిన 'వసంతముళ్ళై ' అనే పాట తమిళనాట విపరీతంగా హిట్టయింది. ఆ పాట ట్యూన్ నే 'వయస్సునామి ' పాటకి వాడుకున్నాడు మణిశర్మ ... అంటే తన ట్యూన్ నే తను ఉపయోగించుకున్నాడన్నమాట . ఇదిలా ఉండగా దీనికి చేరిన మరో పిట్ట కథ ఏమిటంటే - యాభై ఏడులో శివాజీ గణేశన్ నటించిన 'సారంగధర ' విడుదలైంది. అందులో 'వసంతముళ్ళై ' అనే పల్లవితో మొదలయ్యే పాటొకటుంది.ఆ పాట ట్యూన్ ని ' పోక్కిరి ' లోని 'వసంతముళ్ళై ' పాట మధ్యలో మైక్ నుంచి వచ్చేట్టు సరదాగా ప్లాన్ చేసి పాడించుకొని చిత్రీకరించారు.ఈ సంగతి తెలియని కొందరు 'కంత్రీ ' లోని 'వయస్సునామి ' పాటకి ట్యూన్ ని పాత తమిళ చిత్రం నుండి మణిశర్మ కొట్టేశాడు అనే వార్తని ప్రచారం చేశారు. సో అదీ సంగతి. నిజానిజాలు తెలుసుకోడానికి ఆ క్లిప్పింగ్లు దిగువనే ఉన్నాయి. క్లిక్ చేసి చూడండోసారి.

Tuesday, June 23, 2009

అక్కినేని చేతి వేళ్ళకి డూపు


ఈ ఫొటొ లో వున్నాయన - ప్రముఖ సంగీత దర్శకుడు యస్. రాజేశ్వర రావు గారి పెద్దబ్బాయి రామలింగేశ్వర రావు. అందరూ సాలూరి బాబు అని అంటారు. ఈయన చేతి వేళ్ళు , అక్కినేని నాగెశ్వర రావు గారి చేతి వేళ్ళు ఒకేలా వుంటాయి. అంచేత ' చదువుకున్న అమ్మాయిలు ' సినిమాలో ' ఆడవాళ్ళ కోపంలో అందమున్నది ' అనే పాటలో అక్కినేని పియానో వాయించే క్లోజ్ షాట్లకి ఈయన చేతి వేళ్ళు డూప్ గా వాడేరు. ఆంతే కాదు ఆ సినిమాలో అక్కినేని పెట్టుకునే నల్లటి బెల్ట్ రిస్ట్ వాచ్ ని ఈ రామలింగేశ్వర రావు గారి చేతికి పెట్టి మరీ షాట్ తీశారు. దిగువనున్న వీడియో ని క్లిక్ చేసి చూడండోసారి .

Sunday, June 21, 2009

ఎన్టీయార్ కు తమిళ ' మాయాబజార్ ' లో డబ్బింగ్ ...

విజయా వారి 'మాయాబజార్ ' ద్వారా ఎన్టీయార్ కి శ్రీకృష్ణుడి గా ఎటువంటి ఇమేజ్ వచ్చిందో అందరికీ తెలుసు. ఆ చిత్రాన్ని విజయా వారు తెలుగు , తమిళ భాషలలో ఏక కాలంలో నిర్మించారు.ముఖ్య పాత్రలవరకు చూసుకుంటే - తమిళ వెర్షన్ లో ఏయన్నార్ పాత్రని జెమిని గణేషన్ , సియ్యస్సార్ పాత్రని నంబియార్ ధరించగా - యస్వీఆర్ పాత్రని యస్వీఆర్, ఎన్టీయార్ పాత్రని ఎన్టీయార్ , సావిత్రి పాత్రని సావిత్రి నటించారు. ఐతే యస్వీఆర్, సావిత్రి తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పుకోగా , ఎన్టీయార్ పాత్రకు మాత్రం వేరే వారి చేత డబ్బింగ్ చెప్పించారు. మచ్చుకి ఓ రెండు సీన్లు చూడండి.

Tuesday, June 16, 2009

' వివాహ భోజనంబు ' ని తమిళంలో పాడితే గొంతు పచ్చి పుండు ...

విజయా వారి 'మాయాబజార్ ' లో 'వివాహ భోజనంబు ' పాటను తెలుగు వెర్షన్ లో మాధవపెద్ది సత్యం , తమిళ వెర్షన్ లో తిరుచ్చి లోకనాథన్ పాడేరు. ట్యూన్ రెండు భాషలలోనూ ఒకటే. సాహిత్యం కూడా అంత నోరు తిరగనంతదేం కాదు. ఐతే తమిళ గీతాన్ని పాడిన తిరుచ్చి లోకనాథన్ గారికి గొంతు పచ్చి పుండై రెండు మూడు రోజుల దాకా మాట్లాడలేని పరిస్థితి వచ్చిందట. మన మాధవపెద్ది సత్యం గారు మాత్రం ఆ తెలుగు వెర్షన్ పాటను తను చనిపోయే దాకా స్టేజ్ ప్రోగ్రాం లలో కూడా పాడుతూ వుండేవారు. రిఫరెన్స్ కోసం రెండు పాటలనీ చూడండి ఓసారి .

' ఈ వెన్నెలా ఈ పున్నమి వెన్నెలా ' పాట వెనుక స్ఫూర్తి ...

' శభాష్ సూరి ' సినిమాలోని ' ఈ వెన్నెలా ఈ పున్నమి వెన్నెలా ' పాట గుర్తుండే వుంటుంది. తమిళం లో అంతకు ముందు వచ్చిన ' పెరియ ఇడుత పెణ్ణ్ ' అనే చిత్రం ఆధారంగా ఈ శభాష్ సూరి చిత్రాన్ని తీశారు. ఈ తమిళ చిత్రం లోని ' అన్డ్రు వందదుం ఇదే నిలా ' పాట స్టయిల్ ని, నడక ని , డ్రెస్ కోడ్ ని తెలుగు పాట ' ఈ వెన్నెలా ' పాటకు తీసుకున్నారు. ఐతే ట్యూన్ ఓపెనింగ్ కి మాత్రం క్లిఫ్ రిచర్డ్ పాడిన ' ద యంగ్ వన్స్ ' అనే పాట ట్యూన్ ని కొద్దిగా అనుకరించి , తమిళ పాట నడకతో జత కలుపుతూ తన దైన సృజనాత్మకతను జోడిస్తూ ' ఈ వెన్నెలా ' పాట ని ఆకర్షణీయం గా తయారు చేశారు సంగీత దర్శకుడు పెండ్యాల. మూడు పాటల వీడియో లను కొద్దిగా చూసి , వాటితో పాటు ' ఈ వెన్నెలా ' పాట క్లిప్పింగ్ ని కూడా మరోసారి చూసి కంపేర్ చేసుకోండి.

Monday, June 15, 2009

' మనసున మనసై ' పాటకు మూలం బెంగాలీ లో ...

గతం లో తెలుగు సినిమాలు బెంగాలీ సినీ పరిశ్రమ నుండి కథల్నీ, సంగీతాన్నీ తీసుకున్నాయని ఉదాహరణలతో సహా చెప్పుకున్నాం (ఓల్డర్ పోస్ట్ లు చూడండి). ఐతే అందుకు ఉదాహరణలు గా పేర్కొన్న ఆరాధన , మాంగల్యబలం సినిమాలలోని పాటలను చూపించినా - వాటి ఒరిజినల్స్ ఐన సాగరిక, అగ్నిపరీక్ష లను కథలతో సహా తీసుకున్నారు కాబట్టి - అని అనుకున్నా తప్పులేదు . కానీ మనందరికీ ఇష్టమైన ' మనసున మనసై ' పాటకు మూలం బెంగాలీలో వుందంటే కొంత ఆశ్చర్యం కలగకమానదు. ఎందుకంటే 'డాక్టర్ చక్రవర్తి ' సినిమా కథ స్వచ్చ మైన తెలుగు కథ. కోడూరి (అరికెపూడి) కౌసల్యా దేవి రాసిన 'చక్రభ్రమణం' నవల ఆధారంగా ఆ చిత్రాన్ని తీశారు. సో , అందులోని ఒక్క పాటకు కూడా బెంగాలీ సంగీతాన్ని ఆశ్రయించాల్సిన అవసరం లేదు. ఐనా 'మనసున మనసై' పాటకు 'శాప్ మోచన్ ' అనే బెంగాలీ సినిమాలో హేమంత్ కుమార్ స్వరపరిచి పాడిన పాట ట్యూన్ ని తీసుకున్నారు. ఆ బెంగాలీ పాటకు నటించింది ఉత్తమ్ కుమార్. జతపరిచిన వీడియో ని చూడండి మీకే తెలుస్తుంది.

Thursday, June 11, 2009

' పెనుచీకటాయే లోకం ' పాటకు మూలం బెంగాలీ లో ...


ఇదివరకటి రోజుల్లో తెలుగు సినిమాల మీద బెంగాలీ నవలల ప్రభావం , బెంగాలీ సినిమాల ప్రభావం వుండేది. ఏయన్నార్ ఆరాధన సినిమాని బెంగాలీ సినిమా ' సాగరిక ' ఆధారం గా తీశారని , అందులో ' నా హృదయం లో నిదిరించే చెలీ ' పాటకు మూలం ఆ సాగరిక సినిమాలో వుందని చెప్పుకున్నాం (సవివరం గా కావాలంటే ఓల్డర్ పోస్ట్స్ చూడండి). అలాగే అన్నపూర్ణా వారు ' మాంగల్యబలం ' సినిమాని ' అగ్ని పరీక్ష ' అనే ఓ బెంగాలీ సినిమా ఆధారం గా తీశారు. ఆ సంగతి ఆ సినిమా టైటిల్స్ లోనే ఎక్నాలెద్జ్ చేశారు. అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే మంగల్యబలం లోని ' పెను చీకటాయే లోకం ' పాట ట్యూన్ కూడా ఆ బెంగాలీ చిత్రం ' అగ్ని పరీక్ష ' నుంచి తీసుకున్నారన్నది కొందరికి మాత్రమే తెలిసిన విషయం . జతపరిచిన వీడియో ని చూసి కన్ఫర్మ్ చేసుకోండి .

' మల్లన్న ' లోని ఈ పాటని ట్రై చేసి చూడండోసారి

' మల్లన్న ' లో హీరో విక్రమ్ , దేవిశ్రీ ప్రసాద్ కలిసి పాడిన పాటలో 'ఇవన్నీ డూప్ ' అనే హుక్ లైన్ ని యూత్ తెగ పాడుకుంటున్నారు.ఈపాటలో మొదటి చరణం విక్రమ్ పాడేడు. మిగతా చరణాలు దేవిశ్రీ పాడేడు. సాహిత్యం ఎదురుగా వుంటేనే ఈ పాటను ఎవరైనా పాడగలరు. లేకపోతే ఎవ్వరూ పాడలేరు. ఎందుకంటే మొదటి చరణం లో రకరకాల చిరు తిళ్ళను పేర్కొంటూ ఇవన్నీ డూప్ - పిజ్జాయే టాప్పు అని అంటాడు విక్రమ్ . అలాగే రెండో చరణం లో రకరకాల బంధుత్వాలను పేర్కొని ఇవన్నీ డూప్ - స్నేహితుడే టాప్పు అని అంటాడు దేవిశ్రీ. ఇక మూడో చరణం లో రకరకాల ఫీలింగ్స్ గురించి చెప్తూ ఇవన్నీ డూప్ - జాలీయే టాప్పు అంటాడు. నాలుగో చరణం లో రకరకాల వ్యక్తులను సంభోధిస్తూ ఇవన్నీ డూప్ (వీళ్ళంతా డూప్ అని వుండాల్సింది) మల్లన్నే టాప్ అని ముగిస్తాడు. ఈ ' రకరకాలను ' ఏరి ఒక చోట కూర్చడం ఎంత కష్టమో ,వాటన్నిటినీ మర్చిపోకుండా గుక్క తిప్పుకోకుండా పాడడం అంతే కష్టం. అంచేతే 'ఇవన్నీ డూప్ ' అనే హుక్ లైన్ వుందనిపిస్తుంది. జత పరిచిన వీడియో ని చూడండోసారి .

Wednesday, June 10, 2009

పి.బి.శ్రీనివాస్ మొదట పాడింది ఏ భాష లోనో తెలుసా ?


ప్రముఖ గాయకుడు పి.బి.శ్రీనివాస్ గారిని కర్ణాటక ప్రభుత్వం రెండు వేల ఐదు వందల చదరపు అడుగుల స్థలాన్ని ఇచ్చి సత్కరించింది. మన గాయనీ గాయకులు మొదట మన ప్రభుత్వం నుండి కాక తమిళ , కర్ణాటక ప్రభుత్వాల నుండి గౌరవాలను పొందడం మామూలే . అవన్నీ పక్కన పెట్టి పి.బి.శ్రీనివాస్ గారి గురించి చెప్పుకోవాలంటే అంతటి సంస్కారి, మేధావి మరొకరు కనిపించరు మనకి. శాస్త్రీయ సంగీతం నేర్చుకునే వారికోసం ' డైమండ్ కీ ' కనిపెట్టాడాయన. ఎనిమిది భాషలలో కవిత్వం చెప్పగలడు , రాయగలడు కూదా . నవనీత సుమసుధ అనే రాగాన్ని కూడా కనిపెట్టాడాయన. ఇవి ఆయనెంతటి మేధావో చెప్పేవి. ఇక సంస్కారం గురించి ... బాలూ వచ్చిన కొత్తలో ఈయనకి పాటలు తగ్గితే కొంతమంది వచ్చి నెగెటివ్ గా మాట్లాదాలని ప్రయత్నిస్తే - ' మంచి పాటకి పి.బి.యస్. ఐతేనేంటి యస్.పి.బి. ఐతేనేంటి ?' అంటూ నవ్వేశాడాయన. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే పి.బి.శ్రీనివాస్ తొలుత సినీరంగ ప్రవేశం చేసింది హిందీ పాటతో. మిస్టర్ సంపత్ అనే హిందీ సినిమాలో ఆయన పాడిన తొలి గీతాన్ని కొద్దిగా వీడియో రూపంలో జతపరుస్తున్నాం. చూచి ఆనందించండి.

Monday, June 8, 2009

నా హృదయం లో నిదిరించే చెలీ పాటకి మూలం బెంగాలీ లో ...


' ఆరాధన ' పేరు తో తెలుగులో ముగ్గురు పాప్యులర్ హేరోలైన ఏయన్నార్,ఎన్టీయార్, చిరంజీవి తో మూడు హిట్ సినిమాలు వచ్చాయి. ఇందులో ఏయన్నార్ నటించిన 'ఆరాధన ' లో ' నా హృదయం లో నిదురించే చెలీ ' పాట ను ఎవ్వరూ మరిచిపోలేరు. కాకపోతే చాలా మందికి తెలియని విషయాలు ఈ సినిమా గురించి వున్నాయి. కాలక్రమేణా కొంతమదికి ఇప్పుదు తెలియొచ్చు గానీ అప్పట్లో ఇవి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ. ఏయన్నార్ ఆరాధన కి బెంగాలీ సినిమా ' సాగరిక ' మూలం . ఉత్తమ్ కుమార్ , సుచిత్రా సేన్ హీరో హీరోయిన్లు. అంతే కాదు మనం ఇవాళ్టికీ మర్చిపోలెకపోతున్న ' నా హృదయం లో నిదురించే చెలీ ' పాటను కూద ఆ బెంగాలీ సినిమా నుంచే తీసుకున్నారు. ఈ బెంగాలీ పాటకి సంగీతం రాబిన్ బెనర్జీ. జత పరిచిన వీడియో క్లిప్పింగ్స్ ని సరదాగా చూడండోసారి.

Sunday, June 7, 2009

' మల్లన్న ' లో ' అలేగ్రా ' పాట గురించి ...

ఈ పాటని రీటా పాడింది. ఈ అమ్మాయి కి తమిళ నాట సింగర్ గా మంచి పేరుంది. ఈ పాటకి రచన సాహితి. నటించింది గ్రూప్ డాన్సర్స్ తో శ్రియ . అలేగ్రా అంటే అదో ఇటాలియన్ పదం అనీ , ఈ పాట హిరోయిన్ ఇంట్రడక్షన్ సాంగ్ గా వస్తుందనీ ఓ అనధికార సమాచారం . ఇక పాటని ఎంత రిచ్ గా తీశారో జత పరిచిన వీడియో క్లిప్ ని చూస్తేనే తెలిసిపోతుంది . సీ అండ్ ఎంజాయ్

' మల్లన్న ' లో ' ఎక్స్ క్యూజ్ మీ ' పాట గురించి ...

'ఎక్స్ క్యూజ్ మీ మిస్టర్ మల్లన్నా' పాట ప్రస్తుతం క్రేజీ సాంగ్ ఆఫ్ ది యూత్ గా చెలామణీ అవుతోంది. దీని తమిళ వెర్షన్ ' ఎక్స్ క్యూజ్ మీ మిస్టర్ కందస్వామీ' పాటకు కూడా తమిళ నాట అంతే ఆదరణ లభిస్తోంది. మన దేవిశ్రే కి ఈ డ్యూయెల్ వెర్షన్ హిట్స్ కొత్త కాదు. లోగడ వర్షం (తెలుగు), మలై (తమిళం) కి కూడ ఇలాగే సమాన గౌరవాన్ని అందుకున్నాడాయన. ఈ పాటని హీరో విక్రమ్ , సుచిత్రా కార్తిక్ కుమార్ పాడారు. ఈ పాటలో కూదా విక్రమ్ గాయకుడి గా తన ప్రతిభను ఎలా ప్రదర్శించాడో గమనించవచ్చు. ఇక్కడ మరో మాట చెప్పుకో వలసింది రచయిత సాహితి గురించి. 'ఒట్టి సిమ్ కార్దు - ఎమ్టి ఐ పాడ్ - నిన్ను స్విచ్చాను చెయ్యడమే వేస్టూ ' లాంటి లేటెస్ట్ టెక్నాలజీ పదాలతో పాటు ' ఎల్ బోర్డూ ... రేయ్ ఎల్ బోర్డూ - ఎప్పుడెక్కుతావ్ మెయిన్ రోడ్డూ ' లాంటి చిలిపి చమత్కారాలు కూడా చేసి పాట ను జనం నోటికి పట్టుకునేలా చెయ్య గలిగాడు. జత పరిచిన వీడియోని చూడండి మీకు తెలియకుండా మీరే పాడుకుంటూ వుంటారు కాస్సేపటికి.

' మల్లన్న ' లో ' మాంబో మానియా ' పాట గురించి ...

ఈ పాట ని విక్రమ్ , రీటా పాడగా మధ్య మధ్య దేవిశ్రీ ప్రసాద్ గొంతు కూడా వినిపిస్తూ వుంటుంది. విక్రమ్ లోని గాయకుడు ఎన్ని పోకడలు పోయాడో చెప్పడానికి ఈ ఒక్క పాట సరిపోతుంది . చిత్రీకరణ కూడా బాగుంటుంది అని చెప్పడానికి ' ఫదేల్ ఫడేల్ ఫడేల్ ' దగ్గిర చూడండి. ఈ పాటకి మోహన రాగం ఆధారం . ఈ రాగం లో రెహమాన్ చేసిన 'మావేలే మావేలే ' (జంటిల్ మన్) , ఇళయరాజా చేసిన 'నిన్ను కోరీ వర్ణం (ఘర్షణ) పాటల్ని గుర్తుచేసుకుంటూ ఈ పాటని విని చూడండి . ఇళయరాజా , రెహమాన్ , దేవిశ్రీ ఈ ముగ్గురూ ఈ రాగాన్ని ఎంత బాగా ప్రయోగించారో తెలుస్తుంది .

Friday, June 5, 2009

పాటలు రాసే దాశరథి గారికి పాట ఎందుకు రాదు ?


ఆంధ్రప్రదేశ్ ఒకప్పటి ఆస్థాన కవి డాక్టర్ దాశరథి (అసలు పేరు దాశరథి కృష్ణమాచార్యులు ) సినీ గీత రచయిత కూడా అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అన్నపూర్ణా వారి ' ఇద్దరు మిత్రులు ' చిత్రం ద్వారా సినీ రంగప్రవేశం చేసిన దాశరథి గారికి ఆ బ్యానర్ అంటే ప్రత్యేకమైన గౌరవం . అందుకే అన్నపూర్ణా వారు తీసిన 'చదువుకున్న అమ్మాయిలు ' సినిమాలో ఓ చిన్న వేషం కూడా వేశాడాయన . ఆ సినిమాలోని బ్రహ్మచారుల నిలయం సెట్ ల లో బాత్ రూం దగ్గర క్యూ కట్టి బ్రహ్మచారులు అవస్థ పడే సీన్ లో బాత్ రూం లోకెళ్ళి తలుపేసుకుంటూ ' అబ్బాయిలూ ... నాకు పాట రాదు. తలుపు తీయొద్దు. తీశారో మీఖర్మ ' అని చెప్పి తలుపేసుకునే వ్యక్తి దాశరథి గారే. జతపరిచిన వీడియోని క్లిక్ చేసి చూసి గుర్తుపట్టండోసారి.

మీరిది గమనించారా ? (రెండు)

పంథొమ్మిది వందల అరవై నాలుగులో 'దాగుడుమూతలు ' అనే సినిమా రిలీజైంది. ఆ సినిమాలో ఓ పాట - 'దేవుడనే వాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం '. అలాగే పంథొమ్మిది వందల అరవై ఐదులో ' వీరాభిమన్యు ' అనే సినిమా రిలీజైంది. ఇందులోని పాట - ' రంభా ఊర్వశి తలదన్నే ' . ఈ రెండు సినిమాలకీ కేవీ మహదేవనే సంగీత దర్శకుడు.ఈ రెండు పాటలూ హిట్టే. కానీ ఈ రెండు పాటల్లోనూ ఒక లైన్ దగ్గర ట్యూన్ కామన్ గా వుందని ఆ రోజుల్లో కొంతమంది మాత్రమే గ్రహించగలిగారు. కావాలంటే ' దేవుడనే వాడున్నాడా ' పాటలో 'తాము నవ్వుతూ నవ్విస్తారు కొందరు అందరినీ ' అనే లైన్ దగ్గిర ట్యూనూ , ' రంభా ఊర్వశి తలదన్నే ' పాటలో ' తనివితీరా వలచి హృదయం కానుకీయని కరమేలా ' , 'కలికి సరసనా పులకరించీ కరగిపోవని తనువేలా ' అనే లైన్ల దగ్గర ట్యూనూ ఒకేలా వుంటాయి వినడానికి. ఈ ఆర్టికిల్ తో పాటు జత పరిచిన వీడియోని ఓ సారి క్లిక్ చేసి చూడండి. .

Thursday, June 4, 2009

పుట్టినరోజు సందర్భం గా మీతో భాస్కరభట్ల ...

భాస్కరభట్ల రవికుమార్ ప్రస్తుతం మాంచి డిమాండ్ వున్న సినీ గీత రచయిత. ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే (పోకిరి)లాంటి పాటలూ రాయగలడు. నీ కళ్ళ తోటి నా కళ్ళ లోకి (తులసి) లాంటి పాటలూ రాయగలడు. అందుకే 'బట్లేసుకున్న పాటలకైనా , బట్లేసుకోని పాటలకైనా భాస్కరబట్ల నేసుకుంటే రెండిటికీ సంపూర్ణ న్యాయం చేస్తాడూ అనే టాక్ ఇండస్ట్రీ లో వుంది. జూన్ ఐదు భాస్కరభట్ల బర్త్ డే. ఈ సందర్భం గా ఓ చిన్న వీడియో ఇంటర్ వ్యూ చేద్దామని అడగగానే ఒప్పుకున్నాడాయన. ఆయన మీతో చెప్పాలనుకున్న సంగతులు డైరెక్ట్ గా ఆయన మాటల్లోనే వీడియో రూపంలో చూడండి.


మీరిది గమనించారా ?

పంథొమ్మిది వందల అరవై ఒకటిలో రిలీజైన భక్త జయదేవ, భార్యాభర్తలు సినిమాలలోని పాటలు గుర్తుండే వుంటుంది. రెండిటికీ యస్.రాజేశ్వరరావే సంగీత దర్శకుదు.అభినయించిన నాయకుదు - అక్కినేని నాగేశ్వరరావు.ఇప్పుడు చెప్పదలచుకున్న విషయానికి సంబంధించిన ఆ పాటలు రెండూ - భక్త జయదేవ లో 'యారమితా వనమాలినా' ,భార్యాభర్తలు లో 'మధురం మధురం ఈ సమయం' . ఈ రెండు పాటలనీ వింటుంటే ట్యూన్ ఒక దగ్గిర కామన్ గా వున్నట్టు అనిపిస్తుంది. యారమితా వనమాలినా లో 'సకల భువన జన వర తరుణేనా' అనే లైన్ దగ్గర ట్యూనూ, మధురం మధురం ఈ సమయం లో 'పరిమళించె అనురాగపు విరులూ' అనే ట్యూనూ ఒకేలా వున్నాయనిపిస్తుంది. ఆ పాటల రెండో చరణాలలోని 'అమృత మధుర తర మృదు వచనేనా ' దగ్గిర,'పొంగిపొరలె మన కోర్కెల అలలూ ' దగ్గిర కూడా అలాగే ఫీలవుతాం .

Wednesday, June 3, 2009

ఏమని వర్ణించనూ ....


సమర్ధతకు సాకారం , ప్రతిభకు ప్రాకారం , సంస్కారానికి శ్రీకారం ... ఇవీ బాలూ గారి గురించి షార్ట్ కట్ లో చెప్పాలంటే దొరికే మాటలు.గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటుడి గా, ఇంకా ప్రేక్షకులకు తెలిసిన 'చాలా చాలా గా' వీటి గురించి కొత్త గా చెప్పాల్సిన పని లేదు. కానీ చాలా మందికి తెలియనిది ఆయన సంస్కారం గురించి . అది కేవలం రుచి చూసిన కొద్ది మందికే తెలుసు. ఒకసారి ఆ సంస్కారం కి అలవాటు పడ్డాక ప్రపంచం లోని కుళ్ళు తో ఎడ్జెస్ట్ అవడం కష్టం. అదో తీయటి ప్రమాదం ఉంది ఆయన స్నేహం తో. రోజుకున్న రెండు పూటలలో ఒక్క పూటైనా స్నేహితుడితో భోజనం చేయకపొతే ఆరోజు వేష్ట్ కింద లెక్కగా భావించే స్నేహశీలి ఆయన. స్నేహానికి ఆయన ఇచ్చే విలువల గురించి నా దగ్గరున్న అనుభవాలను పేర్కొనడం మొదలు పెడితే ఈజీ గా అదో గ్రంధమే అవుతుంది. వీలుని బట్టి అప్పుడప్పుడు ఇకనుంచి ఈ బ్లాగులో రాస్తూ వుంటాను. దానికి బాలూ గారు పర్మిషన్ ఇస్తారనే ఆశిస్తూ .... బాలూ గారికి జన్మ దిన శుభాకాంక్షలు.

అసెంబ్లీ లో అడుగు పెట్టడానికి ఓ రోజు ముందు ...

సికింద్రాబాద్ నియోజక వర్గం నుండి మ్మెల్యే గా ఎన్నికైన సహజ నటి జయసుధను ఆంధ్ర ప్రదెశ్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సగౌరవం గా సత్కరించింది. సీనియర్, జూనియర్ పాత్రికేయులెందరో జయసుధ గారితో తమకున్న అనుబంధాన్ని,ఆమె వ్యక్తిత్వాన్ని కొనియాడుతూ ప్రసంగించారు. తరువాత జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమం లో పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు జయసుధ గారు ఇచ్చిన సమాధానాల సారాంశం ఇదీ : " క్రికెట్ మ్యాచ్ ని టీవీ లో చూస్తున్నపుడు తప్ప నేనెప్పుడూ ఉద్వేగానికి లోను గాను. కనుక గెలుపు, ఓటమి,అసెంబ్లీ లో తొలిసారి కాలు పెట్టడం ఇలాంటి వాటికి థ్రిల్ ఫీల్ కాను. ప్రతి పురుషుడి వెనుక ఒక స్త్రీ వుంటుందంటారు. నా విజయం వెనక దేవుడున్నాడు. ప్రజలు నన్ను సికింద్రాబద్ కే పరిమితం చేసుకోలేదు. ఎక్కదెక్కడి వాళ్ళో వచ్చి వారి సమస్యలు నాతో చెప్పుకుంటున్నారు. ఇవాళ మధ్యాహ్నం కాన్సర్ పేషెంట్ కి హాస్పిటల్ లో ఎడ్మిషన్ దొరకకపోతే తీసుకు వచ్చి మా ఇంటి ముందు పడేశారు. " ఇలా తన మనసులోని భావాలను పాత్రికేయులతొ పంచుకుంటూ వారికి అండగా తనెప్పుదూ ఉంటానన్నారు. విచ్చేసిన వారందరి ముఖాలలో సంతొషం తొణికిసలాదుతూ వుండగా సమావేశం ముగిసింది.

Monday, June 1, 2009

'కరెంట్' ఆడియో లోని 'అటు నువ్వే ఇటు నువ్వే ' పాట గురించి ...


ఈ పాటను నేహ భసిన్ పాడింది.ఈమెది ఓ టిపికల్ వాయిస్. పేరుకి శోక గీతమే ఐనా ఈమె వాయిస్ లో వున్న ఓ విచిత్రమైన హస్కీ నెస్ పాటకి స్పెషల్ ఎట్రాక్షన్ గా మారింది. దేవిశ్రీ ఇచ్చిన ట్యూన్ లో కూడా ఏదో తెలియని డెప్త్ వుంది. ఈ ఆడియోలోని మిగిలిన నాలుగు పాటలతో కాకుండా ఈ ఒక్క పాటని విడిగా వింటే పాట ట్యూన్ లోనూ,సాహిత్యం లోనూ వున్న డెప్త్ ని ఫీల్ అవగలం. ఇక సాహిత్యం గురించి చెప్పాలంటే - రామ జోగయ్య శాస్త్రి గారి గురించి తెలియని వాళ్ళకి ఈ పాట సీతారామ శాస్త్రి రాశారనిపిస్తుంది. ఎందుకంటే ప్రేమ గురించి సీతారామ శాస్త్రి గారు ఇచ్చినన్ని ఎక్స్ ప్రెషన్లు ఇంకెవరూ ఇవ్వలేదు గనుక. ఈ పాటలొ 'నాకే తెలియకుండా నాలో నిన్ను ఒదిలావే - నేనే నువ్వయేలా ప్రేమ గుణమై ఎదిగావే - మాటే చెప్పకుండా నీతో నువ్వు కదిలావే'లాంటి వాక్యాలు రామజోగయ్య శాస్త్రి లోని సీతారామ శాస్త్రి గారిని ఆంజనేయుడి గుండెల్లో రాముడు కనిపించినట్టు అద్దం పట్టినట్టు చూపిస్తాయి.

Sunday, May 31, 2009

కరెంట్ టైటిల్ సాంగ్ గురించి ....


'అందాల చందమామ లాంటి అమ్మడూ' అనే పల్లవితో మొదలయ్యే ఈ 'కరెంట్' టైటిల్ సాంగ్ ని బెన్ని దయాళ్ పాడారు. మధ్య మధ్య దేవిశ్రీ వాయిస్ అవసరమైనప్పుడు కలుస్తూ వుంటుంది. కుర్రకారు దృష్టిలో మొదటి స్థానాన్ని, పెద్దకారు దృష్టిలో రెండవ స్థానాన్ని ఆక్రమించుకుంటుందీ పాట. అందుక్కారణం 'కే ఐ యెన్ జీ వస్తున్నాడూ కింగ్' ట్యూన్ ని గుర్తుకు తెచ్చేలా ఈ పాటలో 'సర్రు మంటూ ఒళ్ళంత పాకే ఫీలింగేరా కరంట్' అనే వాక్యాలు వుండడమే. ఇక మిగిలిన పాటంతా హుషారుగానే వుంటుంది. దానికి రచయిత రామజోగయ్య శాస్త్రి ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. 'నీ హార్ట్ కొత్త బీటు కొట్టినప్పుడూ- రీచార్జ్ చేసినట్టు ఎనర్జి లెవెల్స్ ఎవరెస్టుకెక్కినప్పుడూ - నీ మాట ఈల పాట పాడినప్పుడూ - నీ మనసు తీన్ మార్ ఆడినప్పుడూ - నీ కంటి చూపు నీ మాట వినకుండ దిక్కులన్ని చూసినప్పుడూ- రంగుల్తో రామకోటి రాసినప్పుడూ-నీ పేరు నువ్వే మర్చిపోయినప్పుడూ - నువ్వంటే నీకె చాలా నచ్చినప్పుడూ - ఆనాటి రోమియో నీలాగ పుట్టినట్టు నువ్వే ఫీలైనప్పుడూ' లాంటి వాక్యాలు మచ్చుకి కొన్ని .

కరెంట్ సినిమాలోని 'రెక్కలు తొడిగిన పక్షల్లె ' పాట గురించి ....


ఈ పాటని దేవిశ్రీ తమ్ముదు సాగర్,రెనిన పాడారు. సంగీత పరం గా ఈ పాటకు మొదటి స్థానాన్ని ఇవ్వొచ్చు. ముఖ్యం గా చరణాల బిగినింగ్ లో ని ట్యూన్ గనక నోటికి పట్టుకుందంటే ఇక వదలదు. హాంట్ చేస్తూనే వుంటుంది.రచయిత భాస్కరభట్ల కూదా ఆ జీవ స్వరాలకు తగ్గట్టు గానే తన పదాలతో ప్రాణం పోశాడు. 'ప్రపంచమంత జయించినట్టు ఉప్పొంగి పోతోంది ప్రాణం - పెదాలలోన పదాలు అంది క్షణాలలో మాయం - క్షణాలనేమో యుగాలు చేసి తెగేడిపిస్తోంది కాలం - మనస్సుతోటి మనస్సులోకి రహస్య రాయభారం' లాంటి వాక్యాలతొ తన లోని ప్రతిభతొ మరొసారి శ్రోతలను ఆకట్టుకుంటాడు.విని చూడండి మీకే తెలుస్తుంది.

దేవిశ్రీ 'కరెంట్ ' రిలీజైందిదేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్నిచ్చిన 'కరెంట్' ఆడియో రిలీజైంది. అక్కినేని మనవడు , నాగార్జున మేనల్లుడు ఐన సుశాంత్ సినిమా లో హీరో. ఆదిత్యా మ్యూజిక్ ద్వారా విడుదలైన ఆడియో లో ఐదు పాటలున్నాయి.(గోపి గోపిక గోదావరి ఆడియో నుంచి ఐదు పాటల ట్రెండ్ మొదలైనట్టుంది). కరెంట్ ఆడియో లోని ఐదు పాటలలో రెండిటిని భాస్కరభట్ల రాశారు. మిగిలిన మూడిటిని రామ జోగయ్య శాస్త్రి రాశారు. మొదటి పాట యూ వర్ మై లవ్ లోని ఇంగ్లీష్ లిరిక్స్ ని దేవిశ్రీ ప్రసాద్ రాశారు . డి యస్ పి అని వుంటుంది. మూడవ పాట అమ్మాయిలు అబ్బాయిలు పాట లోని ఇంగ్లీష్ లిరిక్స్ ని (అందరి వాడు పాట పాడిన) ఆండ్రియా రాశారు. నాల్గవ పాట కరెంట్ టైటిల్ సాంగ్ లోని ఇంగ్లీష్ లిరిక్స్ ని దివ్య ,రెనిన కలిసి రాశారు. దివ్య ఇదివరకు 'రెడీ' లో ఓం నమస్తే బోలో పాటని పాడింది. రెనిన ఆడియో లోనే 'రెక్కలు తొడిగిన పక్షల్లే ' పాటని పాడింది. ఇందులోని పాటల గురించి తర్వాత చర్చించుకుందాం .

Friday, May 29, 2009

'మల్లన్న ' లో విక్రమ్ విశ్వరూపం


తమిళం లో కందస్వామి గా తెలుగులో మల్లన్న గా విడుదలవుతున్న సినిమా లో విక్రమ్ ఆడవేషం లో కనిపించడం తో పాటు తన పాటల్ని తనే పాడుకున్నాడు. ఎంత బాగా పాడాడో ఆడియో విన్నవాళ్ళకి తేలుస్తుంది . విక్రమ్ లో నిజం గా ఓ మంచి గాయకుడు ఉన్నాడని ఎవరైనా సరే ఒప్పుకుని తీర్తారు . సంగీత పరం గా దేవిశ్రీ ప్రసాద్ కొత్త రకం ట్యూన్స్ నిచ్చాడు. పాటలన్నీ చాలా బావున్నాయి. రచయిత సాహితి ప్రతి పాటలోనూ ఒక్కో రకం ప్రయోగాన్ని చేశారు . వెంటనే మల్లన్న ఆడియో ని కొని , ప్రతి పాటని ఓ రెండు మూడు సార్లు విని చూడండి. మీరే ఒప్పుకుంటారు .

Monday, May 25, 2009

వొ జబ్ యాద్ ఆయే బహుత్ యాద్ ఆయే ...అలనాటి ప్రముఖ నటి శ్రీమతి గీతాంజలి ఇటీవల ఫంక్షన్ లో కనిపించారు . " మధ్యనే గోపీ గోపిక గోదావరి సినిమాలో హీరో వేణు కి తల్లిగా మంచి వేషం వేశానండీ . ఎంతో ప్రాముఖ్యత వున్న క్యారెక్టర్. కచ్చితంగా నాకు మళ్ళీ మంచి పేరు తెచ్చి పెట్టే క్యారెక్టర్ అది. మీరు, మీ పాఠకులు చూసి ఎలా వుందో చెప్పాలి ." అని సహృదయం తో అన్నారావిడ. ఇక్కడ గీతాంజలి గారి గురించి చాలా మందికి తెలియని విషయం చెప్పాలనిపిస్తోంది . 'పారస్ మణి ' అనే హిందీ సినిమా లో ఆవిడ హీరోయిన్ గా నటించారు. సంగతి మనం గుర్తు పెట్టుకోక పోయినా ఉత్తరాది వాళ్లు మాత్రం మర్చిపోరు. సినిమా లో గీతాంజలి గారు నటించిన ' వొ జబ్ యాద్ ఆయే బహుత్ యాద్ ఆయే ' పాటను తలచుకుంటూనే ఉంటారు. మీకు ఇంకో విషయం తెలుసా ? 'పారస్ మణి ' చిత్రం యావద్భారత దేశాన్ని తమ సంగీతం తో ఉర్రూతలూపిన లక్ష్మీకాంత్ - ప్యారేలాల్ జంటకి తొలి చిత్రం. అందుకే గీతాంజలి గారు నటించిన 'గోపి గోపిక గోదావరి ' చిత్రం లోని స్టిల్ ని , 'పారస్ మణి ' లోని పాటని (వీడియో రూపం లో) జత చేస్తున్నాం. చూసి ఆనందించండి .

ఈ పాటకు నటనలో ఏ బాధలు దాగెనో ...


'అమరశిల్పి జక్కన ' సినిమా లో పాప్యులర్ ఐన 'ఈ నల్లని రాలలొ ' పాట కు సంబందించి ఓ విశేషం ఉంది . ఆ చిత్ర నిర్మాత దర్శకుడు అయిన బి.యస్. రంగా ఓ విచిత్రమైన మనస్తత్వం గలవాడు. ఒక్కోసారి ఎంత ఖర్చు పెడతాడో , ఒక్కోసారి అస్సలు పైసా కూడా విదల్చడు. ' ఈ నల్లని రాలలో ' పాటకి ప్లేబ్యాక్ మెషీన్ లేకుండా అవుట్ డోర్ షూటింగ్ ప్లాన్ చేసేశాడు. అక్కినేని మేకప్ చేసుకొని వచ్చేసరికి "మెషీన్ తేలేదు , డబ్బులు లేవు, ఎలాగోలాగ ఎడ్జెస్ట్ అయిపోండి" అన్నాడు . షూటింగ్ క్యాన్సిల్ చెయ్యండి అని అనడానికి మనసొప్పక , ఎలాగూ పాటంతా బై హార్ట్ చేసే అలవాటు, సంగీత జ్ఞానం వుండి కనుక తనకు తనే ప్లేబ్యాక్ పాడుకుంటూ , లిప్ మూమెంట్ ఇచ్చుకుంటూ మ్యానేజ్ చేశారు అక్కినేని. అదృష్టవశాత్తూ కరెక్ట్ గా సింక్ అయింది అదీ సంగతి.

Sunday, May 24, 2009

గొపి గోపిక గోదావరి లో మరికొన్ని చిన్ని చిన్ని పాటలు


వంశీ దర్శకుడి గా చక్రి సంగీత సారధ్యం లో వల్లూరిపల్లి రమేష్ నిర్మించిన ' గోపి గోపిక గోదావరి' సినిమా ఆడియో రిలీజ్ అయి మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమా శాటిలైట్ హక్కులు జెమిని వారివి. ఆడియో హిట్ అయిన సందర్భం గా

చక్రి ని అభినందిద్దామని ఆయన స్టూడియో కి వెళ్తే అక్కడ వంశీ గారు రికార్డింగ్ థియేటర్లో కనిపించారు. అవును వాళిద్దరూ ఇష్ట పడ్డారు సినిమా లో లాగ చిన్న చిన్న పాటల లాంటివి రికార్డ్ చేస్తున్నామని చెప్పారు. అలా వచ్చె ఆ రెండేసి లైన్ల స్వరఖందికల్ని వంశీ గారు, చక్రి గారు రాసేసుకున్నారు. ఎలాగూ ఆడియో రిలీజ్ అయిపొయింది కాబట్టి మళ్ళీ మరో అకేషన్ చూసుకొని ఈ స్వరఖందికలతో మరో ఆడియో రిలీజ్ చేస్తే సంగీతాభామానులు సంతోషిస్తారు.

కమల్ హసన్ కోసం గొల్లపూడి స్క్రీన్ ప్లే


భారత దేశం గర్వించ దగ్గ నటుడు కమల్ హసన్ చెన్నై లో ఓ వర్క్ షాప్ ని నిర్వహించబోతున్నారు . ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హాలీవుడ్ ప్రముఖులతో పాటు , కే . బాలచందర్ , గొల్లపూడి మారుతీ రావు వంటి లబ్ధ ప్రతిష్టులు కూడా పాల్గొనబోతున్నారు. జూన్ మూడు న జరగబోయే సెమినార్ లో స్క్రీన్ ప్లే మీద ఓ ప్రత్యేక వ్యాసాన్ని రాయవలసింది గా

గొల్లపూడి గారిని కమల్ హసన్ కోరారు . గొల్లపూడి గారు మన విశ్వనాథ్ గారు తీసిన 'ఓ సీత కథ ' స్క్రీన్ ప్లే గురించి రాయబోతున్నారు. కమల్ హసన్ కి, ఓ సీత కథ కి సంబంధం ఏమిటనుకుంటున్నారా ? ఓ సీత కథ తమిళ , మళయాళ వెర్షన్స్ లో నటించింది కమల్ హసనే కాబట్టి . గొల్లపూడి గారు రాయబోయే ఆ వ్యాసం కాపీ ని ఈ బ్లాగు పాఠకుల కోసం పంపిస్తానన్నారు. అతి త్వరలో ఆ వ్యాసాన్ని మనం చూడొచ్చు.

ఆ చెయ్యి ఎవరిదో తెలుసా ?

ఇప్పుడంటే గ్రాఫిక్ లు వచ్చి అంతా ఈజీ ఐపోయింది గానీ , పాత రోజుల్లో ట్రిక్ ఫోటోగ్రఫీ అంటే తీసే వాళ్ళకి ,
చేసే వాళ్ళకి యమ యాతన గా ఉండేది. అందులో ద్విపాత్రాభినయం ఐతే మరీనూ. అక్కినేని తొలి ద్విపాత్రాభినయ చిత్రం
'ఇద్దరు మిత్రులు' లో ఫోటోగ్రఫీ ప్రత్యేకించి ప్రశంసించ దగ్గది . క్లైమాక్స్ సీన్ లో ఇద్దరు నాగేశ్వరరావు లు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం చూసి ప్రేక్షకులు మురిసిపోయారు. అక్కడ నటించిన అక్కినేని, చిత్రీకరించిన సెల్వరాజ్ ల ప్రతిభ తో పాటు మరొకరి హస్తం కూడా ఉంది . కళాతపస్వి , దర్శకుడు కే. విశ్వనాథ్ గారు ఆ రోజుల్లో దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు గారికి అసిస్టెంట్ గా పని చేసే వారు. 'ఇద్దరు మిత్రులు ' క్లైమాక్స్ సీన్ లో కోటు వేసుకున్న నాగేశ్వర రావు గారి పక్క నుంచి నాగేశ్వరరావు గారి చెయ్యి లా భ్రమింప చేస్తూ వచ్చిన చెయ్యి శ్రీ కే. విశ్వనాథ్ గారిది. ఈ విషయాన్ని నాగేశ్వర రావు గారే స్వయం గా ఈ మధ్య నే చెప్పారు.

ఈమె ఎవరో తెలుసా ?


' భార్యాభర్తలు' సినిమాలో 'జోరుగా హుషారుగా ' పాటలో అక్కినేని లవర్స్ లో ఒకామె గా నటించి, తర్వాతి సీనులో
నటి జయంతి తో అక్కినేని కోసం కొట్లాడే గర్ల్ ఫ్రెండ్ గా కనిపించే ఈవిడెవరో తెలుసా ? ఈవిడ పేరు రాజేశ్వరి.
ప్రముఖ నటి శ్రీదేవి కి తల్లి. భార్యాభర్తలు సినిమా తర్వాత శాంతినివాసం సినిమాలో కృష్ణకుమారి కి చెల్లెలు గా నటించింది. కావాలంటే టీవీ లో శాంతినివాసం సినిమా వచ్చినప్పుడు 'కలనైనా నీ తలపే ' పాట దగ్గర బాగా చూడండి. చాలా చోట్ల క్లోజప్ లో కనిపిస్తుంది.

ఎన్టీయార్ కి సింగీతం ప్లేబ్యాక్


ఎన్టీయార్ , ఏయన్నార్ నటించిన 'శ్రీకృష్ణార్జున యుద్ధము' సినిమా గుర్తుండే ఉంటుంది. అందులోని 'అలిగితివా సఖి ప్రియా' పాట కూడా గుర్తుండే ఉంటుంది. ఆ పాట చిత్రీకరణ జరుగుతుండగా ప్లేబ్యాక్ మెషీన్ చెడిపోయింది. రిపేర్ చేయించడానికి ఛాలా పడుతుంది . ఈ లోగా టైం వేష్ట్ ఎందుకని కే.వీ. రెడ్డి గారికి అసిస్టెంట్ గా ఉన్నసింగీతం శ్రీనివాస రావు గారు తను పాడతానని, ఎన్టీ రామా రావు గారు లిప్ మూమెంట్ ఇస్తే చాలని అన్నారు. కే.వీ . రెడ్డి గారు "ఇదేమన్నా మ్యాజిక్కా .. ? టెక్నిక్ " అంటూ కోప్పడ్డారు . అప్పుడు ఎన్టీయార్ " ఓ సారి ప్రయత్నించి చూద్దాం " అన్నారు . ఆయన మాట కొట్టేయ్యలేక 'ఓ. కే." అన్నారు కే.వీ . రెడ్డి గారు. సింగీతం గారు పాడారు. ఎన్టీయార్ లిప్ మూమెంట్ మ ఇచ్చారు . తర్వాత ల్యాబ్ లో ప్రింట్ చేసి చూసుకుంటే లిప్ మూమెంట్ యధాతధం గా సరిపోయింది. సంగీతం మీద సింగీతం గారికున్న పట్టు అటువంటిది .

నాలుగు వందల సంవత్సరాల తర్వాతి గీతం ఇప్పుడే ...


అక్కినేని నాగేశ్వరరావు , భానుమతి కలిసి నటించిన 'విప్రనారాయణ ' సినిమా లోని 'సావిరహే తవ దీనా' అనే గీతం

గుర్తుండే ఉంటుంది. "ఎంత బావుందీ గీతం " అని విప్రనారాయణుడు అంటే "జయదేవ కవి కవిత్వమే అంత స్వామీ "

అంటుంది దేవదేవి - సినిమాలో. నిజానికి విప్రనారాయణుడు ఎనిమిదవ శతాబ్దానికి చెందిన వాడు జయదేవుడు

పన్నెండవ శతాబ్దానికి చెందిన వాడు. అంటే నాలుగు వందల సంవత్సరాల తర్వాత పుట్టాడన్నమాట.

నాలుగు వందల సంవత్సరాల తర్వాత పుట్టబోయే వారు రాయబోయే గీతాన్ని వర్తమానం లో పాడడం ఎలా సాధ్యం ?

ఎంత వరకు సబబు ? ఈ విషయాన్ని అప్పట్లో ప్రేక్షకులేవ్వరూ పట్టించుకోలేదు . సన్నివేశం , నటన బాగుంటే

ప్రేక్షకులు లాజిక్ జోలికి పోరనటానికి ఇదో ఉదాహరణ .