Monday, January 24, 2011

ఏయన్నార్ ఆవార్డ్ టు బాలచందర్


జనవరి 11 న ఏయన్నార్ ఆవార్డ్ టు బాలచందర్ ఫంక్షన్ జరిగింది. (ఈ న్యూస్ ఇంతకు ముందే పెట్టాల్సింది కానీ ఫోటో , వీడియో క్లిప్ నాకు అందే సరికి లేట్ అయింది)  ఆ ఫంక్షన్ లో బాలచందర్ గారిని చానల్  తరఫునుంచి సత్కరించే ఆవకాశం మా టీవీ నాకు ఇచ్చింది. దీనిక్కూడా కారణం మా టీవీ వైస్ ప్రెసిడెంట్ సాయి ప్రసాద్ గారే . బాలచందర్ గారి దగర కెళ్ళి శాలువా కప్పడం ఒక ఎత్తు. ఆయన కి షేక్ హ్యాండ్ ఇవ్వడం ఒక్కటీ ఒక ఎత్తు. పులకించి పోయాను ఆ క్షణం లో. ఎవరి తెలివి తేటలకి చిన్నప్పట్నుంచీ జోహార్లు అపించే వాళ్ళమో ఎవరి సినిమాలను చూడడం మేధో వర్గం కి సంబందించిన ఓ అదృష్టం గానూ, ఓ గొప్పతనం గానూ  భావించే వాళ్ళమో  అటువంటి వ్యక్తి తో చేయి  కలపడం - అన్నమయ్య భాషలో చెప్పాలంటే   - ఇది గాక సౌభాగ్యమిది కాక తపము మరి ఇది కాక  వైభవమ్మింకొకటి  కలదా ?  ఈ ఫంక్షన్ లోనే మరొక సంఘటన ఏమిటంటే  సుమ నన్ను పబ్లిక్ గా 'బాబాయ్ ' అనడం . సుమ నాకు తను యాంకర్ కాక ముందు నుంచీ పరిచయం . నన్ను తన తండ్రి లా  భావిస్తుంది.  నేనూ తనని ఎంతో అభిమానం గా చూసుకుంటాను. ఎంత బిజీ గా వున్నానేను అడిగితే తను కాదనదని మా టీవీ లో అనుకుంటూ వుంటారు . అలా అనుకోవడం నాక్కూడా ఇష్టం  కనుక ఆ అభిప్రాయాల్ని ఖండించను . సుమ అంటే నాకు ఎంత అభిమానమో అంతకన్నా ఎక్కువ గౌరవం . అంత తెలివైన, మర్యాద తెలిసిన - అమ్మాయిని నా జీవితంలో ఇప్పటి వరకూ చూడలేదు.  సుమ గురించి చాలా రాయాలనుంది. ఏదో ఓ రోజు ఆమె కి చాలా పెద్ద గౌరవం లభిస్తుంది. ఆ రోజు ఎక్కువ గా మాట్లాడేదీ , రాయాల్సొస్తే పేజీలకు  పేజీలు  రాసేది బహుశా  నేనే అవుతానేమో ?

Sunday, January 23, 2011

ఈవీవీ జ్ఞాపకాలు - 1


సాధారణంగా నాకు నిద్ర పడితే మధ్యలో మెలకువ రావడం బహు అరుదు - ఒంట్లో బాగులేక పోతేనే తప్ప.  ఈ జనవరి 21 న   మాత్రం రాత్రి పన్నెండు గంటలకోసారి, తెల్లవారు ఝామున మూడు గంటలకోసారి, మళ్ళీ నాలుగు గంటలకోసారి తెలివి వచ్చింది. ఎందుకిలా అవుతోంది అనుకుంటూ బలవంతాన పడుకున్నాను. పొద్దున్నే లేచే సరికి ఈవీవీ లేరన్న వార్త . ఏం చెయ్యాలో తోచలేదు. మనసుని జ్నాపకాల ముసుర్నుంచి తప్పించడం నా వల్ల కాలేదు.
నేను జంధ్యాలతో కలిసి తిరిగే రోజుల్లో ఆయనకి అసిస్టెంటు డైరెక్టర్ గా పరిచయ్యమయ్యాడు ఈవీవీ.  "సత్యం" అని పిలిచే వాళ్ళం. జంధ్యాల అంటే అతనికి విపరీతమైన గౌరవం. ఓసారి అవుట్ డోర్ షూటింగ్ లో చూడ్డానికి వచ్చిన వాళ్ళెవరో జంధ్యాల గురించి బ్యాడ్ గా కామెంట్ చేశారని వాళ్ళని కొట్టబోయేంత పని చేశాడు. అంత ఆవేశం మళ్ళీ అతనిలో ఎప్పుడూ చూడలేదు. జంధ్యాలకి సినిమాల్లేక ఖాళీ గా వున్నప్పుడు తను డైరెక్టర్ గా చాలా బిజీగా వున్నాడు. ఆ టైమ్ లో  జంధ్యాల ద్వారా పైకొచ్చిన వాళ్ళంతా కేవలం లిప్ సింపతీ చూపించారే తప్ప ఎవ్వరూ ఏమీ చెయ్యలేదు. తను మాత్రం ఓ పళ్ళెంలోలక్ష రూపాయల క్యాష్ పట్టు బట్టలతో సహా పెట్టి మరీ వచ్చాడు. అంత గడవని పరిస్థితేం కాదు జంధ్యాలది. ఐనా ఈవీవీ చేసిన ఈ పని జంధ్యాలకి ఓ మోరల్ సపోర్ట్ లాంటిది. జంధ్యాలే గనుక బ్రతికుంటే ఆయనకి ఆత్మ స్థైర్యం కలిగించడానికి తను నిర్మాతగా జంధ్యాల దర్శకత్వంలో ఓ సినిమా తీసి వుండేవాడేమో . (పై నున్న ఫోటో 31 డిసెంబర్ 2000 న తీసినది) .


ఈవీవీ జ్ఞాపకాలు - 2


"నీకూ నాకూ పెళ్ళంట " సినిమా తీస్తున్నప్పుడు జంధ్యాల ఓ గమ్మత్తు చేశాడు. తన స్నేహితులందరి చేతా ఆ సినిమాలో ఏదో ఓ వేషం వేయించాడు. అతనికా ఆలోచన వున్నట్టు నాకు తెలీదు. అర్జెంటుగా  ఫ్యామిలీతో సహా రమ్మంటే వెళ్ళాను. తీరా వెళ్ళే సరికి ఇలా యాక్ట్ చెయ్యాలీ అన్నాడు. యాక్టింగ్ అస్సలు చేత కాదు నాకు. పక్కనే బ్రహ్మానందం, నూతన్ ప్రసాద్ వాళ్ళ పోర్షన్లతో రెడీగా వున్నారు. జంధ్యాలతో వున్న చనువు వల్లో, యాక్టింగ్ రాకపోవడం వల్లో  కో ఆపరేట్ చెయ్యలేకపోయాను. అప్పుడు జంధ్యాల ఒకతన్ని పిలిచి నాతో యాక్ట్ చేయించే బాధ్యతని అప్పగించాడు. అతను చాలా సులువుగా తనకు కావలసిన ఎక్స్ ప్రెషన్ ని నానుంచి రాబట్టుకున్నాడు. అతనే ఈవీవీ.


ఈవీవీ జ్ఞాపకాలు - 3


టీవీ రచనల్లో నా చేత బాగా రాయించుకుని కొందరు డబ్బులు ఎగ్గొట్టేవారు. ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది పడే
వాణ్ణి.  ఈసంగతి తెలుసుకుని ఆ టైమ్ లో ఓ సినిమాకి (పేరు చెప్పడం భావ్యం కాదు) నా చేత రెండు సీన్లు , కామెడీ ట్రాక్ రాయించుకుని పదివేల రూపాయలు ఇచ్చాడు. ఆ రోజుల్లో పదివేలంటే ఇవాళ లక్ష్ కింద లెక్క . టైటిల్స్ లో పేరు పడని రైటర్ గా వుండడం ఇష్టం లేక ఆయన గ్రూప్ నుంచి బైటికి వచ్చేశాను. ఆ తర్వాత నుంచీ అతను తన దగ్గరుండే రైటర్ల పేర్లు రచనా సహకారం అంటూ టైటిల్స్ లో వెయ్యడం మొదలు పెట్టాడు.నేనన్నా, నేను రాసే కామెడీ అన్నా, సినీ సంగీతం పై నాకున్న అవగాహన అన్నా ఈవీవీకి చాలా గౌరవం.సినిమాలకి షూటింగ్ లని విదేశాల్లో ప్లాన్ చేసేవాడు.  "వరల్డ్ మ్యాప్ ముందరేసుకుని ఏయే ప్లేసులకెళ్ళలేదో వాటిని టిక్కు పెట్టుకుంటూ కథ రాసుకుంటున్నట్టుంది " అంటూ కామెంట్ చేశాను. గట్టిగా నవ్వేశాడు.


ఈవీవీ జ్ఞాపకాలు - 4


ప్రతి డిసెంబర్ 31 కీ జర్నలిస్ట్ లందరికీ విష్పర్ వ్యాలీలో పార్టీ ఇచ్చేవాడు. అప్పట్లో విష్పర్ వ్యాలీ అంటే ఊరవతల
కిందే లెక్క . "మీకేం .పార్టీ తర్వాత పైకెళ్ళి మీ రూమ్ లో హాయిగా పడుకుంటారు. వచ్చిన జర్నలిస్ట్ లు ఇంత చలిలో
అర్ధరాత్రి ఎలా వెళ్తారనుకున్నారు ? స్కూటర్లకి పంక్చర్ పడితే తోసుకుంటూ పోవడం తప్ప వాళ్ళకింకో గతి లేదు. మీరు పోసే ఆ రెండు పెగ్గులకి ఇంత అవస్త అవసరమా ? " అని అడిగాను అతనితో వున్న చనువు కొద్దీ. ఆ మాటల్ని
సీరియస్ గా తీసుకున్నాడతను.  కోపం రాలేదతనికి. మరుసటి సంవత్సరానికి జర్నలిస్ట్ లందరూ తిరిగి వెళ్ళడానికి
వెహికిల్స్ అరేంజ్ చేయించాడు.


ఈవీవీ జ్ఞాపకాలు - 5


ఓ సినిమాకి ఓ రెండు సీన్లు నాతో రాయించుకున్నాడని చెప్పాను కదా ... ఆ రెండు సీన్లలోనూ అతనితో విభేదించాను.
స్టాండర్డ్ దిగి రాయకూడదన్నాను. అతని బలవంతం మీద అతనికి కావలసినట్టు రాసిచ్చాను. " చూస్తూ వుండండి ... జనం వీటినే ఎంజాయ్ చేస్తారు." అన్నాడు. నిజంగా థియేటర్లో వాటికే క్లాప్స్ పడ్డాయి.  అలా రెండు మూడు సార్లు ఓడిపోయాను. కానీ ఒకే      ఒక్క సారి గెలిచాను. అదేమిటంటే ....
ఆర్యన్ రాజేష్ ని నటుడిగా పరిచయం చేస్తున్నప్పుడు  ప్ర్రెస్ మీట్ పెట్టాడు  మీటింగ్ అయిపోయాక సరదాగా కబుర్లు చెప్పుకుంటూకూచున్నాం. నరేష్ (అల్లరి నరేష్) ఎందుకో అక్కడికి వచ్చాడు . " మా రెండో వాడు " అంటూ పరిచయం చేశాడు.           "ఆడి కన్నా ఈడే మీకు పనికొచ్చేట్టున్నాడే ... ఫేస్ లో కామెడీ అదీ బాగా పలికేట్టుంది " అన్నాను. (ఈవీవీ తో మాట్లాడేటప్పుడే నా భాష మారిపోతూ వుంటుంది). " లేదు లేదు ...రాజేష్ మీద నాకు నమ్మకం వుంది " అన్నాడతను. తర్వాత కొన్నాళ్ళకి కలిసినప్పుడు ఈ ప్రస్థావన గుర్తుచేశాను. " అదే .. అదే " అన్నాడు జంధ్యాలని ఇమిటేట్ చేస్తూ...(ఒరిజినల్ గా ఈ మేనరిజమ్ మిస్సమ్మ లో యస్వీ రంగారావుది. దాన్ని జంధ్యాల సరదాగా అనుకరించేవాడు)

ఈవీవీ జ్ఞాపకాలు - 6


నేను హాసం పత్రిక నడిపిన మూడున్నర సంవత్సరాల్లో  తన సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా యాడ్ తప్పనిసరిగా ఇచ్చేవాడు. పేమెంట్ కూడాప్రామ్ట్ గా పే చేసేవాడు. తన సినిమా "ఆరుగురు పతివ్రతలు" పోయినప్పుడు " ఆ టైటిల్ కి నా పేరు బ్యాడ్ అయిపోయింది. అదే విశ్వనాథ్ గారి పేరు వుండి వుంటే తెగ మెచ్చుకునేవారు. నా పేరుతో వచ్చే సరికి వెకిలిగా ఫీల్ అయ్యారు " అన్నాడు నాతో పర్సనల్ గా.   అంతగా తనని తాను ఆత్మవిమర్శ చేసుకునేవాడు. " ఒక్కోసారి రాత్రి నిద్ర పట్టదు. భయం వేస్తూ వుంటుంది. నన్ను నమ్ముకుని యాభై కుటుంబాలు మద్రాసు నుంచి వచ్చేశాయి. ఫెయిలయినా సరే వాళ్ళ కోసమైనా సినిమాలు తీస్తూ వుండాలి నేను " అనేవాడు.


ఈవీవీ జ్ఞాపకాలు - 7


చివరగా ఈవీవీ తో మాట్లాడింది ఈ జనవరి ఆరున. . కొత్త సంవత్సరం లో కారు మార్చానని , ప్రస్థుతం ఓ ప్రాజెక్ట్ స్వంతంగా చేస్తున్నానని, అది అతి త్వరలో చెప్తానని ,  ఆ సందర్భం గా కలుస్తానని అన్నాను.  " సరుకు లేని వాళ్ళెంతో మంది సొమ్ము చేసుకుంటున్నారు. విషయం వుండి, పరిచయాలుండి, అనుభవం కూడా వుండి  మీరే ముందుకి రావటం లేదు. ధైర్యం చెయ్యండి. అంతా వున్నాంగా " అన్నాడు. కొండంత స్ఫూర్తినిచ్చాయి ఆ మాటలు. ఎందరి జీవితాల్లోనో వెలుగు నింపిన అతనిలోని దీపం - నా మనసులోని  ఆ ప్రాజెక్ట్ ఏమిటో వినకుండానే  కొండెక్కి పోయింది.


Monday, January 3, 2011

గొంతు కి 'చెక్ ' పెట్టిన మిరపకాయ్

రవితేజ , రిచా గంగోపాధ్యాయ నటించిన 'మిరపకాయ్ ' సినిమా 2011 సంక్రాంతి కి విడుదల కాబోతోంది.ఆ సినిమా ఆడియో
ఈ మధ్యనే రిలీజ్ అయింది. అందులోని పాటల్ని వింటుంటే నాకో డౌట్ వచ్చింది. వెంటనే ఆ సినిమా సంగీత దర్శకుడు తమన్ కి ఫోన్ చేస్తే క్లారిఫై చేసాడు .ఆ క్లారిఫికేషన్ చాలా ఇంటలిజెంట్ గా వుంది. ఈ విషయాన్ని నా జర్నలిస్ట్ మిత్రుడు , సాక్షి సినిమా పేజి ఇన్ఛార్జ్ ఎల్ . బాబూరావు గారితో చెప్పాను. అదే మేటర్నిసాక్షి సినిమా పేజి లో వేసాడాయన . ఆయనకు నా కృతఙ్ఞతలు. మీరు కూడా చదివి చూడండి.