Monday, January 23, 2012
E mail of Bapu
జనవరి 25 న మా టీవీ మ్యూజిక్ అవార్డుల కార్యక్రమాన్ని తొలిసారిగా నిర్వహించబోతోంది. అందులోని భాగంగా బాపు గారిని ఆహ్వానించే బాధ్యత నాపై పడింది . టిక్కెట్లు రిజర్వు చేసాం అని చెప్పగానే "అయితే ఆ ఈ టికెట్స్ ని నా ఈ మెయిల్ కి పంపండి " అన్నారు బాపు గారు. " చెప్పండి" అన్నాను. " రాసుకోండి ... బాపు అండర్ స్కోర్ రమణ " అని చెబుతున్నారు బాపు గారు ... నా చెవులు ఏదో వింటున్నాయి చేతులు రాసేసుకుంటున్నాయి. మనసు మాత్రం పిండేసినట్టు అయిపోయింది. బాపు రమణల గురించి అందరికీ అన్నీ తెలుసు. గానీ రమణ గారి పేరుని బాపు గారు తన ఈ మెయిల్లో ఇముడ్చుకుంటారని ఊహించలేక పోయాను.
ఓ సారి బాపు గారి చెబుతూ " బాపు అసలు పేరు ఏమిటో తెలుసా ?" అని అడిగాను. " ఓస్ ... ఆమాత్రం తెలీదనుకున్నావా ... సత్తిరాజు లక్ష్మినారాయణ " అన్నారు మా ఫ్రెండ్స్. " మరదే ... అదెవరైనా చెప్తారు. ఆయన అసలు పేరు ... ముళ్ళపూడి వెంకట రమణ " అన్నాను. మంచి ప్రశంసలు లభించాయి ఆ చమత్కారానికి.
ఈ సందర్భం గా ఓ మాట చెప్పుకోవాలి. రెండేళ్ళ క్రితం వరకూ ... గత పదేళ్ళు గా బాపు రమణలకి పద్మశ్రీ ఇవ్వాలని రిప్రజంటేషన్ లు పెడుతూ వచ్చాను. విసుగొచ్చేసింది. ఇప్పుడు పద్మశ్రీ ఇచ్చినా అది తక్కువే . పైగా రమణ గారు లేకుండా ... ఈ విషయం లో మన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మంచి పనే చేసింది. రఘుపతి వెంకయ్య అవార్డుని ఇద్దరికీ కలిపి ఒకేసారి ఇచ్చింది. ఈ సంవత్సరం పంపిన రికమండేషన్ లలో బాపు గారి పేరు వుందట. రేపు రాబోయే 25 మధ్యాహ్నం కల్లా తెలిసిపోతుంది అందరికీ. బాపు గారికి పద్మశ్రీ కాకుండా పద్మ భూషణ్ రావాలని కోరుకుందాం .
Subscribe to:
Post Comments (Atom)
4 comments:
బాపూ రమణల స్నేహం అపురూపమైనది. బాపూ రమణను ఈ మెయిలు లో మాత్రమేనా కూర్చోబెట్టింది? తన తనువులోని అణువణువులోనూ రమణ ఉన్నాడు. తను గీసే ప్రతి గీత లోనూ రమణ ఉన్నాడు. వాళ్లబంధాన్ని సృష్టిలోని ఏ శక్తీ విడదీయలేదు! స్నేహానికి పర్యాయపదం వాళ్ళ స్నేహం!
బాపూ రమణలకు పద్మశ్రీ ఇచ్చి తమను తాము గౌరవించుకోలేని "ప్రజా" ప్రభుత్వాలు మనవి. "పద్మ" అవార్డులు ఇప్పటికే ఎవరికీ ఇవ్వచ్చు ఎవరికి ఇవ్వకూడదు అన్న ఇంగితం లేకుండా ఇచ్చేసి ఆ అవార్డుల గొప్పతనాన్ని కిందకు లాగేసాయి ప్రభుత్వాలు.
"పద్మశ్రీ" అవార్డ్ "సాక్షి" సినిమా తరువాతే ఇచ్చి ఉండాలి ఇద్దరికీ. పోనీ కనీసం "ముత్యాల ముగ్గు" తరువాత! చివరకు "పెళ్లి పుస్తకం", "మిస్టర్ పెళ్ళాం" సినిమాల తరువాత!!
ఇప్పుడు, ఇన్నాళ్ళ తరువాత ఆ అవార్డులు బాపు రమణలకు ఇస్తే అది వాళ్ళను గౌరవించటం అవుతుంది అంటారా?
రాజాగారూ, బాపు రమణ గార్ల సంగతులు పంచుకున్నందుకు కృతజ్ఞతలు...నిజంగా మనసు చెమ్మగిల్లింది... అలాగే, రమణగారు భౌతికంగా దూరమైనప్పుడు బాపుగారు ఇలా అన్నారు 'నన్ను గోడ లేని చిత్తరువు చేసావు' అని. వారు అవార్డులకు అతీతులు, నిజమైన భారత రత్నాలు.
శ్రీ శివరామప్రసాదు గారి అభిప్రాయంతో నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. వారు రాసినట్లు "ఇప్పుడు, ఇన్నాళ్ళ తరువాత ఆ అవార్డులు బాపు రమణలకు ఇస్తే అది వాళ్ళను గౌరవించటం అవుతుంది అంటారా?"
Post a Comment