Sunday, January 22, 2012

Status of Lyric writers





  ' శ్రీరామరాజ్యం'లో పాటలు విన్నాక ఓ ఫ్రెండు అడిగాడు - 'సీతా రామ చరితం ' పాటలో 'దశరథుని కోడలికా ధర్మపరీక్ష ' అని ఎందుకు రాశారంటావ్- అని. చాలా మంచి ప్రశ్న అది . ఇక్ష్వాకుల వంశం లో అందరూ ధర్మానికి కట్టుబడినవారే. తను పుత్రశోకంతో మరణిస్తానని తెలుసు దశరథునికి. అది శ్రవణకుమారుని తలిదండ్రుల శాపం. రాముణ్ని అడవులకు పంపితే తన ప్రాణం పోతుందని తెలిసి మరీ ధర్మానికి కట్టుబడినది దశరథుడే. అంచేతే ఆ వాక్యం.

ఎందుకు ఈ పరీక్ష ఎవ్వరికీ పరీక్ష
శ్రీరాముని భార్యకా శీలపరీక్ష
అయోనిజకి  అవనిజకా అగ్ని పరీక్ష
దశరథుని కోడలికా ధర్మ పరీక్ష
జనకుని కూతురికా అనుమాన పరీక్ష
రాముని ప్రాణానికా జానకి దేహానికా
సూర్యుని వంశానికా ఈ లోకం నోటికా

ఇలాటిదే మరో అద్భుత వాక్యం - 'జగదానంద కారకా' పాటలో .... !

రాజ మకుటమే వొసగెలే నవరత్న కాంతి నీరాజనం
సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం

రాజ మకుటం గా పెట్టబోయే కిరీటం లోని నవరత్నాలన్నీతమ కాంతులతో నీరాజనం పడుతున్నాయట. అలాగే సూర్య వంశ సింహాసనం పులకించిపోయి తనే అభివందనం చేసిందట. ఏ రాజైనా సింహాసనానికి అభివందనం చేసి కూర్చుంటాడు. కానీ రాముడికి సూర్య వంశ సింహాసనం పులకించి పోయి తనే అభివందనం చేసిందట.
ఇంకా ఇలాంటి గొప్ప గొప్ప ఎక్స్ ప్రెషన్లతో పాటలు రాశాడు జొన్నవిత్తుల 'శ్రీరామ రాజ్యం'లో.
ఇక్కడ చెప్పుకోవలసిందేమిటంటే 'శ్రీరామ రాజ్యం' లో జొన్నవిత్తుల అన్ని పాటలూ రాశాడు. సింగిల్ కార్డ్ రైటర్. అయినా పబ్లిసిటీ లోగోలో ఆయన పేరు లేదు. అంతే కాదు వాల్ పోస్టర్స్ లో కూడా ఎక్కడా
ఆయన పేరు కనబడదు.
ఇదీ మన వాళ్ళు లిరిక్ రైటర్స్ కి ఇచ్చే గౌరవం. ఇదొక ఉదాహరణ మాత్రమే.
కొన్ని ఆడియో ఫంక్షన్స్ లో ఆ సినిమాకి పాటలు రాసే గీత రచయితలు కనబడరు. కారణం వారికి ఆహ్వానం వుండదు. ఒకవేళ సదరు గీత రచయితలు వచ్చినా వారిని స్టేజ్ మీదకు పిలవరు. ఒకవేళ పిలిచినా వారి పని చప్పట్లు కొట్టడం, (కుదిర్తే) క్యాసెట్ కవర్లు పట్టుకుని ఫోటోల్లో కనబడడం ... అంతకు మించి మాట్లాడే చాన్స్ వుండదు. తెలుగు రాని హీరోయిన్లను మాట్లాడమని బలవంతం చేస్తారు కానీ రచయితలకి ఇవ్వాల్సిన  గౌరవం  ఇవ్వరు. అదీ సంగతి.
మళ్ళీ ఇందులో కొంతమంది ఎక్సెప్షన్. కృష్ణవంశీ సినిమా ఆడియో ఫంక్షన్స్ లో రైటర్స్ కి గౌరవం వుంటుంది. వై వీ యస్ చౌదరి దారే వేరు. సీడీ కవర్ మీద రైటర్ ఫోటో వేస్తాడు. వీలయితే రైటర్ కి ఓ బిరుదు కూడా ఇచ్చేస్తాడు. 'సీతయ్య' ఆడియో ఫంక్షన్ లో చంద్రబోస్ కి 'సాహిత్య చిచ్చర పిడుగు ' అనే బిరుదు ఇచ్చేసాడు. ఈ మధ్యనే జరిగిన  'నిప్పు' ఆడియో ఫంక్షన్ లో ఆ సినిమాకి 6 గురు పాటలు రాస్తే ఆ ఆరుగురినీ ( చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరాం, వనమాలి, భాస్కరభట్ల, విశ్వ) స్టేజ్ మీదికి పిలిపించి మాట్లాడే అవకాశం ఇచ్చాడు. అంతే కాదు సీడీ కవర్ మీద ఆ ఆరుగురి ఫోటోలూ, వారి పేర్లూ వచ్చేట్టు చూశాడు. అది కాక  ఫంక్షన్ లో ఆ ఆరుగురి ఫొటోలతో స్పెషల్ గా ఓ హోర్దింగే పెట్టాడు కూడా. 'కవి గాయక నట వైతాళిక ' అన్నారు పెద్దలు. అంటే ప్రాదాన్యతా క్రమం లో కవి ముందుండాలి. కవి, రచయిత వీళ్ళ విలువ తెలిసున్నది ఇవాళ కొంతమందికి మాత్రమే.

















4 comments:

chandrabose lyricist said...

chaalaa manchi amshaanni prasthaavinchaaru raaja gaaru-antha kashtapadi raasina jonnaviththula gaari peru poster lo lekapovadam shochaneeyam-kaalidasu gari kavithwaaniki mugdhudai ardha simhaasanaanni ichhaadata bhoja raju-simhaasanam maata devuderugu cinema poster lo peru unte chaalu ankuntunnaadu neti rachayitha

musicologistraja.blogspot.in said...

బోస్ గారూ,
మీ స్పందన మీ సంస్కారానికి నిదర్శనం. వెను వెంటనే కామెంట్ పోస్ట్ చేసినందుకు కృతఙ్ఞతలు.

Suryaprakash Rao Mothiki said...

బాపు-రమణ ల మానస పుత్రిక "శ్రీ రామరాజ్యం"! ఈ సినిమా లోని అన్ని పాటలూ మంచి సంగీత సాహిత్యాలతో శోభిల్లడము తెలుగు వారికి ఒక వరం! అన్ని పాటలూ రాసిన జొన్నవిత్తుల చాల అదృష్టవంతుడు! "లవకుశ (1963)" లోని పాటలకు ధీటైన సాహిత్యంగా ఆయన రాసిన పాటలు కీర్తించబడడం కంటే గొప్ప ప్రశంస ఏముంటుంది? ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వారికోసం తాయారు చేసిన పోస్టర్లలో ఆయన పేరు లేకపోతే ఆయన సాహిత్యానికి వచ్చే నష్టమేముంది?

శ్రీ ముళ్ళపూడి వెంకటరమణ ప్రాచీన తమిళభాషలో వ్రాసిన "తిరుప్పావై" ప్రభంధాన్ని మధురమైన సరళమైన తెలుగులోకి అనువదించారు. రాజా గారి లాంటివారు ఈ తెలుగు ప్రభంధాన్ని ఎం. ఎం. కీరవాణి లాంటి సంగీతదర్శకులతో బాణీలు కట్తిస్తే ఎంత బాగుంటుంది! తెలుగు వారి ఈ కోరిక తీరుతుందా?

Raju said...

రాజా గారు,

ఆవేదన చెందాల్సిన విషయం ఐనా మీ మాటలు అక్షరసత్యాలు.

సముచిత గౌరవం ఇచ్చి ప్రోత్సహించిననాడు..రచయిత మరిన్ని మంచి రచనలు చేయగలడు.

మీ విశ్లేషణ బహు హర్షణీయం.

~సీతారామరాజు