(’కడలి’ సినిమాలో ’గుంజుకున్నా’ పాటని రెహమాన్ శక్తిశ్రీ గోపాలన్ తోనే
ఎందుకు పాడించాడు అనే నా అభిప్రాయానికి వచ్చిన స్పందన చూశాక
విడివిడిగా సమాధానం చెప్పడం బదులు అనువాద సాహిత్యానికి సంబంధిన
కొన్ని విషయాలు పంచుకుంటే బాగుండుననిపించింది. అదేమిటంటే ....)
'కడలి' సినిమాలోని 'గుంజుకున్నా నిన్ను ఎదలోకే' పాట
తమిళ వెర్షన్ 'నెంజిక్కుళ్ళే ఒమ్మ ముడింజురుక్కేన్'
అనే పల్లవి తో మొదలవుతుంది.
'నెంజిక్కుళ్ళే' అంటే మనసుని లాక్కోవడం
'ఒమ్మ' అంటే నిన్ను
'ముడింజురుక్కేన్' అంటే ముడి వేసుకున్నాను
ఆల్రెడీ షూటింగ్ జరిపేసుకున్న ఈ పాటకి
సరిపడేట్టుగా అనువాద గీతాన్ని రాయాలి .
రచయిత వనమాలి
'గుండెలోనె నిన్ను ముడివేశా'
అంటూ మొదలు పెట్టాడు.
ఇది ఫస్ట్ వెర్షన్
కానీ తమిళం లో వున్నట్టు గా 'నెంజ్' అనే సౌండ్ కి
దగ్గరగా వుండే మాట కావాలని అడిగారు మణిరత్నం.
లిప్ సింక్ కాకపోయినా ఫరవాలేదన్నారు.
కావాలంటే గమనించండి ...
'ముడింజురుక్కేన్' దగ్గర వేసిన
'ఎదలోకే ' అనే మాటకి లిప్ సింక్ కాదు.
అయినా 'ఓకే ' అన్నారు
'గుంజుకున్నా' అనే మాటలో ఒక చనువుంటుంది అన్నారు
ఎందుకంటే కథలో హీరో ఓ జాలరి.
చదువు రాని అనాగరిక ప్రపంచంలో పెరిగిన వాడు.
మొరటుగా ప్రవర్తించే వాడు.
నెగిటివ్ షేడ్స్ కొంచెం ఎక్కువున్న వాడు.
అతనితో చనువు గా హీరోయిన్ ఏదైనా అనాలంటే
అతని లక్షణాలకి తగ్గ మాట పడాలి
(జాలరి వలని గుంజుకుంటాడు గా)
సాధారణంగా రెహమాన్ గానీ, మణిరత్నం గానీ
పాటల సాహిత్యం లో శబ్ద సౌందర్యానికి ప్రాదాన్యం ఇస్తారు.
రెహమాన్ తన 'రోబో' తమిళ వెర్షన్ 'ఎన్ దిరన్' (యంత్రం) లో
'అరిమా అరిమా' అన్నాడు.
'అరిమ' అంటే తమిళంలో సింహం.
దాన్ని తెలుగు చెయ్యాల్సి వచ్చినప్పుడు
'హరి' అంటే సింహం అనే అర్ధం కూడా వుంది కాబట్టి
చివర్న 'మ' కార ప్రత్యయం చేర్చి 'హరిమా హరిమా' అని రాశాడు వనమాలి.
మణిరత్నం రెహమాన్ ల కాంబినేషన్ 'బొంబాయి' సినిమాలోని
'వుయ్ రే వుయ్ రే' పాటని తీసుకుంటే
'వుయ్ రే' అంటే 'ప్రాణమా' అని అర్ధం.
అక్కడ 'వు' తో మొదలయింది కనుక
సాహిత్య పరంగా రెహమాన్, మణిరత్నం ల శబ్ద రహస్యాలను,
అభిరుచిని పసిగట్టిన వ్యక్తి కనుక
'ఉరికే చిలకా' అంటూ
'ఉ' తో మొదలు పెట్టారు వేటూరి.
అలాగే రెహమాన్ తో చేసిన 'మిన్సార కణవు' (తెలుగు లో మెరుపు కలలు) లోని
'తల్లో తామర ముడిచే' పాట తమిళ వెర్షన్ రెండో లైన్ లో వున్న
'తత్తితావుదు మనమే' ని తెలుగు చేయాల్సి వచ్చినప్పుడు
'అట్టిట్టాయెను మనమే' అని రాశారు వేటూరి.
'తత్తిత్తావుదు' కి 'అట్టిట్టాయెను' అద్భుత మైన సౌండింగ్
ఇక - 'మనమే' ...
నిజానికి ఇలాంటివి పాత రోజుల్లో వాడేవారు.
(మనమీ నందన వనమౌ కాదా - మాయింటి మహాలక్ష్మి)
ప్రస్థుతం జనరేషన్ కోసం అయితే 'మనసే' అని రాయాలి
కానీ వేటూరి ఆటు శబ్ధం, ఇటు లిప్ సింక్ చూసుకున్నారు.
అందుకే 'మనమే' అని రాశారు.
అనువాద సాహిత్యం అందరూ అనుకుంటున్నంత సులువు కాదు.
మళ్ళీ 'కడలి' సినిమాకే వస్తే
ఇంకో పాటలో
'అడియే అడియే' అని ఒరిజినల్ లో వుంది
అంటే 'ఒసేయ్ ఒసేయ్' అని అర్ధం
'ఎన్నఎంగే నీ కూటి పోరా'
అనేది తర్వాతి లైన్
అంటే 'నన్ను ఎక్కడికి తీసుకెళ్తావ్' అని అర్ధం
దీని మీనింగ్ ని తీసుకుని
మన నేటివిటీ టచ్ వచ్చేలా
'అడియే అడియే' కి సరిపోయేలా
'యాడికే యాడికే' అని రాశాడు వనమాలి.
జాలరి మాట్లాడే పల్లెటూరి భాష అది
ఆ 'కడల్ ' సినిమాలోనే
'చిత్తిరై నిలా ఒరే నిలా' అనే మరో పాటుంది
అంటే 'చైత్ర మాసపు జాబిలీ' అని అర్ధం
ఈ పాటకి వనమాలి మొదట రాసినది
'నిండు జాబిలీ ఓ జాబిలీ' ...
మళ్ళీ సౌండింగ్ ఇంపార్టెంట్ అన్నారు
దాంతో 'చిట్టి జాబిలీ' అని రాశాడాయన.
పాట నోటికి ఇమ్మీడియట్ గా పట్టుబడాలంటే
శబ్ద సౌందర్యం అవసరం అని నమ్ముతారు
మణిరత్నం, రెహమాన్..
ఒరిజినల్ పాట లోని
మీనింగ్ పక్కదారి పట్టకుండా
భావం చెడకుండా
అందులోనే వుంటూ
శబ్ద సుగమంగా
బాణీకి న్యాయం చేస్తూ రాయాల్సిన బాధ్యత
స్ట్రెయిట్ సాంగ్స్ రాసే రచయిత కన్నా
అనువాద గీతాలు రాసే రచయితకి ఎక్కువ.
ఇవాళ పరిశ్రమలో ఓ గీత రచయిత బతకాలంటే
అతని మెదడు లో తెలుగుతో పాటు
తెలివీ తేటా సమయస్ఫూర్తి
రసమయ స్ఫూర్తి మనస్పూర్తిగా వుండాలి.
ఈ సందర్భంగా దాశరథి గారు
నాతో అన్న మాట గుర్తొస్తోంది
ఎడ్జెస్ట్ కాలేని వాడు ఎగ్జిస్ట్ కాలేడు .
అలాగే ఆత్రేయ ’ప్రేమ నగర్’ లో రాసినట్టు
ఆవేశంలో తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే
మంచి చేసే అవకాశాల్ని శాశ్వతంగా కోల్పోవలసి వస్తుంది.
ఇది నేను రాయ(లే)ను అని వెళ్ళిపోవడం సులువు
కానీ గొప్ప గొప్ప వారిని మెప్పిస్తూ
వారికి కావలసినది అందిస్తూ
ఉనికిని, మనికిని కాపాడుకోవటం చాలా కష్టం.
పైగా వేటూరి స్వంత కోట లాంటి
మణిరత్నం, రెహమాన్ క్యాంప్ లో
ప్రవేశించడానికి, ప్రవేశించి
అంతటి ప్రతిభావంతుల్ని మెప్పించడం
మాటలు కాదు కదా ?
బైట వుండి మనం చాలా అనుకుంటాం.
అది సహజం కూడా.
కానీ తెర వెనుక విషయాలు కూడా తెలిస్తే
అభిప్రాయాల్లో మార్పుంటుందేమోననే
ఈ ప్రయత్నం.
1 comment:
బాగుంది రాజా గారు మీ విశ్లేషణ - చిన్న సూచన: మీ బ్లాగు లో కామెంట్ మోడరేషన్ తీసేస్తే బ్లాగు లో కి కామెంట్ల వరద ప్రవహిస్తుంది
Post a Comment