Thursday, July 2, 2009

' వయస్సునామి ' పాట వెనుక రేగిన సునామి

' కంత్రీ ' సినిమాలో 'వయస్సునామి ' అనే పాటొకటుంది. ఈ పాటకి ట్యూన్ ని మణిశర్మ తమిళం నుంచి తీసుకున్నాడు. అంటే కాపీ కొట్టాడని కాదు. తెలుగులో హిట్టయిన ' పోకిరి ' సినిమాని తమిళంలో ' పోక్కిరి 'గా తీసినప్పుడు ఆ సినిమాకి సంగీత దర్శకుడి గా మన మణిశర్మని పెట్టుకున్నారు. అందులో ఆయన స్వరపరిచిన 'వసంతముళ్ళై ' అనే పాట తమిళనాట విపరీతంగా హిట్టయింది. ఆ పాట ట్యూన్ నే 'వయస్సునామి ' పాటకి వాడుకున్నాడు మణిశర్మ ... అంటే తన ట్యూన్ నే తను ఉపయోగించుకున్నాడన్నమాట . ఇదిలా ఉండగా దీనికి చేరిన మరో పిట్ట కథ ఏమిటంటే - యాభై ఏడులో శివాజీ గణేశన్ నటించిన 'సారంగధర ' విడుదలైంది. అందులో 'వసంతముళ్ళై ' అనే పల్లవితో మొదలయ్యే పాటొకటుంది.ఆ పాట ట్యూన్ ని ' పోక్కిరి ' లోని 'వసంతముళ్ళై ' పాట మధ్యలో మైక్ నుంచి వచ్చేట్టు సరదాగా ప్లాన్ చేసి పాడించుకొని చిత్రీకరించారు.ఈ సంగతి తెలియని కొందరు 'కంత్రీ ' లోని 'వయస్సునామి ' పాటకి ట్యూన్ ని పాత తమిళ చిత్రం నుండి మణిశర్మ కొట్టేశాడు అనే వార్తని ప్రచారం చేశారు. సో అదీ సంగతి. నిజానిజాలు తెలుసుకోడానికి ఆ క్లిప్పింగ్లు దిగువనే ఉన్నాయి. క్లిక్ చేసి చూడండోసారి.

Tuesday, June 23, 2009

అక్కినేని చేతి వేళ్ళకి డూపు


ఈ ఫొటొ లో వున్నాయన - ప్రముఖ సంగీత దర్శకుడు యస్. రాజేశ్వర రావు గారి పెద్దబ్బాయి రామలింగేశ్వర రావు. అందరూ సాలూరి బాబు అని అంటారు. ఈయన చేతి వేళ్ళు , అక్కినేని నాగెశ్వర రావు గారి చేతి వేళ్ళు ఒకేలా వుంటాయి. అంచేత ' చదువుకున్న అమ్మాయిలు ' సినిమాలో ' ఆడవాళ్ళ కోపంలో అందమున్నది ' అనే పాటలో అక్కినేని పియానో వాయించే క్లోజ్ షాట్లకి ఈయన చేతి వేళ్ళు డూప్ గా వాడేరు. ఆంతే కాదు ఆ సినిమాలో అక్కినేని పెట్టుకునే నల్లటి బెల్ట్ రిస్ట్ వాచ్ ని ఈ రామలింగేశ్వర రావు గారి చేతికి పెట్టి మరీ షాట్ తీశారు. దిగువనున్న వీడియో ని క్లిక్ చేసి చూడండోసారి .

Sunday, June 21, 2009

ఎన్టీయార్ కు తమిళ ' మాయాబజార్ ' లో డబ్బింగ్ ...

విజయా వారి 'మాయాబజార్ ' ద్వారా ఎన్టీయార్ కి శ్రీకృష్ణుడి గా ఎటువంటి ఇమేజ్ వచ్చిందో అందరికీ తెలుసు. ఆ చిత్రాన్ని విజయా వారు తెలుగు , తమిళ భాషలలో ఏక కాలంలో నిర్మించారు.ముఖ్య పాత్రలవరకు చూసుకుంటే - తమిళ వెర్షన్ లో ఏయన్నార్ పాత్రని జెమిని గణేషన్ , సియ్యస్సార్ పాత్రని నంబియార్ ధరించగా - యస్వీఆర్ పాత్రని యస్వీఆర్, ఎన్టీయార్ పాత్రని ఎన్టీయార్ , సావిత్రి పాత్రని సావిత్రి నటించారు. ఐతే యస్వీఆర్, సావిత్రి తమ పాత్రలకు తామే డబ్బింగ్ చెప్పుకోగా , ఎన్టీయార్ పాత్రకు మాత్రం వేరే వారి చేత డబ్బింగ్ చెప్పించారు. మచ్చుకి ఓ రెండు సీన్లు చూడండి.

Tuesday, June 16, 2009

' వివాహ భోజనంబు ' ని తమిళంలో పాడితే గొంతు పచ్చి పుండు ...

విజయా వారి 'మాయాబజార్ ' లో 'వివాహ భోజనంబు ' పాటను తెలుగు వెర్షన్ లో మాధవపెద్ది సత్యం , తమిళ వెర్షన్ లో తిరుచ్చి లోకనాథన్ పాడేరు. ట్యూన్ రెండు భాషలలోనూ ఒకటే. సాహిత్యం కూడా అంత నోరు తిరగనంతదేం కాదు. ఐతే తమిళ గీతాన్ని పాడిన తిరుచ్చి లోకనాథన్ గారికి గొంతు పచ్చి పుండై రెండు మూడు రోజుల దాకా మాట్లాడలేని పరిస్థితి వచ్చిందట. మన మాధవపెద్ది సత్యం గారు మాత్రం ఆ తెలుగు వెర్షన్ పాటను తను చనిపోయే దాకా స్టేజ్ ప్రోగ్రాం లలో కూడా పాడుతూ వుండేవారు. రిఫరెన్స్ కోసం రెండు పాటలనీ చూడండి ఓసారి .

' ఈ వెన్నెలా ఈ పున్నమి వెన్నెలా ' పాట వెనుక స్ఫూర్తి ...

' శభాష్ సూరి ' సినిమాలోని ' ఈ వెన్నెలా ఈ పున్నమి వెన్నెలా ' పాట గుర్తుండే వుంటుంది. తమిళం లో అంతకు ముందు వచ్చిన ' పెరియ ఇడుత పెణ్ణ్ ' అనే చిత్రం ఆధారంగా ఈ శభాష్ సూరి చిత్రాన్ని తీశారు. ఈ తమిళ చిత్రం లోని ' అన్డ్రు వందదుం ఇదే నిలా ' పాట స్టయిల్ ని, నడక ని , డ్రెస్ కోడ్ ని తెలుగు పాట ' ఈ వెన్నెలా ' పాటకు తీసుకున్నారు. ఐతే ట్యూన్ ఓపెనింగ్ కి మాత్రం క్లిఫ్ రిచర్డ్ పాడిన ' ద యంగ్ వన్స్ ' అనే పాట ట్యూన్ ని కొద్దిగా అనుకరించి , తమిళ పాట నడకతో జత కలుపుతూ తన దైన సృజనాత్మకతను జోడిస్తూ ' ఈ వెన్నెలా ' పాట ని ఆకర్షణీయం గా తయారు చేశారు సంగీత దర్శకుడు పెండ్యాల. మూడు పాటల వీడియో లను కొద్దిగా చూసి , వాటితో పాటు ' ఈ వెన్నెలా ' పాట క్లిప్పింగ్ ని కూడా మరోసారి చూసి కంపేర్ చేసుకోండి.

Monday, June 15, 2009

' మనసున మనసై ' పాటకు మూలం బెంగాలీ లో ...

గతం లో తెలుగు సినిమాలు బెంగాలీ సినీ పరిశ్రమ నుండి కథల్నీ, సంగీతాన్నీ తీసుకున్నాయని ఉదాహరణలతో సహా చెప్పుకున్నాం (ఓల్డర్ పోస్ట్ లు చూడండి). ఐతే అందుకు ఉదాహరణలు గా పేర్కొన్న ఆరాధన , మాంగల్యబలం సినిమాలలోని పాటలను చూపించినా - వాటి ఒరిజినల్స్ ఐన సాగరిక, అగ్నిపరీక్ష లను కథలతో సహా తీసుకున్నారు కాబట్టి - అని అనుకున్నా తప్పులేదు . కానీ మనందరికీ ఇష్టమైన ' మనసున మనసై ' పాటకు మూలం బెంగాలీలో వుందంటే కొంత ఆశ్చర్యం కలగకమానదు. ఎందుకంటే 'డాక్టర్ చక్రవర్తి ' సినిమా కథ స్వచ్చ మైన తెలుగు కథ. కోడూరి (అరికెపూడి) కౌసల్యా దేవి రాసిన 'చక్రభ్రమణం' నవల ఆధారంగా ఆ చిత్రాన్ని తీశారు. సో , అందులోని ఒక్క పాటకు కూడా బెంగాలీ సంగీతాన్ని ఆశ్రయించాల్సిన అవసరం లేదు. ఐనా 'మనసున మనసై' పాటకు 'శాప్ మోచన్ ' అనే బెంగాలీ సినిమాలో హేమంత్ కుమార్ స్వరపరిచి పాడిన పాట ట్యూన్ ని తీసుకున్నారు. ఆ బెంగాలీ పాటకు నటించింది ఉత్తమ్ కుమార్. జతపరిచిన వీడియో ని చూడండి మీకే తెలుస్తుంది.

Thursday, June 11, 2009

' పెనుచీకటాయే లోకం ' పాటకు మూలం బెంగాలీ లో ...


ఇదివరకటి రోజుల్లో తెలుగు సినిమాల మీద బెంగాలీ నవలల ప్రభావం , బెంగాలీ సినిమాల ప్రభావం వుండేది. ఏయన్నార్ ఆరాధన సినిమాని బెంగాలీ సినిమా ' సాగరిక ' ఆధారం గా తీశారని , అందులో ' నా హృదయం లో నిదిరించే చెలీ ' పాటకు మూలం ఆ సాగరిక సినిమాలో వుందని చెప్పుకున్నాం (సవివరం గా కావాలంటే ఓల్డర్ పోస్ట్స్ చూడండి). అలాగే అన్నపూర్ణా వారు ' మాంగల్యబలం ' సినిమాని ' అగ్ని పరీక్ష ' అనే ఓ బెంగాలీ సినిమా ఆధారం గా తీశారు. ఆ సంగతి ఆ సినిమా టైటిల్స్ లోనే ఎక్నాలెద్జ్ చేశారు. అది అందరికీ తెలిసిన విషయమే. కాకపోతే మంగల్యబలం లోని ' పెను చీకటాయే లోకం ' పాట ట్యూన్ కూడా ఆ బెంగాలీ చిత్రం ' అగ్ని పరీక్ష ' నుంచి తీసుకున్నారన్నది కొందరికి మాత్రమే తెలిసిన విషయం . జతపరిచిన వీడియో ని చూసి కన్ఫర్మ్ చేసుకోండి .

' మల్లన్న ' లోని ఈ పాటని ట్రై చేసి చూడండోసారి

' మల్లన్న ' లో హీరో విక్రమ్ , దేవిశ్రీ ప్రసాద్ కలిసి పాడిన పాటలో 'ఇవన్నీ డూప్ ' అనే హుక్ లైన్ ని యూత్ తెగ పాడుకుంటున్నారు.ఈపాటలో మొదటి చరణం విక్రమ్ పాడేడు. మిగతా చరణాలు దేవిశ్రీ పాడేడు. సాహిత్యం ఎదురుగా వుంటేనే ఈ పాటను ఎవరైనా పాడగలరు. లేకపోతే ఎవ్వరూ పాడలేరు. ఎందుకంటే మొదటి చరణం లో రకరకాల చిరు తిళ్ళను పేర్కొంటూ ఇవన్నీ డూప్ - పిజ్జాయే టాప్పు అని అంటాడు విక్రమ్ . అలాగే రెండో చరణం లో రకరకాల బంధుత్వాలను పేర్కొని ఇవన్నీ డూప్ - స్నేహితుడే టాప్పు అని అంటాడు దేవిశ్రీ. ఇక మూడో చరణం లో రకరకాల ఫీలింగ్స్ గురించి చెప్తూ ఇవన్నీ డూప్ - జాలీయే టాప్పు అంటాడు. నాలుగో చరణం లో రకరకాల వ్యక్తులను సంభోధిస్తూ ఇవన్నీ డూప్ (వీళ్ళంతా డూప్ అని వుండాల్సింది) మల్లన్నే టాప్ అని ముగిస్తాడు. ఈ ' రకరకాలను ' ఏరి ఒక చోట కూర్చడం ఎంత కష్టమో ,వాటన్నిటినీ మర్చిపోకుండా గుక్క తిప్పుకోకుండా పాడడం అంతే కష్టం. అంచేతే 'ఇవన్నీ డూప్ ' అనే హుక్ లైన్ వుందనిపిస్తుంది. జత పరిచిన వీడియో ని చూడండోసారి .

Wednesday, June 10, 2009

పి.బి.శ్రీనివాస్ మొదట పాడింది ఏ భాష లోనో తెలుసా ?


ప్రముఖ గాయకుడు పి.బి.శ్రీనివాస్ గారిని కర్ణాటక ప్రభుత్వం రెండు వేల ఐదు వందల చదరపు అడుగుల స్థలాన్ని ఇచ్చి సత్కరించింది. మన గాయనీ గాయకులు మొదట మన ప్రభుత్వం నుండి కాక తమిళ , కర్ణాటక ప్రభుత్వాల నుండి గౌరవాలను పొందడం మామూలే . అవన్నీ పక్కన పెట్టి పి.బి.శ్రీనివాస్ గారి గురించి చెప్పుకోవాలంటే అంతటి సంస్కారి, మేధావి మరొకరు కనిపించరు మనకి. శాస్త్రీయ సంగీతం నేర్చుకునే వారికోసం ' డైమండ్ కీ ' కనిపెట్టాడాయన. ఎనిమిది భాషలలో కవిత్వం చెప్పగలడు , రాయగలడు కూదా . నవనీత సుమసుధ అనే రాగాన్ని కూడా కనిపెట్టాడాయన. ఇవి ఆయనెంతటి మేధావో చెప్పేవి. ఇక సంస్కారం గురించి ... బాలూ వచ్చిన కొత్తలో ఈయనకి పాటలు తగ్గితే కొంతమంది వచ్చి నెగెటివ్ గా మాట్లాదాలని ప్రయత్నిస్తే - ' మంచి పాటకి పి.బి.యస్. ఐతేనేంటి యస్.పి.బి. ఐతేనేంటి ?' అంటూ నవ్వేశాడాయన. చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే పి.బి.శ్రీనివాస్ తొలుత సినీరంగ ప్రవేశం చేసింది హిందీ పాటతో. మిస్టర్ సంపత్ అనే హిందీ సినిమాలో ఆయన పాడిన తొలి గీతాన్ని కొద్దిగా వీడియో రూపంలో జతపరుస్తున్నాం. చూచి ఆనందించండి.

Monday, June 8, 2009

నా హృదయం లో నిదిరించే చెలీ పాటకి మూలం బెంగాలీ లో ...


' ఆరాధన ' పేరు తో తెలుగులో ముగ్గురు పాప్యులర్ హేరోలైన ఏయన్నార్,ఎన్టీయార్, చిరంజీవి తో మూడు హిట్ సినిమాలు వచ్చాయి. ఇందులో ఏయన్నార్ నటించిన 'ఆరాధన ' లో ' నా హృదయం లో నిదురించే చెలీ ' పాట ను ఎవ్వరూ మరిచిపోలేరు. కాకపోతే చాలా మందికి తెలియని విషయాలు ఈ సినిమా గురించి వున్నాయి. కాలక్రమేణా కొంతమదికి ఇప్పుదు తెలియొచ్చు గానీ అప్పట్లో ఇవి తెలిసిన వాళ్ళు చాలా తక్కువ. ఏయన్నార్ ఆరాధన కి బెంగాలీ సినిమా ' సాగరిక ' మూలం . ఉత్తమ్ కుమార్ , సుచిత్రా సేన్ హీరో హీరోయిన్లు. అంతే కాదు మనం ఇవాళ్టికీ మర్చిపోలెకపోతున్న ' నా హృదయం లో నిదురించే చెలీ ' పాటను కూద ఆ బెంగాలీ సినిమా నుంచే తీసుకున్నారు. ఈ బెంగాలీ పాటకి సంగీతం రాబిన్ బెనర్జీ. జత పరిచిన వీడియో క్లిప్పింగ్స్ ని సరదాగా చూడండోసారి.