Tuesday, February 7, 2012

Trivikram - Sirivennela - Arudra - Atreya త్రివిక్రమ్ - సిరివెన్నెల - ఆరుద్ర - ఆత్రేయ 




మా మ్యూజిక్ అవార్డుల్లో సిరివెన్నెల గురించి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇచ్చిన స్పీచ్ కి
స్పందించని వారు లేరు. యూ ట్యూబ్ లోనూ , పేస్ బుక్కుల్లోనూ తెగ పెట్టేశారా వీడియో ని.

 'ప్రాగ్దిశ వీణియ పైన -
దినకర మయూఖ తంత్రుల పైన -
జాగృత విహంగ తతులే -
వినీల గగనపు వేదిక పైన'

అంటూ సీతా రామ శాస్త్రి గారు 'సిరివెన్నెల' లో రాసిన పాట విని డిక్షనరీ చూసానన్నాడాయన.
నిజం ... ఆ మాటల్లోని ప్రతి పదానికి అర్ధం చాలామంది పెద్దవాళ్ళకి కూడా తెలియదు.

ప్రాగ్దిశ = తూరుపు దిక్కు, మయూఖము = కిరణము, జాగృత = మేలుకున్న , విహంగము = పక్షి, తతి = సముదాయము , గగనము = ఆకాశం -
అని విడమర్చి చెపితే కానీ తెలుసుకోలేని పరిస్తితుల్లోనే వున్నాం మనం.

ఓసారి ఓ ప్రముఖ దిన పత్రిక ఈ పాట సాహిత్యాన్ని ప్రచురిస్తూ 'తతి' ఏమిటండీ 'గతి' అని ఉండాలేమో అని నన్ను అడగడం జరిగింది. దానికి అర్ధం చెప్పాక "అలాగా ... ఇలాంటి మాటలు సినిమా పాటల్లో ఎవరూ వాడరు కదండీ" అని అన్నారు.

"బాల భారతం సినిమాలోని ' మానవుడే మహనీయుడు' పాటలో ఆరుద్ర  గారు వాడారండీ -
గ్రహరాశులనధిగమించి ,
ఘన తారల పథము నుంచి ,
గగనాంతర రోదసిలో
గంధర్వ గోళ తతులు దాటి -
అంటూ రాశారండీ "
అని వివరించాను.
ఇటువంటిదే మరొక సంఘటన. ఓ పెద్దాయన, సినీ రచయిత కూడా ... మాటల సందర్భం లో చెప్పారు
"ఓ కుగ్రామం లో ఓ పెళ్లి కి వెళ్ళాను. అక్కడ వాళ్ళు ' సేస ' పట్టండి అన్నారు. నాకు అర్ధం కాలేదు. చేతికి అక్షతలు ఇచ్చారు. అప్పుడు తెలుసుకున్నాను అక్షతల్ని సేసలంటారని."

వెంటనే అన్నాను " ఆత్రేయ గారు ఇదెప్పుడో రాశారు కదా !? " అని.
" ఆత్రేయా ... ఏం రాశాడు ? " అడిగారాయన
" ముద్దబంతి పూవులో మూగ కళ్ళ ఊసులో పాటలో - మూగ మనసు బాసలు మీకిద్దరికీ సేసలు - అని రాయలేదా ?" అన్నాను. ఆ పెద్దాయనకి చిన్న కోపం వచ్చింది. ఆయన చనిపోయి చాలా కాలం అయింది. అంచేత పేరు రాసి ఆయన పట్ల నాకున్న గౌరవ భావానికి కళంకం తెచ్చుకోలేను.
మన భాషకి సంబందించిన కనీస  జ్ఞానాన్ని సినిమా పాటల ద్వారా కూడా పెంపొందించుకోవచ్చు అని తెలియచెప్పడానికే  ఈ ఉదాహరణలు.

ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే  - నచ్చిన సినిమా పాటల్ని కేవలం విని వూరుకోకండి. వీలయితే ఆ పాట సాహిత్యాన్ని రాసి చూసుకోండి. మీ భాషా జ్ఞానం లో కచ్చితంగా మీకు తెలియకుండానే మార్పు వచ్చేస్తుంది. శని ఆది వారాల్లో కనీసం ఒక తెలుగు పాటనైనా విని రాయమని, అలా రాసి చూపిస్తేనే బైటికి తీసుకెళ్తానని మీ పిల్లల్ని ఊరించి చూడండి. సినిమా పాట కనుక ఆకర్షణ సహజం. ఫలితం అద్భుతం.
మన పిల్లలకి తెలుగు రావాలంటే  ఇంతకు మించిన సులువైన మార్గం లేదు ప్రస్తుతానికి. 

6 comments:

రసజ్ఞ said...

బాగుందండీ చాలా బాగా చెప్పారు! కాని మీరన్నట్టు ఇప్పటి పిల్లలకి ఇప్పటి పాటలు కాకుండా కాస్త సాహిత్యం అర్థమయ్యే పాటలు, పాత పాటలు అయితే ఇంకా త్వరితగతిన ఆసక్తి చూపుతారు తెలుగు నేర్చుకోవడానికి.

అక్షర మోహనం said...

Very very good article..

KRISHNA'S చెప్పు దెబ్బలు-పూలదండలు said...

సిరి వెన్నెలలో ఈ పాట విని నేను కూడా అప్పట్లో డిక్షనరీలో చూసి ప్రతి పదానికీ అర్ధమ్ తెలుసుకొని నా మిత్రులకి చెప్పి కాలరెగరేశాను. ఇప్పుడు ఆ పదాలకి అర్ధాలు వెతికేవారి మాట అటుంచితే తెలుసుకోవాలని ఎందరికి ఉంటుంది?

Madhav Kandalie said...

మీరు బాగా చెప్పారు సార్.సిరివెన్నెల లోని ఆ పాటని చాలా మంది తప్పుగా పాడటం విన్నాను నేను ప్రాకృత వీణియ అని, మయూహ తంత్రి అని రియాలిటీ షోలలో. ఈ మధ్య కాలం లో ఇంత మంచి సాహిత్యం వినపడటం లేదు.

Suryaprakash Rao Mothiki said...

కె. వి. మహదేవన్ "సిరివెన్నెల" కు స్వరాలందించిన స్వరమాంత్రికుడు. ఆయనే లేకుంటే సీతారామశాస్త్రి గారు మొదటి సినిమాలొనే ఇంత సాహిత్యోపేతమైన ప్రయోగం చెయగలిగేవారు కాదు. ఈ పాట సొంపులో సగబాగం కె. వి. మహదేవన్ గారికి చెందుతుంది. నా మిత్రుడొకరు నన్ను ఈ పాటను ఇంగ్లీషు లోనికి అనువదించ మన్నాడు. నా అనువాదం ఇక్కడ చూడవచ్చు.
http://poetryintelugufilmsongs.blogspot.in/

Saradhi Motamarri said...

Raja garu,
Well written.
Sirivennela gari lyric really superb. Appreciate if you can put the whole lyric and the full meaning, I love to know the meaning.

Thank you also for the clarification of the memorable lyrics of Atreya and Arudra and their meaning.