Sunday, March 25, 2012
As a jury member for Nandi Awards నందీ అవార్డుల జ్యూరీ మెంబర్ గా ...
ఉగాది రోజున నందీ అవార్డుల జ్యూరీ మెంబర్ గా నందిని అందుకున్నాను. 2010 సంవత్సరం లో రిలీజైన సినిమాలకి సంబంధించి న్యాయ నిర్ణయం చేసినందుకు లభించిన మెమెంటో ఇది. నిజం చెప్పాలంటే అంతకు ముందు సంవత్సరాల జడ్జ్ మెంట్ కొన్నిచోట్ల విమర్శలకు గురైంది. 2010 జడ్జ్ మెంట్ కి మంచి పేరే తెచ్చుకున్నాం. ఈ సందర్భం గా గతం ఒక్కసారి గుర్తు చేసుకుంటే - 1976 నుంచి 1980 టైం లో నందీ అవార్డుల ఫంక్షన్స్ ని కవర్ చెయ్యడానికి జర్నలిస్ట్ గా వెళ్ళేవాడిని. ఆ తర్వాత వివిధ పత్రికలలో నా రచనలు చూసి నందీ అవార్డుల ఫంక్షన్లో స్టేజ్ మీద కామెంటరీ కి కొన్ని సంవత్సరాల పాటు నా చేత ఎఫ్ డీ సి వారు రాయించేవారు.
ఓ సారి నందీ అవార్డుల ఫంక్షన్ కి షావుకారు జానకి గారు యాంకర్. ఆవిడ చెప్పాల్సిందంతా నేను రాయాలి. నేను రాయాల్సింది రాసిచ్చేసి వెళ్ళిపోయాను. ఆవిడ అంతా చదివి, "ఇది రాసినవారిని పిలిపించండి.వారితో నేను మాట్లాడాలి" అన్నారు. ఆవిడ ఆర్డర్ వేస్తే తిరుగేముంది ? వెంటనే నాకు కబురు పెట్టారు. ప్రతీ వాక్యాన్ని ఆవిడ చదువుతూ, నేనెందుకలా రాసానో తెలుసుకుంటూ, రకరకాల మాడ్యులేషన్లలోపలుకుతూ ఉంటూ వుంటే - ఆమె ప్రతిభకీ, కమిట్మెంట్ పట్ల ఆమెకి గల ఆసక్తికీ మనసులోనే నమస్కరించుకున్నాను. అంతటితో ఆగలేదావిడ . ప్రోగ్రాం చివర్లో " మీరందరూ నా కామెంటరీకి మెచ్చుకుని ఈ దండ వేసారే ... ఇది నేను రాసుకున్నది కాదు. దీన్నిచదివానంతే ... రాసినవారు వేరే వున్నారు ... ఈ మాటలూ ఈ భావాలూ అన్నీ ఆయనవే .." అంటూ పబ్లిక్ గా ప్రేక్షకులకి నిజం చెప్పేసి నన్ను స్టేజ్ మీదికి పిలిచేసి తన మెడలో వున్న దండ నాకు వేసేవరకూ ఊరుకోలేదు. అదీ ఆవిడ వ్యక్తిత్వం .
మరోసారి ఇలాంటి అనుభవమే ఎల్బీ శ్రీరాం తో ... అది కూడా నందీ అవార్డులకే ... రచన నాది. యాంకరింగ్ ఆయనది. షూటింగ్ లలో వుండడం వల్ల క్షణం తీరికలేదాయనకి. ఫంక్షన్ కి ఓ అరగంట ముందు వచ్చి నేను రాసింది చదువుకోవడం మొదలు పెట్టాడు. " బొత్తిగా టైం లేకుండా పోయింది. ఎలా వస్తుందో ఏమిటో" అన్నాడు బెరుగ్గా . " మీరు రైటరు కాబట్టి మానేజ్ చెయ్యగలరు" అని చెప్పి కొన్ని మాడ్యులేషన్లు నేననుకున్నవి వివరించాను. స్టేజ్ మీద చెలరేగిపోయాడాయన.
చాలాసార్లు చప్పట్లు పడ్డాయి ఆయన యాంకరింగ్ కి . ప్రోగ్రాం పూర్తయ్యాక ఆనందంతో నన్ను కౌగలించుకున్నాడు ఎల్బీ శ్రీరాం. ఆ తర్వాత నేను బిజీగా ఉండడంవల్ల క్లిప్పింగ్స్ పర్యవేక్షణ వరకూ కొన్ని నందీ అవార్డుల ఫంక్షన్ లకి నేను నా వంతు సాయం చేసాను. మాటీవీ లో చేరాక దర్శకుడి గా నేను తీసిన 'గుర్తుకొస్తున్నాయి' కార్యక్రమానికి ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా టీవీ అవార్డుల్లో నందీ అవార్డు ని అందుకున్నాను. ఇదిగో ... ఇప్పుడు జ్యూరీ మెంబర్ గా ... అదీ సినిమా విభాగానికి .... ఇదీ ఆంద్ర ప్రదేశ్ నందీ అవార్డులతో నా ప్రస్థానం.
ఈ జ్యూరీ అవార్డ్ ని అందుకునే టైం లోనే 2009 కి తన అవార్డులని అందుకోడానికి వచ్చాడు ఎల్బీ శ్రీరాం. అప్పటి సంగతులు తల్చుకున్నాం. " ఆ రోజు ఒరిజినల్ గా ఎంతో భయంగా వుంది. మీ ధైర్యం చూస్తే మరింత భయం వేసింది " అన్నాడు నిర్మొహమాటం గా. "అయితేనేం ... మొత్తానికి చప్పట్లు పడ్డాయి గా" అన్నాను. మళ్ళీ మరోసారి కౌగలించుకున్నాడాయన మనస్పూర్తి గా .. ఎల్బీ తో స్నేహం కూడా అవార్దంత గొప్పదే !!
Subscribe to:
Post Comments (Atom)
1 comment:
చాలా సంతోషం.
Post a Comment