Saturday, September 29, 2012

‘నిన్నలేని అందమేదో’ పాట ఎవరు రాశారు ?





ఈ మధ్య నా ఫేస్ బుక్ లో నిన్నలేని అందమేదో పాట ఎవరు రాశారు అనే టాపిక్ మీద ఓ చర్చ వచ్చింది.  సి.నారాయణ రెడ్డి అని సమాధానమిచ్చాను.
అయినప్పటికీ తృప్తి పడలేదా సంగీత ప్రియులు. దాశరథి గారి ముద్ర కనిపిస్తోందన్నారు. పైగా ఈ మధ్య టీవీ చానల్స్ లో అలా చూపించారన్నారు.ఇక లాభం లేదని, ఇది నా కర్తవ్యం అనుకుని ఇలా చేశాను :
" పూజా ఫలం లోని నిన్న లేని అందమేదో పాటను గురించిన అభిప్రాయాలూ . చర్చలూ చూశాక నిరూపించాలనిపించింది. సినారె గారు రాసిన పాటలో  ఏముంది .. నా మాటలో ఏముంది పుస్తకాన్ని (నడుం నొప్పి వల్ల కొంచెం కష్టం అయినా) నిచ్చెనేసుకుని ఎక్కి పైనున్న నా లైబ్రరీ నుంచి తీశాను.  అందులో పూజాఫలం లో తను రాసిన పాటల గురించి నాలుగు పేజీలలో ఆయన వివరించారు. వాటిని  స్కాన్ చేసి అందులో నిన్న లేని అందమేదో పాటకు సంబంధించిన విషయాలను విడిగా ఫొటో షాప్ లో కలిపి సింగిల్ పేజి గా చేసి మీ ముందుంచుతున్నాను. ఇక ఈ పాట రచయిత విషయంలో ఎవరికీ ఏ సందేహమూ వుండదనుకుంటాను.ఈ బుక్ సినారె గారు రాస్తున్నప్పుడు ఆయనకు ఓ రిఫరెన్స్ లా ఉపయోగపడడం నా అదృష్టం. ఆయన తన ముందు మాటలో అది పేర్కొన్నారు. అందుకు సంబంధించిన సాక్ష్యాన్ని కూడా (నాకు చెందినంత వరకూ ఫొటో షాప్ లో కలుపుకుంటూ) మరో పేజీగా జత చేస్తున్నాను.
ఇవిలా వుండగా ఈ పాటలో దాశరథి గారి ముద్ర వుందనడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసిన విషయం.
          తెలియ రాని రాగమేదో తీగ సాగె నెందుకో   ( నిన్న లేని అందమేదో పాటలో)
          అనురాగ మధు ధారయై సాగనీ (తోటలో నా రాజు పాటలో)
అక్కడ రాగం తీగ సాగడం, ఇక్కడ అనురాగం ధారగా సాగడం ఇదీ నారాయణ రెడ్డి గారి ముద్ర.
ఇక టీవీ చానల్స్ లో ఇది దాశరథి గారి పాటగా చెప్పారంటే అందుకు కారణం - సదరు చానల్స్ వారికి తెలుగు సినిమా పాటల క్రెడిట్స్ విషయంలో వుండవలసినంత శ్రద్ధాసక్తులు, నిజాయితీ లేకపోవడమే."
ఇది నా బ్లాగు లొ కూడా వుంటే మరింత ఉపయోగకరంగా వుంటుందని పోస్ట్ చేస్తున్నాను.



No comments: