Sunday, June 7, 2009

' మల్లన్న ' లో ' అలేగ్రా ' పాట గురించి ...

ఈ పాటని రీటా పాడింది. ఈ అమ్మాయి కి తమిళ నాట సింగర్ గా మంచి పేరుంది. ఈ పాటకి రచన సాహితి. నటించింది గ్రూప్ డాన్సర్స్ తో శ్రియ . అలేగ్రా అంటే అదో ఇటాలియన్ పదం అనీ , ఈ పాట హిరోయిన్ ఇంట్రడక్షన్ సాంగ్ గా వస్తుందనీ ఓ అనధికార సమాచారం . ఇక పాటని ఎంత రిచ్ గా తీశారో జత పరిచిన వీడియో క్లిప్ ని చూస్తేనే తెలిసిపోతుంది . సీ అండ్ ఎంజాయ్

' మల్లన్న ' లో ' ఎక్స్ క్యూజ్ మీ ' పాట గురించి ...

'ఎక్స్ క్యూజ్ మీ మిస్టర్ మల్లన్నా' పాట ప్రస్తుతం క్రేజీ సాంగ్ ఆఫ్ ది యూత్ గా చెలామణీ అవుతోంది. దీని తమిళ వెర్షన్ ' ఎక్స్ క్యూజ్ మీ మిస్టర్ కందస్వామీ' పాటకు కూడా తమిళ నాట అంతే ఆదరణ లభిస్తోంది. మన దేవిశ్రే కి ఈ డ్యూయెల్ వెర్షన్ హిట్స్ కొత్త కాదు. లోగడ వర్షం (తెలుగు), మలై (తమిళం) కి కూడ ఇలాగే సమాన గౌరవాన్ని అందుకున్నాడాయన. ఈ పాటని హీరో విక్రమ్ , సుచిత్రా కార్తిక్ కుమార్ పాడారు. ఈ పాటలో కూదా విక్రమ్ గాయకుడి గా తన ప్రతిభను ఎలా ప్రదర్శించాడో గమనించవచ్చు. ఇక్కడ మరో మాట చెప్పుకో వలసింది రచయిత సాహితి గురించి. 'ఒట్టి సిమ్ కార్దు - ఎమ్టి ఐ పాడ్ - నిన్ను స్విచ్చాను చెయ్యడమే వేస్టూ ' లాంటి లేటెస్ట్ టెక్నాలజీ పదాలతో పాటు ' ఎల్ బోర్డూ ... రేయ్ ఎల్ బోర్డూ - ఎప్పుడెక్కుతావ్ మెయిన్ రోడ్డూ ' లాంటి చిలిపి చమత్కారాలు కూడా చేసి పాట ను జనం నోటికి పట్టుకునేలా చెయ్య గలిగాడు. జత పరిచిన వీడియోని చూడండి మీకు తెలియకుండా మీరే పాడుకుంటూ వుంటారు కాస్సేపటికి.

' మల్లన్న ' లో ' మాంబో మానియా ' పాట గురించి ...

ఈ పాట ని విక్రమ్ , రీటా పాడగా మధ్య మధ్య దేవిశ్రీ ప్రసాద్ గొంతు కూడా వినిపిస్తూ వుంటుంది. విక్రమ్ లోని గాయకుడు ఎన్ని పోకడలు పోయాడో చెప్పడానికి ఈ ఒక్క పాట సరిపోతుంది . చిత్రీకరణ కూడా బాగుంటుంది అని చెప్పడానికి ' ఫదేల్ ఫడేల్ ఫడేల్ ' దగ్గిర చూడండి. ఈ పాటకి మోహన రాగం ఆధారం . ఈ రాగం లో రెహమాన్ చేసిన 'మావేలే మావేలే ' (జంటిల్ మన్) , ఇళయరాజా చేసిన 'నిన్ను కోరీ వర్ణం (ఘర్షణ) పాటల్ని గుర్తుచేసుకుంటూ ఈ పాటని విని చూడండి . ఇళయరాజా , రెహమాన్ , దేవిశ్రీ ఈ ముగ్గురూ ఈ రాగాన్ని ఎంత బాగా ప్రయోగించారో తెలుస్తుంది .

Friday, June 5, 2009

పాటలు రాసే దాశరథి గారికి పాట ఎందుకు రాదు ?


ఆంధ్రప్రదేశ్ ఒకప్పటి ఆస్థాన కవి డాక్టర్ దాశరథి (అసలు పేరు దాశరథి కృష్ణమాచార్యులు ) సినీ గీత రచయిత కూడా అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అన్నపూర్ణా వారి ' ఇద్దరు మిత్రులు ' చిత్రం ద్వారా సినీ రంగప్రవేశం చేసిన దాశరథి గారికి ఆ బ్యానర్ అంటే ప్రత్యేకమైన గౌరవం . అందుకే అన్నపూర్ణా వారు తీసిన 'చదువుకున్న అమ్మాయిలు ' సినిమాలో ఓ చిన్న వేషం కూడా వేశాడాయన . ఆ సినిమాలోని బ్రహ్మచారుల నిలయం సెట్ ల లో బాత్ రూం దగ్గర క్యూ కట్టి బ్రహ్మచారులు అవస్థ పడే సీన్ లో బాత్ రూం లోకెళ్ళి తలుపేసుకుంటూ ' అబ్బాయిలూ ... నాకు పాట రాదు. తలుపు తీయొద్దు. తీశారో మీఖర్మ ' అని చెప్పి తలుపేసుకునే వ్యక్తి దాశరథి గారే. జతపరిచిన వీడియోని క్లిక్ చేసి చూసి గుర్తుపట్టండోసారి.

మీరిది గమనించారా ? (రెండు)

పంథొమ్మిది వందల అరవై నాలుగులో 'దాగుడుమూతలు ' అనే సినిమా రిలీజైంది. ఆ సినిమాలో ఓ పాట - 'దేవుడనే వాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం '. అలాగే పంథొమ్మిది వందల అరవై ఐదులో ' వీరాభిమన్యు ' అనే సినిమా రిలీజైంది. ఇందులోని పాట - ' రంభా ఊర్వశి తలదన్నే ' . ఈ రెండు సినిమాలకీ కేవీ మహదేవనే సంగీత దర్శకుడు.ఈ రెండు పాటలూ హిట్టే. కానీ ఈ రెండు పాటల్లోనూ ఒక లైన్ దగ్గర ట్యూన్ కామన్ గా వుందని ఆ రోజుల్లో కొంతమంది మాత్రమే గ్రహించగలిగారు. కావాలంటే ' దేవుడనే వాడున్నాడా ' పాటలో 'తాము నవ్వుతూ నవ్విస్తారు కొందరు అందరినీ ' అనే లైన్ దగ్గిర ట్యూనూ , ' రంభా ఊర్వశి తలదన్నే ' పాటలో ' తనివితీరా వలచి హృదయం కానుకీయని కరమేలా ' , 'కలికి సరసనా పులకరించీ కరగిపోవని తనువేలా ' అనే లైన్ల దగ్గర ట్యూనూ ఒకేలా వుంటాయి వినడానికి. ఈ ఆర్టికిల్ తో పాటు జత పరిచిన వీడియోని ఓ సారి క్లిక్ చేసి చూడండి. .

Thursday, June 4, 2009

పుట్టినరోజు సందర్భం గా మీతో భాస్కరభట్ల ...

భాస్కరభట్ల రవికుమార్ ప్రస్తుతం మాంచి డిమాండ్ వున్న సినీ గీత రచయిత. ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే (పోకిరి)లాంటి పాటలూ రాయగలడు. నీ కళ్ళ తోటి నా కళ్ళ లోకి (తులసి) లాంటి పాటలూ రాయగలడు. అందుకే 'బట్లేసుకున్న పాటలకైనా , బట్లేసుకోని పాటలకైనా భాస్కరబట్ల నేసుకుంటే రెండిటికీ సంపూర్ణ న్యాయం చేస్తాడూ అనే టాక్ ఇండస్ట్రీ లో వుంది. జూన్ ఐదు భాస్కరభట్ల బర్త్ డే. ఈ సందర్భం గా ఓ చిన్న వీడియో ఇంటర్ వ్యూ చేద్దామని అడగగానే ఒప్పుకున్నాడాయన. ఆయన మీతో చెప్పాలనుకున్న సంగతులు డైరెక్ట్ గా ఆయన మాటల్లోనే వీడియో రూపంలో చూడండి.


మీరిది గమనించారా ?

పంథొమ్మిది వందల అరవై ఒకటిలో రిలీజైన భక్త జయదేవ, భార్యాభర్తలు సినిమాలలోని పాటలు గుర్తుండే వుంటుంది. రెండిటికీ యస్.రాజేశ్వరరావే సంగీత దర్శకుదు.అభినయించిన నాయకుదు - అక్కినేని నాగేశ్వరరావు.ఇప్పుడు చెప్పదలచుకున్న విషయానికి సంబంధించిన ఆ పాటలు రెండూ - భక్త జయదేవ లో 'యారమితా వనమాలినా' ,భార్యాభర్తలు లో 'మధురం మధురం ఈ సమయం' . ఈ రెండు పాటలనీ వింటుంటే ట్యూన్ ఒక దగ్గిర కామన్ గా వున్నట్టు అనిపిస్తుంది. యారమితా వనమాలినా లో 'సకల భువన జన వర తరుణేనా' అనే లైన్ దగ్గర ట్యూనూ, మధురం మధురం ఈ సమయం లో 'పరిమళించె అనురాగపు విరులూ' అనే ట్యూనూ ఒకేలా వున్నాయనిపిస్తుంది. ఆ పాటల రెండో చరణాలలోని 'అమృత మధుర తర మృదు వచనేనా ' దగ్గిర,'పొంగిపొరలె మన కోర్కెల అలలూ ' దగ్గిర కూడా అలాగే ఫీలవుతాం .

Wednesday, June 3, 2009

ఏమని వర్ణించనూ ....


సమర్ధతకు సాకారం , ప్రతిభకు ప్రాకారం , సంస్కారానికి శ్రీకారం ... ఇవీ బాలూ గారి గురించి షార్ట్ కట్ లో చెప్పాలంటే దొరికే మాటలు.గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటుడి గా, ఇంకా ప్రేక్షకులకు తెలిసిన 'చాలా చాలా గా' వీటి గురించి కొత్త గా చెప్పాల్సిన పని లేదు. కానీ చాలా మందికి తెలియనిది ఆయన సంస్కారం గురించి . అది కేవలం రుచి చూసిన కొద్ది మందికే తెలుసు. ఒకసారి ఆ సంస్కారం కి అలవాటు పడ్డాక ప్రపంచం లోని కుళ్ళు తో ఎడ్జెస్ట్ అవడం కష్టం. అదో తీయటి ప్రమాదం ఉంది ఆయన స్నేహం తో. రోజుకున్న రెండు పూటలలో ఒక్క పూటైనా స్నేహితుడితో భోజనం చేయకపొతే ఆరోజు వేష్ట్ కింద లెక్కగా భావించే స్నేహశీలి ఆయన. స్నేహానికి ఆయన ఇచ్చే విలువల గురించి నా దగ్గరున్న అనుభవాలను పేర్కొనడం మొదలు పెడితే ఈజీ గా అదో గ్రంధమే అవుతుంది. వీలుని బట్టి అప్పుడప్పుడు ఇకనుంచి ఈ బ్లాగులో రాస్తూ వుంటాను. దానికి బాలూ గారు పర్మిషన్ ఇస్తారనే ఆశిస్తూ .... బాలూ గారికి జన్మ దిన శుభాకాంక్షలు.

అసెంబ్లీ లో అడుగు పెట్టడానికి ఓ రోజు ముందు ...









సికింద్రాబాద్ నియోజక వర్గం నుండి ఎమ్మెల్యే గా ఎన్నికైన సహజ నటి జయసుధను ఆంధ్ర ప్రదెశ్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సగౌరవం గా సత్కరించింది. సీనియర్, జూనియర్ పాత్రికేయులెందరో జయసుధ గారితో తమకున్న అనుబంధాన్ని,ఆమె వ్యక్తిత్వాన్ని కొనియాడుతూ ప్రసంగించారు. తరువాత జరిగిన మీట్ ది ప్రెస్ కార్యక్రమం లో పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు జయసుధ గారు ఇచ్చిన సమాధానాల సారాంశం ఇదీ : " క్రికెట్ మ్యాచ్ ని టీవీ లో చూస్తున్నపుడు తప్ప నేనెప్పుడూ ఉద్వేగానికి లోను గాను. కనుక గెలుపు, ఓటమి,అసెంబ్లీ లో తొలిసారి కాలు పెట్టడం ఇలాంటి వాటికి థ్రిల్ ఫీల్ కాను. ప్రతి పురుషుడి వెనుక ఒక స్త్రీ వుంటుందంటారు. నా విజయం వెనక దేవుడున్నాడు. ప్రజలు నన్ను సికింద్రాబద్ కే పరిమితం చేసుకోలేదు. ఎక్కదెక్కడి వాళ్ళో వచ్చి వారి సమస్యలు నాతో చెప్పుకుంటున్నారు. ఇవాళ మధ్యాహ్నం ఓ కాన్సర్ పేషెంట్ కి హాస్పిటల్ లో ఎడ్మిషన్ దొరకకపోతే తీసుకు వచ్చి మా ఇంటి ముందు పడేశారు. " ఇలా తన మనసులోని భావాలను పాత్రికేయులతొ పంచుకుంటూ వారికి అండగా తనెప్పుదూ ఉంటానన్నారు. విచ్చేసిన వారందరి ముఖాలలో సంతొషం తొణికిసలాదుతూ వుండగా సమావేశం ముగిసింది.

Monday, June 1, 2009

'కరెంట్' ఆడియో లోని 'అటు నువ్వే ఇటు నువ్వే ' పాట గురించి ...


ఈ పాటను నేహ భసిన్ పాడింది.ఈమెది ఓ టిపికల్ వాయిస్. పేరుకి శోక గీతమే ఐనా ఈమె వాయిస్ లో వున్న ఓ విచిత్రమైన హస్కీ నెస్ పాటకి స్పెషల్ ఎట్రాక్షన్ గా మారింది. దేవిశ్రీ ఇచ్చిన ట్యూన్ లో కూడా ఏదో తెలియని డెప్త్ వుంది. ఈ ఆడియోలోని మిగిలిన నాలుగు పాటలతో కాకుండా ఈ ఒక్క పాటని విడిగా వింటే పాట ట్యూన్ లోనూ,సాహిత్యం లోనూ వున్న డెప్త్ ని ఫీల్ అవగలం. ఇక సాహిత్యం గురించి చెప్పాలంటే - రామ జోగయ్య శాస్త్రి గారి గురించి తెలియని వాళ్ళకి ఈ పాట సీతారామ శాస్త్రి రాశారనిపిస్తుంది. ఎందుకంటే ప్రేమ గురించి సీతారామ శాస్త్రి గారు ఇచ్చినన్ని ఎక్స్ ప్రెషన్లు ఇంకెవరూ ఇవ్వలేదు గనుక. ఈ పాటలొ 'నాకే తెలియకుండా నాలో నిన్ను ఒదిలావే - నేనే నువ్వయేలా ప్రేమ గుణమై ఎదిగావే - మాటే చెప్పకుండా నీతో నువ్వు కదిలావే'లాంటి వాక్యాలు రామజోగయ్య శాస్త్రి లోని సీతారామ శాస్త్రి గారిని ఆంజనేయుడి గుండెల్లో రాముడు కనిపించినట్టు అద్దం పట్టినట్టు చూపిస్తాయి.