Monday, August 17, 2009

భాష తెలిసినా పాడడానికి , రాయడానికి కష్టమైన పాట ఇది...

ఓ సారి వృత్తి రీత్యా ఓ ఇంటర్వ్యూ కోసం సంగేత దర్శకుడు కీరవాణి గారిని కలవడం జరిగింది.ఆయన కున్న టైట్ షెడ్యూల్ వల్ల కారులోనే ఇంటర్వ్యూ చేయక తప్పలేదు. ఇంటర్వ్యూ అయ్యాక, జర్నీ ఇంకా వుండడం చేత ఆయన తన దగ్గరున్న ల్యాప్ ట్యాప్ ని ఆన్ చేశారు. అప్పుడు వినిపించింది ఓ తమిళ గీతం. వినడానికి ఎంత గొప్ప గా అనిపించిందో పాడడానికి అంత కష్టం గా వుంటుందంపించిందా పాట.ఇది సుమారు ఏడు సంవత్సరాల క్రితం సంగతి. అప్పట్నుంచి సుమారు ఓ రెండేళ్ళ పాటు సాగింది వేట - ఆ పాట వివరాలు కనుక్కోడానికి. మా టీవీ లో ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగ రీత్యా చెన్నై వెళ్ళడం జరిగింది. అక్కడ కనబడ్డ ప్రతి వీడియో షాపులోనూ ఎంక్వైరీ చేయడం జరిగింది. ఒక షాపులో మాత్రం నా అవస్థ గమనించి ఆ పాటని ముత్తైతరు పాట అని అంటారని , అది అరుణగిరి నాదర్ 'సినిమాలోనిదని, ఆ వీడియో కాపీ తన దగ్గర ఒక్కటి మాత్రమే వుందని,దాని ఖరీదు రెండు వందల డబ్భై అయిదు అయినా హైద్రాబాద్ నుంచి వచ్చాను కనుక నూటా యాభై కి ఇస్తానని అన్నాడు. (మూసార్ బేర్ కంపెనీ రాకముందు వీసీడీల ధరలు అలాగే వుండేవి). అదికూడా మర్నాడు పదిన్నరకి వస్తేనే ఇస్తానన్నాడు. మర్నాడు సరిగ్గా అదే సమయానికి మణిశర్మతో ఇంటర్వ్యూ షూటింగ్.షెడ్యూల్ ప్రకారం ఆయన ఇంటికి వెళ్తే తెమలడానికి మరో అరంగంట కావాలన్నారు లక్కీగా.ఆ అరగంట నాకోసమే అన్నట్టుగా సెట్ అయింది. వెంటనే వెళ్ళి అ వీడియోని చేజిక్కించుకున్నాను. తిరిగి వచ్చాక చేతిలో ఉన్న వీడియోని చూసి, జరిగిన కథని మొత్తం విన్నాడు మణిశర్మ." ఆ ముత్తైతరు పాటని ప్రాక్టీస్ చెయ్యడాని చచ్చేవాళ్ళమండీ బాబూ ...."అంటూ ఆ పాటలో ఎక్కడెక్కడ కష్టం గా వుంటుందో వాటన్నిటినీ పాడి వినిపించాడాయన." ఇంత కష్టమైన సాహిత్యాన్ని తెలుగులో ఇప్పుడెవరైనా రాయగలరా ? " అని అడిగాను. దానికాయన " వేటూరి గారు ఒక్కరే రాయగలరు . ఐనా సంగీతం మీద ఇలాంటి ప్రయోగాలు ఇవాళ ఎవరు చెయ్యనిస్తారు ?" అన్నారు. విన్నాక మీకూ అనిపిస్తుంది ఇలాంటివి పాడడం ఎంత కష్టమో... అన్నట్టు ఈ పాటను పాడిందీ, పాటకు నటించిందీ తమిళ నాట అలనాటి ప్రముఖ గాయకుడు టి.యం.సౌందర్రాజన్.

Wednesday, August 5, 2009

ప్రే 'రణ ' రంగం లో సృజనాత్మకత


ఈ ఫొటోలో వున్నావిడ పేరు లీలానాయుడు. ఈ మధ్యనే చనిపోయింది. ఆ రోజుల్లో మంచి అందగత్తె గా ఈవిడ గురించి చెప్పుకునేవారు. ఈవిడ నటించిన సినిమాల్లో అందరికీ తెలిసిన సినిమా - ' ఏ రాస్తే హై ప్యార్ కి ' . అందులో రఫీ , ఆశా పాడిన ' ఎ ఖామోషియా ఎ తన్ హాయియా ' పాట చాలా పెద్ద హిట్. ఈ పాట ట్యూన్ ని కూడా మనవాళ్ళు వదలలేదు. 'మనుషులు - మమతలు ' సినిమాలో 'నిన్ను చూడనీ నన్ను పాడనీ ' పాటకి వాడుకున్నారు. కాకపోతే అప్పట్లో ఇటువంటి విషయాల్లో కొంత నిజాయితీ కూడా చూపే వారు. పల్లవినో, చరణాన్నో ప్రేరణగా తీసుకున్నా మిగతా భాగాన్ని అధ్భుతంగా స్వంతం గా చేసి, ప్రేరణగా తీసుకున్న భాగం తో కలిపి టోటల్ గా వచ్చిన అవుట్ పుట్టే ఒరిజినల్ అవుట్ పుట్టేమో అన్నంత బాగా పాటని తయారు చేసే వారు. అందుకు వుదాహరణ గా ' ఎ ఖామోషియా ' , 'నిన్ను చూడనీ ' పాటల్నే చెప్పుకోవాలి. రెండు పాటల్నీ మొత్తం గుర్తుకు తెచ్చుకునో లేదా డవున్ లోడ్ చేసుకుని వినో చూడండి. ప్రస్తుతానికి పల్లవులని మాత్రం క్లిక్ చెసి చూడండి.