Saturday, February 15, 2014

దటీజ్ చంద్రబోస్

ఈ ప్లేట్ లను చూస్తుంటే పూర్వం వచ్చే గ్రామ్ ఫోన్ రికార్డ్ ల్లా వున్నాయి కదూ !? నిజానికి ఇవి -వేడి తగ్గకుండా - టీ కప్ ల మీద పెట్టే టీ కోస్టర్స్. ఆ మధ్య అమెరికా వెళ్ళినప్పుడు చంద్రబోస్ చూసి - ఇలాటి తమాషా ఐటమ్స్ అంటే నాకు ఇష్టం అని గుర్తొచ్చి - కొని తీసుకొచ్చారు. ఇటీవల నాకు ఒంట్లో బావులేదని తెలిసి ( ప్రస్తుతం బాగానే వుంది) నన్ను చూడడానికి తన భార్య సుచిత్ర తో మా ఇంటికి వచ్చి , ఓ గంట గడిపి, ఈ టీ కోస్టర్స్ ఇచ్చి వెళ్ళారు. చంద్రబోస్ కి నేనంటే ఎంతో గౌరవం. 'ఆయన  మా సంగీత సాహిత్య కుటుంబానికి పెద్ద' అని అంటుంటారు నా గురించి. ఇలాంటి మధురానుభూతుల్ని మనసులో దాచుకోవడం, పంచుకోవడం తప్ప ఇంకేం చెయ్యగలం ? Tuesday, February 11, 2014

దేవిశ్రీ ప్రసాద్ లోని ఓ ప్రత్యేక లక్షణం" సినీ పరిశ్రమలో ఒక వ్యక్తి పైకి రావాలంటే - ప్రతిభ, పరిశ్రమ తో పాటు ప్రవర్తన కూడా వుండాలి. ఈ మూడూ ముప్పేట గొలుసులా ఎప్పుడూ పెనవేసుకుని వుండాలి " అనేవారు సి. నారాయణ రెడ్ది. సంగీత దర్శకుడు, గాయకుడు, రచయిత అయిన దేవిశ్రీ ప్రసాద్ ని ఎప్పుడు కలిసినా ఈ మాటలు గుర్తుకొస్తుంటాయి. అందుకు నా అనుభవంలో ఓ ఉదాహరణ ... 'అత్తరింటికి దారేది' సినిమా ఆడియో అప్పుడే రిలీజయింది. పాటలు విన్నాను. 'నిన్ను చూడగానే చిట్టిగుండె' పాట ట్యూను, పాడే పద్ధతి కొత్తగా వుందనిపించింది. సాధారణంగా దేవిశ్రీ ఫోన్ లో దొరకడు కాబట్టి ఏం చెప్పాలన్నా అతని తమ్ముడు సాగర్ కి చెబుతుంటాను. ఆ పాట గురించి నా అభిప్రాయం చెప్పాను. "ఇందులో వున్న ఒకరకమైన బద్ధకాన్ని భలే లబ్జుగా పాడేడు దేవిశ్రీ " అని అన్నాను. "మీకు నచ్చిందంటే పాట హిట్టే. అన్నయ్యతో చెప్తాను. జనం ఎలా రిసీవ్ చేసుకుంటారో అని కొంచెం టెన్షన్ పడుతున్నాడు" అన్నాడు సాగర్. అది జరిగిన రెండు నెలల తర్వాత రేడియో మిర్చి అవార్డుల ఫంక్షన్ కి జ్యూరీ మెంబర్ గా చెన్నై వెళ్ళడం జరింది. హాజరైన వారంతా తెలుగు, తమిళ, కన్న్డడ, మలయాళ సినీ ప్రముఖులే... కాస్త ఆలస్యంగా  ఫంక్షన్ మధ్యలో వచ్చాడు దేవిశ్రీ. అందర్నీ పలకరించుకుంటూ, మధ్యలో వున్న నన్ను కూడా విష్ చేసేసి ముందుకి వెళ్ళాడు. ఇంకా చాలా మంది ప్రముఖులు వున్నారు విష్ చేయడానికి. కొంత దూరం వెళ్ళి వెనక్కి పరుగెత్తుకుంటూ వచ్చి నా దగ్గిర ఆగాడు. "రాజా గారు .. మీ ఫోన్ గురించి సాగర్ చెప్పాడు. మీకు నచ్చిందంటే నా ఎక్స్ పెరిమెంట్ జనం రిసీవ్ చేసుకుంటారని, సినిమా రిలీజయ్యాక ఆ పాటని మరింత మెచ్చుకుంటారన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. థాంక్యు సర్" అన్నాడు నా రెండు చేతులూ పట్టుకుని. ఆ తర్వాత ఆ పాట హిట్టు గురించి అందరికీ తెలిసిందే. దేవిశ్రీ జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నిజాయితీ తో కూడిన ఈ వినయమే నాకు గుర్తొస్తుంటుంది. అతని  విజయాలకి గల కారణాల్లో ఈ ప్రవర్తన కూడా ఒకటని అనిపిస్తూ వుంటుంది.
(ఈ ఫొటో అప్పుడు తీసినది కాదు. దానికి వేరే కథ వుంది. వీలుని బట్టి చెబుతా).

Tuesday, September 10, 2013

జేసుదాసు తర్వాత మధుబాలకృష్ణనే
సరిగ్గా 12 ఏళ్ళ క్రితం విన్నాను - మధుబాలకృష్ణన్ వాయిస్. రామజోగయ్య శాస్త్రి గారు సినీ గీత రచయిత కాక ముందు తను రాసిన కొన్ని పాటలను వినమంటూ ఓ క్యాసెట్ ఇచ్చారు. సాహిత్యం ఎంత బావుందో పాడిన గొంతు అంత బావుంది. 'ఎవరిదండీ ఈ వాయిస్ ?' అనడిగాను. 'మధు బాలకృష్ణన్ అని మలయాళ గాయకుడు' అని చెప్పారు రామజోగయ్య శాస్త్రి. అచ్చు జేసుదాసు గారి ని గుర్తు చేసే ఆ వాయిస్ మీద ప్రేమ పెంచుకున్నాను. ఎప్పుడు మనవాళ్ళు పాడిస్తారా అని ఎదురు చూశాను. ఈలోగా చంద్రముఖి తమిళ వెర్షన్ లో 'కొంజుమ్ నేరమ్ కొంజుమ్ నేరమ్' పాట ఆశాభోస్లే తో పాడగా ఆ వాయిస్ ని విన్నాను. తర్వాత చంద్రముఖి తెలుగు వెర్షన్ లో సుజాత తో 'కొంతకాలం కొంతకాలం' పాటలో విన్నాను. తర్వాత కొన్ని తెలుగు సినిమాల్లో ఆయన వాయిస్ ని విన్నాను -  కానీ మనవాళ్ళు ఆయన వాయిస్ ని కరెక్ట్ గా వాడుకోలేదని నా అభిప్రాయం. మొన్న రేడియో మిర్చి అవార్డుల కార్యక్రమానికి వెళ్లినప్పుడు స్టేజ్ మీద  ఒక మెడ్లీలో దుమ్ము దులిపేశాడు మధుబాలకృష్ణన్. వెళ్ళి ఆయన గురించి నా అబ్జర్వేషన్ చెప్పగానే అయిదు నిముషాల్లోనే ఎప్పటినుంచో పరిచయం వున్నట్టుగా ఎంతగానో కలిసిపోయాం. జత పరిచిన ఫొటో ఆ క్షణాన తీయించుకుకున్నదే.  

అరుదైన సంఘటనజూలై 26 న చెన్నై లో రేడియో మిర్చి వారి అవార్దుల కార్యక్రమం జరిగింది. గ్రాండ్ జ్యూరీ మెంబర్ గా నన్ను కూడా అహ్వానించారు. వెళ్ళాను. రేడియో మిర్చి వారి ట్రీట్ మెంట్ అడుగడునా అత్యద్భుతంగా వుంటుంది. గత మూడేళ్ళుగా చూస్తున్నాను. వారి కమిట్ మెంట్ అలాగే వుంది. అవార్డుల కార్యక్రమం తర్వాత డిన్నర్ వుంటుంది.

దక్షిణ భారత సినీ సంగీత శాఖకు సంబంధించిన వారందరూ అక్కడ కలిసే అవకాశం వుంటుంది. ఆ రోజు జరిగిన ఆ డిన్నర్ ప్లేస్ లో పియానో వుంది.పియానో చూడగానే కోటికి ఎక్కడలేని మూడ్ వచ్చేసింది. వెంటనే వాయించడం మొదలుపెట్టారు. పక్కనే వున్న ఆర్పీ పట్నాయిక్, రమణ గోగుల , సునీత అందరూ చేరిపోయారు. తమ తమ గొంతులను కలిపారు. వారందరూ ఆలపిస్తూ వుంటే, కోటి పియానో వాయిస్తుంటే అక్కడ ఎంజాయ్ చెయ్యనివారు లేరు.

వీలయినంత వరకూ ఫొటోలు తీయగలిగాను. నాక్కూడా ఓ తీపి గుర్తుగా మిగిలిపోతుందని నేను కూడా చేరి ఫొటో తీయించుకున్నాను. అరుదైన ఆ దృశ్యాల్ని మీరు కూడా చూసి ఆనందిస్తారనే నా నమ్మకం.

Friday, April 26, 2013

ఢిల్లీ తెలుగు అకాడమీ వారి సమైక్య భారతి గౌరవ సత్కార్ అవార్డ్ సినీ సంగీత సాహిత్యాలపై నేను చేసిన పరిశోధనలకు, రాసిన విశ్లేషణలకు ఢిల్లీ తెలుగు అకాడమీ నన్ను సమైక్య భారతి గౌరవ సత్కార్ అవార్డ్ తో వారి ఉగాది పురస్కారాలలో సత్కరించింది. ఆ సందర్భంగా తీసిన ఫొటోలను, వీడియోలను జత పరుస్తున్నాను మీ అందరి మన్ననల కోసం ...

video


Friday, January 18, 2013

' సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ' సినిమాకి టైటిల్ హీరోయిన్ ఎవరో తెలుసా ?ఇదే ప్రశ్నని సినీ పరిశ్రమలోనూ, పాత్రికేయ వృత్తిలోనూ వున్న నా మిత్రులు దాదాపు ఓ 30 మందిని అడిగాను.     " అంజలి ... జర్నీ లోనూ, షాపింగ్ మాల్ లోనూ వేసింది. నీకు తెలియక పోవడమేమిటి ?" అని జవాబిచ్చారు చాలామంది. వీడు అడిగాడంటే ఏదో వుండి వుంటుందని "కథే హీరోయిన్ " అన్నారు కొంతమంది ( ఆడ పేరుతో టైటిల్ వుంది కదాని) "సీత" అన్నారు ఒకరిద్దరు అతి తెలివిగా.

సినిమా జాగ్రత్తగా చూస్తే అర్ధం అవుతుంది. వాకిట్లో వున్న సిరిమల్లె చెట్టు కి పూజ చేస్తూ "ఇది మా అత్తగారు నాటారు. ఆరోజు నుంచి ప్రతి రోజూ పూలు పూస్తూనే వుంది" అంటుంది రోహిణి హట్టంగడి - అంజలి తో ... ఆ ఇల్లూ, వాకిలీ వాళ్ళకు పెద్దవాళ్ళ ద్వారా సంక్రమించినది. ఆ పెద్దవాళ్ళు - ఎస్వీ రంగారావు , సూర్యకాంతం. వాళ్ళ ఫొటోలు సినిమాలో చాలా సార్లు చూపిస్తూ వుంటారు. ఆ సూర్యకాంతమే నిజమైన సీతమ్మ. ఆవిడ పేరే అంజలికి పెట్టారు.

ఆఖరి సీన్లో కూడా "ఇదంతా వాళ్ళదే " అంటాడు ప్రకాశ్ రాజ్ - ఎస్వీ రంగారావు, సూర్యకాంతం ఫొటోలు చూపిస్తూ. కాబట్టి 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' కి నిజమైన టైటిల్ హీరోయిన్ - సూర్యకాంతమే . అలా సూర్యకాంతం 'గుండమ్మ కథ' కి డైరెక్ట్ టైటిల్ హీరోయిన్ అయితే ఈ సినిమాకి ఇన్ డైరెక్ట్ టైటిల్ హీరోయిన్ అన్నమాట.

Monday, January 7, 2013

రెహమాన్ ఆర్టికల్ కి దక్కిన గౌరవం

జనవరి న ఎ.ఆర్. రెహమాన్ పుట్టిన రోజు సందర్భంగా సితారా ఫిలిం వీక్లీ వారు నా చేత ప్రత్యేకంగా రాయించిన ఆర్టికల్ కి ఈనాడు ఆర్కీవ్స్ లో చోటు దొరికింది. ఆ ఆర్టికల్ పడిన రోజు ఈనాడు ఇంటర్నెట్ ఎడిషన్ హోమ్ పేజిలో ప్రముఖంగా పబ్లిసిటీ ఇచ్చారు. ఆ పబ్లిసిటీని, ఆర్కీవ్స్ లొ పెట్టిన ఆ వ్యాసమ్ లింకుని జత పరుస్తున్నాను. చూసి ఎలా వుందో చెప్పండి.Friday, January 4, 2013

రెహమాన్ మెలొడీల పై ఓ పరిశీలన


జనవరి 6 న రెహమాన్ పుట్టిన రోజు సందర్భంగా
సితారా ఫిలిం వీక్లీ వారు నా చేత ఓ వ్యాసం రాయించారు.
తనకు బాగా నచ్చిందని, రిపోర్ట్ లు కూడా బాగుందని వస్తున్నాయని
సితారా మ్యాగజైన్ ఇన్ చార్జ్ శ్రీ చక్రవర్తి చెప్పడం తో పడ్డ కష్టానికి
ఫలితం దక్కిందనిపించింది. చదివి మీ అభిప్ర్రాయం కూడా చెబితే
మరింత ఆనందిస్తాను


Friday, December 28, 2012

మణిరత్నం, రెహమాన్ ల ’కడలి’ ని ఈదిన వనమాలి(’కడలి’ సినిమాలో ’గుంజుకున్నా’ పాటని రెహమాన్ శక్తిశ్రీ గోపాలన్ తోనే 
ఎందుకు పాడించాడు అనే నా అభిప్రాయానికి వచ్చిన స్పందన చూశాక
విడివిడిగా సమాధానం చెప్పడం బదులు అనువాద సాహిత్యానికి సంబంధిన 
కొన్ని విషయాలు పంచుకుంటే బాగుండుననిపించింది. అదేమిటంటే ....)

'కడలి' సినిమాలోని 'గుంజుకున్నా నిన్ను ఎదలోకే' పాట
తమిళ వెర్షన్ 'నెంజిక్కుళ్ళే ఒమ్మ ముడింజురుక్కేన్'
అనే పల్లవి తో మొదలవుతుంది.
'నెంజిక్కుళ్ళే' అంటే మనసుని లాక్కోవడం
'ఒమ్మ' అంటే నిన్ను
'ముడింజురుక్కేన్' అంటే ముడి వేసుకున్నాను
ఆల్రెడీ షూటింగ్ జరిపేసుకున్న ఈ పాటకి
సరిపడేట్టుగా  అనువాద గీతాన్ని రాయాలి .
రచయిత వనమాలి
'గుండెలోనె నిన్ను ముడివేశా'
అంటూ మొదలు పెట్టాడు.
ఇది ఫస్ట్ వెర్షన్
కానీ తమిళం లో వున్నట్టు గా 'నెంజ్' అనే సౌండ్ కి
దగ్గరగా వుండే మాట కావాలని అడిగారు మణిరత్నం.
లిప్ సింక్ కాకపోయినా ఫరవాలేదన్నారు.
కావాలంటే గమనించండి ...
'ముడింజురుక్కేన్' దగ్గర వేసిన
'ఎదలోకే '  అనే మాటకి లిప్ సింక్ కాదు.
అయినా 'ఓకే ' అన్నారు
'గుంజుకున్నా' అనే మాటలో ఒక చనువుంటుంది అన్నారు
ఎందుకంటే కథలో హీరో ఓ జాలరి.
చదువు రాని అనాగరిక ప్రపంచంలో పెరిగిన వాడు.
మొరటుగా ప్రవర్తించే వాడు.
 నెగిటివ్ షేడ్స్ కొంచెం ఎక్కువున్న వాడు.
అతనితో చనువు గా హీరోయిన్ ఏదైనా అనాలంటే
అతని లక్షణాలకి తగ్గ మాట పడాలి
(జాలరి వలని గుంజుకుంటాడు గా)
సాధారణంగా రెహమాన్ గానీ, మణిరత్నం గానీ
పాటల సాహిత్యం లో శబ్ద సౌందర్యానికి ప్రాదాన్యం ఇస్తారు.
రెహమాన్ తన 'రోబో' తమిళ వెర్షన్ 'ఎన్ దిరన్' (యంత్రం) లో
'అరిమా అరిమా' అన్నాడు.
'అరిమ' అంటే తమిళంలో సింహం.
దాన్ని తెలుగు చెయ్యాల్సి వచ్చినప్పుడు
'హరి' అంటే సింహం అనే అర్ధం కూడా వుంది కాబట్టి
చివర్న 'మ' కార ప్రత్యయం చేర్చి 'హరిమా హరిమా' అని రాశాడు వనమాలి.
మణిరత్నం రెహమాన్ ల కాంబినేషన్ 'బొంబాయి' సినిమాలోని
'వుయ్ రే వుయ్ రే' పాటని తీసుకుంటే
'వుయ్ రే' అంటే 'ప్రాణమా' అని అర్ధం.
అక్కడ 'వు' తో మొదలయింది కనుక
సాహిత్య పరంగా రెహమాన్, మణిరత్నం ల శబ్ద రహస్యాలను,
అభిరుచిని పసిగట్టిన వ్యక్తి కనుక
'ఉరికే చిలకా' అంటూ
'ఉ' తో మొదలు పెట్టారు వేటూరి.
అలాగే రెహమాన్ తో చేసిన 'మిన్సార కణవు' (తెలుగు లో మెరుపు కలలు) లోని
'తల్లో తామర ముడిచే' పాట తమిళ వెర్షన్ రెండో లైన్ లో వున్న
'తత్తితావుదు మనమే' ని తెలుగు చేయాల్సి వచ్చినప్పుడు
'అట్టిట్టాయెను మనమే' అని రాశారు వేటూరి.
'తత్తిత్తావుదు' కి 'అట్టిట్టాయెను' అద్భుత మైన సౌండింగ్
ఇక - 'మనమే' ...
నిజానికి ఇలాంటివి పాత రోజుల్లో వాడేవారు.
(మనమీ నందన వనమౌ కాదా - మాయింటి మహాలక్ష్మి)
ప్రస్థుతం జనరేషన్ కోసం అయితే 'మనసే' అని రాయాలి
కానీ వేటూరి ఆటు శబ్ధం, ఇటు లిప్ సింక్ చూసుకున్నారు.
అందుకే 'మనమే' అని రాశారు.
అనువాద సాహిత్యం అందరూ అనుకుంటున్నంత సులువు కాదు.
మళ్ళీ 'కడలి' సినిమాకే వస్తే
ఇంకో పాటలో
'అడియే అడియే' అని ఒరిజినల్ లో వుంది
అంటే 'ఒసేయ్ ఒసేయ్' అని అర్ధం
'ఎన్నఎంగే నీ కూటి పోరా'
అనేది తర్వాతి లైన్
అంటే 'నన్ను ఎక్కడికి తీసుకెళ్తావ్' అని అర్ధం
దీని మీనింగ్ ని తీసుకుని
మన నేటివిటీ టచ్ వచ్చేలా
'అడియే అడియే' కి సరిపోయేలా
'యాడికే యాడికే' అని రాశాడు వనమాలి.
జాలరి మాట్లాడే పల్లెటూరి భాష అది
ఆ 'కడల్ '  సినిమాలోనే
'చిత్తిరై నిలా ఒరే నిలా' అనే మరో పాటుంది
అంటే 'చైత్ర మాసపు జాబిలీ' అని అర్ధం
ఈ పాటకి వనమాలి మొదట రాసినది
'నిండు జాబిలీ ఓ జాబిలీ' ...
మళ్ళీ సౌండింగ్ ఇంపార్టెంట్ అన్నారు
దాంతో 'చిట్టి జాబిలీ' అని రాశాడాయన.
పాట నోటికి ఇమ్మీడియట్ గా పట్టుబడాలంటే
శబ్ద సౌందర్యం అవసరం అని నమ్ముతారు
మణిరత్నం, రెహమాన్..
ఒరిజినల్ పాట లోని
మీనింగ్ పక్కదారి పట్టకుండా
భావం చెడకుండా
అందులోనే వుంటూ
శబ్ద సుగమంగా
బాణీకి న్యాయం చేస్తూ రాయాల్సిన బాధ్యత
స్ట్రెయిట్ సాంగ్స్ రాసే రచయిత కన్నా
అనువాద గీతాలు రాసే రచయితకి ఎక్కువ.
ఇవాళ పరిశ్రమలో ఓ గీత రచయిత బతకాలంటే
అతని మెదడు లో తెలుగుతో పాటు
తెలివీ తేటా సమయస్ఫూర్తి
రసమయ స్ఫూర్తి మనస్పూర్తిగా వుండాలి.
ఈ సందర్భంగా దాశరథి గారు
నాతో అన్న మాట గుర్తొస్తోంది
ఎడ్జెస్ట్ కాలేని వాడు ఎగ్జిస్ట్ కాలేడు .
అలాగే ఆత్రేయ ’ప్రేమ నగర్’ లో రాసినట్టు
ఆవేశంలో తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే
మంచి చేసే అవకాశాల్ని శాశ్వతంగా కోల్పోవలసి వస్తుంది.
ఇది నేను రాయ(లే)ను అని వెళ్ళిపోవడం సులువు
కానీ గొప్ప గొప్ప వారిని మెప్పిస్తూ
వారికి కావలసినది అందిస్తూ
ఉనికిని, మనికిని కాపాడుకోవటం చాలా కష్టం.
పైగా వేటూరి స్వంత కోట లాంటి
మణిరత్నం, రెహమాన్ క్యాంప్ లో
ప్రవేశించడానికి,  ప్రవేశించి
అంతటి ప్రతిభావంతుల్ని మెప్పించడం
మాటలు కాదు కదా ?
బైట వుండి మనం చాలా అనుకుంటాం.
అది సహజం కూడా.
కానీ తెర వెనుక విషయాలు కూడా తెలిస్తే
అభిప్రాయాల్లో మార్పుంటుందేమోననే
ఈ ప్రయత్నం.

Thursday, December 27, 2012

రెహమాన్ శక్తిశ్రీ తోనే ఎందుకు పాడించాలి ?మణిరత్నమ్, ఏ.ఆర్. రెహమాన్ ల 'కడలి' సినిమా ఆడియో రిలీజ్ అయ్యింది.
ఇది తమిళం లోని కడల్ కి తెలుగు వెర్షన్.
'కడల్ ' కోసం చేసిన 'నెంజిక్కుళ్ళై' పాటని
ఎమ్ టీవీలో 'రెహమాన్ అన్ ప్లగ్గ్ డ్ ' ప్రోగ్రామ్ ద్వారా
ప్రేక్షక శ్రోతలకు రెహమాన్ కొన్ని నెలల క్రితమే పరిచయం చేశాడు.
అప్పట్నించీ ఈ ట్యూన్ కి విపరీతమైన ఆదరణ.
ఒకానొక దశలో 'కోలావెరి' హిట్స్ ని దాటిపోయిందేమోనన్న
అభిప్రాయం కూడా స్ప్రెడ్ అయ్యింది.
ఆ ట్యూన్ తెలుగు వెర్షన్ లో 'గుంజుకున్నా' అనే పాటగా
'కడలి' ఆడియోలో వుంది. తమిళం లోనూ, అన్ ప్లగ్గ్ డ్ ప్రోగ్రామ్ లోనూ
పాడిన శక్తిశ్రీ గోపాలనే తెలుగు వెర్షన్ (గింజుకున్నాపాట) ని పాడింది.
ఈ తెలుగు వెర్షన్ ని విన్న ఓ సంగీతాభిమాని అంజనా సౌమ్య గాని
శ్రావణ భార్గవి గాని పాడి వుంటే బాగుండేది అని ఓ అభిప్రాయాన్నినాకు పంపారు.
దానికి నా సమాధానం ఇదీ :
(ఆ తెలుగు పాటని విని నా అభిప్రాయం మీద మీ అభిప్రాయం చెప్పండి)
'నెంజిక్కుళ్ళె' తెలుగు వెర్షన్ 'గుంజుకున్నా' పాట మీద మీ అభిప్రాయం చదివాను.
ఏవైనా రెండు ఒక్క లాంటివే వస్తే ప్రేక్షకులు విధిగా మొదటి దాన్నే మెచ్చుకుంటారు.
ఇది కొన్ని తరాలుగా ఋజువవుతోంది.
అంజనా సౌమ్య , శ్రావణ భార్గవి పై మీకు గల అభిమానం 
సద్విమర్శకు అతీతంగా ఆలోచించేలా చేస్తోందనిపిస్తోంది . .
ఈ పాటకి గొంతులో కొంత నాసికా సౌందర్యం తో పాటు
మింగబోతున్న వెన్న ముద్దని కంఠం మధ్యలోనే ఆపి
ఆ మాధుర్యాన్ని పాటకు ఆసాంతం పూయగల సామర్ధ్యం వుండాలి.  
శక్తిశ్రీ గోపాలన్ లో ఆ క్వాలిటీని పట్టుకున్నాడు రెహమాన్.
ఒరిజినల్ పాటని వేరే భాషలోకి తీసుకున్నప్పుడు గాయనీ గాయకుల్ని
మార్చిన సందర్భాలు రెహమాన్ కి వున్నాయి. 
ఈ పాటకి మార్చక పోవడానికి ఆ క్వాలిటీయే కారణం అనుకుంటున్నాను.
రెహమాన్ కి అంజనా సౌమ్య వాయిస్, శ్రావణ భార్గవి వాయిస్ తెలుసు.
వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరు కరెక్ట్ అనుకున్నా రెహమాన్ ఒదిలి పెట్టడు.
మూల మూలల్నించి గాయనీ గాయకుల్ని వెతికి పట్టుకుని
శ్రోతలకి పరిచయం చేసిన చరిత్ర రెహమాన్ ది.
అంజనా సౌమ్య లో గొంతులో వున్న నాసికా సౌందర్యం ఈ పాటకి
సరిపోతుందేమో గానీ పైన చెప్పిన రెండో క్వాలిటీ లేదు.
ఇక శ్రావణ భార్గవి తన గొంతుని రకరకాలు గా మార్చగలదేమో గానీ
తన ఒరిజినల్ గొంతుతో  ఇన్ని అందాలను పలికించ లేదు.
ఈ పాటకి ఏ భాషలోనైనా - రెహమాన్ ఊహించి పంచిన అనుభూతిని
అందించ గల గాయని శక్తిశ్రీ గోపాలన్ కి వుంది
రెహమాన్ పాటకు అంకితమైన వ్యక్తి.  
వ్యక్తిగత మైన అభిమానాలకు తావివ్వడు.
ఇచ్చే వ్యక్తే అయితే ఇంతమంది సింగర్లను పరిచయం చెయ్యడు.
ఈ పాటకు శక్తిశ్రీ తరువాత కొంతలో కొంత సరిపోయే గొంతు మధుశ్రీ ది.
( యువ లో సంకురాత్రి కోడి పాటను గుర్తు తెచ్చుకోండి)
ఇవన్నీ గాక పూర్తి తెలుగు తనాన్నే కోరుకుంటే
ఈ రకం అందాలన్నిటినీ మర్చిపోతే (గలిస్తే) ,
సరికొత్త అందాలతో పాడగల గాయని 
కేవలం శ్రేయా గోషల్ మాత్రమే.
ఇదీ నా అభిప్ర్రాయం.