Friday, December 28, 2012

మణిరత్నం, రెహమాన్ ల ’కడలి’ ని ఈదిన వనమాలి



(’కడలి’ సినిమాలో ’గుంజుకున్నా’ పాటని రెహమాన్ శక్తిశ్రీ గోపాలన్ తోనే 
ఎందుకు పాడించాడు అనే నా అభిప్రాయానికి వచ్చిన స్పందన చూశాక
విడివిడిగా సమాధానం చెప్పడం బదులు అనువాద సాహిత్యానికి సంబంధిన 
కొన్ని విషయాలు పంచుకుంటే బాగుండుననిపించింది. అదేమిటంటే ....)

'కడలి' సినిమాలోని 'గుంజుకున్నా నిన్ను ఎదలోకే' పాట
తమిళ వెర్షన్ 'నెంజిక్కుళ్ళే ఒమ్మ ముడింజురుక్కేన్'
అనే పల్లవి తో మొదలవుతుంది.
'నెంజిక్కుళ్ళే' అంటే మనసుని లాక్కోవడం
'ఒమ్మ' అంటే నిన్ను
'ముడింజురుక్కేన్' అంటే ముడి వేసుకున్నాను
ఆల్రెడీ షూటింగ్ జరిపేసుకున్న ఈ పాటకి
సరిపడేట్టుగా  అనువాద గీతాన్ని రాయాలి .
రచయిత వనమాలి
'గుండెలోనె నిన్ను ముడివేశా'
అంటూ మొదలు పెట్టాడు.
ఇది ఫస్ట్ వెర్షన్
కానీ తమిళం లో వున్నట్టు గా 'నెంజ్' అనే సౌండ్ కి
దగ్గరగా వుండే మాట కావాలని అడిగారు మణిరత్నం.
లిప్ సింక్ కాకపోయినా ఫరవాలేదన్నారు.
కావాలంటే గమనించండి ...
'ముడింజురుక్కేన్' దగ్గర వేసిన
'ఎదలోకే '  అనే మాటకి లిప్ సింక్ కాదు.
అయినా 'ఓకే ' అన్నారు
'గుంజుకున్నా' అనే మాటలో ఒక చనువుంటుంది అన్నారు
ఎందుకంటే కథలో హీరో ఓ జాలరి.
చదువు రాని అనాగరిక ప్రపంచంలో పెరిగిన వాడు.
మొరటుగా ప్రవర్తించే వాడు.
 నెగిటివ్ షేడ్స్ కొంచెం ఎక్కువున్న వాడు.
అతనితో చనువు గా హీరోయిన్ ఏదైనా అనాలంటే
అతని లక్షణాలకి తగ్గ మాట పడాలి
(జాలరి వలని గుంజుకుంటాడు గా)
సాధారణంగా రెహమాన్ గానీ, మణిరత్నం గానీ
పాటల సాహిత్యం లో శబ్ద సౌందర్యానికి ప్రాదాన్యం ఇస్తారు.
రెహమాన్ తన 'రోబో' తమిళ వెర్షన్ 'ఎన్ దిరన్' (యంత్రం) లో
'అరిమా అరిమా' అన్నాడు.
'అరిమ' అంటే తమిళంలో సింహం.
దాన్ని తెలుగు చెయ్యాల్సి వచ్చినప్పుడు
'హరి' అంటే సింహం అనే అర్ధం కూడా వుంది కాబట్టి
చివర్న 'మ' కార ప్రత్యయం చేర్చి 'హరిమా హరిమా' అని రాశాడు వనమాలి.
మణిరత్నం రెహమాన్ ల కాంబినేషన్ 'బొంబాయి' సినిమాలోని
'వుయ్ రే వుయ్ రే' పాటని తీసుకుంటే
'వుయ్ రే' అంటే 'ప్రాణమా' అని అర్ధం.
అక్కడ 'వు' తో మొదలయింది కనుక
సాహిత్య పరంగా రెహమాన్, మణిరత్నం ల శబ్ద రహస్యాలను,
అభిరుచిని పసిగట్టిన వ్యక్తి కనుక
'ఉరికే చిలకా' అంటూ
'ఉ' తో మొదలు పెట్టారు వేటూరి.
అలాగే రెహమాన్ తో చేసిన 'మిన్సార కణవు' (తెలుగు లో మెరుపు కలలు) లోని
'తల్లో తామర ముడిచే' పాట తమిళ వెర్షన్ రెండో లైన్ లో వున్న
'తత్తితావుదు మనమే' ని తెలుగు చేయాల్సి వచ్చినప్పుడు
'అట్టిట్టాయెను మనమే' అని రాశారు వేటూరి.
'తత్తిత్తావుదు' కి 'అట్టిట్టాయెను' అద్భుత మైన సౌండింగ్
ఇక - 'మనమే' ...
నిజానికి ఇలాంటివి పాత రోజుల్లో వాడేవారు.
(మనమీ నందన వనమౌ కాదా - మాయింటి మహాలక్ష్మి)
ప్రస్థుతం జనరేషన్ కోసం అయితే 'మనసే' అని రాయాలి
కానీ వేటూరి ఆటు శబ్ధం, ఇటు లిప్ సింక్ చూసుకున్నారు.
అందుకే 'మనమే' అని రాశారు.
అనువాద సాహిత్యం అందరూ అనుకుంటున్నంత సులువు కాదు.
మళ్ళీ 'కడలి' సినిమాకే వస్తే
ఇంకో పాటలో
'అడియే అడియే' అని ఒరిజినల్ లో వుంది
అంటే 'ఒసేయ్ ఒసేయ్' అని అర్ధం
'ఎన్నఎంగే నీ కూటి పోరా'
అనేది తర్వాతి లైన్
అంటే 'నన్ను ఎక్కడికి తీసుకెళ్తావ్' అని అర్ధం
దీని మీనింగ్ ని తీసుకుని
మన నేటివిటీ టచ్ వచ్చేలా
'అడియే అడియే' కి సరిపోయేలా
'యాడికే యాడికే' అని రాశాడు వనమాలి.
జాలరి మాట్లాడే పల్లెటూరి భాష అది
ఆ 'కడల్ '  సినిమాలోనే
'చిత్తిరై నిలా ఒరే నిలా' అనే మరో పాటుంది
అంటే 'చైత్ర మాసపు జాబిలీ' అని అర్ధం
ఈ పాటకి వనమాలి మొదట రాసినది
'నిండు జాబిలీ ఓ జాబిలీ' ...
మళ్ళీ సౌండింగ్ ఇంపార్టెంట్ అన్నారు
దాంతో 'చిట్టి జాబిలీ' అని రాశాడాయన.
పాట నోటికి ఇమ్మీడియట్ గా పట్టుబడాలంటే
శబ్ద సౌందర్యం అవసరం అని నమ్ముతారు
మణిరత్నం, రెహమాన్..
ఒరిజినల్ పాట లోని
మీనింగ్ పక్కదారి పట్టకుండా
భావం చెడకుండా
అందులోనే వుంటూ
శబ్ద సుగమంగా
బాణీకి న్యాయం చేస్తూ రాయాల్సిన బాధ్యత
స్ట్రెయిట్ సాంగ్స్ రాసే రచయిత కన్నా
అనువాద గీతాలు రాసే రచయితకి ఎక్కువ.
ఇవాళ పరిశ్రమలో ఓ గీత రచయిత బతకాలంటే
అతని మెదడు లో తెలుగుతో పాటు
తెలివీ తేటా సమయస్ఫూర్తి
రసమయ స్ఫూర్తి మనస్పూర్తిగా వుండాలి.
ఈ సందర్భంగా దాశరథి గారు
నాతో అన్న మాట గుర్తొస్తోంది
ఎడ్జెస్ట్ కాలేని వాడు ఎగ్జిస్ట్ కాలేడు .
అలాగే ఆత్రేయ ’ప్రేమ నగర్’ లో రాసినట్టు
ఆవేశంలో తొందరపడి నిర్ణయాలు తీసుకుంటే
మంచి చేసే అవకాశాల్ని శాశ్వతంగా కోల్పోవలసి వస్తుంది.
ఇది నేను రాయ(లే)ను అని వెళ్ళిపోవడం సులువు
కానీ గొప్ప గొప్ప వారిని మెప్పిస్తూ
వారికి కావలసినది అందిస్తూ
ఉనికిని, మనికిని కాపాడుకోవటం చాలా కష్టం.
పైగా వేటూరి స్వంత కోట లాంటి
మణిరత్నం, రెహమాన్ క్యాంప్ లో
ప్రవేశించడానికి,  ప్రవేశించి
అంతటి ప్రతిభావంతుల్ని మెప్పించడం
మాటలు కాదు కదా ?
బైట వుండి మనం చాలా అనుకుంటాం.
అది సహజం కూడా.
కానీ తెర వెనుక విషయాలు కూడా తెలిస్తే
అభిప్రాయాల్లో మార్పుంటుందేమోననే
ఈ ప్రయత్నం.

Thursday, December 27, 2012

రెహమాన్ శక్తిశ్రీ తోనే ఎందుకు పాడించాలి ?



మణిరత్నమ్, ఏ.ఆర్. రెహమాన్ ల 'కడలి' సినిమా ఆడియో రిలీజ్ అయ్యింది.
ఇది తమిళం లోని కడల్ కి తెలుగు వెర్షన్.
'కడల్ ' కోసం చేసిన 'నెంజిక్కుళ్ళై' పాటని
ఎమ్ టీవీలో 'రెహమాన్ అన్ ప్లగ్గ్ డ్ ' ప్రోగ్రామ్ ద్వారా
ప్రేక్షక శ్రోతలకు రెహమాన్ కొన్ని నెలల క్రితమే పరిచయం చేశాడు.
అప్పట్నించీ ఈ ట్యూన్ కి విపరీతమైన ఆదరణ.
ఒకానొక దశలో 'కోలావెరి' హిట్స్ ని దాటిపోయిందేమోనన్న
అభిప్రాయం కూడా స్ప్రెడ్ అయ్యింది.
ఆ ట్యూన్ తెలుగు వెర్షన్ లో 'గుంజుకున్నా' అనే పాటగా
'కడలి' ఆడియోలో వుంది. తమిళం లోనూ, అన్ ప్లగ్గ్ డ్ ప్రోగ్రామ్ లోనూ
పాడిన శక్తిశ్రీ గోపాలనే తెలుగు వెర్షన్ (గింజుకున్నాపాట) ని పాడింది.
ఈ తెలుగు వెర్షన్ ని విన్న ఓ సంగీతాభిమాని అంజనా సౌమ్య గాని
శ్రావణ భార్గవి గాని పాడి వుంటే బాగుండేది అని ఓ అభిప్రాయాన్నినాకు పంపారు.
దానికి నా సమాధానం ఇదీ :
(ఆ తెలుగు పాటని విని నా అభిప్రాయం మీద మీ అభిప్రాయం చెప్పండి)
'నెంజిక్కుళ్ళె' తెలుగు వెర్షన్ 'గుంజుకున్నా' పాట మీద మీ అభిప్రాయం చదివాను.
ఏవైనా రెండు ఒక్క లాంటివే వస్తే ప్రేక్షకులు విధిగా మొదటి దాన్నే మెచ్చుకుంటారు.
ఇది కొన్ని తరాలుగా ఋజువవుతోంది.
అంజనా సౌమ్య , శ్రావణ భార్గవి పై మీకు గల అభిమానం 
సద్విమర్శకు అతీతంగా ఆలోచించేలా చేస్తోందనిపిస్తోంది . .
ఈ పాటకి గొంతులో కొంత నాసికా సౌందర్యం తో పాటు
మింగబోతున్న వెన్న ముద్దని కంఠం మధ్యలోనే ఆపి
ఆ మాధుర్యాన్ని పాటకు ఆసాంతం పూయగల సామర్ధ్యం వుండాలి.  
శక్తిశ్రీ గోపాలన్ లో ఆ క్వాలిటీని పట్టుకున్నాడు రెహమాన్.
ఒరిజినల్ పాటని వేరే భాషలోకి తీసుకున్నప్పుడు గాయనీ గాయకుల్ని
మార్చిన సందర్భాలు రెహమాన్ కి వున్నాయి. 
ఈ పాటకి మార్చక పోవడానికి ఆ క్వాలిటీయే కారణం అనుకుంటున్నాను.
రెహమాన్ కి అంజనా సౌమ్య వాయిస్, శ్రావణ భార్గవి వాయిస్ తెలుసు.
వాళ్ళిద్దరిలో ఏ ఒక్కరు కరెక్ట్ అనుకున్నా రెహమాన్ ఒదిలి పెట్టడు.
మూల మూలల్నించి గాయనీ గాయకుల్ని వెతికి పట్టుకుని
శ్రోతలకి పరిచయం చేసిన చరిత్ర రెహమాన్ ది.
అంజనా సౌమ్య లో గొంతులో వున్న నాసికా సౌందర్యం ఈ పాటకి
సరిపోతుందేమో గానీ పైన చెప్పిన రెండో క్వాలిటీ లేదు.
ఇక శ్రావణ భార్గవి తన గొంతుని రకరకాలు గా మార్చగలదేమో గానీ
తన ఒరిజినల్ గొంతుతో  ఇన్ని అందాలను పలికించ లేదు.
ఈ పాటకి ఏ భాషలోనైనా - రెహమాన్ ఊహించి పంచిన అనుభూతిని
అందించ గల గాయని శక్తిశ్రీ గోపాలన్ కి వుంది
రెహమాన్ పాటకు అంకితమైన వ్యక్తి.  
వ్యక్తిగత మైన అభిమానాలకు తావివ్వడు.
ఇచ్చే వ్యక్తే అయితే ఇంతమంది సింగర్లను పరిచయం చెయ్యడు.
ఈ పాటకు శక్తిశ్రీ తరువాత కొంతలో కొంత సరిపోయే గొంతు మధుశ్రీ ది.
( యువ లో సంకురాత్రి కోడి పాటను గుర్తు తెచ్చుకోండి)
ఇవన్నీ గాక పూర్తి తెలుగు తనాన్నే కోరుకుంటే
ఈ రకం అందాలన్నిటినీ మర్చిపోతే (గలిస్తే) ,
సరికొత్త అందాలతో పాడగల గాయని 
కేవలం శ్రేయా గోషల్ మాత్రమే.
ఇదీ నా అభిప్ర్రాయం.

Monday, December 24, 2012

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు గురించి ...


    

ఇండస్ట్రీ లో ఇప్పుడు హాట్ టాపిక్  సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు.నిజానికి ఈ టైటిల్ కి ఆధారం పాత రోజుల్లో పిల్లల్ని ఆడిస్తూ పాడడానికి ఉపయోగించే బాల గేయ సాహిత్యం. దీనికి కర్తలెవరో తెలియకుండా తరతరాలు గా వస్తోంది. ఆ సాహిత్యాన్ని, ఆ నోటా ఆ నోటా  ఓ సంప్రదాయంగా వస్తున్న ట్యూన్ ని తీసుకుని స్వర్గీయ పాలగుమ్మి విశ్వనాథం గారు రేడియోలో పాడించారు.నెలవంక పేరు తో పుస్తకంగా, సీడీలుగా రిలీజ్ చేశారు.
ఆ పుస్తకంలోని ముందుమాటని, ఆనాటి ఆ గేయం సాహిత్యాన్ని సంగీతాభిమానుల కోసం జతపరుస్తున్నాను.
పాట లింక్ కూడా వుంది. క్లిక్ చేస్తే వినొచ్చు.

http://www.palagummiviswanadham.com/music/pillala-paatlau/nelavanka-cd1/seethammavakita.mp3










Thursday, November 29, 2012

యస్. జానకి పాటల్లో అతి గొప్ప పాట




ఆ మధ్య ఓ పని మీద గాయని శ్రీమతి యస్. జానకి గారిని కలవడం జరిగింది. ఆవిడతో నా పరిచయం 23 ఏళ్ళు. చెన్నై లో వాళ్ళింట్లో ఆవిడ స్వయంగా నేతి తో చేసిన అట్లు తిన్న అదృష్టం నాది. 'సప్తపది' సినిమాలోని  'గోవుల్లు తెల్లన' పాటని అచ్చం అవిడ లాగే పాడుతోందని మురిసిపోయి స్వయంగా మా ఇంటికి వచ్చి (అప్పటికి రెండేళ్ళ) నా పెద్ద కూతుర్ని ఆడించారు. ఆ రోజు ఆవిడ ఇచ్చిన కుంకుమ భరిణ ఇవాళ్టికీ మా ఆవిడ వాడుతుంది. .
'విశాఖపట్నంలోని మా బంధువులలో మీ అభిమానులు చాలా మంది వున్నారండీ' అని అంటే వైజాగ్ వచ్చినప్పుడు గుర్తు పెట్టుకుని మా వాళ్ళింటికి వచ్చి సాయంత్రం ఏడు నుంచి రాత్రి పన్నెండు వరకూ వుండి ఎవరేం పెట్టినా కాదనకుండా తిని, ఎవరేది అడిగినా పాడి, పాడించుకుని అందర్నీ ఆనందాశ్చార్యాలలో ముంచి వెళ్ళిన సంస్కారి, స్నేహశీలి ఆవిడ.
ఆవిడ పాడిన పాటల్లో కన్నడ సినిమా ' హేమవతి ' లో 'శివ శివ యన్నదె' పాట నాకెక్కువ ఇష్టం. నా దృష్టిలో ' నీ లీల పాడెద దేవా ' కన్నా గొప్ప పాట అది. ఈ కన్నడ పాట రికార్డింగ్ లో వయొలిన్ వాయించిన ఎమ్మెస్ గోపాలకృష్ణ గారి వయొలిన్ తో సమానంగా చివర్న ఆవిడ వేసిన స్వరాలకి మతిపోతుంది. ఇది బాగా రిహార్సిల్స్ చేసి పాడిన పాట కాదు. అప్పటికప్పుడు నేర్చుకుని పాడిన పాట. ఈ ఒక్క పాటకే ఆవిడకి పద్మ అవార్డుల్లో దేన్నైనా ఇవ్వొచ్చు. ఈ తరం సింగర్లలో ఈ పాటని టచ్ చేయగల సామర్ధ్యం ఒక్క  శ్రీనిథి లోనే వుందని నా అభిప్రాయం. ఆ పాట లింకు జత పరుస్తున్నాను. కేవలం ఆడియో మీదే మనసు లగ్నం చేసి వినండి.
http://www.youtube.com/watch?v=rGLLevDBwDU

Monday, November 26, 2012

ప్రియతమా మనసు మారునా పాట ఒరిజినల్స్

1956లో భానుమతి , ఎమ్జీయార్ తో  ఆలీబాబా  40 దొంగలు అనే  డబ్బింగ్  సినిమా  వచ్చింది.   అందులోని '  ప్రియతమా  మనసు మారునా ' పాట  ఇవాళ్టికీ మర్చిపోలేని  వాళ్ళున్నారు . ఆ  పాట తమిళ మూలం ' మాసిలా  ఉన్మై కాదలే  ...' ఈ తమిళ మూలానికి  హిందీ  మూలం ' ఏ సభా ఉన్  సె  కెహ్  జరా '... (1953) లింకులు క్లిక్ చేసి చూడండి .

మాసిలా ఉన్మై కాదలే                            
http://www.youtube.com/watch?v=MBepNZJjK-4
ఏ సభా ఉన్ సె కెహ్ జరా                                             
http://www.youtube.com/watch?v=whKlS5OH36w

Tuesday, October 2, 2012

'చివరకు మిగిలేది' లో 'సుధవోల్ సుహాసిని' పాట గురించి ....



బెంగాలీ లో వచ్చిన 'దీప్ జలే జయ్' (1959 ) చిత్రం 'చివరకు మిగిలేది' కి మూలం. 'దీప్ జలే జయ్' లో ' ఎయ్ రాత్ తోమార్ అమార్ ' పాట ' చివరకు మిగిలేది' లో 'సుధవోల్ సుహాసిని ' (1960 ) కి మూలం.'చివరకు మిగిలేది' కి అశ్వత్థామ సంగీత దర్శకుడు. ప్రముఖ వైణికురాలు 'వీణ గాయత్రి ' ఈయన కుమార్తె. 'దీప్ జలే జయ్' సంగీత దర్శకుడు, గాయకుడు హేమంత్ కుమార్ హిందీలో 'కొహ్ రా ' (1964 ) సినిమాకి సంగీతాన్నిచ్చేటప్పుడు 'యే నయన్ డరే డరే' పాటకి తన 'ఎయ్ రాత్ తోమార్ అమార్' ట్యూన్ ని ఉపయోగించుకున్నాడు. అప్పటికి 'దీప్ జలే జయ్' సినిమాని హిందీలో తీసే ప్రపోజల్ లేదు. 'ఖమోషి' (1969 ) గా వచ్చినప్పుడు 'ఎయ్ రాత్ తోమార్ అమార్' సీన్ కి వేరే ట్యూన్ ని చెయ్యవలసి వచ్చింది హేమంత్ కుమార్ కి. అప్పుడు వచ్చిన ట్యూనే ' తుమ్ పుకార్ లో' . ఈ బెంగాలీ, తెలుగు, హిందీ పాటలు దిగువన ఇచ్చిన యూ ట్యూబ్ లింకుల్లోచూడొచ్చు.
దీనికి మరో ఉప కథ ఏమిటంటే - సావిత్రి నటించిన సినిమాల్లో ది బెస్ట్ - చివరకు మిగిలేది. ఆమె మీద ఒక ఎపిసోడ్ చెయ్యాలనుకుని ఏయన్నార్ ని ఎప్రోచ్ అయ్యాను. ఎలా తీస్తావ్ అని అడిగారు. బెంగాలీ లో సుచిత్రా సేన్, తెలుగు లో సావిత్రి, హిందీ లో వహీదా రెహ్మాన్ నటించారు ఈ మూడు వెర్షన్లు. వీరిలో సుచిత్రా సేన్ బెటర్. సావిత్రి బెస్ట్. వహీదా వీళ్ళిద్దరి ముందూ తేలిపోయింది. ఇది చెప్పాను ఆయనకి. ఇవన్నీ ఆయనకీ తెలుసు. నాకెంత తెలుసో అని అడిగారు.మూడు క్లిప్పింగ్ లూ చూపిస్తావా అని ఓ సవాల్ విసిరారు. చూపిస్తానన్నాను. ఇదొక్కటే చాలదు కాబట్టి ఇంకా చాలా మ్యాటర్ చెపుతాను. అవన్నీ మీరు ఓన్ చేసుకుని మీ మాటలు గా చెప్పాలీ అని రిక్వస్ట్ చేశాను. ఒకే అన్నారు. చాలా బాగా వచ్చిందా ఎపిసోడ్. మా టీవీలో ప్రసారం అయ్యాక ఏయన్నార్ కూడా మెచ్చుకున్నారు . 'ANR appreciates savitri ' అని యూ ట్యూబ్ లో వెతికి చూడండి. దొరకచ్చు.





Saturday, September 29, 2012

‘నిన్నలేని అందమేదో’ పాట ఎవరు రాశారు ?





ఈ మధ్య నా ఫేస్ బుక్ లో నిన్నలేని అందమేదో పాట ఎవరు రాశారు అనే టాపిక్ మీద ఓ చర్చ వచ్చింది.  సి.నారాయణ రెడ్డి అని సమాధానమిచ్చాను.
అయినప్పటికీ తృప్తి పడలేదా సంగీత ప్రియులు. దాశరథి గారి ముద్ర కనిపిస్తోందన్నారు. పైగా ఈ మధ్య టీవీ చానల్స్ లో అలా చూపించారన్నారు.ఇక లాభం లేదని, ఇది నా కర్తవ్యం అనుకుని ఇలా చేశాను :
" పూజా ఫలం లోని నిన్న లేని అందమేదో పాటను గురించిన అభిప్రాయాలూ . చర్చలూ చూశాక నిరూపించాలనిపించింది. సినారె గారు రాసిన పాటలో  ఏముంది .. నా మాటలో ఏముంది పుస్తకాన్ని (నడుం నొప్పి వల్ల కొంచెం కష్టం అయినా) నిచ్చెనేసుకుని ఎక్కి పైనున్న నా లైబ్రరీ నుంచి తీశాను.  అందులో పూజాఫలం లో తను రాసిన పాటల గురించి నాలుగు పేజీలలో ఆయన వివరించారు. వాటిని  స్కాన్ చేసి అందులో నిన్న లేని అందమేదో పాటకు సంబంధించిన విషయాలను విడిగా ఫొటో షాప్ లో కలిపి సింగిల్ పేజి గా చేసి మీ ముందుంచుతున్నాను. ఇక ఈ పాట రచయిత విషయంలో ఎవరికీ ఏ సందేహమూ వుండదనుకుంటాను.ఈ బుక్ సినారె గారు రాస్తున్నప్పుడు ఆయనకు ఓ రిఫరెన్స్ లా ఉపయోగపడడం నా అదృష్టం. ఆయన తన ముందు మాటలో అది పేర్కొన్నారు. అందుకు సంబంధించిన సాక్ష్యాన్ని కూడా (నాకు చెందినంత వరకూ ఫొటో షాప్ లో కలుపుకుంటూ) మరో పేజీగా జత చేస్తున్నాను.
ఇవిలా వుండగా ఈ పాటలో దాశరథి గారి ముద్ర వుందనడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసిన విషయం.
          తెలియ రాని రాగమేదో తీగ సాగె నెందుకో   ( నిన్న లేని అందమేదో పాటలో)
          అనురాగ మధు ధారయై సాగనీ (తోటలో నా రాజు పాటలో)
అక్కడ రాగం తీగ సాగడం, ఇక్కడ అనురాగం ధారగా సాగడం ఇదీ నారాయణ రెడ్డి గారి ముద్ర.
ఇక టీవీ చానల్స్ లో ఇది దాశరథి గారి పాటగా చెప్పారంటే అందుకు కారణం - సదరు చానల్స్ వారికి తెలుగు సినిమా పాటల క్రెడిట్స్ విషయంలో వుండవలసినంత శ్రద్ధాసక్తులు, నిజాయితీ లేకపోవడమే."
ఇది నా బ్లాగు లొ కూడా వుంటే మరింత ఉపయోగకరంగా వుంటుందని పోస్ట్ చేస్తున్నాను.



Saturday, September 22, 2012

బెస్ట్ జర్నలిస్ట్ అవార్డ్

సంతోషం సినీ వార పత్రిక ఇంతవరకూ ఫిలిం అవార్డులను టాలీవుడ్ కి మాత్రమే పరిమితం చేస్తూ ఇస్తూ వచ్చింది. ఈసారి తన పదవ వార్షికోత్సవం సందర్భంగా ఆ అవార్డులను మొత్తం సౌత్ ఇండియాకి విస్తరించింది. 12 ఆగస్ట్  2012న జరిగిన ఆ కార్యక్రమం లో నాకు బెస్ట్ జర్నలిస్ట్ అవార్డ్ ని ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని మా టీవీ వారు 19  ఆగస్ట్ 2012 వినాయక చవితి రోజు ప్రసారం చేశారు. మా టీవీ ఎడిటర్ కె.యస్. సహకారం తో, మా టీవీ సౌజన్యం తో నాకు సంబంధించిన క్లిప్పింగ్ ని జత పరుస్తున్నాను.  క్లిక్ చేసి చూడండి.

బెస్ట్ జర్నలిస్ట్ అవార్డ్

Sunday, September 2, 2012

My sweet Memories గుర్తుకొచ్చాయి





హైదరాబాద్ దూర దర్శన్ వారు వివిధ రంగాలలోని ప్రముఖుల్ని ’హలో సప్తగిరి’ కార్యక్రమంలో పరిచయం చేస్తూ వుంటారు. ఆ క్రమంలో మొన్న ఆగస్ట్ 30 న నన్ను పిలిచారు. దీనికి నేను పని చేస్తున్న మా టీవీ యాజమాన్యం సహృదయంతో అనుమతినిచ్చారు. అది అరగంట ప్రోగ్రామ్. పైగా లైవ్. అలవాటే గనుక సులువుగానే చేసేశాను. ప్రోగ్రామ్ అయిపోయాక అభినందనలు రావడం కూడా మామూలే. కానీ ఈ సారి అనుభూతి మాత్రం ప్రత్యేకమైనది. చిన్నప్పుడు నాతో స్కూల్లో చదువుకున్న బాల్యమిత్రులందరూ రియాక్ట్ అయారు. గాలికి విసిరేసినట్టుగా ఒక్కొక్కరూ ఒక్కో ఊరు, ఒక్కో రాష్ట్రంలో వున్నాం. వారందరూ ఫోన్లు చేసి చిన్ననాటి సంగతులు మాట్లాడుతూ వుంటే మనసు 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. ఒక్కసారి నన్ను నేను చెక్ చేసుకుంటే - నేను అప్పుడెలా వున్నానో - ఇప్పుడు కూడా అలాగే - అంత పవిత్రంగానే వున్నాననిపించింది. ఆ ప్రోగ్రామ్ లో ఫొటోలు తీయకపోయినా వున్న టెక్నికల్ నాలెడ్జ్ సహాయంతో కాప్చర్ చేసి, జెపెగ్ లోకి మార్చి మరిచిపోలేని గుర్తు కాబట్టి ఇక్కడ జత చేస్తున్నాను వాటితో పాటు ఆ ఇంటర్యూ వీడియో ని నాలుగు భాగాలుగా చేసి మిత్రులు సూర్యప్రకాశరావు గారు పంపిన లింకుని జతపరుస్తున్నాను. చూసి ఎలా వుందో చెప్పండి.

 Doordharshan interviews Haasam Raja!






 
 

Tuesday, August 21, 2012

ది గ్రేట్ యాంకర్ఆఫ్ సౌతిండియా - సుమ

టీవీ ప్రోగ్రామ్స్ లో, ఇంటర్వ్యూలలో, సినిమా ప్రోగ్రామ్స్ లో, ఆడియో రిలీజ్ ఫంక్షన్స్ లో
అసలు ఒకటేమిటి ఏ రకమైన ప్రోగ్రాం కైనా , ఈవెంట్ కైనా నంబర్ వన్ యాంకర్ ఎవరు
అనగానే ఎవరైనా సరే తడుముకోకుండా చెప్పే పేరు - సుమ.
ఈ సారి సుమ ఓ ప్రయోగం చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, మళయాళ భాషలలోలోని
సినీ సంగీతానికి ప్రతీ ఏటా అవార్డులిచ్చే రేడియో మిర్చి వారి అవార్డుల కార్యక్రమం లో
(ఇది 18  ఆగస్ట్  2012 న జరిగింది) నాలుగు భాషల్లో యాంకరింగ్ చేసింది. వచ్చిన
ప్రతీ వారు ఎంజాయ్ చెయ్యడమే కాదు - ఆమె ప్రజ్ఞకి ఆశ్చర్య పోయారు కూడా.
సుమ సెన్సాఫ్ హ్యూమర్ గురించి. (ర) సమయస్ఫూర్తి గురించి అందరికీ తెలుసు.
కానీ ఆమె లో కొత్తగా కనిపించిన ఈ ప్రతిభ గురించి చర్చించుకోని వారు,
ప్రశంసించని  వారు ఇంచుమించుగా లేరనే చెప్పాలి. దీంతో ఆమె సౌతిండియన్
యాంకర్ అయిపోయింది.
ఇంతేనా ... తెలుగు సినిమాల్లోని 3 దశాబ్దాలలో హీరోయిన్ ల వేషధారణని
అనుకరిస్తూ గెటప్పులు వేసింది. (ఇక్కడ రెండే ఫోటోలు దొరికాయి
ప్రస్తుతానికి). ప్రోగ్రాం చూశాక ఇంటికి వస్తూ " ఈ అమ్మాయి మనింట్లో మెంబర్ లాగ
మనతో కలిసిపోవడం నిజంగా మన అదృష్టం" అన్నారు నా కుటుంబ
సభ్యులు. ఇలా మా ఇంట్లోనే కాదు ఎందరి ఇళ్ళలోనో అనుకుంటూ వుంటారు.
ఒక విధంగా చెప్పాలంటే ఆ భగవంతుడు ఎంతో శ్రద్ధ తీసుకుని ప్రత్యేకం గా సృష్టించిన
ఓ అపూర్వ అద్భుతం - సుమ .
ఆమె  గిన్నీస్ బుక్ లోకి ఎక్కినా, పద్మశ్రీ వంటి బిరుదులూ ఏ ప్రయత్నమూ
చేయకుండా వచ్చినా ఆశ్చర్య పడాల్సిన అవసరమే లేదు.
"తల్లీ ... సుమా ... నేను ఎన్నెన్నో జన్మల్లో వరసగా ఎంతో పేద్ద పుణ్యం చేసుకొని వుంటాను.వాటన్నిటి ఫలితమే - నీ చేత 'బాబాయ్' అని పిలిపించుకో గలిగే అదృష్టం. ఇది నేను మనసారా నమ్ముతున్ననిజం. ఈ తృప్తి భలే గర్వం గా, గౌరవంగా ఉందమ్మా... " .


హ్యాట్సాఫ్ టు ఉషా ఉతుప్


ఆవిడ వయసు 65 ఏళ్ళు - ఇప్పటికి .
స్టామినా 25 ఏళ్ళు - ఎప్పటికీ ....
ఇదే అనిపిస్తుంది  18 ఆగస్ట్ 2012 న హైదరాబాద్ లో జరిగిన
రేడియో మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ లో ఆవిడ పెర్ఫార్మెన్స్ చూస్తే ...
సాధారణం గా నామినేషన్స్ చెప్పేటప్పుడు క్లిప్పింగ్స్ చూపిస్తారు.
కానీ బెస్ట్ సింగర్ నామినేషన్స్ చెప్పేటప్పుడు క్లిప్పింగ్స్ చూపించకుండా వెరైటీ గా
వాళ్ళ పాటల్ని పాడించే ప్రయత్నాన్ని చేసారు రేడియో మిర్చి వారు.
దానికి ఉషా ఉతుప్ ని ఎన్నుకున్నారు . ఒక్కో భాష కి 4 నుంచి 5 చొప్పున
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలకు కలిపి మొత్తం ఓ 20 పాటల పల్లవులు.

ఈ చాలెంజ్ ని స్పోర్టివ్ గా తీసుకుని
రాని భాషల్ని వచ్చిన భాషలో రాసుకుని భాష వచ్చినట్టుగా పాడాలి ...
అది లైవ్ గా ... లవ్లీ గా వుండాలి .

పాడుతూ ప్రేక్షకులతో ఇంటరాక్ట్ అవుతూ
తను ఎంజాయ్ చేస్తూ
అందర్నీ రంజింప చేస్తూ పెర్ఫార్మ్ చెయ్యడం
ఒక్క ఉషా ఉతుప్ కే చెల్లిందనిపించింది.
ఇవి చాలక తన ఎంట్రీ  తో ఒక పాట,
ధనుష్ ని చూసి కొలవేరి పాట,
ఆ కొలవేరి ట్రాక్ దొరికే వరకు ఆడియన్స్ ని  ఆ పాట తో ఇంటరాక్ట్ చెయ్యడం ....
ఇలా ఓ గంటన్నర పాటు ఆ వయసులో ఫుల్ జోష్ తో ఊగిపోతూ ఊపెయ్యడం
మాటలు కాదు.

ఇదిలా వుండగా 43 ఏళ్ళు గా పాడుతున్నా గొంతులో మొదట్నించీ వున్న
ఆ మెటాలిక్ సౌండ్ ని మైంటైన్ చెయ్యడం ఒక ఎత్తయితే
అకేషన్ కి తగ్గ డ్రెస్ కోడ్ ని చూపించడం ఇది మరో ఎత్తు.
ఈ ప్రోగ్రాం కి ఆవిడ ఏం చేసిందో తెలుసా ?
ఇది రేడియో మిర్చివారి ఫంక్షన్ కనుక -
తను కట్టుకున్న చీర బోర్డర్ మీదా , పైట కొంగు మీదా
మిరపకాయలున్న డిజైన్ ని ప్రత్యేకం గా ప్రింట్ చేయించుకుని వచ్చింది.
ఇవన్నీ పాట పట్ల , దానిని సంగీతాభిమానులకు అందజేయగల ప్రదర్శనావకాశాల పట్ల
ఆవిడకి గల భక్తి శ్రద్ధలనీ , ప్రేమాభిమానాలనీ తెలియచేస్తాయి.

ఆ డెడికేషన్ కి , ఆ స్టామినా కి ప్రోగ్రాం అవగానే వెళ్లి పాదాభివందనం చేయాలనిపించింది.
ఇంతలో మొత్తం ఆడియన్స్ అంతా లేచి నిల్చొని 'standing ovation ' ఇచ్చారు.
మనసంతా తృప్తి తో నిండిపోయింది.

ఈ గంటన్నర సేపూ ఎంటర్ టైన్ చేస్తూనే ఉషా ఉతుప్ కొన్ని మంచి మాటలు
చెప్పారు . అవి :
(1 ) హృదయాన్ని నేరుగా తాకి అందులో నిలిచిపోయేదే మంచి పాట.
(2 ) నేను, బప్పి లహరి పాడితే ఏది మేల్ వాయిసో ఏది ఫిమేల్ వాయిసో పోల్చుకోలేక
పోయేవారు.
(3 ) నలభై మూడేళ్ళ నా సింగింగ్ కెరీర్ లో నా స్కేల్ తో మ్యాచ్ అయ్యే వాయిస్
ఒక్క ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం దే .
ఈ వ్యాసాన్ని ఐడిల్ బ్రెయిన్.కమ్ లో వేశారు. ఆ లింకు ఇక్కడ జతపరుస్తున్నాను. http://www.idlebrain.com/news/2000march20/ushauthup-radiomirchi.html

Friday, August 10, 2012

బెస్ట్ చానల్ జర్నలిస్ట్ అవార్డ్

సంతోషం సినీ వార పత్రిక గత పదేళ్లుగా వస్తోంది. ఆ పత్రిక ఎడిటర్ సురేష్ కొండేటి అంతకుముందు వార్త దిన పత్రికలో నాతో కలిసి మూడేళ్ళు పని చేశాడు. సరే, వార్త నుంచి నేను హాసం కి, ఆ తర్వాత మా టీవీ కి షిఫ్ట్ అయ్యాను. అతను సంతోషం అనే సిఏ వార పత్రికను పెట్టాడు. సినీ అవార్డ్ ఫంక్షన్లు ఆ పత్రిక తరఫున చేశాడు. మధ్యలో తమిళంలో విజయం సాధించిన కొన్ని సినిమాలను కొని తెలుగులోకి అనువదించాడు. వాటిలో ప్రేమిస్తే, షాపింగ్ మాల్, నాన్న, జర్నీ, రేణిగుంట, ప్రేమలో పడితే ముఖ్యమైనవి. సంతోషం పత్రిక పెట్టి పదేళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ సారి దక్షిణ భారత దేశం లోని నాలుగు భాషల సినిమాలకూ కలిపి అవార్డ్లులు  ఆగస్ట్ 12  న ఇవ్వబోతున్నాడు. నాక్కూడా బెస్ట్ చానెల్ జర్నలిస్ట్ అంటూ ఓ అవార్డు వుందని లెటర్ పంపాడు. అఫీషియల్ గా ఆరోజు వేదిక మీద ప్రకటించి ఇవ్వడం జరుగుతుంది. ఈ విషయాన్నినేను ముందే లీక్ చెయ్యకూడదన్న నిబంధనలేవీ లేవు కనుక మీ అందరితోనూ పంచుకుంటున్నాను. థాంక్ యు వెరీ మచ్ సురేష్...

Friday, June 29, 2012

As a Jury member for Radio Mirchi again ...రేడియో మిర్చి జ్యూరీ మెంబర్ గా మరోసారి ...


రేడియో మిర్చి నిర్వహించే మ్యూజిక్ అవార్డ్స్ ప్రెస్ మీట్ ఇవాళ (28 జూన్ 2012 )  జరిగింది. గత సంవత్సరం లాగే ఈ ఏడు కూడా జ్యూరీ మెంబర్ గా వున్నాను. పక్కా గా, మోస్ట్ సైంటిఫిక్ గా నిర్వహిస్తారు రేడియో మిర్చివాళ్ళు. అలాగే జ్యూరీ మెంబర్లకు ఇచ్చే గౌరవ మర్యాదలు కూడా ఎంతో బావుంటాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది - సినీ సంగీతం తో సంబంధం వున్నవాళ్ళు, సినీ సంగీతానికి ఏదో రూపం లో  ఎంతో  కొంత తమ వంతు గా జీవితాన్ని వెచ్చించిన వాళ్ళు జ్యూరీ మెంబర్లు గా వుండడం. అలా అయితే న్యాయ నిర్ణయం కమర్షియల్ గా కాకుండా నిజాయితీ గా వుంటుంది. రిజల్ట్స్ ఆగస్ట్ 4 న వెలువడుతాయి. అంతవరకూ ఓటేసిన జ్యూరీ మెంబర్లక్కూడా తెలియదు. ప్రెస్ మీట్లోతీసిన కొన్ని ఫోటోలు, ఎడిటెడ్ వీడియో ...సంగీతాభిమానులైన స్నేహితులకోసం .... 

Saturday, June 2, 2012

About Hemachandra ....హేమచంద్ర గురించి ...

హేమచంద్ర గురించి ఇవాళ తెలుగు సినీ సంగీత ప్రియులకి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇళయరాజా బర్త్ డే అయిన  జూన్ 2 న పుట్టాడు. హేమచంద్ర మేనమామ కీ.శే.లక్ష్మణాచారి నాకు చిరకాల మిత్రుడు. హేమచంద్ర తల్లి శశికళ నన్ను తన అన్నయ్యలా భావిస్తుంది. అలా ఏ విధంగా చూసినా హేమచంద్ర నా వ్యూ లో నాకు నెవ్యూ కిందే లెక్క. అతని పుట్టినరోజు సందర్భంగా మా మ్యూజిక్ చానల్ కోసం ఇంటర్వ్యూ చేసే చాన్స్ అఫీషియల్ గా తీసుకున్నాను. దగ్గరుండి షూటింగ్, ఎడిటింగ్ బాధ్యతలన్నీ చక్కగా చేసాననుకుంటున్నాను. నాకు ఇచ్చిన టైం 23 నిముషాలు. షూటింగ్ చేసిన పార్ట్ సుమారు గంటన్నర. అందులో పనికొచ్చే పార్ట్ ఎంతలేదన్నా 60 నిముషాలు వుంటుంది. ఎంచి ఎంచి  - క్లిప్పింగ్ లని కలుపుకుంటూ 23 నిముషాలకు ఎలా కుదించానో ఈ లింక్ చూసి మీరే చెప్పండి.
Hemachandra Birthday Speical

Friday, May 11, 2012

A Small felicitation from SPB ...బాలూ గారితో సత్కారం అందుకున్నవేళ







'ముద్దమందారం' హీరో ప్రదీప్ నాకు జంధ్యాల ద్వారా పరిచయం. ఈ మధ్య అంటే ఏప్రిల్ 29 న బాలూ గారితో 'నేను - నా స్వరకర్తలు' అనే కార్యక్రమాన్ని 'ఈ - సర్కిల్' సంస్థను స్థాపించి నిర్వహించాడు. ఆ ప్రోగ్రాం కి  నేను కొంత 'పాట సాయం' చెయ్యాల్సి వచ్చింది. 'పాట సాయం' అంటే కొన్ని పాటలను సూచించడం, వాటి సాంకేతిక వివరాలు అందివ్వడం లాంటివన్నమాట. అందుకు కృతజ్ఞతగా ఆ రోజు స్టేజ్ మీద బాలూ గారితో ఓ చిన్నపాటి సత్కారం చేయించాడు. బాలూ గారు నాకెంత ఆత్మీయుడైనా, మా ఇద్దరి మధ్యగల స్నేహం ఎంత పాతదైనా, ఆయనతో నాకు గల జ్ఞాపకాలు కొన్నివందలు, వేలు వున్నా - అంతటి గొప్ప వ్యక్తి తో అభినందన పూర్వక సత్కారం పొందడంలోని ఆనందం సాటిలేనిది, మరిచిపోలేనిది.

Wednesday, May 2, 2012

Openion of Malladi Venkata Krishna Murthy రాజా గురించి మల్లాది

a


 

మల్లాది గారితో నా  పరిచయం చాలా పాతది . ఆయన పద్ధతులు కొన్ని నాకు నచ్చుతాయి.
కొన్నిటిని ఇంకా ఆచరిస్తూనే వున్నాను కూడా . కౌముది తెలుగు వెబ్ మాగజైన్ లో
ఆయన కొన్ని నెలలు గా తన సాహితీ జీవనం  లో ఎదురైన కొందరు ఎడిటర్ల గురించి
రాస్తున్నారు. ఈ నెల నా గురించి రాసేరు. నన్ను ఆవిష్కరించే ప్రయత్నం లో నా గురించి
నేను చెప్పుకోలేనివి కొన్ని బైటికొచ్చాయి. అవి మీ ముందు వుంచడం లో కూడా కొంత
ఆనందం వుంది.చదివి చెప్పండి.  అన్నట్టు ఇప్పటి వరకూ చెప్పలేదనుకుంటా ఈ కౌముది
తెలుగు వెబ్ మాగజైన్ లోనే నేను ఒకప్పుడు రాసిన 'ఆపాత మధురం' వ్యాసాలని గత మూడు సంవత్సరాలు గా వేస్తున్నారు. వీలయితే తాపీగా  అవి కూడా చదవండి.

Sunday, March 25, 2012

National award for Vidya Balan again విద్యాబాలన్ కి మరోసారి జాతీయ అవార్డు 




విద్యాబాలన్ కి 2012 సంవత్సరానికి జాతీయ స్థాయి లో ఉత్తమ నటిగా అవార్డు వస్తే ఈసారి ప్రతివారూ మెచ్చుకుంటారు - రాకపోతేనే బాధ పడతారు - అంత బాగా చేసింది 'కహానీ' లో... విద్యాబాలన్ అవార్డు తో పాటు మరో మూడు అవార్డులు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను - బెస్ట్ బ్యాగ్రౌండ్ స్కోర్, బెస్ట్ స్క్రీన్ ప్లే , బెస్ట్ డైరెక్షన్. అన్నివిధాలా ఎంతో బాగుందీ సినిమా. అనవసరపు డ్యూయెట్లు లేవు.. ఐటం సాంగ్ ఒక్కటీ లేదు. సినిమా బిగినింగ్ నుంచీ ఎండింగ్ వరకూ ఏ డీవియేషన్లూ లేకుండా ఒకటే పాయింట్ మీద వెళ్తుంది. చూస్తుంటే ఎంత తృప్తి గా వుందో !? చూస్తున్నంత సేపూ మన సౌందర్య లేకుండా పోయిందే అని ఎన్ని సార్లు అనిపించిందో !? ఉంటే కచ్చితంగా తెలుగులో ఈ సినిమా ప్లాన్ చేసే వాళ్ళమేమో ... మళ్ళీ అంతలోనే అనిపించింది - గగనం ని ఆదరించామా , రామరాజ్యాన్ని ఆదరించామా ... ప్రస్తుతం మనకే అర్హత వుందని ఇలాంటి సినిమాని తెలుగుకి ఊహించడానికి !? వద్దు లెండి ... మనందరిలోనూ మార్పు వస్తే తప్ప మన సినిమాల ధోరణి మారదు. 
 

As a jury member for Nandi Awards నందీ అవార్డుల జ్యూరీ మెంబర్ గా ...



ఉగాది రోజున నందీ అవార్డుల జ్యూరీ మెంబర్ గా నందిని అందుకున్నాను. 2010 సంవత్సరం లో రిలీజైన సినిమాలకి సంబంధించి న్యాయ నిర్ణయం చేసినందుకు లభించిన మెమెంటో ఇది. నిజం చెప్పాలంటే అంతకు ముందు సంవత్సరాల జడ్జ్ మెంట్ కొన్నిచోట్ల విమర్శలకు గురైంది. 2010 జడ్జ్ మెంట్ కి మంచి పేరే తెచ్చుకున్నాం. ఈ సందర్భం గా గతం ఒక్కసారి గుర్తు చేసుకుంటే - 1976 నుంచి 1980 టైం లో నందీ అవార్డుల ఫంక్షన్స్ ని కవర్ చెయ్యడానికి జర్నలిస్ట్ గా వెళ్ళేవాడిని. ఆ తర్వాత వివిధ పత్రికలలో నా రచనలు చూసి నందీ అవార్డుల ఫంక్షన్లో స్టేజ్ మీద కామెంటరీ కి కొన్ని సంవత్సరాల పాటు నా చేత ఎఫ్ డీ సి వారు రాయించేవారు. 

ఓ సారి నందీ అవార్డుల ఫంక్షన్ కి షావుకారు జానకి గారు యాంకర్. ఆవిడ చెప్పాల్సిందంతా నేను రాయాలి. నేను రాయాల్సింది రాసిచ్చేసి వెళ్ళిపోయాను. ఆవిడ అంతా చదివి, "ఇది రాసినవారిని పిలిపించండి.వారితో నేను మాట్లాడాలి" అన్నారు. ఆవిడ ఆర్డర్ వేస్తే తిరుగేముంది ? వెంటనే నాకు కబురు పెట్టారు. ప్రతీ వాక్యాన్ని  ఆవిడ చదువుతూ, నేనెందుకలా రాసానో తెలుసుకుంటూ, రకరకాల మాడ్యులేషన్లలోపలుకుతూ ఉంటూ వుంటే  - ఆమె ప్రతిభకీ, కమిట్మెంట్ పట్ల ఆమెకి గల ఆసక్తికీ మనసులోనే నమస్కరించుకున్నాను. అంతటితో ఆగలేదావిడ . ప్రోగ్రాం చివర్లో " మీరందరూ నా కామెంటరీకి మెచ్చుకుని ఈ దండ వేసారే ... ఇది నేను రాసుకున్నది కాదు. దీన్నిచదివానంతే ... రాసినవారు వేరే వున్నారు ... ఈ మాటలూ ఈ భావాలూ అన్నీ ఆయనవే .." అంటూ పబ్లిక్ గా ప్రేక్షకులకి నిజం చెప్పేసి నన్ను స్టేజ్ మీదికి పిలిచేసి తన మెడలో వున్న దండ నాకు వేసేవరకూ ఊరుకోలేదు. అదీ ఆవిడ వ్యక్తిత్వం .

మరోసారి ఇలాంటి అనుభవమే ఎల్బీ శ్రీరాం తో ... అది కూడా నందీ అవార్డులకే ... రచన నాది. యాంకరింగ్ ఆయనది. షూటింగ్ లలో వుండడం  వల్ల క్షణం తీరికలేదాయనకి. ఫంక్షన్ కి ఓ అరగంట ముందు వచ్చి నేను రాసింది చదువుకోవడం మొదలు పెట్టాడు. " బొత్తిగా టైం లేకుండా పోయింది. ఎలా వస్తుందో ఏమిటో" అన్నాడు బెరుగ్గా . " మీరు రైటరు కాబట్టి మానేజ్ చెయ్యగలరు" అని చెప్పి కొన్ని మాడ్యులేషన్లు నేననుకున్నవి వివరించాను. స్టేజ్ మీద చెలరేగిపోయాడాయన. 

చాలాసార్లు చప్పట్లు పడ్డాయి ఆయన యాంకరింగ్ కి . ప్రోగ్రాం పూర్తయ్యాక ఆనందంతో నన్ను కౌగలించుకున్నాడు ఎల్బీ శ్రీరాం. ఆ తర్వాత నేను బిజీగా ఉండడంవల్ల క్లిప్పింగ్స్ పర్యవేక్షణ వరకూ కొన్ని నందీ అవార్డుల ఫంక్షన్ లకి నేను నా వంతు సాయం చేసాను. మాటీవీ లో చేరాక దర్శకుడి గా నేను తీసిన 'గుర్తుకొస్తున్నాయి' కార్యక్రమానికి ఫస్ట్ బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ గా టీవీ అవార్డుల్లో నందీ అవార్డు ని అందుకున్నాను. ఇదిగో ... ఇప్పుడు జ్యూరీ మెంబర్ గా ... అదీ సినిమా విభాగానికి .... ఇదీ ఆంద్ర ప్రదేశ్ నందీ అవార్డులతో నా ప్రస్థానం.
ఈ జ్యూరీ అవార్డ్ ని అందుకునే టైం లోనే 2009 కి తన అవార్డులని అందుకోడానికి వచ్చాడు ఎల్బీ శ్రీరాం. అప్పటి సంగతులు తల్చుకున్నాం. " ఆ రోజు ఒరిజినల్ గా ఎంతో భయంగా వుంది.  మీ ధైర్యం చూస్తే మరింత భయం వేసింది " అన్నాడు నిర్మొహమాటం గా. "అయితేనేం ... మొత్తానికి చప్పట్లు పడ్డాయి గా" అన్నాను. మళ్ళీ మరోసారి కౌగలించుకున్నాడాయన మనస్పూర్తి గా .. ఎల్బీ తో స్నేహం కూడా అవార్దంత గొప్పదే !!

Friday, March 16, 2012

A Tribute to Music Director Bombya Ravi ఆయన సంగీతం - స్వర రాగ గంగా ప్రవాహం


గురుదత్ భార్య పాట పాడిన ఏయన్నార్ సినిమా ఏది  ?
ఎస్పీ కోదండపాణి సంగీతంలో వచ్చిన సినిమాలో గీతాదత్ పాడిన పాట ఏది ?

ఏ మ్యూజిక్ క్విజ్ లోనైనా ఇలాంటి ప్రశ్నలడిగితే ఆన్సరిచ్చే వాళ్ళు దొరకడం కష్టం. వీటికి ఆన్సరుందా అంటే అక్కినేని నటించిన 'మంచి కుటుంబం' సినిమాకి సంగీత దర్శకుడు ఎస్పీ కోదండపాణి. ఆ సినిమాలో  గీతాదత్ పాడిన 'డింగ్ డాంగ్ డింగ్ డాంగ్ డింగ్ లల్ల' అనే పాటుంది - అని జవాబు చెప్పొచ్చు.  అసలివి నిజమైన ప్రశ్నలేనా అని  లోతులకెళితే మాత్రం కరెక్ట్ కాదని ఒప్పుకోవలసి వస్తుంది.                                                                             జెమిని వాళ్ళు హిందీ లో తీసిన  'గృహస్తి' సినిమాలోదా పాట. ఆ పాటని ట్యూన్ చేసింది రవి. ఆ సినిమాని అటు తమిళం లో 'మోటార్ సుందరం పిళ్ళై' గా, తెలుగులో 'మంచి కుటుంబం' గా తీసినప్పుడు సందర్భానికి సూట్ అవుతుందని ఈ పాటని యధాతధం గా సీన్ తో సహా వాడుకున్నారు. అలా రవి పాట తెలుగు సినిమాలోకి డైరెక్ట్ గా వచ్చేసిందన్న మాట.  కాకపోతే అంతకు ముందూ, ఆ తర్వాతా రవి చేసిన ట్యూన్లు తెలుగు సినిమాల్లోకి వచ్చేసిన     సందర్భాలు చాలా వున్నాయి .                                                                                                                  నిన్ను చూడనీ  నన్ను పాడనీ  (మనుషులు - మమతలు) -  (ఎ ఖామోషియా ఎ తన్ హాయియా - యే రాస్తే హై      ప్యార్ కి), ఈ వేళ నాలో ఎందుకో ఆశలు (మూగనోము) - (తుమ్హారీ నజర్ క్యోం కఫా హోగయీ - దో కలియా), అన్నా అన్నా విన్నావా చిన్నీ కృష్ణుడు వచ్చాడు (ఇలవేల్పు) - చందామామా దూర్ కి (వచన్), అందచందాల ఓ  తారకా (వరుడు కావాలి) -(ముస్కురాతీ హుయీ చాంద్ నీ - అల్బేలీ), నీలిమేఘ మాలవో నీలాల  తారవో (మదన కామరాజు కథ) (చౌద్ వీ క చాంద్ హో - చౌద్ వీ కా చాంద్)                                                                                 ఇవిలా వుండగా ఒరిజినల్ సినిమాని పూర్తిగా హక్కులతో సహా కొనుక్కోవడం వల్ల ఆయా సినిమాల్లో రవి చేసిన ట్యూన్లు ( కొన్ని) తెలుగులో పాపులరైనవి వున్నాయి. అలా  'మా బాబు' లోని 'బాబూ నిద్దుర పోరా ' , 'చల్ చలో యని స్వారి చేసెను' పాటలకి 'చిరాగ్ కహా రోష్ని కహా' లోనూ, 'భలే తమ్ముడు' లోని 'ఎంతవారు గాని' , 'గోపాల బాల నిన్నే కోరి' , 'గుమ్మా గుమ్మా గుమ్మెత్తించే ముద్దుల గుమ్మా' పాటలకి 'చైనా టౌన్' లోనూ, 'భలే అబ్బాయిలు' లోని   'గులాబీలు పూసేవేళ' , 'ఎవరో నా మది లో' , 'ఏమౌనో ఈవేళలో' పాటలకి 'వక్త్' లోనూ 'మొనగాళ్ళకి మొనగాడు' లోని 'నేనున్నది నీలోనే' , 'వచ్చామే నీ కోసం' పాటలకి 'ఉస్తాదోం కె ఉస్తాద్' లోనూ వున్న ఒరిజినల్స్ ని చెప్పుకోవచ్చు.                                                                                                                                                   ఇదిలా వుండగా 'భక్త జయదేవ' లోని 'నీ మధు మురళీ గానలీల' పాటకి ('స్వర్ణ మంజరి' లోని 'ఝనన ఝనన ఝణ  నాదమే నాట్యం' పాటక్కూడా) 'నర్సీ భగత్' లోని 'దర్శన్ దో ఘన్ శ్యామ్' పాటా, 'పెద రాయుడు' లోని 'కదిలే కాలమా' పాటకి 'హమ్ రాజ్' లోని 'యే నీలే గగన్ కి తలే' పాటా - ఇన్స్పిరేషన్ అని విశ్లేషించే వారు కూడా లేకపోలేదు. ఇవి కూడా రవి ట్యూన్లే. ('ఉస్తాదోం కె ఉస్తాద్' లో 'మైనే కహాతా ఆనా సన్ డే  కో సన్ డే కో' పాటని మనవాళ్ళు 'గూఢచారి 116 ' లో 'మనసుతీరా నవ్వులె నవ్వులె నవ్వాలి' పాటకి వాడుకున్నరనే వాళ్ళున్నారు. కాకపోతే ఈ రెండిటికీ మూలం 'నెవర్ ఆన్ సన్ డే' అనే ట్యూనుంది కనుక రవికి పూర్తి క్రెడిట్ ఇవ్వడం న్యాయం కాదు.)                                                                                                                                                              ఇలా మన తెలుగు ప్రేక్షకులు 'ఇవి రవివి ' అని తెలిసో తెలియకో చాలా ట్యూన్ లు ఆయన చేసినవి ఎంజాయ్ చేసేసారు. ఇక రవి సంగీతాన్నిచ్చిన హిందీ సినిమాల్ని వాటిలోని పాటల్నీ ఉత్తరాది ప్రేక్షకులతో  సమానం గా ఆదరించిన దక్షిణాది ప్రేక్షక శ్రోతలు కోకొల్లలు. సి యే టి క్యాట్ - క్యాట్ మానె బిల్లీ, హమ్ కో మోహోబ్బత్ కరేగా (దిల్లీ  కా థగ్), చౌద్ వీ కా చాంద్ టైటిల్ సాంగ్,  యే హవా యే హవా, ఆజా ఆజారే తుఝ్ కో మేరా ప్యార్ పుకారే, చలో ఇక్ బార్ ఫిర్ సే, ఆప్ ఆయే తో ఖయాలే (గుమ్ రాహ్ - తెలుగులో అభినందన),  నీల్ గగన్ కి ఉడ్ తీ బాదల్ (ఖాన్ దాన్  - తెలుగులో కలసి వుంటే కలదు సుఖం ),  జబ్ చలీ టండీ హవా (దో బదన్), న ఝట్ కో జుల్ఫ్ కె పానీ (షెహనాయి), తోరా మన్ దర్పన్ కేహలాయే , మేరె భయ్యా మేరె చందా , చూలేనేదో నాజుక్ హోటోం కో, యే జుల్ఫ్ అగర్ జుల్ఫే (కాజల్ - తెలుగులో మా ఇంటి దేవత ), షిశిసే పీ, యే పైమానే సే పీ ( ఫూల్ ఆర్ పత్తర్ - తెలుగులో నిండుమనసులు తుజ్ కో పుకారే మేరా ప్యార్, బాబుల్ కి దువాయే ( నీల్ కమల్ ),  ఇవి కాక హమ్ రాజ్, వక్త్ లాంటి అల్ సాంగ్స్  హిట్ సినిమాలు ఎన్నో వున్నాయి రవికి.                                                                                                     1926 మార్చ్ 3 న  ఢిల్లీ లో పుట్టిన రవికి తండ్రి పాడే భజనల నుంచే సంగీతం అబ్బింది. తనకు తాను గా హార్మోనియం వాయించడం నేర్చుకున్నాడు. కుటుంబాన్ని పోషించడం  కోసం కొన్నాళ్ళు ఎలక్ట్రీషియన్ గా  పని చేసాడు. సింగర్ గా సెటిలవుదామని 1950 లో బొంబాయికి వచ్చేసాడు. ఇల్లు లేదు వాకిలి లేదు రోడ్ల మీదే మకాం. అలా హేమంత్ కుమార్ దృష్టిలో పడ్డాడు. 'ఆనంద్ మఠ్ ' లో 'వందే మాతరం' పాటలో  కోరస్ పాడడానికి తీసుకుపోయాడు హేమంత్.  ఆ తర్వాత కథ అతని పాటల ద్వారా అందరికీ తెలిసిందే . అటు మహేంద్ర కపూర్ కి, ఇటు ఆశా భోంస్లే కి  రవి పాటలే కొత్త లైఫ్ ఇచ్చాయని హిందీ సినీ సంగీత చరిత్ర తెలిసిన ప్రతివారూ ఒప్పుకుంటారు. ఆల్మోస్ట్ రిటైరింగ్ స్టేజ్ అని అందరూ అనుకుంటూ వుండగా మ్యూజిక్ చేసిన 'నిక్కా' సినిమాలోని 'దిల్ కె అర్ మా' పాటతో సల్మా ఆగా బెస్ట్ సింగర్ గా ఫిలిం ఫేర్ అవార్డ్ తెచ్చేసుకుంది. ఆ తర్వాత బాంబే రవిగా మళయాళ చిత్రాలకు సంగీతం ఇస్తే రెండు సార్లు ( 'నక్షత్రంగల్' సినిమాలోని 'మంజల్ ప్రసాదవుమ్ ' పాటకి,  'వైశాలి' లోని 'ఇందుపుష్పం' పాటకి)  చిత్ర నేషనల్ అవార్డ్ వచ్చింది.  మధ్యలో 'మహాభారత్' టీవీ సీరియల్ టైటిల్ సాంగ్ తో ప్రాంతీయ బేధాల్లేకుండా దేశం మొత్తం ఇంటింటా రవి పేరు మార్మోగి పోయింది. అప్పటివరకూ ఆయన సంగీతాన్ని వేరే దారుల్లో తీసుకున్న తెలుగు చలన  చిత్ర పరిశ్రమ 'సరిగమలు' చిత్రంతో నేరుగా స్వాగతం పలికింది. ఆ సినిమాలో జేసుదాసు పాడిన 'స్వర రాగ గంగా ప్రవాహమే' పాట ఔత్సాహిక గాయకులకి , మంచి పాటల కోసం ఎదురు చూసే శ్రోతలకి ఓ వరం లా నిలిచిపోయింది. 'ఎవరీ రవి ? ' తెలుగు వాళ్ళందరూ అడిగేలా చేసింది. 'సరిగమలు' సినిమాకి పాటలు రాసిన వేటూరి - ఆ పాటల గురించి , రవి గురించి ఇలా అన్నారు .                                                                                  " ఇహానికి పరానికి పనికొచ్చే సాహిత్యం సృష్టించే ఆవకాశం వున్న సినిమాలు ఎప్పుడో గాని రావు. సంగీత సాహిత్య భరితమైన 'సరిగమలు' చిత్రం - పాటల రచయితగా నాకెంతో తృప్తిని , మంచి పాటలు రాశానన్న నమ్మకాన్ని కలిగించిన చిత్రం. దానికి కారణం - అన్నీ ట్యూన్ కి రాసిన పాటలైనప్పటికీ - ఇచ్చిన ట్యూన్ లు సందర్భానికి పనికి వచ్చేవిగా , సాహిత్యానికి ఉపకరించేవిగా , ప్రేరణ కలిగించే విధంగా వుండడం.  ఈ చిత్రం లోని పాటలు ఇంత ప్రసిద్ధి పొందడానికి మూల కారకుడు - మహా సంగీత విద్వాంసుడు -  మా అందరికీ పూజనీయుడు అయినటువంటి రవి. ఆయన ఇచ్చిన ట్యూన్లలోని శక్తే నాచేత అటువంటి పాటలు రాయించింది. రవి గారు ఇచ్చిన ట్యూన్ల వల్ల నేను రాసిన సాహిత్యం అక్కరకొచ్చింది. 'సరిగమలు' లో  నేను రాసిన ప్రతీ పాటకీ నా మది లో గూడు కట్టుకున్న భావాలు అక్షరాలుగా మారి అమృతోపమానమైన సంగీత ప్రవాహంలో పూల పడవల్లా తేలి మీ హృదయ తీరాలకు చేరాయి ".   సర్వలోకాలకు చెందిన ఆ రవి కి అస్తమయం లేనట్టే స్వరలోకాలకు చెందిన ఈ రవికీ అస్తమయం లేదు.  మరణం మరు జన్మకి శ్రీకారం అనుకుంటే మనం చెప్పే ఈ వీడ్కోలే వేడుకోలై స్వాగత వచనం  పలుకుతుంది.  అందుకు మన వేటూరి వారి వాక్యాలే సాక్ష్యం, నివాళీ కూడా ...