Tuesday, January 31, 2012

Attitude of Mahesh Babu మహేష్ బాబు ధోరణి ఇలా వుంది



నిన్ననే పని మీద సీతా రామ శాస్త్రి గారింటికి వెళ్లాను.అప్పుడే ఓ పాట పూర్తి చేసి,ఆ ఆనందం లో 
వున్నారాయన.'కొత్త బంగారు లోకం ' సినిమాని తీసిన శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం లో దిల్ రాజు గారు తీస్తున్న 'సీతమ్మ వాకిటిలో సిరిమల్లె చెట్టు' కోసం రాసిన పాట అది. ఆ సినిమాలో వెంకటేష్, మహేష్ బాబు కలిసి నటిస్తున్నారని అందరికీ తెలుసు.మా మధ్య మాటలు మొదలవుతూ ఉండగానే వచ్చేశారు దిల్ రాజు. రాసిన పాటని వినిపించారు శాస్త్రి గారు.సాధారణం గా పాట ని వినిపించినప్పుడు తన స్వంత బాణీ లో వినిపించడం శాస్త్రి గారి స్టయిల్. కానీ ఈ పాటని మాత్రం మిక్కి జే మేయర్ ఇచ్చిన tune లోనే వినిపించారాయన . అంటే ఆ tuneఅంత బాగా రిజిస్టర్అయిపోయిందన్నమాట  ఆయనలో.  దిల్ రాజు గారికి లిరిక్స్ నచ్చేశాయి. శాస్త్రి గారు రాసిన వెర్షన్స్ లో తనకు కావలిసినవి టిక్కు పెట్టుకుని 'ఇవి తీసుకుంటాను' అన్నారు. 'నీ ఇష్టం ... నీకేది నచ్చితే అదే తీసుకో ' అన్నారు శాస్త్రి గారు.'అన్నీ బావున్నాయి.కానీ నేను టిక్కు పెట్టినవి ఇంకా ఎక్కువ బావున్నాయి' అన్నారు దిల్  రాజు. 'అన్నీఇంత బాగా రావడానికి కారణం మహేష్ బాబు యాటిట్యూడ్' అన్నారు శాస్త్రి గారు. 'నిజం గా అది మాత్రం గ్రేటండీ ' అన్నారు దిల్  రాజు. ఏంటన్నట్టుచూశాను. 'ఈకథని మేం  దూకుడు,బిజినెస్ మాన్ షూటింగ్ మొదలు కాకముందు వినిపించాం అదే చెబుతూ ఇవాళ ఆ రెండూ హిట్ అయ్యాయని కథలో ఏ మార్పులూ చెయ్యకండి. నాకెలా వినిపించారో అలాగే తియ్యండి అన్నారు మహేష్ బాబు' అని వివరించారు దిల్ రాజు.
'అదే రాజూ ఆ యాటిట్యూడే నాకు తెగ నచ్చేసింది.' అన్నారు శాస్త్రి గారు. సాధారణం గా ఓ రెండు సినిమాలు క్లిక్ అయితే 'నా నుంచి జనం ఇలాటివే ఎక్స్ పెక్ట్ చేస్తారు ' అంటూ కథలో మార్పులు సూచిస్తూ వుంటారు కొంతమంది. దాంతో వెరైటీ చేద్దాం అంటే కుదరక రొటీన్ కి వచ్చేస్తారు. అన్దుకు భిన్నంగా నిజంగా ఇదే ధోరణి లో మహేష్ బాబు కొనసాగితే కథల్లో వైవిధ్యం ఉండడానికి అవకాశం వుంటుంది. ఈ లెక్కన 'సీతమ్మ వాకిటిలో సిరిమల్లె చెట్టు' సినిమా ఆ టైటిల్ లాగే బ్యూటిఫుల్ గా తయారవుతుందని అనిపిస్తోంది.  


Sunday, January 29, 2012

Nippu Title Song ....నిప్పు టైటిల్ సాంగ్ గురించి ..




                                                     వేగ వేగ వేసెయ్యెర అడుగు
                                                     వేగం అంటే గాలిని అడుగు
                                                     గాలిని తాకి మబ్బే కరుగు 
                                                     మబ్బే కరిగి చినుకై దూకు 
                                                     చినుకు చినుకు ఏరై ఉరుకు 
                                                     ఏరే కడలై నీరై పొంగు 
                                                     నీరే పొంగి నిప్పై మరుగు
                                                     నిప్పెవరంటే నన్నే అడుగు

                                             అడుగులు అడుగులు పిడుగులు అడుగులు
                                             చెడుగుడు చెడుగుడు చెడుకిక చెడుగుడు
                                             మనసుకి భయపడు మనసుల జతపడు 
                                             మనసును గెలిచిన మనిషే దేవుడు  

ఇదీ చంద్రబోస్ 'నిప్పు' సినిమా కోసం రాసిన పాట. ఇది ట్యూన్ కి రాసిన పాట. సాధారణంగా సంగీత దర్శకుడు ట్యూన్ ఇచ్చేటప్పుడు డమ్మీ లిరిక్స్ తో గాని  'తత' కారాలతో గానీ ఇస్తాడు. ఇక్కడ సంగీత దర్శకుడు తమన్ తన ట్యూన్ ని బోస్ కి 'తత' కారాలతో ఇచ్చాడు. వీటికి సాహిత్యం సమకూర్చాలి. సాహిత్యం సమకూర్చడం అంటే అక్షరాల పేర్పు కాదు. భావాలతో అక్షరాల కూర్పు.  'ఇదేమిటీ , ఎందుకూ' అని అడిగితే వివరించి ఒప్పించగలిగే నేర్పు వుండాలి రచయితకి. అప్పుడే ప్రేక్షక శ్రోతల తీర్పు బాగుంటుంది. గర్భం లో ప్రాణం పోసుకున్న జీవాన్ని ప్రపంచం లోకి పంపించడానికి తల్లి ఎంతటి ప్రసవ వేదన అనుభవిస్తుందో , గుండెల్లో రూపు దిద్దుకున్న భావాన్ని అక్షర ప్రపంచం లోకి పంపించడానికి అంతటి అంతర్మధనాన్నీ అనుభవిస్తాడు కవి.  ఈ పాట పల్లవి రాయడానికి 15 రోజులు పట్టింది చంద్రబోస్ కి. మొట్ట మొదటి కారణం ట్యూన్. 

ఈ ట్యూన్ ని 'తత' కారాల తో అనుకుంటూ చంద్రబోస్ ఇచ్చిన సాహిత్యం తో కంపేర్ చేసుకుంటూ చూడండి ... కష్టం తెలుస్తుంది. కష్టం ఎందుకూ అంటే చాలా సవాళ్లు ఉన్నాయి నేటి సినీ రచయితకి. అందులో హీరో ఇమేజ్ మొదటిది. తరువాత సంగీత దర్శకుడు, దర్శకుడు, నిర్మాత తో గల సంబంధ బాంధవ్యాలు. (అప్పుడే కథ, కథతో ఈ పాటకి గల ప్రాదాన్యత తెలుస్తుంది రచయితకి.    కట్ చేస్తే డ్యూయెట్ అండీ .. మాంఛి డ్యూయెట్ఒకటి ఇరగ దియ్యాలిక్కడ ... అని కథ చెప్పకుండా పాట రాయించుకునే రోజులు కదా) అందుకని ఎంత ఒద్దనుకున్నా ఇవన్నీ మైండ్ లో అండర్ కరెంట్ గా వర్క్ అవుట్ అవుతూనే వుంటాయి రచయితకి.

వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుంటూ - ఏకాగ్రతకి ఇవి అడ్డు రాకుండా రాయాలి. అదీ సవాల్. 

హీరో రవితేజ డైలాగ్ డెలివరీ నుంచి పెర్ఫార్మెన్స్ దాకా స్పీడు వుంటుంది. అంచేత - వేగ వేగ వేసెయ్యర అడుగు. ఇది బిగినింగు. వేగ అనడం పాత పధ్ధతి. ( పాత సినిమా పాటల్లో వేగ రారా అనే పదాలుండేవి).
వేగం అంటే బావుంటుంది కానీ ట్యూన్ కి నప్పదు.   ఆ పాత పదాలతో  ఈ జనరేషన్ ని ఒప్పించాలంటే తర్వాతి లైన్స్ తో ఆకట్టుకోవాలి. 

 సినిమా పేరు నిప్పు . హీరో క్యారెక్టర్ ని తెలిపే టైటిల్ - ఈ టైటిలూ, ఆ క్యారెక్టరూ ఈ రెండూ పల్లవిలో వర్కవుట్ అయితే జనాలకి పట్టుకుంటుంది. కాబట్టి - నిప్పెవరంటే నన్నే అడుగు. ఇది కన్ క్లూజన్ .
ఇప్పుడు బిగినింగు నుంచి కన్ క్లూజన్  కి చేరే పద్ధతిలో - వాటికి   వేసే లింకుల్లో రీజనింగ్ వుండాలి . 
వేగం కి ఉదాహరణగా గాలిని చెప్పుకుంటాం కనుక - వేగం అంటే గాలిని అడుగు. ఆ తర్వాత ఇంక ఒకటే వరస - గాలిని తాకి మబ్బే కరుగు - మబ్బే కరిగి చినుకై దూకు -చినుకు చినుకు ఏరై ఉరుకు - ఏరే కడలై నీరై పొంగు - నీరే పొంగి నిప్పై మరుగు. కంక్లూజన్ కి వచ్చేసింది.   నిప్పెవరంటే నన్నే అడుగు. 

ఇక్కడ ఎవరికైనా కలిగే డౌట్ ఏమిటంటే - నీరు పొంగితే నిప్పుని ఆర్పుతుంది కానీ నిప్పై ఎలా మరుగుతుంది ? కానీ నీటి అడుగున బడబాగ్ని వుంటే ఆ నీరు మరిగి పొంగుతుంది. ఒక విధంగా ఇది హీరో క్యారెక్టర్ ని ఎలివేట్ చేసే ఎక్స్ ప్రెషన్.

ఇక - అడుగులు అడుగులు పిడుగులు అడుగులు - చెడుగుడు చెడుగుడు చెడుకిక చెడుగుడు.

ఇలాంటి - టక టక టక టక - టైపు ట్యూన్లిస్తూ ఉంటాడు తమన్ . (కావాలంటే 'దూకుడు' టైటిల్ సాంగ్ ని గుర్తు చేసుకోండి - సమరమే సై ఇక చెలగిక చక చక - ఎడతెగ చెయ్ ఇక విలయపు తై తక). అటువంటి ట్యూన్ లకి పదాలు పేర్చినట్టు కాకుండా అర్ధవంతం గా ఉండేట్టు రాయాలి. సహ రచయితల ప్రయోగాలకు దీటుగా ,  పూర్వ కవుల ప్రయోగాలు రిపీట్ కాకుండా చెప్పాలి. 
అందుకే - అడుగులు అడుగులు పిడుగులు అడుగులు -చెడుగుడు చెడుగుడు చెడుకిక చెడుగుడు .

అలా అని తను చెడు అనుకున్నవారినందరినీ నరుక్కుంటూ పోయే సైకాలజీ వుండకూడదు హీరోకి. తన మనసుకి తాను జవాబుదారి గా వుండాలి. అటువంటి నిజాయితీపరుల తోనే తను కలిసుండాలి. అందుకే - మనసుకి భయపడు. (అటువంటి) మనసుల(తో) జతపడు. ఇటువంటి మనసుల్ని గెలిచిన మనిషే దేవుడనిపించుకుంటాడు. హీరో అంటే అంతే కదా మరి !?

ఇదీ థాట్ ప్రాసెస్. ఈ థాట్ ప్రాసెస్ లో అనుకున్నదంతా పల్లవిలో  క్లియర్ గా వచ్చేస్తే చరణాలు ఆటోమాటిక్ గా పరుగెడతాయి.  అదే జరిగిందీ పాటలో. ఈ ప్రాసెస్ ని దృష్టిలో పెట్టుకుని , సాహిత్యాన్ని దృష్టి ముందు పెట్టుకుని పాటని విని చూడండి. 

వేగ వేగ వేసేయ్యర అడుగు
వేగం అంటే గాలిని అడుగు
గాలే తాకి మబ్బే కరుగు
మబ్బే కరిగి చినుకై దూకు
చినుకు చినుకు ఏరై ఉరుకు
ఏరే కడలై నీరై పొంగు
నీరే పొంగి నిప్పై మరుగు
నిప్పవరంటే నన్నే అడుగు
అడుగులు అడుగులు పిడుగులు అడుగులు
చెడుగుడు చెడుగుడు చెడుకిక చెడుగుడు
మనసుకు భయపడు మనసుల  జతపడు
మనసుని గెలిచిన మనిషే దేవుడు

చరణం 1
ఎవర్ని ఫాలో కాను నాతో నేను పోతుంటాను
ఎవరికీ పోటి కాను నాకే నేను ఎదురొస్తాను
ఎవరితో పంతం లేదు నాతో నేను కలిసుంటాను
ఎవరికీ అర్ధం కాను నాకే నేను తెలిసుంటాను
ఎవరికీ వుండని దారుంది
వేరెవరికి చెందని తీరుంది
పరులెవరికి లొంగని ఫైరుంది
నేన్నాలా ఉంటె తప్పేముంది
ఎరగను ఎరగను ఎవరిని కెలుకుడు
కెలికితే జరుగును ఎముకల విరుగుడు
తొడగను తొడగను మనసుకి ముసుగును 
మనిషిగ మసలిన మనిషే దేవుడు

చరణం 2
ఎటైనా వెళ్తుంటాను భారం లేదు తీరం లేదు.
ఏదైనా చేస్తుంటాను ఆశే లేదు హద్దే లేదు
ఎలాగో బతికేస్తాను స్వప్నం లేదు సొంతం లేదు
ఇలాగే గడిపేస్తాను గమ్యం లేదు లక్ష్యం లేదు
నిన్నటి గురుతే లేకుంది
మరి నేటికి కొరతే లేకుంది
మరునాటికి కలతే లేకుంది
ఏదీ లేకుంటే లేనిది ఏది
ఎగసిన పిలుపుకి బదులిక వినపడు
మెరిసిన కనులకి చెలిమిక కనపడు
తెరిచిన మనసుకి మనసుతో ముడిపడు
మనిషిగ ఎదిగిన మనిషే దేవుడు 
@@@@@@@@@@

Thursday, January 26, 2012

Pl don't excuse us ... మేం ఇంతే ...

బాపు గారి పేరు పద్మ అవార్డులకు ఎంపిక కాకపోవడం ఇది ఎనిమిదో సారిట. తెలుగు వారందరూ తల్చుకుని తల్చుకుని సిగ్గుపడాల్సిన విషయం ఇది. అసలు మనకి సిగ్గుపడడానికి కూడా అర్హత ఉందా అనిపిస్తోంది. ఇప్పటి వరకు  పద్మ అవార్డులు పొందిన తెలుగు వారిలో కొందరికైనా ఆత్మ విమర్శ చేసుకునేటంత సంస్కారం వుంటే సిగ్గు అనే పదానికి కనీసం అర్ధం అయినా తెలిసుండేది. 

బాపు గారికి పద్మ అవార్డు రాకపోవటానికి అసలు కారణం ఏమై వుంటుంది ? శాంతా బయోటెక్ వర ప్రసాద రెడ్డి గారన్నట్టు 'భూపేన్ హజారికా గురించి మనకి తెలుసు. భీమ్ సేన్ జోషి గురించి తెలుసు. అలా మన బాపు గారి గురించి నార్త్ లో తెలియక పోవడానికి కారణం అక్కడి మీడియా . అక్కడ వాళ్ళ గురించి ఇక్కడ మనం ఆర్టికల్స్ మీద ఆర్టికల్స్ పరిశోధించి మరీ రాస్తాం. మనవాళ్ళ గురించి వాళ్ళు రాయరు . మనం పబ్లిసిటీ చేసుకోం. బాపు గారి గురించి చెబితే - సౌత్ లో కార్టూనిస్ట్ లు కూడా ఉన్నారా ? - అని ఆర్కే లక్ష్మణ్ అన్నారట. దీనికి కారణం కొంత వరకూ మీడియానే. '

నిజమే ... కొంత మీడియా అయితే..  మరికొంత రాజకీయ నాయకులు... తమకు కావలసిన సీట్లను, పదవులను పట్టు పట్టి సాధించుకునే తత్త్వం - మనకు గర్వకారణమైన వారిని గౌరవించుకునే సమయం వచ్చినప్పుడు ఎందుకు ఉండదు ? పక్కనే ఉన్న తమిళ రాష్ట్రం ని చూసి ఎందుకు నేర్చుకోం ? గాయని పి. లీలని మన అనీ, చనిపోయిన వెంటనే పద్మశ్రీ వచ్చిందనీ చెప్పుకుంటున్నామే ... అది ఎవరి వలన ? తమిళుల రిప్రజంటేషన్ వలన ..! మన ఎస్పీ బాలు కి పద్మభూషణ్ వచ్చింది ఎవరి వలన ?  తమిళుల రిప్రజంటేషన్ వలన ...! 

కానీ మనం !?  శ్రీరామచంద్ర ఇండియన్ ఇడల్ కి ఎంపిక కావాలని ఎస్సెమ్మెస్ ల మీద ఎస్సెమ్మెస్ లు పంపిస్తాం. అవినీతి మీద అన్నా హాజారే పిలుపుకి స్పందిస్తాం . బాపు గారి దగ్గిరకొచ్చేసరికి  అభిమానులందరం ఎందుకు తగిన విధంగా రియాక్ట్ కాలేక పోతున్నాం ?మహా ఐతే పత్రికల్లో ఓ రెండు రోజుల పాటు కార్టూన్లు వేసేసి కసి తీర్చేసుకుంటాం. వీలయితే సంపాదకీయాలు రాసేస్తాం. ఎవరైనా ఎందుకు రాయలేదంటే - ఇదేమైనా నేషనల్ ప్రోబ్లెమా - అని కొట్టి పడేస్తాం . ఆరోజుకు వెతుక్కోకుండా స్లాట్ నిండుతుందంటే ఓ ఇద్దరు ముగ్గుర్ని పిలిచి టీవీల్లో చర్చా కార్య క్రమాలు నిర్వహించేస్తాం. ఇలా బ్లాగుల్లోనూ, ఫేస్ బుక్కుల్లోనూ షేర్ చేసేసుకుని 'హమ్మయ్య మన డ్యూటీ మనం చేసేశాం' అని చేతులు దులిపేసుకుంటాం.  

మేం ఇంతే బాపు గారూ ... మీ నుంచి మేం బోలెడంత తృప్తినీ , ఆత్మానందాన్నీ పొందుతాం ... మిమ్మల్ని తెగ పొగుడుతాం ... మిమ్మల్ని గౌరవించుకునే సమయం వచ్చేసరికి మా మా లెవెల్స్ లో  భలేగా తప్పుకుంటాం ... మీకు తెలియనిదేముంది బాపూ గారూ  ...  మేం ఇంతే ... మీకు చేతనైతే దయచేసి మమ్మల్ని క్షమించకండి ...








 

Monday, January 23, 2012

E mail of Bapu




జనవరి 25 న మా టీవీ మ్యూజిక్ అవార్డుల కార్యక్రమాన్ని తొలిసారిగా నిర్వహించబోతోంది. అందులోని భాగంగా బాపు గారిని ఆహ్వానించే బాధ్యత నాపై పడింది . టిక్కెట్లు రిజర్వు చేసాం అని చెప్పగానే "అయితే ఆ ఈ టికెట్స్ ని నా ఈ మెయిల్ కి పంపండి " అన్నారు బాపు గారు. " చెప్పండి" అన్నాను. " రాసుకోండి ... బాపు అండర్ స్కోర్ రమణ " అని చెబుతున్నారు బాపు గారు ... నా చెవులు ఏదో వింటున్నాయి చేతులు రాసేసుకుంటున్నాయి. మనసు మాత్రం పిండేసినట్టు అయిపోయింది. బాపు రమణల గురించి అందరికీ అన్నీ తెలుసు. గానీ రమణ గారి పేరుని బాపు గారు తన ఈ మెయిల్లో ఇముడ్చుకుంటారని ఊహించలేక పోయాను.
ఓ సారి బాపు గారి చెబుతూ " బాపు అసలు పేరు ఏమిటో తెలుసా ?" అని అడిగాను. " ఓస్ ... ఆమాత్రం తెలీదనుకున్నావా ... సత్తిరాజు లక్ష్మినారాయణ " అన్నారు మా ఫ్రెండ్స్. " మరదే ... అదెవరైనా చెప్తారు. ఆయన అసలు పేరు ... ముళ్ళపూడి వెంకట రమణ " అన్నాను. మంచి ప్రశంసలు లభించాయి ఆ చమత్కారానికి.
ఈ సందర్భం గా ఓ మాట చెప్పుకోవాలి. రెండేళ్ళ క్రితం వరకూ ... గత పదేళ్ళు గా బాపు రమణలకి పద్మశ్రీ ఇవ్వాలని రిప్రజంటేషన్ లు పెడుతూ వచ్చాను. విసుగొచ్చేసింది. ఇప్పుడు పద్మశ్రీ ఇచ్చినా అది తక్కువే . పైగా రమణ గారు లేకుండా ... ఈ విషయం లో మన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మంచి పనే చేసింది. రఘుపతి వెంకయ్య అవార్డుని ఇద్దరికీ కలిపి ఒకేసారి ఇచ్చింది. ఈ సంవత్సరం పంపిన రికమండేషన్ లలో బాపు గారి పేరు వుందట. రేపు రాబోయే 25 మధ్యాహ్నం కల్లా తెలిసిపోతుంది అందరికీ. బాపు గారికి పద్మశ్రీ కాకుండా పద్మ భూషణ్ రావాలని కోరుకుందాం .

Sunday, January 22, 2012

Status of Lyric writers





  ' శ్రీరామరాజ్యం'లో పాటలు విన్నాక ఓ ఫ్రెండు అడిగాడు - 'సీతా రామ చరితం ' పాటలో 'దశరథుని కోడలికా ధర్మపరీక్ష ' అని ఎందుకు రాశారంటావ్- అని. చాలా మంచి ప్రశ్న అది . ఇక్ష్వాకుల వంశం లో అందరూ ధర్మానికి కట్టుబడినవారే. తను పుత్రశోకంతో మరణిస్తానని తెలుసు దశరథునికి. అది శ్రవణకుమారుని తలిదండ్రుల శాపం. రాముణ్ని అడవులకు పంపితే తన ప్రాణం పోతుందని తెలిసి మరీ ధర్మానికి కట్టుబడినది దశరథుడే. అంచేతే ఆ వాక్యం.

ఎందుకు ఈ పరీక్ష ఎవ్వరికీ పరీక్ష
శ్రీరాముని భార్యకా శీలపరీక్ష
అయోనిజకి  అవనిజకా అగ్ని పరీక్ష
దశరథుని కోడలికా ధర్మ పరీక్ష
జనకుని కూతురికా అనుమాన పరీక్ష
రాముని ప్రాణానికా జానకి దేహానికా
సూర్యుని వంశానికా ఈ లోకం నోటికా

ఇలాటిదే మరో అద్భుత వాక్యం - 'జగదానంద కారకా' పాటలో .... !

రాజ మకుటమే వొసగెలే నవరత్న కాంతి నీరాజనం
సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం

రాజ మకుటం గా పెట్టబోయే కిరీటం లోని నవరత్నాలన్నీతమ కాంతులతో నీరాజనం పడుతున్నాయట. అలాగే సూర్య వంశ సింహాసనం పులకించిపోయి తనే అభివందనం చేసిందట. ఏ రాజైనా సింహాసనానికి అభివందనం చేసి కూర్చుంటాడు. కానీ రాముడికి సూర్య వంశ సింహాసనం పులకించి పోయి తనే అభివందనం చేసిందట.
ఇంకా ఇలాంటి గొప్ప గొప్ప ఎక్స్ ప్రెషన్లతో పాటలు రాశాడు జొన్నవిత్తుల 'శ్రీరామ రాజ్యం'లో.
ఇక్కడ చెప్పుకోవలసిందేమిటంటే 'శ్రీరామ రాజ్యం' లో జొన్నవిత్తుల అన్ని పాటలూ రాశాడు. సింగిల్ కార్డ్ రైటర్. అయినా పబ్లిసిటీ లోగోలో ఆయన పేరు లేదు. అంతే కాదు వాల్ పోస్టర్స్ లో కూడా ఎక్కడా
ఆయన పేరు కనబడదు.
ఇదీ మన వాళ్ళు లిరిక్ రైటర్స్ కి ఇచ్చే గౌరవం. ఇదొక ఉదాహరణ మాత్రమే.
కొన్ని ఆడియో ఫంక్షన్స్ లో ఆ సినిమాకి పాటలు రాసే గీత రచయితలు కనబడరు. కారణం వారికి ఆహ్వానం వుండదు. ఒకవేళ సదరు గీత రచయితలు వచ్చినా వారిని స్టేజ్ మీదకు పిలవరు. ఒకవేళ పిలిచినా వారి పని చప్పట్లు కొట్టడం, (కుదిర్తే) క్యాసెట్ కవర్లు పట్టుకుని ఫోటోల్లో కనబడడం ... అంతకు మించి మాట్లాడే చాన్స్ వుండదు. తెలుగు రాని హీరోయిన్లను మాట్లాడమని బలవంతం చేస్తారు కానీ రచయితలకి ఇవ్వాల్సిన  గౌరవం  ఇవ్వరు. అదీ సంగతి.
మళ్ళీ ఇందులో కొంతమంది ఎక్సెప్షన్. కృష్ణవంశీ సినిమా ఆడియో ఫంక్షన్స్ లో రైటర్స్ కి గౌరవం వుంటుంది. వై వీ యస్ చౌదరి దారే వేరు. సీడీ కవర్ మీద రైటర్ ఫోటో వేస్తాడు. వీలయితే రైటర్ కి ఓ బిరుదు కూడా ఇచ్చేస్తాడు. 'సీతయ్య' ఆడియో ఫంక్షన్ లో చంద్రబోస్ కి 'సాహిత్య చిచ్చర పిడుగు ' అనే బిరుదు ఇచ్చేసాడు. ఈ మధ్యనే జరిగిన  'నిప్పు' ఆడియో ఫంక్షన్ లో ఆ సినిమాకి 6 గురు పాటలు రాస్తే ఆ ఆరుగురినీ ( చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరాం, వనమాలి, భాస్కరభట్ల, విశ్వ) స్టేజ్ మీదికి పిలిపించి మాట్లాడే అవకాశం ఇచ్చాడు. అంతే కాదు సీడీ కవర్ మీద ఆ ఆరుగురి ఫోటోలూ, వారి పేర్లూ వచ్చేట్టు చూశాడు. అది కాక  ఫంక్షన్ లో ఆ ఆరుగురి ఫొటోలతో స్పెషల్ గా ఓ హోర్దింగే పెట్టాడు కూడా. 'కవి గాయక నట వైతాళిక ' అన్నారు పెద్దలు. అంటే ప్రాదాన్యతా క్రమం లో కవి ముందుండాలి. కవి, రచయిత వీళ్ళ విలువ తెలిసున్నది ఇవాళ కొంతమందికి మాత్రమే.

















Saturday, January 21, 2012

Puri Jagan's version - Perversion (an opinion on Business man)




Puri Jagan's version - Perversion (opinion on Business man)

పెర్వెర్టేడ్ జీనియస్ లని కొందరుంటారు . ఇందుకు సినీ రంగం మినహాయింపేం కాదు. ఈ రంగం లోని పెర్వెర్టేడ్ జీనియస్ లు  - వాళ్ళ పైత్యాన్ని కసిగా మార్చుకుని సినిమాలు తీసేసి జనాల మీదకి వదుల్తూ వుంటారు.వీళ్ళలో కొందరు ఉగ్రవాదులు గా, మరికొందరు పిచ్చివాళ్ళు గా మారే అవకాశం వుంది.   ఈ 
 రెండు స్లాట్ లకి మధ్య మరో కొత్త స్లాట్ ని తనకు తాను గా క్రియేట్ చేసుకున్నాడు పూరి జగన్నాథ్- బిజినెస్ మాన్- ద్వారా .

పూరి జగన్ టేకింగ్ స్పీడు గా జనాలకి నచ్చేట్టు వుంటుంది. డైలాగులు పవర్ ఫుల్ గా వుంటాయి. అందుకని ఏం చెబితే దానికి కన్విన్స్ అయిపోతారనుకుంటే ఎలా ? మచ్చుకి ఓ రెండు మూడు చూద్దాం ..

" డిస్కవరీ చానెల్ లో పులి జింకని వేటాడడం చూస్తూ జింక బ్రతకాలని ప్రార్ధన చేస్తాం. జింక తప్పించుకోగానే టీవీ కట్టేసి కోడినివండుకుని బిరియాని తింటాం . నిజానికి అది జింక మీద ప్రేమ కాదు పులి మీద కోపం. దాన్ని ఏం చెయ్యలేక (ఇక్కడ పూరి వాడిన మాట వేరు గా వుంటుంది) అది ఓడిపోతే చూడాలనుకుంటాం".

జింక తప్పించుకుంటే బావుంటుందని కోరుకోవడానికి కారణం పులి క్రౌర్యం .. దాని పశుబలం. జాలి జింక నిస్సహాయత గురించి. అక్కడ మనకి కలిగే భావనకి కారణం మనలోని కరుణ. అంతేగాని మన చేతకానితనం కాదు. మనం గనక అడవిలో వుండి వుంటే జింక ని కాపాడడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తాం. అది మన శక్తికి మించిన పని అయితే తెలివితేటలతో మరో మార్గం కనిపెడతాం. కొరివి బాణాలతో , డప్పులతో పులిని బెదరగొట్టి జింకల్ని కాపాడుకున్నకోయవాళ్ళ గురించి విశాఖ పట్నం ఏజెన్సీ ఏరియాల్లో తిరిగిన పూరి జగన్ కి తెలియదా ? అంతే గానీ టీవీ చూస్తున్నవాళ్ళు టీవీల్లోకి దూరి పోయి పులిని చంపెయ్యగలరా ? టీవి కట్టేసిన తర్వాత కోడి ని వండుకుని తినడం కేవలం కసితో అన్నమాటే. నిజానికి అటువంటి హింసాత్మక దృశ్యాలు చూసిన తరువాత నాన్ వెజిటేరియన్ ముట్టని వాళ్ళు నాన్ వెజిటేరియన్లలో కూడా వుంటారు. జీవితం లో దెబ్బతిని పెర్వెర్షన్ లోకి వెళ్ళిన వాళ్ళకే బ్రెయిన్ ఇలా విపరీత ధోరణిలో పనిచేస్తూ వుంటుంది.

 ఇంకో డైలాగ్ 

" మీ గురించి కలలు కనండి . ప్రపంచం గురించి కలలు కనకండి "

ఇదెంత తప్పుడు సలహా ? కుక్క కాటుకి మందు కనిపెట్టిన లూయీ పాశ్చర్, బల్బ్ ని కనుక్కున్న ఎడిసన్ దగ్గర్నుంచి ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి కృషి చేస్తున్న వాళ్ళంతా ప్రపంచం గురించి కలలు కన్నవాళ్ళు కాదా ? హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో మునిగి పోకుండా ప్లాన్ చేసిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య దగ్గిరనుంచి నిన్న మొన్నటి అబ్దుల్ కలాం వరకు ప్రపంచం గురించి కలలు కన్నవాళ్ళు కాదా ? ఇవాళ మనం అనుభవిస్తున్నసుఖాలు సౌకర్యాలు ఎంతమంది కలల ఫలితం ? వాళ్ళంతా పిచ్చివాళ్ళా ? పవర్ ఫుల్ మీడియం లో రెస్పాన్సిబుల్ పొజిషన్ లో వున్నవాళ్ళు రాయాల్సిన డైలాగేనా ఇది ? 

చిట్ట చివర్న సందేశం పేరిట మరో డైలాగు ...
 
" ఎవరేం చెప్పినా వినొద్దు  ( మరి ఈయన  మాటెందుకు వినాలి ?) 
ముఖ్యం గా మనుషులమాటనమ్మొద్దు(ఈయన మనిషి కాదా ....? ) "

పూరి జగన్ ని అతని స్నేహితుడు (గుడ్డిగా నమ్మినందుకు గాను) 30 కోట్లకు  ముంచి పోయాడు ..నిజం గా చాలా ఘోరం . క్షమించ రాని నేరం . అంత దెబ్బతిని పడి లేస్తున్న జగన్ ని సానుభూతి తో చూడాల్సిందే. అంత మాత్రం చేత ఆ కసిని ఆయన కోట్లాది తెలుగు ప్రజల మీద తీర్చుకుంటాననడం ఎంత వరకు న్యాయం ? అందుకు మహేష్ బాబు గ్లామర్ ని, యాక్టింగ్ టాలెంట్ ని, కెరీర్ ని ఫణంగా పెట్టాలనుకోవడం ఎంత వరకు కరెక్ట్ ? మహేష్ బాబు తో పలికించిన బూతులకి, తిట్లకి మహేష్ బాబు అభిమానులే కాదు తెలుగు ప్రజలు కూడా పూరి జగన్ని క్షమించ(లే)రు.

అంతెందుకు ... మాఫియా లీడర్స్ ని, వాళ్ళ యాక్టివిటీస్ ని రాబిన్ హుడ్ పాలసీ లా గ్లోరిఫై చేయాలనుకోవడం అనే థాట్ ని ప్రమోట్ చేసినందుకు  సుమోటో కింద  కేసు బుక్ చేస్తే ఏమవుతుంది ?

దీనికి బదులు 30 కోట్లకి మునిగిపోయిన తన కథనే తీసుకుని సినిమా గా తీసి  'ఇది మీ పూరి జగన్ రియల్ స్టోరీ' అని చివర్న చెప్పి వుంటే ప్రజల్లో అతనికి వున్న క్రేజ్ కి మూడు రోజుల్లో 30 కోట్లు వచ్చి ఉండేవి కదా  . ఇవాళ అతను పోగొట్టుకున్న గుడ్ విల్ విలువ 30 కోట్లకు పైనే... కాదంటారా  ?