Saturday, September 29, 2012

‘నిన్నలేని అందమేదో’ పాట ఎవరు రాశారు ?





ఈ మధ్య నా ఫేస్ బుక్ లో నిన్నలేని అందమేదో పాట ఎవరు రాశారు అనే టాపిక్ మీద ఓ చర్చ వచ్చింది.  సి.నారాయణ రెడ్డి అని సమాధానమిచ్చాను.
అయినప్పటికీ తృప్తి పడలేదా సంగీత ప్రియులు. దాశరథి గారి ముద్ర కనిపిస్తోందన్నారు. పైగా ఈ మధ్య టీవీ చానల్స్ లో అలా చూపించారన్నారు.ఇక లాభం లేదని, ఇది నా కర్తవ్యం అనుకుని ఇలా చేశాను :
" పూజా ఫలం లోని నిన్న లేని అందమేదో పాటను గురించిన అభిప్రాయాలూ . చర్చలూ చూశాక నిరూపించాలనిపించింది. సినారె గారు రాసిన పాటలో  ఏముంది .. నా మాటలో ఏముంది పుస్తకాన్ని (నడుం నొప్పి వల్ల కొంచెం కష్టం అయినా) నిచ్చెనేసుకుని ఎక్కి పైనున్న నా లైబ్రరీ నుంచి తీశాను.  అందులో పూజాఫలం లో తను రాసిన పాటల గురించి నాలుగు పేజీలలో ఆయన వివరించారు. వాటిని  స్కాన్ చేసి అందులో నిన్న లేని అందమేదో పాటకు సంబంధించిన విషయాలను విడిగా ఫొటో షాప్ లో కలిపి సింగిల్ పేజి గా చేసి మీ ముందుంచుతున్నాను. ఇక ఈ పాట రచయిత విషయంలో ఎవరికీ ఏ సందేహమూ వుండదనుకుంటాను.ఈ బుక్ సినారె గారు రాస్తున్నప్పుడు ఆయనకు ఓ రిఫరెన్స్ లా ఉపయోగపడడం నా అదృష్టం. ఆయన తన ముందు మాటలో అది పేర్కొన్నారు. అందుకు సంబంధించిన సాక్ష్యాన్ని కూడా (నాకు చెందినంత వరకూ ఫొటో షాప్ లో కలుపుకుంటూ) మరో పేజీగా జత చేస్తున్నాను.
ఇవిలా వుండగా ఈ పాటలో దాశరథి గారి ముద్ర వుందనడం నన్ను ఆశ్చర్యానికి గురి చేసిన విషయం.
          తెలియ రాని రాగమేదో తీగ సాగె నెందుకో   ( నిన్న లేని అందమేదో పాటలో)
          అనురాగ మధు ధారయై సాగనీ (తోటలో నా రాజు పాటలో)
అక్కడ రాగం తీగ సాగడం, ఇక్కడ అనురాగం ధారగా సాగడం ఇదీ నారాయణ రెడ్డి గారి ముద్ర.
ఇక టీవీ చానల్స్ లో ఇది దాశరథి గారి పాటగా చెప్పారంటే అందుకు కారణం - సదరు చానల్స్ వారికి తెలుగు సినిమా పాటల క్రెడిట్స్ విషయంలో వుండవలసినంత శ్రద్ధాసక్తులు, నిజాయితీ లేకపోవడమే."
ఇది నా బ్లాగు లొ కూడా వుంటే మరింత ఉపయోగకరంగా వుంటుందని పోస్ట్ చేస్తున్నాను.



Saturday, September 22, 2012

బెస్ట్ జర్నలిస్ట్ అవార్డ్

సంతోషం సినీ వార పత్రిక ఇంతవరకూ ఫిలిం అవార్డులను టాలీవుడ్ కి మాత్రమే పరిమితం చేస్తూ ఇస్తూ వచ్చింది. ఈసారి తన పదవ వార్షికోత్సవం సందర్భంగా ఆ అవార్డులను మొత్తం సౌత్ ఇండియాకి విస్తరించింది. 12 ఆగస్ట్  2012న జరిగిన ఆ కార్యక్రమం లో నాకు బెస్ట్ జర్నలిస్ట్ అవార్డ్ ని ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని మా టీవీ వారు 19  ఆగస్ట్ 2012 వినాయక చవితి రోజు ప్రసారం చేశారు. మా టీవీ ఎడిటర్ కె.యస్. సహకారం తో, మా టీవీ సౌజన్యం తో నాకు సంబంధించిన క్లిప్పింగ్ ని జత పరుస్తున్నాను.  క్లిక్ చేసి చూడండి.

బెస్ట్ జర్నలిస్ట్ అవార్డ్

Sunday, September 2, 2012

My sweet Memories గుర్తుకొచ్చాయి





హైదరాబాద్ దూర దర్శన్ వారు వివిధ రంగాలలోని ప్రముఖుల్ని ’హలో సప్తగిరి’ కార్యక్రమంలో పరిచయం చేస్తూ వుంటారు. ఆ క్రమంలో మొన్న ఆగస్ట్ 30 న నన్ను పిలిచారు. దీనికి నేను పని చేస్తున్న మా టీవీ యాజమాన్యం సహృదయంతో అనుమతినిచ్చారు. అది అరగంట ప్రోగ్రామ్. పైగా లైవ్. అలవాటే గనుక సులువుగానే చేసేశాను. ప్రోగ్రామ్ అయిపోయాక అభినందనలు రావడం కూడా మామూలే. కానీ ఈ సారి అనుభూతి మాత్రం ప్రత్యేకమైనది. చిన్నప్పుడు నాతో స్కూల్లో చదువుకున్న బాల్యమిత్రులందరూ రియాక్ట్ అయారు. గాలికి విసిరేసినట్టుగా ఒక్కొక్కరూ ఒక్కో ఊరు, ఒక్కో రాష్ట్రంలో వున్నాం. వారందరూ ఫోన్లు చేసి చిన్ననాటి సంగతులు మాట్లాడుతూ వుంటే మనసు 40 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. ఒక్కసారి నన్ను నేను చెక్ చేసుకుంటే - నేను అప్పుడెలా వున్నానో - ఇప్పుడు కూడా అలాగే - అంత పవిత్రంగానే వున్నాననిపించింది. ఆ ప్రోగ్రామ్ లో ఫొటోలు తీయకపోయినా వున్న టెక్నికల్ నాలెడ్జ్ సహాయంతో కాప్చర్ చేసి, జెపెగ్ లోకి మార్చి మరిచిపోలేని గుర్తు కాబట్టి ఇక్కడ జత చేస్తున్నాను వాటితో పాటు ఆ ఇంటర్యూ వీడియో ని నాలుగు భాగాలుగా చేసి మిత్రులు సూర్యప్రకాశరావు గారు పంపిన లింకుని జతపరుస్తున్నాను. చూసి ఎలా వుందో చెప్పండి.

 Doordharshan interviews Haasam Raja!