ఇదివరకు ఏదైనా ఒక పాటని ఇన్ స్పిరేషన్ గా తీసుకుంటే ఆ ఒరిజినల్ సాంగ్ తెలియడానికి సంవత్సరాలు పట్టేది. గ్లోబలైజేషన్ పుణ్యమా అని ఇవాళ అందరికీ అన్నీ త్వరగానే తెలిసిపోతున్నాయి. అదీ కాక నేటి యువత కూడా మ్యూజిక్ పట్ల అప్ దేట్ గానే ఉంటున్నారు. ఒక అడాప్టేషన్ వినగానే ఒరిజినల్ ని క్షణాల మీద చెప్పేస్తున్నారు. ఐనా సరే కొన్ని రికార్డ్ కోసమైనా చెప్పక తప్పదు. పాప్ గాయని షకీరా పాడిన ' వేరెవర్ వెనెవర్ ' సాంగ్ చాల పాపులర్. దాన్ని ' నువ్వే నువ్వే ' సినిమాలో 'ఐయామ్ వెరీ సారీ ' పాట కోసం చాలా బాగా అడాప్ట్ చేశారు. ఎంత బాగా అడాప్ట్ చేశారో జతపరిచిన క్లిప్పింగ్స్ చూసి తెలుసుకోండి.
Monday, July 13, 2009
Saturday, July 11, 2009
' రావె రాధా రాణీ రావే ' పాట గురించి ...
పంతొమ్మిది వందల అరవై లో వచ్చిన 'శాంతి నివాసం ' సినిమాలో నాలుగు పాటలకి ట్యూన్ లు వేరే భాష నుండి తీసుకున్నారని ఇదివరకు చెప్పుకున్నాం . అందుకు ఉదాహరణ గా ' చక్కని దానా చిక్కని దానా ' పాట గురించి కూడా చెప్పుకున్నాం . అలాగే ఆ సినిమాలోని ఇంకో పాట ' రావే రాధా రాణీ రావే ' గురించి ఇప్పుడు ... ఈ పాటకి ఇప్పటికీ తిరుగులేదు. అంత హిట్ అయిందీ పాట . ఐతే అంతకు ఓ సంవత్సరం ముందు అంటే యాభై తొమ్మిది లో ' ఉజాలా' అనే సినిమా వచ్చింది . షమ్మీ కపూర్ , మాలాసిన్హా హీరో హీరోయిన్ లు . ఆ సినిమాలో సంగీత దర్శకులు శంకర్ - జైకిషన్ స్వరపరిచిన ' జూమ్ త మౌసమ్ మస్త్ మహీనా ' పాట చాలా పెద్ద హిట్ . అంతే కాదు ఆ పాత - గాయకుడు మన్నాడే కి ఓ వెరైటీ కూడా . ఆ పాట ట్యూన్ ని ఇంటర్లూడ్స్ తో సహా యధాతధం గా అనుకరించారు - ' రావే రాధా రాణీ రావే ' పాట కి. అందుకే ఆ హిందీ పాటనీ , మన తెలుగు పాట నీ కలిపి మరీ జత చేశాం. చూసి ఆనందించండి .
Friday, July 10, 2009
' ఖుషీ ఖుషీ గా నవ్వుతూ ' పాట గురించి ...
అన్నపూర్ణా వారి 'ఇద్దరు మిత్రులు ' లో 'ఖుషీ ఖుషీ గా నవ్వుతూ ' పాట అందరికీ గుర్తుండే వుంటుంది. ఆ పాట ట్యూన్ ని ' టామ్ డూలీ ' ఆల్బమ్ నుండి తీసుకున్నారు. ఐతే పల్లవి వరకు మాత్రమే తీసుకున్నారు. చరణాలన్నీ మన ట్యూన్ లే . ఫల్లవి వరకు ఉన్న రెండు ట్యూన్ లనీ కంపేర్ చేసుకుని చూడండి.
Tuesday, July 7, 2009
' వస్తా నీ వెనక ' పాట వెనక లింకులు
మహేష్ బాబు నటించిన ' నానీ ' లో 'వస్తా నీ వెనక ' పాట రెహమాన్ హిట్స్ లో ఒకటి. ఐతే ఈ పాట తమిళ వెర్షన్ కి మాత్రం ఓ తమాషా చేశారు. అంతకు కొన్నేళ్ళ క్రితం ఎంజీయార్, బి.సరోజా దేవి నటించిన 'పడగోట్టి ' అనే చిత్రం విడుదలైంది. అందులోని ' తొట్టాల్ పూమలరుం ' పాట ఆ రోజుల్లోనే కాదు నేటికీ తమిళ నాట పెద్ద హిట్ . ఆ పాట పల్లవిని తీసుకున్నారు. ఆ పల్లవి ఎలా వుంటుందంటే - తొట్టాల్ పూమలరుమ్ - తొడామల్ నాన్ మలర్దేన్ - సుట్టాల్ పొణ్ణ్ శివక్కుమ్ - సుడామల్ కణ్ శివన్ దేన్ - కంగల్ పడామల్ - కైగల్ తొడామల్ - కాదల్ వరువదిల్లై - నేరిల్ వరామల్ - నెంజిల్ తరామల్ - ఆశై విడువదిల్లై ' . బాగా గమనించి వినండి. 'నానీ ' తమిళ వెర్షన్ (సినిమా పేరు న్యూ ) పాటకి , ' పడగోట్టి ' లోని హిట్ సాంగ్ కి పల్లవి వరకూ సాహిత్యం ఒకటే. కానీ ఈ తమాషాల పర్వం ఇక్కడితో ఆగలేదు. 'ఫడగోట్టి ' లోని ' తొట్టాల్ పూమలరుం ' ట్యూన్ ని మనవాళ్ళు 'హాయ్ ' సినిమా లోని 'తంతే పడిపోయా 'అఏ పాట కోసం తీసుకున్నారు. జతపరిచిన క్లిప్పింగ్ లని చూడండోసారి మీకే అర్ధమైపోతుంది.
Monday, July 6, 2009
' శాంతినివాసం ' లో ' చక్కనిదానా చిక్కనిదానా ' పాట గురించి ...
శాంతినివాసం ' సినిమా పంథొమ్మిది వందల అరవై లో వచ్చింది . అందులోని పాటలలో ఓ నాలుగింటికి మాతృకలు వేరే భాషలో ఉన్నాయి . ఒకపాటకైతే రెండు మాతృకలున్నాయి. పిఠాపురం నాగేశ్వర రావు , స్వర్ణలత పాడగా రేలంగి, సురభి బాలసరస్వతి పై చిత్రీకరించిన ' చక్కనిదానా చిక్కనిదానా ఇంకా అలుకేనా ' అనే పాటకు సరైన ఒరిగినల్ గా - ' దిల్ దెకే దేఖో ' చిత్రం కోసం ఉషాఖన్నా స్వరపరచగా షమ్మీకపూర్ పై చిత్రీకరించిన ' దిల్ దేకే దేఖో ' టైటిల్ సాంగ్ ని చెప్పుకోవాలి. ఇది పంథొమ్మిది వందల యాభై తొమ్మిది లో వచ్చింది. ఐతే దీనికి ఇన్ స్పిరేషన్ గా ఓ పాటుంది. పంథొమ్మిది వందల యాభై ఎనిమిది లో మాక్ గ్వయిర్ సిస్టర్స్ (వీరు ముగ్గురు) పాడగా - విడుదలైన కొద్ది రోజుల్లోనే వన్ మిలియన్ రికార్డులు అమ్ముడు పోయిన ' షుగర్ ఇన్ ద మార్నింగ్, షుగర్ ఇన్ ద ఈవినింగ్ ' అనే 'షుగర్ టైమ్స్ ' పాట శ్రీమతి ఉషాఖన్నా కు ఇన్ స్పిరేషన్ . ఆ పాట పల్లవిని మాత్రం తీసుకొని, స్పీడు పెంచి, చరణాలకు ఇంటర్లూడ్ లకు సెపరేట్ ట్యూన్ ని 'దిల్ దేకే దేఖో 'పాటకు చేసిందామె. ఆ ట్యూన్ నే యధాతధం గా మనం 'శాంతినివాసం' లోని 'చక్కనిదానా ' పాటకి వాడేసుకున్నాం .
Sunday, July 5, 2009
ధరణికి గిరి భారమా పాట గురించి ...
చాలా కాలం క్రితం ' మంచి మనసుకు మంచి రోజులు ' అనే సినిమా వచ్చింది. అలా అనే కంటే ' ధరణికి గిరి భారమా ' అనే పాట ఉన్న సినిమా వచ్చింది అంటే ఎవరికైనా సరే వెంటనే అర్ధం అవుతుంది - అంత హిట్ అయింది ఆ పాట . ఆ ' మంచి మనసుకు మంచి రోజులు ' సినిమాకి సంగీతం ఘంటసాల . ఐతే ఈ పాట పల్లవి కి మాత్రం ట్యూన్ ని కె.వి. మహదేవన్ స్వరపరిచిన ఓ తమిళ పాట నుంచి తీసుకున్నారు. అసలేం జరిగిందంటే - తమిళం లో అంతకుముందు వచ్చిన ' తై పిరందాల్ వై పిరక్కుమ్ ' ఆధారంగా ' మంచి మనసుకు మంచి రోజులు ' సినిమాని తీశారు . ఆ ' తై పిరందాల్ ' లోని ' మణ్ణ్ క్క్ పరమ్ భారమా ' పాట ని పాడుకోని తల్లి ఆ రోజుల్లో తమిళ నాట లేదనే చెప్పాలి. అంచేత ఆ పాట ట్యూన్ ని పల్లవి వరకు నిర్మాతల కోరిక మేరకు అడాప్ట్ చెయ్యక తప్పలేదు ఘంటసాల గారికి. ఇక్కడ ఇంకో కొస మెరుపు ఏమిటంటే తెలుగు పాట ' ధరణి కి గిరి భారమా ' లో తల్లిగా నటించింది - ఒకనాటి హీరోయిన్ జయచిత్ర తల్లి అమ్మాజీ . ఈమె రోజులు మారాయి లో అక్కినేని కి చెల్లెలు గానూ , దైవబలం లో ఎన్టీయార్ కి హీరోయిన్ గానూ నటించింది.
Thursday, July 2, 2009
' వయస్సునామి ' పాట వెనుక రేగిన సునామి
' కంత్రీ ' సినిమాలో 'వయస్సునామి ' అనే పాటొకటుంది. ఈ పాటకి ట్యూన్ ని మణిశర్మ తమిళం నుంచి తీసుకున్నాడు. అంటే కాపీ కొట్టాడని కాదు. తెలుగులో హిట్టయిన ' పోకిరి ' సినిమాని తమిళంలో ' పోక్కిరి 'గా తీసినప్పుడు ఆ సినిమాకి సంగీత దర్శకుడి గా మన మణిశర్మని పెట్టుకున్నారు. అందులో ఆయన స్వరపరిచిన 'వసంతముళ్ళై ' అనే పాట తమిళనాట విపరీతంగా హిట్టయింది. ఆ పాట ట్యూన్ నే 'వయస్సునామి ' పాటకి వాడుకున్నాడు మణిశర్మ ... అంటే తన ట్యూన్ నే తను ఉపయోగించుకున్నాడన్నమాట . ఇదిలా ఉండగా దీనికి చేరిన మరో పిట్ట కథ ఏమిటంటే - యాభై ఏడులో శివాజీ గణేశన్ నటించిన 'సారంగధర ' విడుదలైంది. అందులో 'వసంతముళ్ళై ' అనే పల్లవితో మొదలయ్యే పాటొకటుంది.ఆ పాట ట్యూన్ ని ' పోక్కిరి ' లోని 'వసంతముళ్ళై ' పాట మధ్యలో మైక్ నుంచి వచ్చేట్టు సరదాగా ప్లాన్ చేసి పాడించుకొని చిత్రీకరించారు.ఈ సంగతి తెలియని కొందరు 'కంత్రీ ' లోని 'వయస్సునామి ' పాటకి ట్యూన్ ని పాత తమిళ చిత్రం నుండి మణిశర్మ కొట్టేశాడు అనే వార్తని ప్రచారం చేశారు. సో అదీ సంగతి. నిజానిజాలు తెలుసుకోడానికి ఆ క్లిప్పింగ్లు దిగువనే ఉన్నాయి. క్లిక్ చేసి చూడండోసారి.
Subscribe to:
Posts (Atom)