Thursday, September 4, 2014

జ్ఞాపకాలు .. సంతకాలు .. మధ్య ..!!




మొన్నామధ్య అన్నిటికీ తానే అయిన రమణ గారు
నిన్నీమధ్య తనలో సగమైన తన భార్య
ఇప్పటికిప్పుడు మన మధ్య నుంచి ఏకంగా తనే .... !!!

అందుకే అన్నారొకాయన -
బాపు వెంట్ టు మీట్ హిజ్ బెటర్ హాఫ్
అండ్ బెస్ట్ హాఫ్ - అని
మరొకాయన
బాపు మరణించలేదు ... రమణించారు
అని.

బాపు - రమణ ఓ ద్వంద్వ సమాసం ..
కాదు
నిర్ద్వంద్వ సమాసం,
ఇంకా లోతుగా చెప్పాలంటే
ఓ ద్వ్యర్ధి కావ్యం ...
మన సాహిత్యంలో
రాఘవ పాండవీయం ద్వ్యర్ధి కావ్యం
దాన్ని ఓ వైపు నుంచి చదివితే రామాయణం
మరో వైపు నుంచి చదివితే భారతం
అలా
తెలుగుదనాన్ని, తెలుగు ధనాన్ని
బొమ్మల్లో చూస్తే బాపు
అక్షరాలుగా చదివితే రమణ
నిజానికి బాపు అసలు పేరు
సత్తిరాజు లక్ష్మీనారాయణ కాదు...
ముళ్ళపూడి వెంకట రమణ ...

భగవంతుని దయవల్ల, ఊహ ( సినిమా హీరో శ్రీకాంత్ భార్య కాదు) తెలిసినప్పట్నించీ ఆరాధించి అభిమానించే బాపు రమణల గారితో పరిచయం, ఫోన్ చేసి మాట్లాడగల చనువు, కలిసి కాస్సేపు ముచ్చటించుకోగల అదృష్టం, ఏదైనా  అడగ గలిగే సాహసం కలిగాయి. ఓ సారి ఆయనకిష్టం లేని ఓప్రపోజల్ తీసుకొస్తే 'నన్ను మీ ఫ్రెండ్ అనుకుంటే దయచేసి బలవంతం చెయ్యకండి' అన్నారు బాపు. ఆయన తిరస్కరించారన్న బాధ కన్నా ఫ్రెండ్ అన్నందుకు జన్మ తరించిపోయింది అనుకున్నాను. ఇంకోసారి బాపు గారు మరో విషయంలో కోపంగా వున్నారని తెలిసి కూడా తప్పనిసరి పరిస్థితిలో రమణ గారికి ఫోన్ చేశాను. 'హీ ఈజ్ బైటింగ్ హిజ్ ఓన్ టీత్ ( వాడి పళ్ళు వాడే కొరుక్కుంటున్నాడు) . కాస్సేపాగితే మామూలై పోతాడు. మీరు ఫోన్ చేశారని చెప్తాలెండి' అన్నారు రమణ గారు చిన్నగా నవ్వుతూ.

మరోసారి - ఈ టీవీలో బాపు రమణల అపూర్వ సృష్టి ' భాగవతం' మొదలైంది. ఫస్ట్ ఎపిసోడ్ కే పులకించిపోయాను. ఉండబట్టలేక ఫోన్ చేశాను. ఆయన సంగతి అందరికీ తెలిసినదేగా ...  'థాంక్సండీ ...వుంటానండీ ... అబ్బే అంతలేదండీ... అంతా ఆ దేవుడే చేయించుకుంటున్నాడండీ.. మన్దేముందండీ' అంటూ వీలైనంత త్వరగా పొగడ్తలనుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నారాయన. 'సార్సార్ ... ఒక్క నిముషం.. ప్లీజ్' అంటూ ఆయన్ని ఆపి ' టైటిల్స్ వస్తుంటే జనం సాష్టాంగ నమస్కారాలు చేసేశారండీ' అన్నాను. 'అయ్యో .. అదేంటండీ' అన్నారు బాపు. 'దర్శకత్వం బాపు అని వచ్చాక - దర్శక పర్యవేక్షణ సుమన్ - అని రాకుండా దేవుడికి మొక్కేసుకున్నారటండీ' అని అన్నాను (అప్పట్లో ఎంత గొప్ప వ్యక్తి దర్శకత్వం వహించినా ఆ తర్వాత దర్శకత్వ పర్యవేక్షణ సుమన్ అనే టైటిల్ కార్డ్ వచ్చేది ఈ టీవీలో). వెంటనే చాలా పెద్దగా ఓ నవ్వు వినిపించింది. నా అనుభవంలో బాపు గారు అంత బిగ్గరగా నవ్వినట్టు దాఖలాలు లేవు. 'ఎవ్వరికీ చెప్పుకోలేని జోక్ వేశారండీ' అన్నారు బాపు నవ్వి నవ్వి అలసిపోయి. అందర్నీ తన కార్టూన్ లతో నవ్వించే బాపు గార్ని నవ్వించిన భాగ్యం నాకు దక్కిందని తెగ మురిసిపోయానారోజు.

'బాపు-రమణ వారిద్దరూ ఒకరికొకరు. అలా ఇద్దరూ ఏకాంతంగా ఎన్నాళ్ళయినా ఉండిపోగలరు. థర్డ్ పర్సన్ ఈజ్ క్రౌడ్ ఫర్ దెమ్' అని అన్నానొకసారి. 'ఏవన్నారూ ?'  అని మరోసారి చెప్పించుకుని 'అదేం లేదు లెండి' అంటూ మనస్ఫూర్తిగా నవ్వేశారు బాపు. నిజానికి అందరూ అలా అనుకుంటారు గానీ మనసుకి నచ్చితే ఫోన్ చేసి మరీ మాట్లాడతారాయన. అలాగే ఓసారి ఫోన్ చేసి 'నేను బాపునండీ' అన్నారు. ఇటీజ్ ఎ ప్లెజెంట్ సర్ ప్రైజ్. 'చిన్న  అవసరం పడిందండీ ... తెలుగు సినిమాలో ఇప్పటి వరకూ నారదుడు పాడిన పాటల లిస్ట్ ఇవ్వగలరా ?' అని అడిగారు. ' తప్పకుండా ఇస్తానండీ' అన్నాను తేరుకుంటూ. మర్నాడు నేను పంపిన లిస్ట్ చూసి మళ్ళీ ఫోన్ చేశారు 'చాలా వర్క్ చేశారండీ' అంటూ.

నేను ఎడిటర్ గా తీసుకువచ్చిన 'హాసం' పక్ష పత్రిక అంటే ఆయనకీ, రమణ గారికీ ఎంతో ఇష్టం. ఈటీవీ భాగవతం తర్వాత రమణ గారు చాలా కాలం ఏమీ రాయలేదు. కానీ నేను అడగ్గానే రెండు ఆర్టికిల్స్ రాసి సంపాదకుడిగా నన్నొక ఎత్తున నిలబెట్టారు . అలాగే బాపు గారు ... 'హాసం' ని మెచ్చుకుంటూ రామాయణంని 12 బొమ్మల రూపంలో రేఖా వర్ణ చిత్రాలు గా చిత్రీకరించి, కాఫీ మగ్ ల మీద ప్రింట్ చేయించి ఇంటికి పంపారు. ఇవాళ్టికీ వాటిని ప్రాణప్రదంగా చూసుకుంటున్నాను.



బాపు గారిలో ఒక భక్తుడూ ఉన్నాడు, ఒక అభ్యుదయవాదీ ఉన్నాడు. ముప్పాళ రంగనాయకమ్మ 'రామాయణ విష వృక్షం' పుస్తకాన్ని రాసి కవర్ పేజీ బాపు గారు వేస్తే బాగుంటుందని, పేమెంట్ కూడా ముందే ఇస్తే ఇంకా బాగుంటుందని డిమాండ్ డ్రాఫ్ట్ ద్వారా పంపారు. బాపు గారు ఆ డిమాండ్ డ్రాఫ్ట్ వెనక 'శ్రీరామ శ్రీరామ' అంటూ అస్సలు ఖాళీ లేకుండా రాసి వెనక్కి తిప్పి పంపించారు - 'ఈ పని నేను చెయ్యను' అని చెప్పీ చెప్పకుండా చెబుతూ.
ఇంకోసారి ఓ ఆలయం యొక్క గాలిగోపురం పునర్నిర్మాణ సమయంలో అక్కడకు వచ్చిన పీఠాధిపతి 'ఇందులో ఓ అంతస్థు భారం నువ్వు మోస్తున్నావు' అన్నారు ఇళయరాజాతో. 'ఇది నా భాగ్యం' అన్నారు ఇళయరాజా. ఆ భారం, భాగ్యం ఖరీదు ముప్ఫై అయిదు లక్షలు.
అలాగే ఆ పీఠాధిపతి మరొక పీఠాధిపతి ని - మన మధ్య నడయాడే దేవుడిగా - వర్ణిస్తూ రాసిన ఓ ఉద్గ్రంధం ముఖచిత్రం బాపు గార్ని వెయ్యమని కోరారు. బాపు గారు అంగీకరించారు.
ఇళయరాజా డబ్బు కూడదీసుకుని ఇవ్వడానికి వెళితే ఆయన్ని ఆ గుడిలో అడ్డుకున్నారు - నువ్వు హరిజనుడవని ఎందుకు చెప్పలేదు - అంటూ. ఈ విషయం ఇళయరాజా ఎక్కడా చెప్పుకోలేదు. అయినా బాపు గారికి తెలిసింది. వెంటనే ఆ పీఠాధిపతులకు ఉత్తరం రాశారు. 'వేదాలు, ఉపనిషత్తులు వెలసిన దేశం మనది. ఆదిశంకరాచార్యుల వారికి ఛండాలునితో తత్త్వబోధ చేయించిన పుణ్యభూమి మనది. అందరికీ అన్నీ చెందాలని గుడి గోపురం ఎక్కి మంత్రాలు ఘోషించిన సంస్కారం మనది. ఒక మహామనిషిని - నువ్వు ఫలానా కదా - అని వెలివేసిన - మీ నడయాడే దేవుణ్ణి - అంగీకరించడానికి నా మనసు అంగీకరించడం లేదు. నా రాతలు మీ మనసుని నొప్పించి వుంటే  మీ సంస్కారం నన్ను మన్నించగలదని ఆశిస్తున్నాను' అంటూ ఆ ముఖచిత్రం వెయ్యనని మళ్ళీ చెప్పీ చెప్పకుండా చెప్పారు.

బాపు రమణలది ఎవ్వరినీ నొప్పించే తత్త్వం కాదు. బాపు గారికి పద్మశ్రీ వచ్చినప్పుడు బాధపడని వారంటూ ఎవరూ లేరు. ఆయనకి ఫోన్ చేసి ' చాలా బాధగా వుందండీ ... మీకిప్పుడివ్వడమేంటండీ' అన్నాను. 'దాన్దేముందండీ ... వాళ్ళకెప్పుడు ఇవ్వాలనిపిస్తే అప్పుడు ఇస్తారు' అన్నారాయన. 'అదికాద్సార్ ... రెఫ్యూజ్ చేస్తే మీ విలువేంటో తెలుస్తుంది  కదా వాళ్ళకి' అన్నాను గుండె మండిపోతుంటే. 'అలా చేస్తే బాధపడరూ ? పైగా అది ప్రభుత్వం కదా ... వాళ్ళకిప్పుడు ఇవ్వాలనిపించింది. ఇచ్చారు. వెళ్ళి తీసుకుంటేనే మనకి విలువ. ఎవరికెప్పుడు ఎంత ప్రాప్తమో అంతే' అన్నారు బాపు నెమ్మదిగా, మృదువుగా, అనునయంగా - ఓ తండ్రి తన కొడుక్కి నచ్చచెప్పినట్టు, ఓ గురువు తప్పుగా ఆలోచిస్తున్న శిష్యుడికి జ్ఞానోపదేశం చేస్తున్నట్టు. అదీ బాపు గారి సంస్కారం.










'మీ బొమ్మలున్న పోష్టర్లు ఇంట్లోను, ఆఫీస్ లో నా క్యాబిన్ లోను పెట్టుకోవాలని వుందండీ' అంటూ సలహా కోసం ఫోన్ చేశానోసారి. ' ఇంట్లో డైనింగ్ టేబుల్ దగ్గిరైతే బ్రహ్మ కడిగిన పాదము పోష్టర్ పెద్ద సైజ్ లో ఫ్రేమ్ తో అయితే బావుంటుంది. ఇక క్యాబిన్ అయితే మీరు ఫ్లూట్ వాయించేవాణ్ణి అని చెప్పారు కదూ ... '
( 'హాసం' నడిపే రోజుల్లో పాటలకు, రాగాలకు సంబంధించిన చిన్న చర్చ వచ్చినప్పుడు - కాలేజీ రోజుల్లో మిడి మిడి జ్ఞానంతో ఫ్లూట్ వాయించే వాణ్ణి - అని ఆయనతో చెప్పినట్టు జ్ఞాపకం. అది ఆయన గుర్తుపెట్టుకున్నందుకు గుండె ఝల్లుమంది ఒక్కసారిగా...)

'ఫ్లూట్ వాయిస్తున్న వెంకటేశ్వరుడు, చుట్టూ వాగ్గేయకారులు ఉన్న పోష్టర్ అయితే బావుంటుంది . గంధం ప్రసాద్ కి నేను చెప్పానని చెప్పండి (ఈయన విజయవాడలో వుంటారు. బాపు బొమ్మల పోష్టర్లన్నీ రకరకాల సైజుల్లో ఈయన దగ్గరుంటాయి). చక్కగా పీవీసీ పైప్ లో పెట్టి పంపిస్తాడు' అన్నారు. నిలువెల్ల పరవశించిపోయానా ఆప్యాయతకి, ఆ పర్సనల్ టచ్ కి.

ఇలా ఎన్నో జ్ఞాపకాలు ...
తడియారని సంతకాలు ...
గుండె తడిని తడుముతునే ఉన్నాయి, ఉంటాయి కూడా ...
మచ్చుకి ఇవి కొన్ని మాత్రమే ...

బాపు రమణ ఉన్న కాలంలో పుట్టడం ఒక అదృష్టం అయితే - వారితో పరిచయం కలగడం, కొన్ని అనుభవాలు పంచుకోగలగడం జన్మ జన్మల పుణ్యఫలం. ఏ జన్మ పుణ్యమో ఈ జన్మకిది చాలు. మళ్ళీ జన్మంటూ ఉంటే వారిద్దరూ అవతరించిన కాలంలో వుంటేనే దానికో విలువ, సార్థకత.

రాజా (మ్యూజికాలజిస్ట్)


సత్కారణ జన్ములు బాపు - రమణ లతో నాకున్న పరిచయాన్ని గుర్తుచేసుకుంటూ రాగా.కమ్ వారి బ్లాగ్ లో రాసిన ప్రత్యేక వ్యాసం లింక్ ఇది. క్లిక్ చేసి , చదివి, మీ అభిప్రాయం చెప్పండి.

http://blog.raaga.com/2014/09/blog-post_3.html














Tuesday, July 8, 2014

ఆ హంస వేరు ఈ హంస వేరు



'శ్రీమద్విరాటపర్వం' సినిమాలోని 'ఆడవే హంసగమనా' అనే ఓ పాట వుంది.ఆ పాటను రాసింది వేటూరి సుందర రామ్మూర్తి.  వేటూరి పాటను రాసి ఎన్.టి.ఆర్. కు చూపించగానే పక్కనే వున్న కొండవీటి వెంకటకవి 'అదేమిటి నాయనా ... హంస గమనా అన్నావు. ఆదిలోనే హంసపాదు అనే మాటను వినలేదా ? అటువంటి అశుభాన్ని ఎలా ఆపాదిస్తావు?' అంటూ అభ్యంతరం చెప్పారు. అప్పుడు వేటూరి 'ఇక్కడ హంస అంటే నీటిలో విహరించే హంస కాదండీ... సూర్యుడుకి హంస అనే ఇంకో పేరుంది. చందస్సులో ఆటవెలది లక్షణాల లోని సూర్య గణాల గురించి చెబుతూ హంస పంచకమ్ము ఆటవెలది అని అన్నారు కదా ఆ హంస అండి. ఏ వేళలోనైనా గతి తప్పని గమనం సూర్యునిది. అటువంటి గతి తప్పని గమనంతో నాట్యమాడమని బృహన్నల ఉత్తరని ఆశీర్వదిస్తే బావుంటుందని అలా రాశానండీ' అని అన్నారు. దాంతో అటు కొండవీటి వెంకట కవి, ఇటు ఎన్.టి.ఆర్. ఇద్దరూ మురిసిపోతూ వేటూరిని కౌగలించుకున్నారు. 

Sunday, July 6, 2014

బాలమురళి గారితో నా పరిచయం అదృష్టానికి పరాకాష్ట


ఈ రోజు  (జూలై 6) బాలమురళి గారి పుట్టిన రోజు. ఆయనతో పరిచయం ఈనాటిది కాదు. అప్పుడెప్పుడో ఎన్.టి.ఆర్. లలితకళా అకాడమీలను రద్దు చేసినప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో అడుగుపెట్టనని ప్రతిజ్ట చేశారు బాలమురళి. కొన్నాళ్ళకి మద్రాసు లో వుండే టి.వి.కె. శాస్త్రి 'బాలాజీ కళ్యాణోత్సవ్' అనే కార్యక్రమాన్ని హైదరాబాద్ లో నిర్వహించారు. మహామహులంతా వచ్చి పాల్గొని పాడి వెళ్ళారు. ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి బాలమురళి గార్ని అతికష్టం మీద ఒప్పించారు. 'ఎన్.టి.ఆర్. వచ్చి వెళ్ళాక మాత్రమే నేను వస్తాను. ఆయన వుంటుండగా రాను. ' అని షరతు పెట్టారు బాలమురళి. ఆ ప్రకారమే ఎన్.టి.ఆర్. వెళ్ళాక బాలమురళి గారికి కన్ఫర్మ్ చేసి ఆయన్ని హోటల్ నుంచి వేదికకి తీసుకొచ్చే బాధ్యతని ఎస్పీ బాలు గారు, ఆయనతో పాటు నేను తీసుకున్నాం. అలా బాలమురళి గారితో మొదటి పరిచయం. 
అంతకు ముందు ఏ సినిమా అవార్డుల్లోనైనా ఉత్తమ గాయకుడిగా బాలూయే ఎన్నికయ్యేవారు. సినీహెరాల్డ్ అవార్డుల్లో - బాలమురళి గారిని ఉత్తమ గాయకుడిగా (మౌనమె నీ భాష ఓ మూగమనసా),  బాలూ గారిని ఉత్తమ సంగీత దర్శకుడిగా (తూర్పు వెళ్ళే రైలు), రాళ్ళపల్లిని ఉత్తమ నూతన హాస్యనటుడిగా (తూర్పు వెళ్ళే రైలు) నేను సూచించాను. ఆ యాజమాన్యం ఒప్పుకుంది. ఈ విషయం బాలూ గారికి తెలుసు. రాళ్ళపల్లికీ తెలుసు.  
బాలాజీ కళ్యాణోత్సవ్ ముగిశాక ఆ రాత్రి బాలమురళి గారికి ఈ అవార్డుల విషయం చెబుతూ నన్ను పరిచయం చేశారు. అప్పటి సంప్రదాయానికి భిన్నంగా ఆలోచించినందుకు బాలమురళి గారు నన్ను అభినందించారు. అదే రోజు ఆక్కడికి వేరే పనుల మీద వచ్చిన సంగీత దర్శకులు కె.వి.మహదేవన్, ఎమ్మెస్ విశ్వనాథం ఆ హోటల్ లోనే బస చేశారు. 

ఇది తెలుసుకున్న బాలు గారు డిన్నర్ కి అందర్నీ ఒక చోట చేర్చారు. బాలమురళీ గారు, మహదేవన్ గారు, ఎమ్మెస్ గారు, బాలు గారు ఇలా మహామహులంతా ఓ చోట చేరి సంగీతానికి సంబంధించిన కబుర్లు చెప్పుకుంటూ, మధ్య మధ్య పాడుకుంటూ వుంటే - భగవంతుడు నాకు చెవులు, కళ్ళు రెండు రెండే ఇచ్చినందుకు తిట్టుకోవాలా, కనీసం అవైనా ఇచ్చి ఇంతటి మహదవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్టతలు చెప్పుకోవాలా తెలియని పరిస్థితుల్లో ఉక్కిరిబిక్కిరి అయిపోయాను. రాత్రి రెండో మూడో అయింది భోజనాలు అయేసరికి. ఆనాటి  అ జ్టాపకాలు ఇవాళ్టికీ పచ్చిగానే, పచ్చగానే వున్నాయి నా గుండెల్లో.
ఆ తర్వాత ఎప్పుడు ఎక్కడ కనబడినా, ఫోన్ చేసినా అదే ఆప్యాయతతో బాలమురళి గారు నన్ను రిసీవ్ చేసుకునేవారు. అదే చనువుతో మా టీవీ తరఫున ఎక్స్ క్లూజివ్ ఇంటర్ వ్యూ కావాలని అడిగితే వెంటనే ఒప్పుకున్నారు. ఆ సందర్భంగా 3 రోజుల పాటు ఆయనతో వుండే అదృష్టం కలిగింది. 'యూనిట్ ని ఆ కార్లో వెళ్ళనీ, నువ్వు నాతో రా' తన కార్లో తన పక్కనే కూచోబెట్టుకుని, నా చెయ్యి పట్టుకుని ఎన్ని కబుర్లు చెప్పారో ...!? అలాగే భోజనం కూడా ఆయనతోనే ... తను హనుమంతుడి భక్తుడనని చెబుతూ - మేడ మీద డ్రాయింగ్ రూమ్ లో వున్న హనుమంతుడి బొమ్మ పక్కన నిలబడి, నా కోసం ఓ కీర్తనని అలాపించారు. 'మీరు సరదాగా ఒక్కరే ఉన్నప్పుడు ఏదైనా పాడుకుంటున్నట్తు వుంటే ఓ షాట్ తీసుకుంటానండీ' అని అడిగితే ' ఓ దానికేం భాగ్యం'  అంటూ ఆరుబైట వరండాలో వున్న ఉయ్యాల్లో కూచుని ఓ పాట మొత్తం పాడేశారాయన. 
ఆయన స్వహస్తాలతో రాసుకుని ప్రింట్ చేయించిన కీర్తనల పుస్తకం, మంచి మంచి ఫొటోలు, భీమ్ సేన్ జోషి , కిషోరి అమోంకర్ వంటి నిష్ణాతులతో తను కచేరీలు చేసిన డీవీడీలు నాకు కానుకగా ఇస్తూ 'ఇవి నీ దగ్గరుంచు సంగీత ప్రియులకు ఉపయోగపడతాయి' అన్నారు. ఇంతటి మహద్భాగ్యం కలగటం నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ...!? 
సంగీతం కోసమే పుట్టిన ఆ మహత్కారణ జన్ముడిని పుట్టిన రోజు పూటా తలుచుకోగలగడం భగవంతుడికి గుడికెళ్ళి చేయించుకున్న అర్చన లాంటిదేననుకుంటున్నాను.

Tuesday, May 6, 2014

చిరస్మరణీయుడు,స్వరస్మరణీయుడు,తెరస్మరణీయుడు ఆత్రేయ


తెలుగు సినీ సాహిత్య చరిత్రలో భావాన్ని ప్రేక్షకుడి మనసుకి సూటిగా తాకేట్టు చేయడంలో ఆత్రేయ స్థానం అనితర సాధ్యం. భాష చేత భావాలకు ఆయన ఎప్పుడూ వెట్టిచాకిరీ చేయించుకోలేదు. అయినా పదాలు ఆయన చేతిలో అతి అందంగా అమరిపోయాయి. ఒదిగిపోయాయి. ఒదుగు, ఒడుపు, జగి జిలుగులతో అతి చాకచక్యంగా పట్టుకోవడంలోనూఆకట్టుకోవడంలోనూ ఆయన సిద్దహస్తుడే కాదు, ప్రసిద్ధ హస్తుడు కూడా.                                                     
ముఖ్యంగా మనిషి, మనసు, మమత, దేవుడు, విధి మీద రకరకాల ప్రయోగాలతో ఆత్రేయ రాసినన్ని పాటలు మరొకరు రాయలేదు.
మచ్చుకి-
పశువుల కన్నా పక్షుల కన్నా మనషిని మిన్నగ చేశాడు.
బుద్దిని ఇచ్చి హృదయాన్నిచ్చి భూమే నీదని పంపాడు.
బుద్ధికి హృదయం లేక హృదయానికి బుద్ధే రాక
నరుడే ఈ లోకం నరకం చేశాడు.
(దేవుడనేవాడున్నాడా - 'దాడుగుమూతలు')
మహాత్ములైనా దురాత్ములైనా మనుజుల పేరనే మసలేరయ్యా.
అందరికీ నీ అభయం కలదని అనుకోమందువా దేవా
(వెలుగు చూపవయ్యా - 'వాగ్దానం')
మనిషిని దైవానికి ఏనాటి నుంచో వైరము
వీడి కోరికవాడు తీర్చడు వాడి దారికి వీడు వెళ్ళడు
(మనసులేని దేవుడు -'ప్రేమలు-పెళ్ళిళ్ళు')
ఒకడి ఆకలికి అంబలి నీళ్ళు ఒకరికి పాలు పళ్ళు
భలేభలేగా దగాల దేవుడ బాగా పంచేవు
కోతికి బాబనిపించేవు ఓ బ్రహ్మయ్య
నీ లీలలే గడబిడ ఎడపెడ నీ గడాబిడా మా కెడాపెడా
(ఓ బుచ్చిబాబు - 'నాటకాల రాయుడు')
ఇక మనుషుల తత్వాల గురించి:
తాము నవ్వుతూ నవ్విస్తారు కొందరు అందరినీ
తామేడుస్తూ ఏడ్పించుతారెందరో కొందరినీ
(దేవుడునే వాడున్నాడా - 'దాగుడుమూతలు')
మాటలలో చిక్కుపడి మనసు నలిగిపోతుంది
మనసులేని మాటలనే మనం నమ్ముతున్నది
పలుకలేని ప్రతిగుండె బాధతో నిండినది
ఒలికే ప్రతి కన్నీటికి చుక్క వెచ్చగా ఉంటుంది
(బ్రతుకు పూలబాట కాదు - 'భార్యాబిడ్డలు')
ఎదుటి మనిషికి చెప్పేటందుకే నీతులు ఉన్నాయి
(నేను పుట్టాను - 'ప్రేమ్_నగర్')
మంచివాడికి, చెడ్డవాడికి తేడా ఒకటే బాబూ
మంచివాడు మనసున అనుకుంటాడు చెడ్డవాడు చేసే చూస్తాడు
(మనిషి మనిషికి తేడా ఉంది - 'పాప కోసం')
ఇక మనసు గురించి ఆత్రేయ మధన పడ్డంతగా మరొకరు కనిపించరు మనకి. ఒకటా... రెండా... ఎన్నో....ఎన్నెన్నో... ఒక్క క్షణం మనసుకి మాటలు తడితే జలజల జాలువారిపోతాయి ఆయన పాటలు.
ఒకరికిస్తే మరలిరాదు, ఓడిపోతే మరచిపోదు.
గాయమైతే మాసిపోదు, పగిలిపోతే అతుకుపడదు.
(మనసుగతి ఇంతే - 'ప్రేమ్_నగర్')
ఊహల ఉయ్యాలవే మనసా, మాయల దయ్యానివే
లేనిది కోరేవు, ఉన్నది వదిలేవు
ఒక పొరపాటుకు  యుగములు పొగిలేవు
(మౌనమే నీ భాష - 'గుప్పెడు మనుసు')
వలచుట తెలిపిన నా మనసునకు
మరచుట మాత్రము తెలియనిదా
మనసిచ్చినదే నిజమైతే
మన్నించుటయే ఋజువు కదా
(నీ సుఖమే నే కోరుతున్నా - 'మురళీకృష్ణ')
కన్ను నీదని, వేలు నీదని పొడుచుకుంటే రాదా రక్తం
రక్తమెంతగా ధారపోసినా దొరుకుతుందా మళ్ళీ హృదయం
(మనసు లేని బ్రతుకొక నరకం - 'సెక్రటరీ')
వయసు కోతి వంటిదీయ మనసు కొమ్మ వంటిదీ
ఊపేసి పోతుంది మొదటిదీ,
ఆ ఊపు మరువనంటుంది రెండవది
(వయసు కోతి వంటిదీ - 'అగ్నిపూలు')
తనువుకు ప్రాణం కాపలా - మనిషికి మనసే కాపలా
ఎవరి ప్రేమకు నోచని నాడు కన్నీరేరా నీకు కాపలా
(ఎవరికి ఎవరు కాపలా - 'ఇంటికి దీపం ఇల్లాలే')
మనిషికి మనిషికి మమత కూడదా
మనసు తెలుసుకొను మనసే లేదా
(ఎవరో జ్వాలను రగిలించారు - 'డాక్టర్ చక్రవర్తి')
మనసు మూగదే కానీ బాసుంటది దానికి
చెవులుండే మనసుకే ఇనిపిస్తుందా ఇదీ
(ముద్దబంతిపూవులో - 'మూగమనసులు')
మడిసితోటి ఏలాకోలం ఆడుకుంటే బాగుంటాది
మనసుతోటి ఆడకు మావా ఇరిగిపోతే అతకదు మల్లా
(మాను మాకును కాను - 'మూగమనసులు')
వయసు పెరిగినా మనిషి ఎదిగినా
మనసు ముదరనంత వరకు మాసిపోదు పసితనం
(వయసు పెరిగినా - 'ప్రాణమిత్రులు')
ఒడ్డున పెరిగే గడ్డిపోచకు హృదయం ఎందుకు ఉండకూడదు
ఉందని ఎందుకు ఒప్పుకోరాదూ
మోడు కూడా చిగురించాలని మూగమనసు కోరే కోర్కెను
మోసం ద్రోహం అనడం అన్యాయం
(అటు ఇటు కాని - 'ఇది కథకాదు')
విధి, సమాజం, ఖర్మ, బలహీనతలు వీటి పోకడల మీద ఆత్రేయ ఎన్నో విసుర్లు విసిరాడు. ఒక్కోసారి విరుచుకు పడ్డాడు. మరోసారి విజ్ఞత తెలియజెప్పాడు. అయితే ప్రతిసారీ బాధ్యతను గుర్తు చేశాడు. ఎలా అంటే -
కడుపు కాలే కష్టజీవులు ఒడలు విరిచీ
గనులూ తొలిచీ చెమట చలువను చేర్చిరాళ్ళను తీర్చినారు తెలుసుకో.
(కారులో షికారుకెళ్ళే - 'తోడికోడళ్ళు')
అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని
జరిగేవన్నీ మంచికని అనుకోవడమే మనిషి పని
(నీ సుఖమే నేను కోరుతున్నా - 'మురళీకృష్ణ')
ఇరవైలో అరవై వయసు ఎవరికైనా వచ్చేనా?
(సిగలోకి విరులిచ్చి - 'సుమంగళి')
కళా జీవితం లక్కు ఒక ట్రిక్కు  ఒకరికి లక్కు - ఒకరికి ట్రిక్కు
(ఓ బుచ్చిబాబు - 'నాటకాల రాయుడు')
తప్పు నాది కాదంటే లోకమొప్పుతుందా నిప్పులాంటి సీతనైన తప్పు చెప్పకుందా
(రాయిని ఆడది చేసిన - 'త్రిశూలం')
ఈ పుణ్యభూమిలో పుట్టడం మన తప్పా ఆవేశం ఆపుకోని అమ్మానాన్నదే తప్పా
(సాపాటు ఎటూ లేదు - 'ఆకలిరాజ్యం')
పిచ్చిపిచ్చిపిచ్చి రకరకాల పిచ్చి
ఏ పిచ్చీ లేదనుకంటే అది అచ్చమైన పిచ్చీ
(పిచ్చిపిచ్చిపిచ్చీ - 'విచిత్ర వివాహం')
రాతి అందాలన్నీ నాతిలో చెక్కి
తీరని కోర్కెలే తీర్చుకున్నాడేమో
(ఆనాటి మానవుడు - 'సుమంగళి')
ప్రేమనేది ఉన్నదా
అది మానవులకే ఉన్నదా
హృదయముంటే తప్పదా
అది బ్రతుకు కన్నా గొప్పదా
(మనసులేని దేవుడు - 'ప్రేమలు - పెళ్ళిళ్ళు')
కర్మను నమ్మినవారెవరూ కలిమిని స్థిరమనుకోరు, కళ్ళు మూసుకోరు.
కావాలని నిప్పు తాకితే చేయి కాలక మానదు
అలా కాలినందుకు ఖర్మే అంటే గాయమేమీ మానదు.
(కనబడని చెయ్యి ఏదో - 'తాశిల్దారుగారమ్మాయి')
ప్రేమ, పెళ్ళి, రెండు హృదయాల పరస్పర స్పందనపై - ఆత్రేయ అందించిన అనుభూతి తల్చుకున్నప్పుడల్లా మనసు అట్టడగు అంచులు కూడా పులకరించిపోతాయి.
నీ వలపు వాన కురిసి కురిసి తడిసి పోనీ
తడియారని హృదిలో నను మొలకలెత్తనీ
(తెల్లవారనీకు ఈ రేయినీ - 'ఆత్మబలం')
జగతిని ఉన్నది మనమిద్దరమే అనుకొని హత్తుకు పోతుంటే
(చిటపటచినుకులు - 'ఆత్మబలం')
పెమిదను తెచ్చి ఒత్తిని యేసి చమురును పోసి బెమసూసేవా
ఇంతా చేసి ఎలిగించేందుకు ఎనక ముందూలాడేవా
(మాను మాకును కాను - 'మూగ మనసులు')
నన్నిడిచి నువ్వెళితె నీ వెంట నేనుంట
నిన్నిడిచి నే వెళితె నువ్వ బ్రతకలేవంట
ఇది నీగొప్పా నాగొప్పా కాదు పిల్లోడా
ప్రేమంటే అంతేరా పిచ్చివాడా
(ఎక్కడికి పోతావు చిన్నవాడా - 'ఆత్మబలం')
ఇక పడుచుదనం, కుర్రతనం మీద ఆత్రేయ పంచకళ్యాణి గుర్రంలా ఎంతగా కదనుతొక్కిందీ, ఎంతగా పదనుచూసిందీ, ఎంతమందిని వెర్రెక్కించిందీ చెప్పాలంటే ఆ ఉదాహరణలు కోకొల్లలు.
దోరవయసు, అలవికాని భారమయింది.
ఆ బరువు మోయలేక నడుము పలచబడింది.
(మిడిసి పడకు అత్తకుతురా - 'ఆస్తిపరులు')
బిగదీయకు బిగదీయకు పైట  కొంగును
ఎంత బిగదీస్తే బిగువులన్నీ బైటపడేను
(ఓహోహో వయ్యారి - 'సుపుత్రుడు')
పడుచు పిల్ల పయ్యెదలా పలుచని వెలుగే పరిచినదీ
కొండల కోనల వలుపుల్లో కొత్త వంపులే చూపినదీ
(ఈ ఉదయం నా హృదయం - 'కన్నెమనసులు')
ఎవరో  చెపితే విన్నాను విన్నది నీతో అన్నాను నాకూ ఇంతే తెలిసినదీ
నీకే తెలియును మిగిలినదీ
(ఎన్నో రాత్రులు వస్తాయి - 'తోడూనీడా')
తేటి ఎగిరిపోతుంది పువ్వు మిగిలిపోతుంది.
తేనె ఉన్న సంగతి తేటి గురుతు చేస్తుంది
(ఇదేనన్న మాట - కొడుకుకోడలు)
ఇది చదువుల్లో ఎక్కడా చెప్పలేదే
చెప్పందీ చేసినా తప్పుకాదే
(పడ్డావటే పిల్లా - 'బ్రతుకే ఒక పండుగ')
పడుచుదనం పందెమెత్తి వలపు జూదం ఆడుకోవాలి.
నాకు నువ్వు నీకు నేను రోజురోజూ ఓడిపోవాలి.
(వెచ్చవెచ్చనీ నీ ఒడిలో - 'శభాష్ వదినా')
నీలోని మగసిరితోటి నాలోని సొగసుల పోటీ
వేయించి నేనే ఓడి, పోనీ పొమ్మంటీ
నేనోడి నీవే గెలిచి నీ గెలుపునాదని తలచి
రాగాలే రంజిలు రోజే రాజీ రమ్మంటీ
(రేపంటి రూపం కంటి- 'మంచిచెడు')
మొదట మొదట కళ్ళతోటి మొదలు పెట్టి లడాయి.
హృదయమంత పాకుతుంది హుషారైన హాయి
కలకాలం ఉండదు ఈ పడుచు బడాయి
తొలినాడే చల్లబడి పోవునమ్మాయి
(గిల్లికజ్జాలు తెచ్చుకునే - 'ఆత్మబలం')
భగ్నప్రేమకు ఆత్రేయ తన పాటలతో వేసిన పీటలు ఆయన ఓ కవిగా ఎంతగా శోధిస్తాడో రోదిస్తాడో తెలియజేస్తాయి.
కదిలే శిలగా మారిపోతిని కథగానైనా మిగలనైతిని
(నాలుగు కళ్ళు రెండైనాయి - 'ఆత్మబలం')
కనులున్నవి కన్నీటికి కొలనుల గుటకా
(బంగారు నావా బ్రతుకు - 'వాగ్దానం')
తొలికోడి కూతల్లె వినిపించి తొలిపొద్దు వెలుగల్లే కనిపించి
తొలిజన్మ ఋణమేదో అనిపించి తెరవని తలుపులు తెరిపించి
ఎందుకు వచ్చానో ఎందుకు వెళ్ళావో నాకేమో తెలియదు.
నీకైనా తెలుసునా
(ఎందుకు వచ్చానో - 'మనసు-మాంగల్యం')
అగ్గి వంటి వలపంటించి హాయిగా ఉందామనుకోకు
మనసు మంచి మనసుకి పాకి ఆరని గాయం చేస్తుంది.
రాయికన్నా రాయిని నీవు కసాయిని నీవు
(హృదయం లేని ప్రియురాలా - 'కన్నెమనసులు')
నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి
ఏ కన్నీటెనకాల ఏముందో తెలుసునా
(ముంద్దబంతి పూవులో - 'మూగ మనసులు')
చావు పుటక లేనిద్మ్మ నేస్తమన్నదీ
జనమ జనమకది మరీ గట్టిపడతదీ
(పాడుతా తీయగా చల్లగా - 'మూగ మనసులు')
మాటలతో, పదాలతో ఆత్రేయ ఎప్పుడూ గిమ్మిక్కులు చేయలేదు. అయినా, సందర్భశుద్ధితో అవే ఆయన సృష్టించిన పాటలలో పోటీ పడుతూ తిష్టవేశాయి. ఆయన ప్రతిష్టను మరింతగా పెంచాయి.
అందుకే నేనది పొందినది అందనిదైనా అందనిది.
పొందిన పిదపే తెలిసినదీ నేనెందుకు నీకు అందినది
(అందరికీ తెలియనదీ - 'ఆస్తిపరులు')
సరిగమ వానికి సగమని తలపోయి
మురిపాలె మన జంట స్వరమైనవి
(ఏ రాగమూ ఇది ఏ తాళమూ - 'అమరదీపం')
వచ్చింది ఎందుకో తెలిసుంటే వెళ్ళవు
వెళ్ళేది తెలిసుంటే అసలొచ్చి ఉండవు
(ఎందుకు వచ్చావో - 'మనసు- మాంగల్యం')
ఇదిలా ఉండగా 'తొలికోడి కూసింది' చిత్రంలో 'పోలిసు వెంకటసామి నీకు పూజరయ్యాడు' పాటలో పూర్తిగా పోలీసు భాషనే ఉపయోగించారాయన. ఉదహరించాలంటే - పాట మొత్తాన్ని రాయాల్సిందే. అలాగే 'అదృష్టవంతులు' సినిమాలో 'నమ్మరే నేను మారానంటే నమ్మరే' పాటలో సాహిత్యం అంతా ఓ డైలాగు చెప్తున్నట్టే ఉంటుంది.
డైలాగంటే గుర్తొచ్చింది... ఎన్నో చిత్రాలలో ఆయన ప్రాణం పోసిన సంభాషణలు తల్చుకుంటే ఒళ్ళు జలదరిస్తుంది. భాషకు ఇంత బలం ఉందా అని అనిపిస్తుంది. ఆత్రేయ డైలాగుకి ట్యూన్ కడితే అది పాటవుతుంది. ఆయన పాటకి ట్యూన్ తీసేస్తే అది డైలాగవుతుంది అని అంటారు పరిశ్రమలో...

''ఎవ్వరికీ ఇవ్వనంత వరకే హృదయం విశాలంగా ఉంటుంది.
ఒకసారి ఇచ్చాక ఇరుకై పోతుంది ఇంకెవ్వరికీ చోటివ్వనంటుంది''
''చినబాబు చెడిపోయాడేమో గాని చెడ్డవాడు మాత్రం కాదమ్మా''
''మనిషి తాను అనుకున్నట్టు బ్రతకనూ లేడు ఇతరులు అనుకున్నట్టు చావనూ లేడు''
''వీటన్నిటినీ భరించాలంటే అసలు మనిషి మీద ప్రేమ ఉండాలి''
" నేను చెడిపోయిన వాళ్ళను చేరదీశానేమో గానీ నాకు నేనుగా ఎవ్వరినీ చెడగొట్టలేదు "
" ఒకటి మీ డబ్బు ఇంకొకటి నా రాజీనామా - అంటే ఒకటి నా అధికారం ఇంకొకటి నీ అహంకారం ... అవునా ?"
" పిరికివాడెక్కడ చస్తాడు లతా ... పిరికివాడు జీవితాన్ని ప్రేమిస్తాడు. గుండె గలవాడు ప్రేమని ప్రేమిస్తాడు, త్యాగాన్ని ప్రేమిస్తాడు. రెండూ ఫలించని నాడు   
  మరణిస్తాడు"
"అంతరాత్మ గొంతు ఎంతకాలం నులిమేస్తావు ? "
" సరే ... నువ్వు నీ అహంకారాన్నే కాపాడుకో ... ఎదో ఒక రోజు అది ఆత్మీయత కోసం అలమటిస్తుంది "
"నేనంటే ఏమిటో తెలియనిదాన్ని నాక్కావల్సిందేమిటో ఎలా తెలుస్తుంది ?"
" తెలుసుకున్నాక తెంచుకోవడం తేలిక "
''(ప్రేమనగర్)''
''సామాన్యుడికి అందుబాటులో లేని కళ సంకుచితమై సమసిపోతుంది''
(జయభేరి)
''చావు ఎంతమందినో విడదీస్తుంది కాని కొంతమందిని కలుపుతుంది''
(మూగమనసులు)
''కన్నీరే మనిషిని బ్రతికించగలిగితే అమృతం లాగే అదీ కరవైపోయేది''
''చంద్రుడు క్షీణిస్తున్నాడని  వెన్నెల వేరే చోట వెతుక్కుంటుందా?''
''కవిత్వం వేరు, జీవితం వేరు. విలువలు తెలుసుకుంటే జీవితమే ఓ మహాకావ్యం అవుతుంది''
(''వెలుగునీడలు'')
ఇలా రాసుకుంటూ పోతే భావావేశం కన్నా 'స్థలాభావేశం' ఎక్కువ ప్రాముఖ్యత వహిస్తుంది. కనుక ఇక్కడికీ ఆ పార్టు ఆపి ఫ్లాష్ బ్యాక్_లోకెళ్ళి ఆత్రేయ గారి 'వ్యక్తిగత జీవితం' గురించి తెలుసుకుందాం.
సూళ్ళురుపేట మంగళంపాడులో 1921వ సంవత్సరం మే ఏడవ తేదీన జన్మించారాయన. మే ఏడవ తేదీ విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ జన్మదినం. 'నిజమా?' అని అడిగితే 'అవును... కావాలనే ఆ తేదీ చూసుకు మరీ పుట్టాను' అంటుండే వాడాయన సరదాగా.
చిన్నప్పుడు చదువు మీదకన్నా, నాటకాల మీదనే ఎక్కువ శ్రద్ధ చూపించేవాడు. ఓసారి ఓ నాటకంలో మీసాలు గొరిగించుకుని నటించాడని ఇంటికి వచ్చాక గోమూత్రం తాగించి ప్రాయశ్చిత్త సంస్కారం చేశారు. అంత సంప్రదాయబద్ధమైన కుటుంబం ఆయనది. ఆత్రేయ అసలు పేరు కిళాంబి వెంకట నరసింహాచార్యులు. గోత్రనామం ఆత్రేయ కనుక ఆ పేరునే తన పేరుగా ధరించాడాయన.
ఓసారి ఓ మిత్రుడు ఆయనకి తను రాసిన కందపద్యాలు తెచ్చిచూడమన్నాడు. ఆత్రేయకు అర్ధం కాలేదు. 'ఏం చేయాలి' అని అడిగాడు మేనమామని. ఆయన కందపద్య లక్షణాలున్న ఓ పుస్తకాన్ని ఆత్రేయకి ఇచ్చి చదివి వంటపట్టించుకోమన్నాడు. ఆత్రేయ ఆ లక్షణాలన్నీ ఆకళింపు చేసుకుని - 'నువ్వు చేసిన తప్పులు ఇవీ' అని ఆ మిత్రుడికి అతని తప్పుల్ని కంద పద్యంలోనే రాసి చూపించాడు.
ఇది తెలుసుకున్న ఆత్రేయ మేనమామ 'ఒరే ....నువ్వు స్కూల్ ఫైనల్ పాసైతే నీకు సైకిల్, రిస్ట్_వాచీ, కొనిస్తాను' అన్నాడు. అంతే... వెంటనే మిత్రుల దగ్గరకెళ్ళి పాఠ్యపుస్తకాలన్నీ కాపీ చేశాడు ఆత్రేయ. అలా రాస్తుండగానే సగం పాఠాలు ఆయనకి కంఠోపాఠంగా వచ్చేశాయి. స్కూల్ ఫైనల్ పాసై మేనమామ ఇచ్చిన రిస్ట్_వాచీ పెట్టుకుని సైకిలెక్కి ఊరంతా గర్వంగా తిరిగాడు.
అయినా సరే 'నాలైను వేరే ఉంది' అని ఎప్పుడూ అనుకునేవాడు మనసులో. ఒకసారి రాజన్ అనే మిత్రుడి సాయంతో ఇంట్లోని వెండిగ్లాసు దొంగిలించి మద్రాసు బండెక్కాడు.
అక్కడ పడరాని అగచాట్లు పడ్డాడు. సబ్బులు అమ్మేవాడు. ఉన్ననాడు భోజనం - లేనినాడు కుళాయి నీళ్ళు. రాత్రిళ్ళు మద్రాసులోని మన్రో విగ్రహం దగ్గర పడుకునేవాడు. ఓసారి ఓ పావలా ఎక్కువ ఉందనిపిస్తే ఓ నోటుబుక్ కొని వీధి దీపం కింద కూర్చొని 'గౌతమబుద్ధ' అనే నాటకం రాసి యాభై రూపాయలకు అమ్మాడు. ఆ రోజుల్లోనే సినీనటుడు రమణారెడ్డితో పరిచయం ఏర్పడింది. టిఫెనుకీ, భోజనానికీ, పావలా, బేడా రమణారెడ్డి ఇచ్చేవాడు ఆత్రేయకి.
ఇలా ఉండగా 'తెనాలి రామకృష్ణ సినిమాలో వేషం ఉంది వేస్తావా' అని అన్నాడో పరిచయస్తుడు. సరేనని వెళ్ళి అక్కడ పడేసిన గుడ్డలు, బకెట్_లో వేసుకోవలసిన రంగునీళ్ళు చూసి నచ్చక వెనక్కి వచ్చేశాడు.
ఆ తర్వాత 'షావుకారు' చిత్రంలో డైలాగులు రాయడానికి కుదిరాడు. కానీ ఆరోగ్యం సహకరించక ఆయనే ఒద్దనుకున్నాడు. కొన్నాళ్ళకు 'మనోహర' చిత్రంలో డైలాగ్ అసిస్టెంట్_గా మాట సాయం చేశాడు. ఎట్టకేలకి 'దీక్ష' చిత్రంలో 'పోరాబాబు పో' పాట రాసే అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఇక ఆయన చేతికి విశ్రాంతే లేకుండా పోయింది.
కొన్ని వందలు, వేలు పాటలు, మాటలు రాసిన ఆత్రేయ దర్శకుడిగా 'వాగ్దానం' చిత్రానికి దర్శకత్వం వహించాడు. నటుడిగా 'కోడెనాగు' చిత్రంలో నటించాడు. ఆత్రేయ మంచి హ్యూమనిస్టే కాదు, చక్కని హ్యూమరిస్ట్ కూడా!
ఓసారి ఓ సినిమా హాల్లోంచి బైటికి వస్తున్న ఆత్రేయను చూసి ఆశ్చర్యపోతూ 'ఆత్రేయగారూ మీరు సినిమా చూశారా?' అని అడిగాడీ వ్యాసకర్త. అంత చెత్త సినిమా అది. దానికి ఆత్రేయ 'లేదు నాయనా... భరించా' అన్నాడు తడుముకోకుండా
మరోసారి ఆత్రేయ తన అడ్రసుని ఇదే వ్యాసకర్తకి తన అడ్రసుని రాసి ఇచ్చేడు. అది చూసి అతను 'అరె... ఇది సుశీలగారు ఉండే వీధే కదండీ... ఆవిడ మీ ఇంటికి దగ్గరేనా?' అని అడిగాడు. 'అవును... ఇది వరకు ఆవిడ మా పక్కింటి అమ్మాయి, ఇప్పుడు ఎదురింటి అమ్మాయి' జవాబిచ్చాడు ఆత్రేయ చమత్కారంగా.
          'అంటే.... ఆవిడ మారేరా.. మీరు మారేరా?' తిరిగి ప్రశ్నించాడీ వ్యాసకర్త.
          'మారేదెప్పుడు ఆడవాళ్ళే... ఊ...ఊ....ఊ....మ్మగమాళ్ళు మారరు' అని అన్నాడు ఆత్రేయ అక్కినేని నాగేశ్వరరావుగారిని ఇమిటేట్ చేస్తూ.
          ఆత్రేయ అంటే చంద్రుడు అని అర్థం. అది తెలియని ఒకాయన 'ఆత్రేయ అంటే ఏమిటండీ?' అని అడిగాడు. దానికి ఆత్రేయ సమాధానం - రాత్రేయుడు'.
ఆత్రేయ 'వాగ్దానం' చిత్రానికి డైరెక్ట్ చేసే రోజుల్లో ఓసారి సెట్_లో అక్కినేని నాగేశ్వరరావుగారితో సహా అందరూ రెడీ అయి కూర్చున్నారు. ఆత్రేయ మాత్రం ఎక్కడా అయిపులేడు. ఆఖరికి అక్కినేని అటూ ఇటూ తిరిగి ఆత్రేయని పట్టుకున్నారు. ఎవరికీ కనిపించకుండా ఓ మూల కూర్చుని అప్పుడు చిత్రీకరించవలసిన డైలాగులు రాసేసుకుంటున్నాడాయన. 'ఏంటండీ ఇది.... ఏంటీ పని?'' అని మందలించారు అక్కినేని.
          ''అదికాదు నాగేశ్వరరావు గారూ... అందరికీ లేటుగా ఇచ్చి నా సినిమాకి నేను ముందుగా డైలాగులు రాసేసుకుంటే 'స్వార్ధం' అని ప్రొడ్యూసర్లు తిట్టుకోరూ... ఆ పార్షియాలిటీ లేకుండా జాగ్రత్త పడుతున్నానండీ'' అన్నాడాయన వస్తున్న నవ్వుని ఆపుకుని సీరియస్ నెస్_ మొహం మీదకు తెచ్చేసుకుంటూ.
          ఆత్రేయ రాసుకునే టైము తెల్లవారు జామున మూడు లేక నాలుగు, రాసిన వాటిని తెలుగులో టైపు చెయ్యడానికి ఓ అసిస్టెంట్_ని పెట్టుకున్నాడు. ఈయన రాసి పంపిస్తూనే ఉన్నాడు. పక్కగదిలోంచి టైపు శబ్దం అస్సలు వినిపించడం లేదు.
          'ఏం టైపు చేస్తున్నావ్?' అరిచాడు ఆత్రేయ. 'సీన్లండీ' అన్నాడతడు ఉలిక్కిపడి లేచి.
          'అదే ఏ సీన్లూ అని...? అసలు శబ్దమే వినిపించడం లేదు'
          'సైలెంట్ సీన్లండీ' అన్నాడా అసిస్టెంట్ బహు చమత్కారంగా.
          ఆత్రేయతోటి సాంగత్య వైభవం అంతటిది మరి.
          ఆత్రేయ రాయకుండా ప్రొడ్యూసర్లని, రాసి ప్రేక్షకులని ఏడిపిస్తారని ఓ సినీ సూక్తి. దాని గురించి ఆయనతో ప్రస్తావిస్తే ''రాస్తూ నేనెంత ఏడుస్తానో, ఎవడికి తెలుసు'' అంటుండేవాడాయన ఛలోక్తిగా.
          అలాగే ''మీరు మనసు మీదనే ఎక్కువ రాస్తారెందుకండీ?'' అని అడిగితే 'మనసు మీద మనసుపడ్డా నాయనా' అంటుండే వారు నర్మగర్భంగా.
          చివర్న చెప్పుకోవలసింది, కళ్ళను చెమ్మగిల్లేట్టు, మనసును గిల్లేట్టు చేసే ఓ జోకు ఆయనది ఉంది.
          ''నాకూ, చావుకి అస్సలు పడదు. నేనున్న దగ్గరికి అది రాదు. అదొస్తే నేనుండను''
          అదీ ఆత్రేయంటే!
          ఆత్రేయ జీవకవి. మనిషి మనసులో మమత చావనంత వరకూ అనుక్షణం ఓ అనుభూతిగా ఆయన పుడుతూనే ఉంటాడు. అందుకే ఆత్రేయ చిరస్మరణీయుడు, తెలుగు పాటలో భావం ఉన్నంత వరకు స్వరస్మరణీయుడు, తెలుగు తెరమీద తెలుగుదనం ఉన్నంతవరకూ తెరస్మరణీయుడు.


రాజా (మ్యూజికాలజిస్ట్)
This article is from rajamusicbank.com & you can read many more articles , interviews etc