Saturday, February 15, 2014

దటీజ్ చంద్రబోస్

ఈ ప్లేట్ లను చూస్తుంటే పూర్వం వచ్చే గ్రామ్ ఫోన్ రికార్డ్ ల్లా వున్నాయి కదూ !? నిజానికి ఇవి -వేడి తగ్గకుండా - టీ కప్ ల మీద పెట్టే టీ కోస్టర్స్. ఆ మధ్య అమెరికా వెళ్ళినప్పుడు చంద్రబోస్ చూసి - ఇలాటి తమాషా ఐటమ్స్ అంటే నాకు ఇష్టం అని గుర్తొచ్చి - కొని తీసుకొచ్చారు. ఇటీవల నాకు ఒంట్లో బావులేదని తెలిసి ( ప్రస్తుతం బాగానే వుంది) నన్ను చూడడానికి తన భార్య సుచిత్ర తో మా ఇంటికి వచ్చి , ఓ గంట గడిపి, ఈ టీ కోస్టర్స్ ఇచ్చి వెళ్ళారు. చంద్రబోస్ కి నేనంటే ఎంతో గౌరవం. 'ఆయన  మా సంగీత సాహిత్య కుటుంబానికి పెద్ద' అని అంటుంటారు నా గురించి. ఇలాంటి మధురానుభూతుల్ని మనసులో దాచుకోవడం, పంచుకోవడం తప్ప ఇంకేం చెయ్యగలం ? 







Tuesday, February 11, 2014

దేవిశ్రీ ప్రసాద్ లోని ఓ ప్రత్యేక లక్షణం



" సినీ పరిశ్రమలో ఒక వ్యక్తి పైకి రావాలంటే - ప్రతిభ, పరిశ్రమ తో పాటు ప్రవర్తన కూడా వుండాలి. ఈ మూడూ ముప్పేట గొలుసులా ఎప్పుడూ పెనవేసుకుని వుండాలి " అనేవారు సి. నారాయణ రెడ్ది. సంగీత దర్శకుడు, గాయకుడు, రచయిత అయిన దేవిశ్రీ ప్రసాద్ ని ఎప్పుడు కలిసినా ఈ మాటలు గుర్తుకొస్తుంటాయి. అందుకు నా అనుభవంలో ఓ ఉదాహరణ ... 'అత్తరింటికి దారేది' సినిమా ఆడియో అప్పుడే రిలీజయింది. పాటలు విన్నాను. 'నిన్ను చూడగానే చిట్టిగుండె' పాట ట్యూను, పాడే పద్ధతి కొత్తగా వుందనిపించింది. సాధారణంగా దేవిశ్రీ ఫోన్ లో దొరకడు కాబట్టి ఏం చెప్పాలన్నా అతని తమ్ముడు సాగర్ కి చెబుతుంటాను. ఆ పాట గురించి నా అభిప్రాయం చెప్పాను. "ఇందులో వున్న ఒకరకమైన బద్ధకాన్ని భలే లబ్జుగా పాడేడు దేవిశ్రీ " అని అన్నాను. "మీకు నచ్చిందంటే పాట హిట్టే. అన్నయ్యతో చెప్తాను. జనం ఎలా రిసీవ్ చేసుకుంటారో అని కొంచెం టెన్షన్ పడుతున్నాడు" అన్నాడు సాగర్. అది జరిగిన రెండు నెలల తర్వాత రేడియో మిర్చి అవార్డుల ఫంక్షన్ కి జ్యూరీ మెంబర్ గా చెన్నై వెళ్ళడం జరింది. హాజరైన వారంతా తెలుగు, తమిళ, కన్న్డడ, మలయాళ సినీ ప్రముఖులే... కాస్త ఆలస్యంగా  ఫంక్షన్ మధ్యలో వచ్చాడు దేవిశ్రీ. అందర్నీ పలకరించుకుంటూ, మధ్యలో వున్న నన్ను కూడా విష్ చేసేసి ముందుకి వెళ్ళాడు. ఇంకా చాలా మంది ప్రముఖులు వున్నారు విష్ చేయడానికి. కొంత దూరం వెళ్ళి వెనక్కి పరుగెత్తుకుంటూ వచ్చి నా దగ్గిర ఆగాడు. "రాజా గారు .. మీ ఫోన్ గురించి సాగర్ చెప్పాడు. మీకు నచ్చిందంటే నా ఎక్స్ పెరిమెంట్ జనం రిసీవ్ చేసుకుంటారని, సినిమా రిలీజయ్యాక ఆ పాటని మరింత మెచ్చుకుంటారన్న కాన్ఫిడెన్స్ వచ్చింది. థాంక్యు సర్" అన్నాడు నా రెండు చేతులూ పట్టుకుని. ఆ తర్వాత ఆ పాట హిట్టు గురించి అందరికీ తెలిసిందే. దేవిశ్రీ జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నిజాయితీ తో కూడిన ఈ వినయమే నాకు గుర్తొస్తుంటుంది. అతని  విజయాలకి గల కారణాల్లో ఈ ప్రవర్తన కూడా ఒకటని అనిపిస్తూ వుంటుంది.
(ఈ ఫొటో అప్పుడు తీసినది కాదు. దానికి వేరే కథ వుంది. వీలుని బట్టి చెబుతా).