Tuesday, July 8, 2014

ఆ హంస వేరు ఈ హంస వేరు



'శ్రీమద్విరాటపర్వం' సినిమాలోని 'ఆడవే హంసగమనా' అనే ఓ పాట వుంది.ఆ పాటను రాసింది వేటూరి సుందర రామ్మూర్తి.  వేటూరి పాటను రాసి ఎన్.టి.ఆర్. కు చూపించగానే పక్కనే వున్న కొండవీటి వెంకటకవి 'అదేమిటి నాయనా ... హంస గమనా అన్నావు. ఆదిలోనే హంసపాదు అనే మాటను వినలేదా ? అటువంటి అశుభాన్ని ఎలా ఆపాదిస్తావు?' అంటూ అభ్యంతరం చెప్పారు. అప్పుడు వేటూరి 'ఇక్కడ హంస అంటే నీటిలో విహరించే హంస కాదండీ... సూర్యుడుకి హంస అనే ఇంకో పేరుంది. చందస్సులో ఆటవెలది లక్షణాల లోని సూర్య గణాల గురించి చెబుతూ హంస పంచకమ్ము ఆటవెలది అని అన్నారు కదా ఆ హంస అండి. ఏ వేళలోనైనా గతి తప్పని గమనం సూర్యునిది. అటువంటి గతి తప్పని గమనంతో నాట్యమాడమని బృహన్నల ఉత్తరని ఆశీర్వదిస్తే బావుంటుందని అలా రాశానండీ' అని అన్నారు. దాంతో అటు కొండవీటి వెంకట కవి, ఇటు ఎన్.టి.ఆర్. ఇద్దరూ మురిసిపోతూ వేటూరిని కౌగలించుకున్నారు. 

Sunday, July 6, 2014

బాలమురళి గారితో నా పరిచయం అదృష్టానికి పరాకాష్ట


ఈ రోజు  (జూలై 6) బాలమురళి గారి పుట్టిన రోజు. ఆయనతో పరిచయం ఈనాటిది కాదు. అప్పుడెప్పుడో ఎన్.టి.ఆర్. లలితకళా అకాడమీలను రద్దు చేసినప్పుడు ఆంధ్ర ప్రదేశ్ లో అడుగుపెట్టనని ప్రతిజ్ట చేశారు బాలమురళి. కొన్నాళ్ళకి మద్రాసు లో వుండే టి.వి.కె. శాస్త్రి 'బాలాజీ కళ్యాణోత్సవ్' అనే కార్యక్రమాన్ని హైదరాబాద్ లో నిర్వహించారు. మహామహులంతా వచ్చి పాల్గొని పాడి వెళ్ళారు. ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి బాలమురళి గార్ని అతికష్టం మీద ఒప్పించారు. 'ఎన్.టి.ఆర్. వచ్చి వెళ్ళాక మాత్రమే నేను వస్తాను. ఆయన వుంటుండగా రాను. ' అని షరతు పెట్టారు బాలమురళి. ఆ ప్రకారమే ఎన్.టి.ఆర్. వెళ్ళాక బాలమురళి గారికి కన్ఫర్మ్ చేసి ఆయన్ని హోటల్ నుంచి వేదికకి తీసుకొచ్చే బాధ్యతని ఎస్పీ బాలు గారు, ఆయనతో పాటు నేను తీసుకున్నాం. అలా బాలమురళి గారితో మొదటి పరిచయం. 
అంతకు ముందు ఏ సినిమా అవార్డుల్లోనైనా ఉత్తమ గాయకుడిగా బాలూయే ఎన్నికయ్యేవారు. సినీహెరాల్డ్ అవార్డుల్లో - బాలమురళి గారిని ఉత్తమ గాయకుడిగా (మౌనమె నీ భాష ఓ మూగమనసా),  బాలూ గారిని ఉత్తమ సంగీత దర్శకుడిగా (తూర్పు వెళ్ళే రైలు), రాళ్ళపల్లిని ఉత్తమ నూతన హాస్యనటుడిగా (తూర్పు వెళ్ళే రైలు) నేను సూచించాను. ఆ యాజమాన్యం ఒప్పుకుంది. ఈ విషయం బాలూ గారికి తెలుసు. రాళ్ళపల్లికీ తెలుసు.  
బాలాజీ కళ్యాణోత్సవ్ ముగిశాక ఆ రాత్రి బాలమురళి గారికి ఈ అవార్డుల విషయం చెబుతూ నన్ను పరిచయం చేశారు. అప్పటి సంప్రదాయానికి భిన్నంగా ఆలోచించినందుకు బాలమురళి గారు నన్ను అభినందించారు. అదే రోజు ఆక్కడికి వేరే పనుల మీద వచ్చిన సంగీత దర్శకులు కె.వి.మహదేవన్, ఎమ్మెస్ విశ్వనాథం ఆ హోటల్ లోనే బస చేశారు. 

ఇది తెలుసుకున్న బాలు గారు డిన్నర్ కి అందర్నీ ఒక చోట చేర్చారు. బాలమురళీ గారు, మహదేవన్ గారు, ఎమ్మెస్ గారు, బాలు గారు ఇలా మహామహులంతా ఓ చోట చేరి సంగీతానికి సంబంధించిన కబుర్లు చెప్పుకుంటూ, మధ్య మధ్య పాడుకుంటూ వుంటే - భగవంతుడు నాకు చెవులు, కళ్ళు రెండు రెండే ఇచ్చినందుకు తిట్టుకోవాలా, కనీసం అవైనా ఇచ్చి ఇంతటి మహదవకాశాన్ని ఇచ్చినందుకు కృతజ్టతలు చెప్పుకోవాలా తెలియని పరిస్థితుల్లో ఉక్కిరిబిక్కిరి అయిపోయాను. రాత్రి రెండో మూడో అయింది భోజనాలు అయేసరికి. ఆనాటి  అ జ్టాపకాలు ఇవాళ్టికీ పచ్చిగానే, పచ్చగానే వున్నాయి నా గుండెల్లో.
ఆ తర్వాత ఎప్పుడు ఎక్కడ కనబడినా, ఫోన్ చేసినా అదే ఆప్యాయతతో బాలమురళి గారు నన్ను రిసీవ్ చేసుకునేవారు. అదే చనువుతో మా టీవీ తరఫున ఎక్స్ క్లూజివ్ ఇంటర్ వ్యూ కావాలని అడిగితే వెంటనే ఒప్పుకున్నారు. ఆ సందర్భంగా 3 రోజుల పాటు ఆయనతో వుండే అదృష్టం కలిగింది. 'యూనిట్ ని ఆ కార్లో వెళ్ళనీ, నువ్వు నాతో రా' తన కార్లో తన పక్కనే కూచోబెట్టుకుని, నా చెయ్యి పట్టుకుని ఎన్ని కబుర్లు చెప్పారో ...!? అలాగే భోజనం కూడా ఆయనతోనే ... తను హనుమంతుడి భక్తుడనని చెబుతూ - మేడ మీద డ్రాయింగ్ రూమ్ లో వున్న హనుమంతుడి బొమ్మ పక్కన నిలబడి, నా కోసం ఓ కీర్తనని అలాపించారు. 'మీరు సరదాగా ఒక్కరే ఉన్నప్పుడు ఏదైనా పాడుకుంటున్నట్తు వుంటే ఓ షాట్ తీసుకుంటానండీ' అని అడిగితే ' ఓ దానికేం భాగ్యం'  అంటూ ఆరుబైట వరండాలో వున్న ఉయ్యాల్లో కూచుని ఓ పాట మొత్తం పాడేశారాయన. 
ఆయన స్వహస్తాలతో రాసుకుని ప్రింట్ చేయించిన కీర్తనల పుస్తకం, మంచి మంచి ఫొటోలు, భీమ్ సేన్ జోషి , కిషోరి అమోంకర్ వంటి నిష్ణాతులతో తను కచేరీలు చేసిన డీవీడీలు నాకు కానుకగా ఇస్తూ 'ఇవి నీ దగ్గరుంచు సంగీత ప్రియులకు ఉపయోగపడతాయి' అన్నారు. ఇంతటి మహద్భాగ్యం కలగటం నేను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ...!? 
సంగీతం కోసమే పుట్టిన ఆ మహత్కారణ జన్ముడిని పుట్టిన రోజు పూటా తలుచుకోగలగడం భగవంతుడికి గుడికెళ్ళి చేయించుకున్న అర్చన లాంటిదేననుకుంటున్నాను.