Sunday, November 28, 2010

స్పీడ్ గా ఆత్మీయురాలైపోయిన స్పీడ్ సాంగ్ సింగర్



'కొమరం పులి ' సినిమాలో 'సూటిగ సూటిగ ధీటుగ ధీటుగ నాటుకు పోయిన చూపుల కొట్టుడు ' అనే స్పీడ్ సాంగ్ గుర్తుందా ? ఆ పాటని పాడినమ్మాయి పేరు శ్వేతా మోహన్. మోహన్ అన్నది వాళ్ళ నాన్నగారు కృష్ణ మోహన్ నుంచి వచ్చినది. ప్రముఖ గాయని సుజాత కూతురీమె.చెప్పవే చిరుగాలి (ఒక్కడు) ఆబ్బబ్భా ఇద్దూ (చూడాలని వుంది,చెప్పనా ప్రేమా(మనసంతా నువ్వే)పాటలు గుర్తున్నవాళ్ళకి సుజాత గారి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. శ్వేత కూడా చాలా మంచి గాయని.ఖలేజా లో పిలిచే పెదవుల పైనా,రోబో లో',చిట్టి చిట్టి రోబో-బూం బూం రోబోరా', సిద్దూ ఫ్రం శ్రీకాకుళం లో 'న నా బాబ నా'వంటి కఠినమైన,మంచి మంచి పాటలున్నయ్ ఆమె క్రెడిట్ లో. 'పులి 'లోని స్పీడ్ సాంగ్ వినగానే ఆమె ని కాంటాక్ట్ చేసి తన గురించి తెలుసుకుని అదంతా ఐడిల్ బ్రెయిన్.కాం లో 'ఎ సాంగ్ టు రిమెంబర్ ' అనే శీర్షిక లో ఆమె గురించి రాశాను. ఆ రిలేషన్ ని మనసులో పెట్టుకుని హైద్రాబాద్ లో ఓ షో ఇవ్వడానికి వచ్చినప్పుడు నన్ను కలిసింది. ఆ సందర్భంగా ఆమె కి ఈనాడు,సాక్షి పేపర్లలో, మా టీవీలో ఇంటర్వ్యూలు చేయించాను. అతి తక్కువ టైంలోనే ఆత్మీయురాలై పోయింది. ఆ సందర్భంగా తీయించుకున్న ఫొటోలే ఇవి.

Friday, November 26, 2010

గుండె చెమ్మగిల్లిన వేళ ....


దిగువన ఇదే హెడ్డింగ్ తో కొన్ని ఫీలింగ్స్ నిరాసి పేపర్ క్లిప్పింగ్స్ ని జత పరిచాను. అవి మొదట చదువుకుని తరవాత ఇది చదువుకుంటే బావుంటుంది . ఆ సీక్వెన్స్ లోనే రెండు వారాల పాటు ఈ అభిప్రాయాలు ప్రచురించ బడ్డాయి కూడా . మీరు కూడా అలాగే చదువుకోండి.. ప్లీజ్ ...

గుండె చెమ్మగిల్లిన వేళ ...


జర్నలిస్ట్ మిత్రుడు ప్రభు ఇటీవల కొంతమంది (సినీ) ప్రముఖుల నుంచి నా పై వారికి గల అభిప్రాయాల్ని సేకరించాడు. అవి ట్రేడ్ గైడ్ అనే పత్రిక లో ప్రచురించ బడ్డాయి. ఆ పత్రిక మార్కెట్ లో దొరకదు. సినీ పరిశ్రమలో మాత్రం విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది. ఆ అభిప్రాయాల్ని చదువుతూ వుంటే నా పై వారికి గల అభిమానానికి గుండె చెమ్మగిల్లి పోయింది. ఆ అభిమానాల్ని, అభిప్రాయాల్ని అలాగే నిలబెట్టుకోవాలని వుంది. ఈ సందర్భంగా ప్రభుకి ప్రత్యేక కృతజ్ఞతలు . ఇంకో మూడు అభిప్రాయాలు వున్నాయి. అవి నెక్స్ట్ పోస్టింగ్ లో ...

Tuesday, November 23, 2010

వైజయంతీ మాల ' స్టిల్ గ్రేట్ '


ఆ మధ్య చెన్నై వెళ్లి నప్పుడు అలనాటి అందాల నటి వైజయంతీమాలని కలవడం జరిగింది . అది కూడా అక్కినేని నాగేశ్వర రావు గారి ద్వారానే సాధ్యమయింది .ఆయన చెబితేనే ఆవిడ అప్పాయింట్ మెంట్ దొరికింది. చాలా పెద్ద ఇల్లు ఆవిడది . ఒక మంత్రి గారి ఇంట్లోకి వెళుతున్నట్టు అనిపించింది. ఇప్పటికీ ఆవిడ డాన్స్ ప్రోగ్రాం లు ఇస్తోందట . చాలా కలుపుగోలుగా మాట్లాడింది. ఆ సందర్బం గా తీయించుకున్న ఫోటోలే ఇవి. ఈ ఫోటోలు కూడా ఎలా తియ్యాలో , లైటింగ్ ఎలా ఉండాలో అన్నీ చెప్పి మరీ తీయించారు ఆవిడ.

Monday, November 22, 2010

తనికెళ్ళ భరణి వెండి పండగ




తనికెళ్ల భరణి తన సినీ జీవిత రజతోత్సవాన్ని పురస్కరించుకొని చేసుకున్న 'వెండి పండగ ' కి మా టీవీ మీడియా పార్టనర్ గా వ్యవహరించింది. భరణికి, నాకు వున్న స్నేహం ఇప్పటిది కాదు. దాదాపు ముప్పైయేళ్ళ క్రితంది.అతను చల్ చల్ గుర్రం నాటిక రాసిన కొత్తలో వంశీ ఆర్ట్స్ తఫున అతనితో ప్రదర్శింప చేశాను.ఆ తర్వాత అతను మెద్రాస్ వెళ్ళిపోయాడు. నేను తరంగిణి పత్రికకి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ గా వున్నప్పుడు ఓ ఫీచర్ రాయించాను.స్క్రీన్ ప్లే గ్రౌండ్ ఆ ఫీచర్ పెరు. నేను ఏ పత్రికకి మారినా భరణి ఏదో ఒకటి రాయాల్సిందే. వార్త సినిమా పేజీ కి ఇన్ చార్జ్ గా వున్నప్పుడు భరణి తో రాయించిన కొన్ని వ్యాసాలు 'నక్షత్ర దర్శనం ' పుస్తకం లో కనిపిస్తాయి. హాసం పత్రికకి ఎడిటర్ గా వున్నప్పుడు సంగీత కళాకారులపై రాయించిన వ్యాసాలు ఎందరో మహానుభావులు పుస్తకం గా వచ్చాయి. ఈ అనుబంధాన్ని పురస్కరించుకుని ఆయన వెండి పండగ నాడు ఆయనకి స్వర్ణ కంకణాన్ని తొడిగే అవకాశం నాకు మా టీవీ ద్వారా లభించింది. ఆ సందర్భం గా తీసిన ఫోటో ఇది. అప్పుడె బాలకృష్ణ ద్వారా మా టీవీ తరఫున మొమెంటొ అందుకున్నాను.ఈ జీవితానికి మరొక మంచి జ్ఞాపకం. నవంబర్ పదిహేడవ తేదీన జరిగిన ఈ ఫంక్షన్ ని మా టీవీ ఇరవై ఒకటో తేదీన ప్రసారం చేసింది. వారి సౌజన్యం తో కొన్ని వీడియో పార్ట్ లని కూడా జత పరుస్తున్నాను . చూడండి .

Monday, July 26, 2010

మా టీవీ తో మరో మధురానుభూతి

ఈ నెల (జూలై ) ఇరవై నాలుగున మా టీవీ యాజమాన్యం ' మా డే సెలబ్రేషన్స్ ' ని నిర్వహించింది . అవి ఎంత గొప్ప గా ఉన్నాయంటే ఒక్కొక్క ఐటెం గురించి ఐదేసి నిముషాల పాటు ప్రత్యేకం గా చెప్పొచ్చు . మ్యాట్రిక్స్ ప్రసాద్ గారు , అల్లు అరవింద్ గారు , చలసాని రమేష్ గారు , నాగార్జున గారు , సి. రామకృష్ణ గారు , శరత్ మరార్ గారు వీరి ఆధ్వర్యం లో , మా టీవీ వైస్ ప్రెసిడెంట్ సాయి ప్రసాద్ గారి నేతృత్వం లో జరిగిన ఆరోజు జరిగిన కార్యక్రమాలలో నా గురించి కూడా ఓ క్లిప్పింగ్ ని ప్రదర్శించడం నా జీవితానికి మిగిలిన మరో మంచి అనుభూతి . ఈ క్లిప్పింగ్ ని మా టీవీ లోని సీనియర్ మానేజర్ విక్టర్ షూట్ చేయగా , వరప్రసాద్ ఎడిట్ చేసారు . వీరందరికీ నా కృతఙ్ఞతలు . జత పరిచిన క్లిప్పింగ్ చూసి నాతో పాటు మీరు కూడా ఆనందిస్తారని ఆశిస్తూ ...

Monday, July 19, 2010

మా టీవీ మిగిల్చిన అద్భుత జ్ఞాపకాలు ...






















మా టీవీ నిర్వహించిన సూపర్ సింగర్స్ ఐదవ విభాగం ఫైనల్స్ నాకెన్నో మంచి మంచి జ్ఞాపకాలను మిగిల్చింది. కార్యక్రమం ద్వారా సినీ సంగీత ప్రపంచం లోని ప్రముఖుల్ని మరోసారి కలిసే అదృష్టం కలిగింది . వర్ధమాన గాయనీ గాయకులతో ముచ్చటించే అవకాశం వచ్చింది . సినీ సంగీతానికి సంబంధించి నాలోని ప్రతీ కణం - ప్రతీ క్షణం రగిల్చే
తపనకు ఆ ప్రోగ్రాం షూటింగ్ జరిగిన రెండు రోజులూ స్వాంతన లభించింది . మా టీవీ ప్రోగ్రామింగ్ డిపార్ట్ మెంట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ సాయి ప్రసాద్ నాకు కొన్నిబాధ్యతలను అప్ప చెప్పారు . అక్కినేని నాగేశ్వర రావు , మణిశర్మ లను ఆ కార్యక్రమానికి గెస్ట్ లు గా పిలవడం ఆ బాధ్యతల్లో ఓ భాగమే అయినా అది ఓ ఘనత గా నా ఎకౌంటు లో పడిపోయింది . అలాగే ఆ ఫైనల్స్ లో కీరవాణి గారి పక్కన కూర్చోవడం కూడా . ఆ ప్రముఖులతో నాకున్న పరిచయాలు వేరు . వారితో టీవీ లో కనిపించడం వేరు . ఆ ఘనతల వెనక నా కున్న అర్హతల మాటెలా వున్నా , వాటిని ఆ సమయంలో గుర్తించింది మాత్రం సాయి ప్రసాద్ గారే . మణిశర్మ తో నేను వున్న ఫోటోలలో ఆ పక్కనే ఎల్లో షార్ట్ లో ఫ్రెంచ్ బియర్డ్ తో వున్నది ఆయనే .. ఈ సందర్భం గా శ్రీ సాయి ప్రసాద్ గారికి నా కృతఙ్ఞతలు .

భవిష్యత్ లో చెప్పుకోడానికి గొప్ప గా ...


మా టీవీ నిర్వహించిన 'సూపర్ సింగర్స్ ' కార్యక్రమం గురించి మీ అందరికీ తెలిసే వుంటుంది . ఆ సీరీస్ లోని ఐదవ విభాగం లో నేను పాలు పంచుకునే అవకాశం వచ్చింది . ఈ ఫోటో ఆ ప్రోగ్రాం ఫైనల్స్ లో తీసినది . నా పక్కన వున్నది - శ్రీనిధి , అంజనా సౌమ్య , ప్రణవి . ముగ్గురూ మంచి గుర్తింపు ని పొందిన సింగర్ లే . ఈ ఫోటోని చూసుకుంటూ నేను మురిసిపోతూ , గొప్పగా చెప్పుకోదగ్గ స్టాయికి చేరే అర్హత ఈ ముగ్గురికీ వుంది . అంతే కాదు ప్రతిభను మించిన వినయ సంపద ముగ్గురిలోనూ వుంది . అదే వాళ్ళను పైకి తీసుకు వస్తుంది , కాపాడుతుంది కూడా . ఈ ఫోటో ని నాకు ఇస్తూ " మీ అమ్మాయిలా సార్ ? " అని అడిగారు - వాళ్ళతో ముఖ పరిచయం లేని వాళ్ళు . ఒక విధం గా అది కరక్టే . నిజానికి నాకు ఇద్దరు అమ్మాయిలు. ఇద్దరూ అద్భుతంగా కాకపోయినా , బాగా పాడతారు . సింగింగ్ ని ప్రొఫెషన్ గా తీసుకోక పోవడం వల్ల అద్భుతం గా పాడే స్థాయి వాళ్లకి రాలేదు . ' ఒక విధం గా అది కరక్టే ' అని ఎందుకన్నానంటే - బాగా పాడుతూ ఆ వయసులో వున్న ఏ సింగర్ ని చూసినా నాకు నా కూతుళ్ళని చూసినట్టే వుంటుంది . వాళ్ళతో మాట్లాడుతూ వుంటే నాకు నా పిల్లలతో మాట్లాడినట్టే వుంటుంది . సూపర్ సింగర్ ద్వారా అందరికీ బాగా తెలిసిన శ్రావణ భార్గవి ఆంటే నాకు మరీ మరీ ఇష్టం . "మా ఇంటికి రామ్మా " అని మనసారా పిలిచాను కూడా . ఆ అమ్మాయి తో ఫోటో తీయించుకునే రోజు ఎప్పుడొస్తుందో ఏమో ... ఆ అమ్మాయి కి కూడా సింగర్ గా చాలా మంచి భవిష్యత్ వుందని నా నమ్మకం .

Thursday, July 15, 2010

ప్రకృతి ధర్మం


గుండెల్లో బడబాగ్నిని దాచుకుంటే

బైటికుబికే నీరు

ఉప్పగానే వుంటుంది

అది మనిషైనా సరే

సముద్రమైనా సరే ... !!

Saturday, July 3, 2010

అనుభవైకవేద్యం


బిడ్డకు తల్లి స్పర్శ

భార్యకు భర్త స్పర్శ

కవికి రస స్పర్శ

ఒకరు బోధించేవి కావు