
'అందాల చందమామ లాంటి అమ్మడూ' అనే పల్లవితో మొదలయ్యే ఈ 'కరెంట్' టైటిల్ సాంగ్ ని బెన్ని దయాళ్ పాడారు. మధ్య మధ్య దేవిశ్రీ వాయిస్ అవసరమైనప్పుడు కలుస్తూ వుంటుంది. కుర్రకారు దృష్టిలో మొదటి స్థానాన్ని, పెద్దకారు దృష్టిలో రెండవ స్థానాన్ని ఆక్రమించుకుంటుందీ పాట. అందుక్కారణం 'కే ఐ యెన్ జీ వస్తున్నాడూ కింగ్' ట్యూన్ ని గుర్తుకు తెచ్చేలా ఈ పాటలో 'సర్రు మంటూ ఒళ్ళంత పాకే ఫీలింగేరా కరంట్' అనే వాక్యాలు వుండడమే. ఇక మిగిలిన పాటంతా హుషారుగానే వుంటుంది. దానికి రచయిత రామజోగయ్య శాస్త్రి ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ బాగా వర్కవుట్ అయ్యాయి. 'నీ హార్ట్ కొత్త బీటు కొట్టినప్పుడూ- రీచార్జ్ చేసినట్టు ఎనర్జి లెవెల్స్ ఎవరెస్టుకెక్కినప్పుడూ - నీ మాట ఈల పాట పాడినప్పుడూ - నీ మనసు తీన్ మార్ ఆడినప్పుడూ - నీ కంటి చూపు నీ మాట వినకుండ దిక్కులన్ని చూసినప్పుడూ- రంగుల్తో రామకోటి రాసినప్పుడూ-నీ పేరు నువ్వే మర్చిపోయినప్పుడూ - నువ్వంటే నీకె చాలా నచ్చినప్పుడూ - ఆనాటి రోమియో నీలాగ పుట్టినట్టు నువ్వే ఫీలైనప్పుడూ' లాంటి వాక్యాలు మచ్చుకి కొన్ని .