Sunday, January 23, 2011

ఈవీవీ జ్ఞాపకాలు - 1


సాధారణంగా నాకు నిద్ర పడితే మధ్యలో మెలకువ రావడం బహు అరుదు - ఒంట్లో బాగులేక పోతేనే తప్ప.  ఈ జనవరి 21 న   మాత్రం రాత్రి పన్నెండు గంటలకోసారి, తెల్లవారు ఝామున మూడు గంటలకోసారి, మళ్ళీ నాలుగు గంటలకోసారి తెలివి వచ్చింది. ఎందుకిలా అవుతోంది అనుకుంటూ బలవంతాన పడుకున్నాను. పొద్దున్నే లేచే సరికి ఈవీవీ లేరన్న వార్త . ఏం చెయ్యాలో తోచలేదు. మనసుని జ్నాపకాల ముసుర్నుంచి తప్పించడం నా వల్ల కాలేదు.
నేను జంధ్యాలతో కలిసి తిరిగే రోజుల్లో ఆయనకి అసిస్టెంటు డైరెక్టర్ గా పరిచయ్యమయ్యాడు ఈవీవీ.  "సత్యం" అని పిలిచే వాళ్ళం. జంధ్యాల అంటే అతనికి విపరీతమైన గౌరవం. ఓసారి అవుట్ డోర్ షూటింగ్ లో చూడ్డానికి వచ్చిన వాళ్ళెవరో జంధ్యాల గురించి బ్యాడ్ గా కామెంట్ చేశారని వాళ్ళని కొట్టబోయేంత పని చేశాడు. అంత ఆవేశం మళ్ళీ అతనిలో ఎప్పుడూ చూడలేదు. జంధ్యాలకి సినిమాల్లేక ఖాళీ గా వున్నప్పుడు తను డైరెక్టర్ గా చాలా బిజీగా వున్నాడు. ఆ టైమ్ లో  జంధ్యాల ద్వారా పైకొచ్చిన వాళ్ళంతా కేవలం లిప్ సింపతీ చూపించారే తప్ప ఎవ్వరూ ఏమీ చెయ్యలేదు. తను మాత్రం ఓ పళ్ళెంలోలక్ష రూపాయల క్యాష్ పట్టు బట్టలతో సహా పెట్టి మరీ వచ్చాడు. అంత గడవని పరిస్థితేం కాదు జంధ్యాలది. ఐనా ఈవీవీ చేసిన ఈ పని జంధ్యాలకి ఓ మోరల్ సపోర్ట్ లాంటిది. జంధ్యాలే గనుక బ్రతికుంటే ఆయనకి ఆత్మ స్థైర్యం కలిగించడానికి తను నిర్మాతగా జంధ్యాల దర్శకత్వంలో ఓ సినిమా తీసి వుండేవాడేమో . (పై నున్న ఫోటో 31 డిసెంబర్ 2000 న తీసినది) .


2 comments:

Rajesh T said...

కొన్నాళ్ళ క్రితం ఒక ఛానల్లో ఒక లైవ్ షో లో ఒక అమ్మాయి తన భర్త రెండు కిడ్నీలు పని చేయటంలేదని, తన కిడ్నీ తన భర్తకి ఇవ్వటానికి రెడీగా ఉందని, కానీ ఆపరేషన్ కి కావాల్సిన డబ్బులు లేవని కన్నీళ్ళ పర్యంతం అయ్యింది. ఈ లైవ్ షో జరుగుతుండగానే, ఈవివి అల్లరి నరేష్ ని స్టూడియో కి పంపించి, 50,000 Rs. ఆ అమ్మాయికి అందజేశారు. అతి తక్కువ సమయంలో, అంత పెద్ద మొత్తంలో డబ్బు సహాయం చేసి ఈ వి వి, తను ఒక గొప్ప డైరెక్టర్ అనే కాదు, మానవత్వం ఉన్న ఒక మంచి మనిషి అని నిరూపించుకున్నారు.

omprakashvaddi said...

ఈవీవీ గారిలో ఉన్న గుణం ఎవరినైనా ఓన్ చేసుకోవటం... కొత్త వాడినైన చక్కగా పలకరిస్తారు... పరిచయం ఏర్పడ్డాక చనువుగా మాట్లాడతారు... ఈ పదమూడేళ్ళ సినీ పాత్రికేయ ప్రస్థానంలో ఏ రోజు ఆయన వల్ల ఇబ్బంది పడింది లేదు... పైగా ఎన్నో తీపి జ్ఞాపకాలు...