సుసర్ల దక్షిణామూర్తి గారి గురించి నేను రాసిన ఆర్టికిల్ 26 ఫిబ్రవరి 2012సితారా లో వేశారు.
ఆ ఆర్టికిల్ నే ఈనాడు ఇంటర్నెట్ ఎడిషన్ లో కూడా పబ్లిష్ చేశారు. జర్నలిస్ట్ గా వృత్తి పరంగా , వ్యక్తిగతంగా ఇది నిజంగా నాకెంతో సంతృప్తిని కలిగించిన విషయం. ఇక్కడ ఓ రెండు విషయాలు చెప్పుకోవాలి.
(1) సర్వాధికారి చిత్రం లో ఎన్టీఆర్ కి డబ్బింగ్ చెప్పినట్టుగా ప్రింట్ వుంటుంది.
అది ప్రింటింగ్ మిస్టేక్.
సుసర్ల వారు ఎం.జీ.ఆర్. కి డబ్బింగ్ చెప్పారు. పాఠకులు సవరించుకుని చదువుకోండి.
(2) అలాగే స్పేస్ లేక పొవడం వల్ల రెండు పేరాలు వారికి వెయ్యడానికి కుదరలేదు. ఇవి ఇక్కడ
జత పరుస్తున్నాను. (జగపతి వారి తొలి చిత్రం అన్నపూర్ణ లో అనే పేరా కి ముందు
ఈ రెండు పేరాలూ వుండాలి. ఇవి కూడా కలిపి చదువుకోండి.
" కొన్ని కొన్ని పాటల్ని ఎడాప్ట్ చేసినప్పుడు ఆయన చేసిన ప్రయోగాల్ని ప్రయోగాలుగా గుర్తించకుండా ఆ పాటల్ని పూర్తిగా ఆయన ఎక్కౌంట్ లో వేసేసారు మనవాళ్ళు. ఉదాహరణకి ఎమ్జీఆర్, భానుమతి నటించిన 'ఆలీబాబా 40 దొంగలు. అంతకు ముందు మహిపాల్, షకీలా హీరో హీరోయిన్లుగా హిందీ లో వచ్చిన 'ఆలీబాబా చాలీస్ చోర్' ఆధారంగా తీశారీ సినిమాని. చిత్రగుప్త - ఎస్. ఎన్. త్రిపాఠి స్వరపరిచిన కొన్ని ట్యూన్ లని తెలుగు, తమిళ వెర్షన్ లకు వాడుకున్నారు. అందులో 'ప్రియతమా మనసు మారునా' (తమిళం లో 'మాసిలా వున్మై కాదలా') ఒకటి. హిందీ వెర్షన్ లో 'ఏ సభా ఉన్ సే కెహ జరా' . అయినా సరే ఈ పాటను సుసర్ల వారి సృజన గా చెప్తారు. నిజానికి తెలుగు తమిళ వెర్షన్ లకు ఆయన చేసిన మార్పు వేరు. హిందీ వెర్షన్ లోని తాళ గతిని మార్చి పాటను స్పీడు చేశారు. ఇంటర్లూడ్లు మార్చారు. అవేవీ గుర్తింపు లోకి రాకుండా పోయాయి.
అలాగే 'వీర కంకణం' లో జగ్గయ్యకు ఘంటసాల పాడిన రెండు పాటలు. ఈ సినిమాలో హీరో ఎన్టీయార్ కి ఏయం రాజా చేత, విలన్ జగ్గయ్య కి ఘంటసాల చేత పాడించారని - ఇదొక ప్రయోగం అనీ తెగ చెప్పేసుకున్నారు. నిజానికి అది ప్రయోగం కాదు. అవసరం. సుసర్ల దాన్ని తెలివిగా పరిష్కరించుకున్నారు. 'వీర కంకణం' లో ఎన్టీయార్ పాటలకు ఘంటసాలే అక్కర్లేదు. కానీ జగయ్య పాటలకు ఘంటసాలే కావాలి. ఎందుకంటే తమిళ మాతృక 'మంత్రి కుమారి' లో జి. రామనాథన్ స్వరపరిచిన ట్యూన్లు అటువంటివి. ఈ 'వీర కంకణం' లోని ' తేలి తేలి నా మనసు' (తమిళం లో 'ఉలవుమ్ తెన్ద్ర పాటయిలే') పాటలో 'కొండ వంటి గుండె నీవు తెలియ లేవులే' దగ్గిర 'నీదు ఓర చూపులోన నేర్చుకుంటినే' దగ్గిర గల ఎగుడు దిగుడుల్లో వాయిస్ మీద పూర్తిపట్టు తో పాడాలి. 'నలుసులెన్ని ఉన్నవో తెలుసుకోగదే' దగ్గర వాయిస్ ని ఒక్కసారిగా రెయిజ్ చెయ్యాలి. ఇవన్నీ ఘంటసాల గొంతుకి నప్పుతాయి. అలాగే 'రావే రావే పోవు స్థలం అతి చేరువయే నా రాణీ ' (తమిళం లో 'వారాయ్ నీ వారాయ్) పాట తెలుగులో ఘంటసాల తప్ప మరొకరు పాడలేని పాట. బాలూ వంటి గాయకుడు డిమాన్ స్త్రేట్ చేసి చూపిస్తే తప్ప ఈ పాటకు ఘంటసాల వాయిస్ ఎంత అవసరమో విప్పి చెప్పలేనంత గొప్ప పాట. అందుకే ఈ పాటల్ని ఘంటసాల చేత పాడించడం ప్రయోగం కాదు అవసరం. "
ఇవే ఆ రెండు పేరాలూ
---------------------------------------------------------------------------------------------------------------
మితృలు సూర్య ప్రకాశ రావు గారు కూడా ఓ లింకుని పంపించారు. దాన్ని పేస్ట్ చేస్తున్నాను.చూసి మీ కామెంట్లను జత చేయండి.