Sunday, February 5, 2012

Hearts off to Shreya Goshal హార్ట్సాఫ్ టు శ్రేయా గోషల్





నా అనుకున్న వాళ్ళు
మన అనుకున్న వాళ్ళు
ఇంచుమించు ప్రతి ఒక్కరూ ...
మనల్ని ఒంటరిగా ఒదిలేసే క్షణాలు చాలా సార్లు వుంటాయి జీవితంలో .
ఎవరి కారణాలు వారికి వుంటాయి.
మనం మాత్రం ఒంటరిగా మిగిలిపోతూవుంటాం.
ఒక్కో సారి సమూహంలో కూడా ఏకాంతం అయిపోతూ వుంటాం.

మనసులోనా ... మస్తిష్కం లోనా ...
ఆలోచనలోనా .. అనుభూతిలోనా ...
ఎక్కడో ఏమిటో తెలియని గ్లాని
ఎందుకో చెప్పలేం గాని ....

అప్పుడో అమృత స్పర్శ ...
భగవంతుడు మనకోసమే పంపినట్టు !
ఓ చల్లటి వెలుగు...
మెల్లగా పాకుతూ, మనసంతా పరుచుకుంటూ... !!
ఎక్కిళ్ళతో ఎగసి పడుతున్నగుండె ...
నిశ్శబ్దంగా రోదిస్తూంటే ...
ఉబుకుతున్న కన్నీటి బిందువుల్లో ఓ తియ్యటి తృప్తి !!!
ఈ క్షణాన ఈ ప్రాణాలు ఇలాగే పోతే బాగుణ్ణు అనుకునేలా ...
ఈ అలౌకిక ఆనందం అందరికీ పంచడం కోసం బ్రతకాలనుకునేలా ...

ఈ అనుభూతులన్నిటినీ సంగీతం ద్వారా అందించగలమా ?
ఒకవేళ స్వరపరిస్తే ...
ఆపాత మధురమైన ఆ సంగీతానికి
ఆలోచనామృత తుల్యమైన సాహిత్యం సహాయం అవసరమా ?
అనుభవైకవేద్య మైన ఆ మాధుర్యానికి ఆలాపనలు సరిపోవా ?
అది సరి అయితే - అందుకు సరితూగ గల స్వరం వుందా ...? అసలుంటుందా ?
ఉన్నా ఆ స్వరానికి ఈ అనుభూతిని ఆవిష్కరించగల సామర్ధ్యం వుంటుందా ?
అదీ వున్నా ,,,
ఆ సామర్ధ్యానికి - గుండె తడిని కంటి చెమ్మ గా మార్చి ప్రవహింప చేసే - హృదయం వుండే అవకాశం వుందా ?

సుస్వర సంగీతప్రియుల కోసం ఆ సరస్వతీ దేవి రెహమాన్ మేధస్సులో సృష్టించిన ఓ ప్రయోగాన్ని ఈ ప్రశ్నల రూపంలోకి మార్చుకుంటే అందుకు వచ్చే సమాధానం శ్రేయా గోషల్ , నిదర్శనం 'ఏక్ దివానా థా' సినిమా ఆడియోలో 'బ్రేకింగ్ ప్రామిసెస్' పేరుతో ఆమె ఆలపించిన ఆలాపనలు.

తెలుగులో వచ్చిన 'ఏ మాయ చేసావె', తమిళంలో వచ్చిన 'విన్నైత్తాండి వరువాయా' చిత్రాల హిందీ వెర్షనే 'ఏక్ దివానా థా'. తెలుగు తమిళ చిత్రాల్లోని ట్యూన్ లన్నీ హిందీ వెర్షన్ లోనూ వున్నాయి. అవి కాక మరికొన్ని అదనంగా కూడా వున్నాయి . వాటిలో ఒకటి శ్రేయా గోషల్ తో రెహమాన్ పాడించిన ఈ ఆలాపన. 'ఆరోమలై' అన్న పదమొక్కటె ఇందులోని సాహిత్యం. తక్కినదంతా ఆలాపనే. ఆరోమలై అన్నది మలయాళ పదం. తెలుగులో 'నా ప్రియతమా' దానికి దీటైన అర్ధం అని మా అమ్మాయి సుమ (ప్రముఖ యాంకర్) చెప్పింది.

ఈ ఆలాపన భాగేశ్వరి రాగం లో వుంది. ఉత్తరాదిన దీన్ని భాగేశ్రీ అని అంటుంటారు. మంటలు రేపే నెలరాజా (రాము), రారా కనరారా (జగదేక వీరుని కథ), నైన్ సే నైన్ నాహీ మిలా (ఝనక్ ఝనక్ పాయల్ బాజే) వంటి సినీ గీతాలు ఈ రాగానికి మంచి ఉదాహరణలు. శోక తప్త విరహం ఈ రాగంలో బాగా పలుకుతుంది. గుండెలు పిండే తత్వం ఈ రాగం లో ఒదుగుతుంది.. రెహమాన్ ఇవన్నీ తెలిసిన వాడు కావడం చేత ఈ రాగం లోని జీవస్వరాలన్నిటినీ పిండి శ్రేయా గోషాల్ అనే మకరంద మాధుర్యం తో కలగలిపి సుస్వరానికి పులకించిపోయే శ్రోతలకు ఒక మరపురాని కానుకగా సమర్పించాడు.

రెహమాన్ ఇంతటి వాడు, అంతటి వాడు అని ఇవాళ ప్రత్యేకించి చెప్పవలసిన అవసరమూ లేదు. అది కొత్త విషయమూ కాదు. కానీ శ్రేయా గోషల్ గురించి మాత్రం చెప్పుకోవాలి. రెహమాన్ ఇచ్చింది ఇచ్చినట్టు పాడి వుంటే ఆమె గ్రాహ్యతని మెచ్చుకోవాలి. లేక రాగ స్వభావం చెప్పేసి ఆలపించుకుంటూ పొమ్మంటే ఆమె కల్పనా శక్తికి జోహార్లు చెయ్యాలి. ఎలా చూసినా హ్యాట్సాఫ్ ... సారీ ... హార్ట్సాఫ్ టు శ్రేయా గోషల్.

'ఏక్ దివానా థా' లోని ఈ ఆలాపనని అసలు ఏ పాటతోనూ కలిపి వినకండి. అంతకంటే ముందు మీ నుంచి మీ హృదయాన్ని బైటికి పంపేయండి. పంపే ముందు ఈ ఆలాపన ని ఇచ్చివినమని చెప్పండి. తర్వాత అది ఎంత అనందం తో మీ దగ్గరికి వస్తుందో మీకే తెలుస్తుంది. అలా జరక్కపోతే భగవంతుడనే డాక్టర్ మీ గురించి ఇచ్చే స్కానింగ్ రిపోర్ట్ చూసి చాలా బాధ పడవలసి వుంటుంది


1 comment:

వేణు said...

రాజా గారూ! మీ పోస్టు చూశాక 'ఆరోమలై' పాట విన్నాను. నాటి స్వర్ణయుగ సంగీతాన్ని తలపిస్తూ, హృదయావిష్కరణ చేస్తూ, మైమరపిస్తూ అలవోకగా సాగిపోయింది శ్రేయాలాపన. ఆ స్వరాల్లోని ప్రత్యేకతకు మీ అక్షర స్పందన అమోఘం! మీకు మనస్ఫూర్తిగా అభినందనలూ, కృతజ్ఞతలూ!