Monday, January 23, 2012

E mail of Bapu




జనవరి 25 న మా టీవీ మ్యూజిక్ అవార్డుల కార్యక్రమాన్ని తొలిసారిగా నిర్వహించబోతోంది. అందులోని భాగంగా బాపు గారిని ఆహ్వానించే బాధ్యత నాపై పడింది . టిక్కెట్లు రిజర్వు చేసాం అని చెప్పగానే "అయితే ఆ ఈ టికెట్స్ ని నా ఈ మెయిల్ కి పంపండి " అన్నారు బాపు గారు. " చెప్పండి" అన్నాను. " రాసుకోండి ... బాపు అండర్ స్కోర్ రమణ " అని చెబుతున్నారు బాపు గారు ... నా చెవులు ఏదో వింటున్నాయి చేతులు రాసేసుకుంటున్నాయి. మనసు మాత్రం పిండేసినట్టు అయిపోయింది. బాపు రమణల గురించి అందరికీ అన్నీ తెలుసు. గానీ రమణ గారి పేరుని బాపు గారు తన ఈ మెయిల్లో ఇముడ్చుకుంటారని ఊహించలేక పోయాను.
ఓ సారి బాపు గారి చెబుతూ " బాపు అసలు పేరు ఏమిటో తెలుసా ?" అని అడిగాను. " ఓస్ ... ఆమాత్రం తెలీదనుకున్నావా ... సత్తిరాజు లక్ష్మినారాయణ " అన్నారు మా ఫ్రెండ్స్. " మరదే ... అదెవరైనా చెప్తారు. ఆయన అసలు పేరు ... ముళ్ళపూడి వెంకట రమణ " అన్నాను. మంచి ప్రశంసలు లభించాయి ఆ చమత్కారానికి.
ఈ సందర్భం గా ఓ మాట చెప్పుకోవాలి. రెండేళ్ళ క్రితం వరకూ ... గత పదేళ్ళు గా బాపు రమణలకి పద్మశ్రీ ఇవ్వాలని రిప్రజంటేషన్ లు పెడుతూ వచ్చాను. విసుగొచ్చేసింది. ఇప్పుడు పద్మశ్రీ ఇచ్చినా అది తక్కువే . పైగా రమణ గారు లేకుండా ... ఈ విషయం లో మన ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మంచి పనే చేసింది. రఘుపతి వెంకయ్య అవార్డుని ఇద్దరికీ కలిపి ఒకేసారి ఇచ్చింది. ఈ సంవత్సరం పంపిన రికమండేషన్ లలో బాపు గారి పేరు వుందట. రేపు రాబోయే 25 మధ్యాహ్నం కల్లా తెలిసిపోతుంది అందరికీ. బాపు గారికి పద్మశ్రీ కాకుండా పద్మ భూషణ్ రావాలని కోరుకుందాం .

Sunday, January 22, 2012

Status of Lyric writers





  ' శ్రీరామరాజ్యం'లో పాటలు విన్నాక ఓ ఫ్రెండు అడిగాడు - 'సీతా రామ చరితం ' పాటలో 'దశరథుని కోడలికా ధర్మపరీక్ష ' అని ఎందుకు రాశారంటావ్- అని. చాలా మంచి ప్రశ్న అది . ఇక్ష్వాకుల వంశం లో అందరూ ధర్మానికి కట్టుబడినవారే. తను పుత్రశోకంతో మరణిస్తానని తెలుసు దశరథునికి. అది శ్రవణకుమారుని తలిదండ్రుల శాపం. రాముణ్ని అడవులకు పంపితే తన ప్రాణం పోతుందని తెలిసి మరీ ధర్మానికి కట్టుబడినది దశరథుడే. అంచేతే ఆ వాక్యం.

ఎందుకు ఈ పరీక్ష ఎవ్వరికీ పరీక్ష
శ్రీరాముని భార్యకా శీలపరీక్ష
అయోనిజకి  అవనిజకా అగ్ని పరీక్ష
దశరథుని కోడలికా ధర్మ పరీక్ష
జనకుని కూతురికా అనుమాన పరీక్ష
రాముని ప్రాణానికా జానకి దేహానికా
సూర్యుని వంశానికా ఈ లోకం నోటికా

ఇలాటిదే మరో అద్భుత వాక్యం - 'జగదానంద కారకా' పాటలో .... !

రాజ మకుటమే వొసగెలే నవరత్న కాంతి నీరాజనం
సూర్యవంశ సింహాసనం పులకించి చేసే అభివందనం

రాజ మకుటం గా పెట్టబోయే కిరీటం లోని నవరత్నాలన్నీతమ కాంతులతో నీరాజనం పడుతున్నాయట. అలాగే సూర్య వంశ సింహాసనం పులకించిపోయి తనే అభివందనం చేసిందట. ఏ రాజైనా సింహాసనానికి అభివందనం చేసి కూర్చుంటాడు. కానీ రాముడికి సూర్య వంశ సింహాసనం పులకించి పోయి తనే అభివందనం చేసిందట.
ఇంకా ఇలాంటి గొప్ప గొప్ప ఎక్స్ ప్రెషన్లతో పాటలు రాశాడు జొన్నవిత్తుల 'శ్రీరామ రాజ్యం'లో.
ఇక్కడ చెప్పుకోవలసిందేమిటంటే 'శ్రీరామ రాజ్యం' లో జొన్నవిత్తుల అన్ని పాటలూ రాశాడు. సింగిల్ కార్డ్ రైటర్. అయినా పబ్లిసిటీ లోగోలో ఆయన పేరు లేదు. అంతే కాదు వాల్ పోస్టర్స్ లో కూడా ఎక్కడా
ఆయన పేరు కనబడదు.
ఇదీ మన వాళ్ళు లిరిక్ రైటర్స్ కి ఇచ్చే గౌరవం. ఇదొక ఉదాహరణ మాత్రమే.
కొన్ని ఆడియో ఫంక్షన్స్ లో ఆ సినిమాకి పాటలు రాసే గీత రచయితలు కనబడరు. కారణం వారికి ఆహ్వానం వుండదు. ఒకవేళ సదరు గీత రచయితలు వచ్చినా వారిని స్టేజ్ మీదకు పిలవరు. ఒకవేళ పిలిచినా వారి పని చప్పట్లు కొట్టడం, (కుదిర్తే) క్యాసెట్ కవర్లు పట్టుకుని ఫోటోల్లో కనబడడం ... అంతకు మించి మాట్లాడే చాన్స్ వుండదు. తెలుగు రాని హీరోయిన్లను మాట్లాడమని బలవంతం చేస్తారు కానీ రచయితలకి ఇవ్వాల్సిన  గౌరవం  ఇవ్వరు. అదీ సంగతి.
మళ్ళీ ఇందులో కొంతమంది ఎక్సెప్షన్. కృష్ణవంశీ సినిమా ఆడియో ఫంక్షన్స్ లో రైటర్స్ కి గౌరవం వుంటుంది. వై వీ యస్ చౌదరి దారే వేరు. సీడీ కవర్ మీద రైటర్ ఫోటో వేస్తాడు. వీలయితే రైటర్ కి ఓ బిరుదు కూడా ఇచ్చేస్తాడు. 'సీతయ్య' ఆడియో ఫంక్షన్ లో చంద్రబోస్ కి 'సాహిత్య చిచ్చర పిడుగు ' అనే బిరుదు ఇచ్చేసాడు. ఈ మధ్యనే జరిగిన  'నిప్పు' ఆడియో ఫంక్షన్ లో ఆ సినిమాకి 6 గురు పాటలు రాస్తే ఆ ఆరుగురినీ ( చంద్రబోస్, రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరాం, వనమాలి, భాస్కరభట్ల, విశ్వ) స్టేజ్ మీదికి పిలిపించి మాట్లాడే అవకాశం ఇచ్చాడు. అంతే కాదు సీడీ కవర్ మీద ఆ ఆరుగురి ఫోటోలూ, వారి పేర్లూ వచ్చేట్టు చూశాడు. అది కాక  ఫంక్షన్ లో ఆ ఆరుగురి ఫొటోలతో స్పెషల్ గా ఓ హోర్దింగే పెట్టాడు కూడా. 'కవి గాయక నట వైతాళిక ' అన్నారు పెద్దలు. అంటే ప్రాదాన్యతా క్రమం లో కవి ముందుండాలి. కవి, రచయిత వీళ్ళ విలువ తెలిసున్నది ఇవాళ కొంతమందికి మాత్రమే.

















Saturday, January 21, 2012

Puri Jagan's version - Perversion (an opinion on Business man)




Puri Jagan's version - Perversion (opinion on Business man)

పెర్వెర్టేడ్ జీనియస్ లని కొందరుంటారు . ఇందుకు సినీ రంగం మినహాయింపేం కాదు. ఈ రంగం లోని పెర్వెర్టేడ్ జీనియస్ లు  - వాళ్ళ పైత్యాన్ని కసిగా మార్చుకుని సినిమాలు తీసేసి జనాల మీదకి వదుల్తూ వుంటారు.వీళ్ళలో కొందరు ఉగ్రవాదులు గా, మరికొందరు పిచ్చివాళ్ళు గా మారే అవకాశం వుంది.   ఈ 
 రెండు స్లాట్ లకి మధ్య మరో కొత్త స్లాట్ ని తనకు తాను గా క్రియేట్ చేసుకున్నాడు పూరి జగన్నాథ్- బిజినెస్ మాన్- ద్వారా .

పూరి జగన్ టేకింగ్ స్పీడు గా జనాలకి నచ్చేట్టు వుంటుంది. డైలాగులు పవర్ ఫుల్ గా వుంటాయి. అందుకని ఏం చెబితే దానికి కన్విన్స్ అయిపోతారనుకుంటే ఎలా ? మచ్చుకి ఓ రెండు మూడు చూద్దాం ..

" డిస్కవరీ చానెల్ లో పులి జింకని వేటాడడం చూస్తూ జింక బ్రతకాలని ప్రార్ధన చేస్తాం. జింక తప్పించుకోగానే టీవీ కట్టేసి కోడినివండుకుని బిరియాని తింటాం . నిజానికి అది జింక మీద ప్రేమ కాదు పులి మీద కోపం. దాన్ని ఏం చెయ్యలేక (ఇక్కడ పూరి వాడిన మాట వేరు గా వుంటుంది) అది ఓడిపోతే చూడాలనుకుంటాం".

జింక తప్పించుకుంటే బావుంటుందని కోరుకోవడానికి కారణం పులి క్రౌర్యం .. దాని పశుబలం. జాలి జింక నిస్సహాయత గురించి. అక్కడ మనకి కలిగే భావనకి కారణం మనలోని కరుణ. అంతేగాని మన చేతకానితనం కాదు. మనం గనక అడవిలో వుండి వుంటే జింక ని కాపాడడానికి ఏదో ఒక ప్రయత్నం చేస్తాం. అది మన శక్తికి మించిన పని అయితే తెలివితేటలతో మరో మార్గం కనిపెడతాం. కొరివి బాణాలతో , డప్పులతో పులిని బెదరగొట్టి జింకల్ని కాపాడుకున్నకోయవాళ్ళ గురించి విశాఖ పట్నం ఏజెన్సీ ఏరియాల్లో తిరిగిన పూరి జగన్ కి తెలియదా ? అంతే గానీ టీవీ చూస్తున్నవాళ్ళు టీవీల్లోకి దూరి పోయి పులిని చంపెయ్యగలరా ? టీవి కట్టేసిన తర్వాత కోడి ని వండుకుని తినడం కేవలం కసితో అన్నమాటే. నిజానికి అటువంటి హింసాత్మక దృశ్యాలు చూసిన తరువాత నాన్ వెజిటేరియన్ ముట్టని వాళ్ళు నాన్ వెజిటేరియన్లలో కూడా వుంటారు. జీవితం లో దెబ్బతిని పెర్వెర్షన్ లోకి వెళ్ళిన వాళ్ళకే బ్రెయిన్ ఇలా విపరీత ధోరణిలో పనిచేస్తూ వుంటుంది.

 ఇంకో డైలాగ్ 

" మీ గురించి కలలు కనండి . ప్రపంచం గురించి కలలు కనకండి "

ఇదెంత తప్పుడు సలహా ? కుక్క కాటుకి మందు కనిపెట్టిన లూయీ పాశ్చర్, బల్బ్ ని కనుక్కున్న ఎడిసన్ దగ్గర్నుంచి ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి కృషి చేస్తున్న వాళ్ళంతా ప్రపంచం గురించి కలలు కన్నవాళ్ళు కాదా ? హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో మునిగి పోకుండా ప్లాన్ చేసిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య దగ్గిరనుంచి నిన్న మొన్నటి అబ్దుల్ కలాం వరకు ప్రపంచం గురించి కలలు కన్నవాళ్ళు కాదా ? ఇవాళ మనం అనుభవిస్తున్నసుఖాలు సౌకర్యాలు ఎంతమంది కలల ఫలితం ? వాళ్ళంతా పిచ్చివాళ్ళా ? పవర్ ఫుల్ మీడియం లో రెస్పాన్సిబుల్ పొజిషన్ లో వున్నవాళ్ళు రాయాల్సిన డైలాగేనా ఇది ? 

చిట్ట చివర్న సందేశం పేరిట మరో డైలాగు ...
 
" ఎవరేం చెప్పినా వినొద్దు  ( మరి ఈయన  మాటెందుకు వినాలి ?) 
ముఖ్యం గా మనుషులమాటనమ్మొద్దు(ఈయన మనిషి కాదా ....? ) "

పూరి జగన్ ని అతని స్నేహితుడు (గుడ్డిగా నమ్మినందుకు గాను) 30 కోట్లకు  ముంచి పోయాడు ..నిజం గా చాలా ఘోరం . క్షమించ రాని నేరం . అంత దెబ్బతిని పడి లేస్తున్న జగన్ ని సానుభూతి తో చూడాల్సిందే. అంత మాత్రం చేత ఆ కసిని ఆయన కోట్లాది తెలుగు ప్రజల మీద తీర్చుకుంటాననడం ఎంత వరకు న్యాయం ? అందుకు మహేష్ బాబు గ్లామర్ ని, యాక్టింగ్ టాలెంట్ ని, కెరీర్ ని ఫణంగా పెట్టాలనుకోవడం ఎంత వరకు కరెక్ట్ ? మహేష్ బాబు తో పలికించిన బూతులకి, తిట్లకి మహేష్ బాబు అభిమానులే కాదు తెలుగు ప్రజలు కూడా పూరి జగన్ని క్షమించ(లే)రు.

అంతెందుకు ... మాఫియా లీడర్స్ ని, వాళ్ళ యాక్టివిటీస్ ని రాబిన్ హుడ్ పాలసీ లా గ్లోరిఫై చేయాలనుకోవడం అనే థాట్ ని ప్రమోట్ చేసినందుకు  సుమోటో కింద  కేసు బుక్ చేస్తే ఏమవుతుంది ?

దీనికి బదులు 30 కోట్లకి మునిగిపోయిన తన కథనే తీసుకుని సినిమా గా తీసి  'ఇది మీ పూరి జగన్ రియల్ స్టోరీ' అని చివర్న చెప్పి వుంటే ప్రజల్లో అతనికి వున్న క్రేజ్ కి మూడు రోజుల్లో 30 కోట్లు వచ్చి ఉండేవి కదా  . ఇవాళ అతను పోగొట్టుకున్న గుడ్ విల్ విలువ 30 కోట్లకు పైనే... కాదంటారా  ?

Tuesday, December 27, 2011

ఆనందం తో ఆశ్చర్య పోయిన హేమా మాలిని

నిన్న  (డిసెంబర్ 26th ) ఏయన్నార్ నేషనల్ అవార్డు హేమామాలిని కి ఇచ్చారు. సాధారణంగా నాగేశ్వరరావు గారు చేసే ఫంక్షన్ లన్నిటికీ  వారి అభిమానాన్ని చూరగొన్న వ్యక్తి గా  నాకు ఇన్విటేషన్ వస్తుంది . అది నిజంగా నా భాగ్యమే . అలాగే ఈ ఫంక్షన్ కి కూడా వచ్చింది. ఏయన్నార్ గారి మీద రీసెర్చ్ చేసిన జర్నలిస్ట్ గా, ఆయన మీద 74 ఎపిసోడ్ లు
తీసిన డైరెక్టర్ గా నన్ను హేమా మాలిని కి పరిచయం చేశారు. ఒకే వ్యక్తి మీద 74 ఎపిసోడ్ లు తీయగలగడం మీద , ఏయన్నార్ గారి మీద రీసెర్చ్ చెయ్యడం మీదా ఆవిడ ఆనందం తో ఆశ్చర్య పోయింది . " ఇట్స్ గ్రేట్ " అంది. ఆ సందర్భం గా యధా ప్రకారం మన ఫోటో జర్నలిస్ట్ మిత్రుడు శివ కెమెరా క్లిక్ మనిపించాడు . రాత్రికి రాత్రే నా ఈ మెయిల్ కి పంపించాడు. శివ గనుక వెంటనే ఈ ఫోటో పంపించక పోయి వుంటే ఈ ఆనందాన్ని మీతో ఇంత త్వరగా పంచుకునే అదృష్టం నాకుండేది కాదు.


Wednesday, October 12, 2011

థాంక్ యూ రేడియో మిర్చి ...

రేడియో మిర్చి మ్యూజిక్ అవార్డ్స్ 2010 కి న్యాయ నిర్ణేతలలో ఒకడిగా వ్యవహరించానని ఈ బ్లాగు రెగ్యులర్ గా చూస్తున్నవారికి బాగా తెలుసు. ఆ ఫంక్షన్ సెప్టెంబర్ 10 న చెన్నై లో అత్యంత వైభవం గా జరిగింది. నన్ను సకల మర్యాదలతో తీసుకువెళ్ళి ఎంతగానో గౌరవించి పంపించారు. థాంక్స్ టూ రేడియో మిర్చి టీమ్. ఆ కార్యక్రమం మా టీవీ లో అక్టోబర్ 9  న  ప్రసారమయింది. ఆ ప్రోగ్రామ్ లో నాకు సంబందించిన క్లిప్పింగ్స్ ని జత పరుస్తున్నాను. నా గురించి ఎంతో బాగా చెప్పిన రేడియో మిర్చి భార్గవి కి, హేమంత్ కి, ఈ క్లిప్పింగ్స్ ని నా పై అభిమానం తో ప్రత్యేకం గా ఎడిట్ చేసి ఇచ్చిన మా ఎడిటర్ వెంకట్ అచ్చి గారికి పేరు పేరునా నా కృతఙ్ఞతలు అందజేయకుండా ఉండలేను. క్లిప్పింగ్స్ చూసి మీ అభిప్రాయం రాయండి.


Saturday, August 13, 2011

సి ఎమ్ ని కలిసిన గురుతులు ....




2010 సంవత్సరానికి నందీ అవార్డుల జ్యూరీ మెంబర్ గా  దిగువన రాసినవి చదివారనీ చూసారనీ అనుకుంటూ మరొక మరిచిపోలేని అనుభవం గురించి చెప్తున్నాను . అవార్డుల నిర్ణయం అయిపోయాక సి యమ్ దగ్గిరికి వెళ్ళడానికి ముందు సభ్యులందరం కలిసి ఎఫ్ డీ సీ మేనేజింగ్ డైరెక్టర్ , ఐ ఎ ఎస్ ఆఫీసర్ వెంకటేశం గారితో ఫోటో తీయించుకున్నాం . ఆ తర్వాత సీ ఎం కిరణ్ కుమార్ రెడ్డి గారిని కలవడం అవన్నీ దిగువన రాసాను. ఐతే ఆ సంఘటనలను అన్నిటినీ ఫోటోల రూపం లో నాకు అందజేసింది ఎఫ్.డీ.సీ. లో మేనేజర్ మూర్తి గారు. ఆయన ఎంత డైనమిక్కో చెప్పలేను . మనకిది కావాలీ అని ఆయనతో అంటే చాలు . ఆ పని అయిపోయినట్టే . అలాగే ఎఫ్ డీ సీ లో అసిస్టెంట్ మేనేజర్ వెంకటేశ్వర్లు గారు. ఈయన మూర్తి గారికి కుడి భుజం . మూర్తి గారు ఎవరికైనా సరే కుడి భుజం లా వ్యవహరిస్తారు. ఈ రెండు భుజాలూ ప్లస్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేశం గారూ మొత్తం ముగ్గురూ ఓ త్రిభుజం లా ఏర్పడి మా చేత ఈ జ్యూరీ కార్యక్రమాన్ని నడిపింప చేసి మాకీ గౌరవం దక్కడానికి కారకులయ్యారు . సభ్యులందరం తీయించుకున్న ఫోటోలో కూర్చున్న వారిలో నా పక్కన బ్లూ షర్ట్ వేసుకుకుని కూర్చున్నది ఎఫ్ డీ సి ఎం డీ వెంకటేశం గారు. నిల్చున్న వారిలో కుడి వైపు వున్నది మూర్తి గారు (ఆయన రైట్ పర్సన్ కాబట్టి రైట్ సైడ్ నిలుచున్నారు). వెంకటేశ్వర్లు గారికి మొహమాటం ఎక్కువ . ఫోటో టైం కి మొహం చాటేశారు. ఎనీ వే మంచి మంచి గుర్తుల్ని భద్రపరుచుకోవడానికి వీలుగా ఫోటోల రూపం లోనూ , సీ డీ ల రూపం లోనూ వీలైంత త్వరగా నాకు అందజేసిన మూర్తి గారికి పదే పదే థాంక్స్ చెబుతూ ......  

Thursday, August 11, 2011

నందీ అవార్డుల జ్యూరీ మెంబర్ గా ....

2010 సంవత్సరానికి నందీ అవార్డుల జ్యూరీ సభ్యుడి గా వ్యవహరించానని దిగువన రాసాను. చదివారనుకుంటాను. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని కలవడం , ఆ తర్వాత జరిగిన ప్రెస్ మీట్ ... వీటన్నిటిలో నాకు
సంబందించిన వీడియో క్లిప్పింగ్ లని టీవీ 5 ముందుగా ఆగస్ట్ 5 న ప్రసారం చేసింది. నా సహోద్యోగి , మా టీవీ సినిమా పీఆర్వో రఘు ఆ క్లిప్పింగ్ లని సంపాదించి నాకు ఇచ్చారు . నా వరకు ఇవి అమూల్యమైనవి . అందుకే మీ అందరితో పంచుకోవాలని ఆశిస్తూ జత పరుస్తున్నాను.


Friday, August 5, 2011

నందీ అవార్డుల జ్యూరీ మెంబర్ గా ....


గత నలభై రోజులుగా బ్లాగ్ లో రాయకుండా వున్నవిషయం ఒకటుంది. అదేమిటంటే - 2010 సంవత్సరం నందీ అవార్డుల కమిటీ జ్యూరీ మెంబర్ గా ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం నన్ను నియమించింది.  మరో 15 మంది తో కలిసి గత నలభై రోజులుగా సుమారు 60 సినిమాలు చూసాను. పుస్తకాలు , వ్యాసాలకు సంబంధించి 2000 పేజీలు చదివాను ... అదీ ఈ నలభై రోజుల్లోనే ... సినీ పరిశ్రమ , తెలుగు ప్రేక్షకులు విపరీతంగా ఎదురుచూసే అవార్డ్ కమిటీ లో న్యాయ నిర్ణయ స్టానం లో వుండడం , (ఇవాళే) ముఖ్య మంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారిని కలిసి మా అభిప్రాయాలను చెప్పడం , ఆ తర్వాత ప్రెస్  మీట్ లో పాల్గొనడం ఇవన్నీ ఓ వింత అనుభూతినిచ్చాయి. సినిమా రీ రికార్డింగ్ కి ప్రత్యేకంగా ఓ అవార్డ్ వుండాలని గత పదేళ్ళు గా నా వ్యాసాలలో రాస్తూ , ఇంటర్వ్యూ లలో రీ రికార్డింగ్ ఇంపార్టెన్స్ ని చెబుతూ  రిప్రజెన్టేషన్ లు పెడుతూ వచ్చాను.భగవంతుడు నా మొర ఆలకించాడు . ఇన్నాళ్ళకు అవకాశం వచ్చింది . ఈ అవార్డుల సందర్భంగా నా సూచనను పరిశీలించడానికి ప్రభుత్వం అంగీకరించింది. నాకు చాలా ఆనందంగా, గర్వంగా వుంది . ప్రెస్ మీట్ ఫోటోలు జత పరుస్తున్నాను. టైం కి ఫోటో లు పంపిన మిత్రుడు , ఫోటో జర్నలిస్ట్ శివ కి , జ్యూరీ మెంబర్ గా వ్యవహరించడానికి అనుమతినిచ్చిన మా టీవీ కి ఎన్నిసార్లు కృతజ్ఞతలని చెప్పినా తక్కువే .... 
                

Sunday, July 10, 2011

Manisharma Birth Day Special మణిశర్మ పుట్టినరోజు సందర్భంగా ...

సంగీత దర్శకుడు  మణిశర్మతో నా పరిచయం దాదాపు 17 ఏళ్ళు గా.అతనికి నేనంటే ఎంతో అభిమానం, గౌరవం. నాక్కూడా అతనంటే ఎంతో ఇష్టం,ప్రేమ,అభిమానం,గౌరవం,వాత్సల్యం. ఫోన్ చేసి దేని గురించి అడిగినా ఏ భేషజం లేకుండా చెప్పేస్తాడు. ఈ మధ్యనే హైదరాబాద్ షిప్ట్ అయిపోయాడు. మొట్టమొదటి ఇంటర్వ్యూ నాకే ఇచ్చాడు . అదీ జూలై 11న తన పుట్టినరోజు సందర్భంగా.సినీ సంగీతాన్ని విపరీతంగా ప్రేమించే నాకు ఇంతకన్నా ఇంకేం కావాలి ? మణిశర్మ ఎన్నెన్నో మంచి మంచి ట్యూన్లు స్వరపరచాలని కోరుకుంటూ ... మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ...

Friday, July 8, 2011

As a Jury Member for Radio Mirchi Awards రేడియో మిర్చి అవార్ద్స్ కి జ్యూరి మెంబర్ గా ...

నా జీవితం లో మరొక అనందించదగ్గ, గౌరవప్రదమైన సంఘటన - రేడియో మిర్చి వారు ప్రతిష్టాత్మకంగా ఈ నెల 23న చెన్నై లో నిర్వహించబోతున్న 2010 మ్యూజిక్ అవార్ద్స్ జ్యూరీ సభ్యులలో ఒకనిగా వ్యవహరించడం. ఒక వారం పదిరోజులుగా ఆ వర్క్ లో వున్నాను. దాదాపు 590 పాటలు విన్నాను. నా వంతు జడ్జిమెంట్ ఇచ్చాను.అంతే కాదు లైఫ్ టైం ఎచీవ్ మెంట్ అవార్డ్ కి కూడా నా సలహాని వాళ్ళు స్వీకరించారు. అన్ని రిజల్ట్సూ తెలిసేది 23నే. ఈ సందర్భంగా జూలై 8న జరిగిన ప్రెస్ మీట్ కవరేజ్ ని, ఫొటోల్ని జతచేస్తున్నాను. నన్ను జ్యూరీ మెంబర్ గా ఎన్నిక చేసిన రేడియో మిర్చి చీఫ్ ప్రోగ్రామింగ్ ఆఫీసర్ తపన్ సేన్,మిగిలిన స్టాఫ్ లో ప్రముఖులైన శేఖర్, ప్రశాంత్,హేమంత్, భార్గవి వీరందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు. రియల్లీ అయాం వెరీ వెరీ హ్యాప్పీ అండ్ ఫీలింగ్ ప్రౌడ్ ఫర్ దిస్ ఆపర్ట్యూనిటీ.