Sunday, January 23, 2011

ఈవీవీ జ్ఞాపకాలు - 3


టీవీ రచనల్లో నా చేత బాగా రాయించుకుని కొందరు డబ్బులు ఎగ్గొట్టేవారు. ఫైనాన్షియల్ గా చాలా ఇబ్బంది పడే
వాణ్ణి.  ఈసంగతి తెలుసుకుని ఆ టైమ్ లో ఓ సినిమాకి (పేరు చెప్పడం భావ్యం కాదు) నా చేత రెండు సీన్లు , కామెడీ ట్రాక్ రాయించుకుని పదివేల రూపాయలు ఇచ్చాడు. ఆ రోజుల్లో పదివేలంటే ఇవాళ లక్ష్ కింద లెక్క . టైటిల్స్ లో పేరు పడని రైటర్ గా వుండడం ఇష్టం లేక ఆయన గ్రూప్ నుంచి బైటికి వచ్చేశాను. ఆ తర్వాత నుంచీ అతను తన దగ్గరుండే రైటర్ల పేర్లు రచనా సహకారం అంటూ టైటిల్స్ లో వెయ్యడం మొదలు పెట్టాడు.నేనన్నా, నేను రాసే కామెడీ అన్నా, సినీ సంగీతం పై నాకున్న అవగాహన అన్నా ఈవీవీకి చాలా గౌరవం.సినిమాలకి షూటింగ్ లని విదేశాల్లో ప్లాన్ చేసేవాడు.  "వరల్డ్ మ్యాప్ ముందరేసుకుని ఏయే ప్లేసులకెళ్ళలేదో వాటిని టిక్కు పెట్టుకుంటూ కథ రాసుకుంటున్నట్టుంది " అంటూ కామెంట్ చేశాను. గట్టిగా నవ్వేశాడు.


ఈవీవీ జ్ఞాపకాలు - 4


ప్రతి డిసెంబర్ 31 కీ జర్నలిస్ట్ లందరికీ విష్పర్ వ్యాలీలో పార్టీ ఇచ్చేవాడు. అప్పట్లో విష్పర్ వ్యాలీ అంటే ఊరవతల
కిందే లెక్క . "మీకేం .పార్టీ తర్వాత పైకెళ్ళి మీ రూమ్ లో హాయిగా పడుకుంటారు. వచ్చిన జర్నలిస్ట్ లు ఇంత చలిలో
అర్ధరాత్రి ఎలా వెళ్తారనుకున్నారు ? స్కూటర్లకి పంక్చర్ పడితే తోసుకుంటూ పోవడం తప్ప వాళ్ళకింకో గతి లేదు. మీరు పోసే ఆ రెండు పెగ్గులకి ఇంత అవస్త అవసరమా ? " అని అడిగాను అతనితో వున్న చనువు కొద్దీ. ఆ మాటల్ని
సీరియస్ గా తీసుకున్నాడతను.  కోపం రాలేదతనికి. మరుసటి సంవత్సరానికి జర్నలిస్ట్ లందరూ తిరిగి వెళ్ళడానికి
వెహికిల్స్ అరేంజ్ చేయించాడు.


ఈవీవీ జ్ఞాపకాలు - 5


ఓ సినిమాకి ఓ రెండు సీన్లు నాతో రాయించుకున్నాడని చెప్పాను కదా ... ఆ రెండు సీన్లలోనూ అతనితో విభేదించాను.
స్టాండర్డ్ దిగి రాయకూడదన్నాను. అతని బలవంతం మీద అతనికి కావలసినట్టు రాసిచ్చాను. " చూస్తూ వుండండి ... జనం వీటినే ఎంజాయ్ చేస్తారు." అన్నాడు. నిజంగా థియేటర్లో వాటికే క్లాప్స్ పడ్డాయి.  అలా రెండు మూడు సార్లు ఓడిపోయాను. కానీ ఒకే      ఒక్క సారి గెలిచాను. అదేమిటంటే ....
ఆర్యన్ రాజేష్ ని నటుడిగా పరిచయం చేస్తున్నప్పుడు  ప్ర్రెస్ మీట్ పెట్టాడు  మీటింగ్ అయిపోయాక సరదాగా కబుర్లు చెప్పుకుంటూకూచున్నాం. నరేష్ (అల్లరి నరేష్) ఎందుకో అక్కడికి వచ్చాడు . " మా రెండో వాడు " అంటూ పరిచయం చేశాడు.           "ఆడి కన్నా ఈడే మీకు పనికొచ్చేట్టున్నాడే ... ఫేస్ లో కామెడీ అదీ బాగా పలికేట్టుంది " అన్నాను. (ఈవీవీ తో మాట్లాడేటప్పుడే నా భాష మారిపోతూ వుంటుంది). " లేదు లేదు ...రాజేష్ మీద నాకు నమ్మకం వుంది " అన్నాడతను. తర్వాత కొన్నాళ్ళకి కలిసినప్పుడు ఈ ప్రస్థావన గుర్తుచేశాను. " అదే .. అదే " అన్నాడు జంధ్యాలని ఇమిటేట్ చేస్తూ...(ఒరిజినల్ గా ఈ మేనరిజమ్ మిస్సమ్మ లో యస్వీ రంగారావుది. దాన్ని జంధ్యాల సరదాగా అనుకరించేవాడు)

ఈవీవీ జ్ఞాపకాలు - 6


నేను హాసం పత్రిక నడిపిన మూడున్నర సంవత్సరాల్లో  తన సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా యాడ్ తప్పనిసరిగా ఇచ్చేవాడు. పేమెంట్ కూడాప్రామ్ట్ గా పే చేసేవాడు. తన సినిమా "ఆరుగురు పతివ్రతలు" పోయినప్పుడు " ఆ టైటిల్ కి నా పేరు బ్యాడ్ అయిపోయింది. అదే విశ్వనాథ్ గారి పేరు వుండి వుంటే తెగ మెచ్చుకునేవారు. నా పేరుతో వచ్చే సరికి వెకిలిగా ఫీల్ అయ్యారు " అన్నాడు నాతో పర్సనల్ గా.   అంతగా తనని తాను ఆత్మవిమర్శ చేసుకునేవాడు. " ఒక్కోసారి రాత్రి నిద్ర పట్టదు. భయం వేస్తూ వుంటుంది. నన్ను నమ్ముకుని యాభై కుటుంబాలు మద్రాసు నుంచి వచ్చేశాయి. ఫెయిలయినా సరే వాళ్ళ కోసమైనా సినిమాలు తీస్తూ వుండాలి నేను " అనేవాడు.


ఈవీవీ జ్ఞాపకాలు - 7


చివరగా ఈవీవీ తో మాట్లాడింది ఈ జనవరి ఆరున. . కొత్త సంవత్సరం లో కారు మార్చానని , ప్రస్థుతం ఓ ప్రాజెక్ట్ స్వంతంగా చేస్తున్నానని, అది అతి త్వరలో చెప్తానని ,  ఆ సందర్భం గా కలుస్తానని అన్నాను.  " సరుకు లేని వాళ్ళెంతో మంది సొమ్ము చేసుకుంటున్నారు. విషయం వుండి, పరిచయాలుండి, అనుభవం కూడా వుండి  మీరే ముందుకి రావటం లేదు. ధైర్యం చెయ్యండి. అంతా వున్నాంగా " అన్నాడు. కొండంత స్ఫూర్తినిచ్చాయి ఆ మాటలు. ఎందరి జీవితాల్లోనో వెలుగు నింపిన అతనిలోని దీపం - నా మనసులోని  ఆ ప్రాజెక్ట్ ఏమిటో వినకుండానే  కొండెక్కి పోయింది.


Monday, January 3, 2011

గొంతు కి 'చెక్ ' పెట్టిన మిరపకాయ్

రవితేజ , రిచా గంగోపాధ్యాయ నటించిన 'మిరపకాయ్ ' సినిమా 2011 సంక్రాంతి కి విడుదల కాబోతోంది.ఆ సినిమా ఆడియో
ఈ మధ్యనే రిలీజ్ అయింది. అందులోని పాటల్ని వింటుంటే నాకో డౌట్ వచ్చింది. వెంటనే ఆ సినిమా సంగీత దర్శకుడు తమన్ కి ఫోన్ చేస్తే క్లారిఫై చేసాడు .ఆ క్లారిఫికేషన్ చాలా ఇంటలిజెంట్ గా వుంది. ఈ విషయాన్ని నా జర్నలిస్ట్ మిత్రుడు , సాక్షి సినిమా పేజి ఇన్ఛార్జ్ ఎల్ . బాబూరావు గారితో చెప్పాను. అదే మేటర్నిసాక్షి సినిమా పేజి లో వేసాడాయన . ఆయనకు నా కృతఙ్ఞతలు. మీరు కూడా చదివి చూడండి.


Saturday, December 18, 2010

శ్రీ రామ వినయామృతం

' పాడుతా తీయగా ' ద్వారా పాపులరై , సినీ రంగం లో కాలుపెట్టి , వచ్చీనాయమ్మా(మనోహరం) వంటి మంచి మంచి పాటల్ని పాడి , మణిశర్మ వద్ద నాలుగు సంవత్సరాలు మ్యూజిక్ అసిస్టెంట్ గా పని చేసిన పార్థ సారథి (పార్థు) బాలూ గారంత  సంస్కారం వున్న గాయకుడు . శాస్త్రీయ సంగీతాన్ని కూడా అభ్యసించిన ఈ పార్థుదు - ఎకబిన  మూడు గంటల  కచ్చేరి ఇవ్వగల సమర్థుడు. నేర్చుకున్న విద్యని పొందిన అనుభవం తో జోడించి దానికి తనలోని సృజనాత్మకత ని జత కలిపి  'జయఘోష ' అనే ఓ ఫ్యూషన్ ఆల్బం కి సంగీతాన్నిచ్చాడు. టైమ్స్ మ్యూజిక్ ద్వారా విడుదలైన ఆ ఆల్బం డిసెంబర్ 17 న బాలూ గారి చేతుల మీదుగా రిలీజ్ అయ్యింది. పార్థు, శ్రీనిధి , పల్లవి,సాహితి  వీరందరి తో పాటు ఇండియన్ ఐడల్ శ్రీరాం కూడా  ఆ ఆల్బం లో పాడాడు. ఆ ఆల్బం గురించి తర్వాత చెప్తాను. టైమ్స్ మ్యూజిక్ ప్రతినిధి సత్యదేవ్  నాకు ఎప్పట్నుంచో  పరిచయం . ఆర్పీ పట్నాయిక్ , చక్రి వంటి వారు తమ  తొలిరోజుల్లో పరిచయాల్ని పొందింది సత్యదేవ్ ద్వారానే . ఆ సత్యదేవే ఇండియన్ ఐడల్ శ్రీరాం ని నాకు పరిచయం చేసాడు.  నా గురించి విని వుండడం వల్ల శ్రీరాం ఎంతో వినయం గా నన్ను రిసీవ్ చేసుకున్నాడు. ఆ సందర్భంగా ఫోటో  జర్నలిస్ట్ నరసయ్య సహృదయం తో తీసి పంపించిన ఫోటో ఇది . ఫోటో లో కూడా శ్రీరాం వినయం కనబడుతోంది చూడండి. థాంక్స్ టు పార్థు , బాలూ గారు, సత్యదేవ్, శ్రీరాం అండ్ నరసయ్య .      

Friday, December 17, 2010

'సంపూర్ణ గోత్రాలు'

నా రెగ్యులర్ వీడియోల వేట లో గత శనివారం బసంత్ పిక్చర్స్ వారు తీసిన 'సంపూర్ణ రామాయణ' కొన్నాను. వసంత దేశాయ్ మ్యూజిక్. భరత్ వ్యాస్ పాటల్ని రాశారు. అందులో ఓ పాట వింటుంటే మన తెలుగు పాట లో ఓ  లైన్ గుర్తొచ్చింది. హిందీ పాట 'బోలో సభీ జై రాం '. మహేంద్ర కపూర్, బృందం పాడేరు. గుర్తొచ్చిన లైన్ - 'కులగోత్రాలు' సినిమాలోని 'రావే రావే బాలా ' పాటలో 'ఇక్కడ పుట్టిన వాళ్ళం -ఎందుకు మనకీ మేళం' . సరదాగా ఆ రెండు పాటల్లో కామన్ ట్యూన్ తో వున్నాయనిపించిన ఆ లైన్స్ ని ఎడిట్ చేసి ,జాయిన్ చేసి మీ ముందు  ఉంచుతున్నాను. సంపూర్ణ రామాయణ , కులగోత్రాలు టైటిల్స్ ని కలిపి 'సంపూర్ణ గోత్రాలు ' అని హెడ్డింగ్ పెట్టాను. ఇది సరదాకే తప్ప ఎవర్నీకించ పరచడానికి కాదు. వీడియో ని క్లిక్ చేసి ఎంజాయ్ చెయ్యండి.

Monday, December 6, 2010

బాలమురళి గారి గురించి రాసే అదృష్టం - 1

డిసెంబర్ 5 , 2010 న విజయవాడ లో బాలమురళి కృష్ణ గారికి వారి గురువు గారు

పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి జన్మదినం సందర్భం గా మహోత్కృష్ట సన్మానం
జరిగింది. ఈ సన్మానాన్ని మా టీవీ కవర్ చేసింది . అందుకోసం నన్ను రెండు ఆడియో వీడియో
ప్రజంటేషన్ లు నన్ను రాయమన్నారు . నిజానికి ఆ టైం లో నేను అంత బాగులేను. ఆఫీస్ లో
కొందరి 'చపల వాచాలత్వం' కారణం గా చాలా డిస్టర్బ్ డ్ గా వున్నాను. ఉద్యోగ ధర్మం గా
ఆ సరస్వతీ దేవి మీద భారం వేసి రాయడం మొదలు పెట్టాను. పూర్తి అయ్యాక ఫరవాలేదనిపించింది.
ఎందరో తెలుగు రాని, పలకడం తెలియని ఆర్టిస్ట్ లకు తన వాయిస్ ద్వారా మంచి పేరు తీసుకువచ్చిన
డబ్బింగ్ ఆర్టిస్ట్ , ప్రముఖ గాయని సునీత ఈ ఏవీ లకి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి వచ్చింది . రిహార్సిల్ గా
వీటిని చదువుకుంటూ 'తెలుగు ఎంత చక్కటి భాషో కదా' అంది. ఆ మాటలు నాకు ఎంతో ఉపశమనం గా
అనిపించాయి. 'నువ్వు చెయ్యాల్సింది ఇంకా ఎంతో వుంది ' అని ఆ సరస్వతీ దేవే నన్ను కర్తవ్యోన్ముఖుణ్ణి చెయ్యడానికి పరోక్షం గా సునీత ద్వారా చెప్పించిందనిపించింది . ఎడిటర్ వెంకట్ అచ్చి సహకారం తో
తయారు చేసిన ఆ ఏవీ లని మా టీవీ సౌజన్యం తో ఇక్కడ జత పరుస్తున్నాను



బాలమురళి గారి గురించి రాసే అదృష్టం - 2

బాలమురళి గారి మీద నేను చేసిన ఆడియో వీడియో ప్రజంటేషన్ లలో ఇది రెండవది చూసి, జత పరిచిన స్క్రిప్ట్ చూసుకుంటూ మళ్ళీ వినండి. నేనెందుకంత తృప్తి గా ఫీలయ్యానో మీకే తెలుస్తుంది .