Sunday, May 30, 2010

ఇద్దరు మిత్రులు





సినీ పరిశ్రమలో ఏ భేషజం, కల్మషం లేని మిత్రులు దొరకడం చాలా అరుదుగా జరుగుతూ వుంటుంది. అదృష్టం కొద్దీ కోటి,చంద్రబోస్ ఇద్దరూ నాకున్న అటువంటి మిత్రులే. అందుకే మే 28న కోటి బర్త్ డే ని పురస్కరించుకుని ఆయన్ని అభినందించడానికి వెళ్ళాను. లక్కీ గా చంద్రబోస్ కూడా అక్కడుండడం నాకు మరీ కలిసొచ్చింది. చాలా కాలం తర్వాత ముగ్గురం కలిసి ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాం. కోటి తన గురువయిన చక్రవర్తి గారిని చాలా సేపు తలచుకున్నారు. చంద్రబోస్ ఈ బ్లాగు రెగ్యులర్ గా చూస్తున్నారు. ఈ బ్లాగులో విషయాలు మాట్లాడారయన. ముఖ్యంగా గురవారెడ్డి గారి హాస్పిటల్ గురించి,నేను పెట్టిన టైటిల్ గురించి మెచ్చుకుంటూ మాట్లాడారయన.ఎంతో తృప్తి గా గడిచిన రోజుల్లో ఆ రోజొకటి.

Thursday, May 13, 2010

సజ్జనుడే సర్జనుడైతే ....


















ప్రముఖ వైద్యులు డాక్టర్ గురవా రెడ్డి సికిందరాబాద్ లోని ప్యారడైస్ సర్కిల్ దగ్గిర ఇటీవల సన్ షైన్ హాస్పిటల్స్ ని ప్రారంభించారు. కొంతమంది స్నేహితుల తో కలిసి అత్యధిక వ్యయ ప్రయాసలకోర్చి , తను సంపాదించుకున్నదంతా కుమ్మరించీ గురవా రెడ్డి గారు నిర్మించుకున్న హాస్పిటల్ ఇది. ఈ ప్రారంభోత్సవానికి సినీ, సాంస్కృతిక, రాజకీయ ప్రముఖులతో పాటు ఎందరెందరో శ్రేయోభిలాషులు వచ్చి గురవారెడ్డి గారికి అభినందనలు తెలిపారు . పత్రికలూ , టీవీ చానల్సూ బ్రహ్మాండం గా కవర్ చేసాయి . ఒకరకంగా గురవారెడ్డి గారు సంపాదించుకున్న గుడ్ విల్ ఎంతుందో ఆరోజే చాలా మందికి తెలిసింది. లేటెస్ట్ ఎక్విప్ మెంట్ తో పాటు ప్రతీవారిని ఆకట్టుకునే అంశాలు ఓ రెండున్నాయి. 'పోకిరి' సినిమాలో మహేష్ బాబు ఓ డాక్టర్ తో ' ఫస్ట్ ఎయిడె మాన్డేట్రీ ' అంటూ అనిపించే సీన్ గుర్తుండే వుంటుంది . అలా సెల్లార్ లో ఓ ఎమర్జెన్సీ వార్డ్ ని ఏర్పాటు చేసారు. ఎమర్జెన్సీ కేసులు ఇక్కడ డైరెక్ట్ గా ఎడ్మిట్ అవుతాయి . అందుకు సంబంధించిన వెహికిల్ డైరెక్ట్ గా సెల్లార్ లోకి వచ్చెయ్య వచ్చు. ఎటువంటి ఫార్మాలిటీస్ లేకుండా అడ్మిట్ చేసుకుంటారు. మెడికో లీగల్ కేసులైనా సరే పేషెంట్ ని కాపాడిన తర్వాతే ఫార్మాలిటీస్ . ఈ సెల్లార్ లో సీటీ స్కానింగ్ , ఎమ్మారై ఎక్విప్ మెంట్ తో పాటు ఆపరేషన్ థియేటర్ కూడా వుంది. ఇవన్నీ జత పరిచిన ఫోటోలలో చూడవచ్చు. ఇక మిగిలిన ఫ్లోర్ లలో కార్పోరేట్ హాస్పిటల్స్ లో వుండే వన్నీ వున్నాయి. సాధారణంగా కార్పోరేట్ హాస్పిటల్స్ మధ్య తరగతి వారికి అందుబాటులో వుండవు అనే అభిప్రాయాన్ని దూరం చేయడానికే అన్నట్టు గురవా రెడ్డి గారు ఓ స్కీం ని పెట్టారు. దాని పేరు సేఫ్ కార్డ్. సేఫ్ లోని ఎస్ ఏ ఎఫ్ యి కి 'సన్ షైన్ ఆక్సిడెంట్ పాలసీ ఫర్ ఎమర్జెన్సీస్ ' అంటూ తనలోని కవితాత్మను కూడా ప్రదర్శించారు గురవారెడ్డి. సంవత్సరానికి మూడు వందలు కట్టి ఈ కార్డ్ ని స్వంతం చేసుకో వచ్చు. ఆక్సిడెంట్ లు అయినప్పుడు అవుట్ పేషంట్ గా అయితే వెయ్యి రూపాయిల వరకు మందులనీ , ఇన్ పేషంట్ గా అయితే లక్ష రూపాయల వరకు ట్రీట్ మెంట్ నీ తీసుకోవచ్చు. సంగీతానికి సంబంధించిన విషయాలు రాసే రాజా ఈ హాస్పిటల్ గురించి ఎందుకు చెప్తున్నాడా అనే సందేహం కలగొచ్చు. గురవారెడ్డి గారు గొప్ప సంగీత సాహిత్య ప్రియుడు. ఆయన కత్తులు కటార్ల తో వైద్యం చెయ్యరు మంచి మాటలతో నయం చేస్తారు అని అక్కినేని నాగేశ్వరరావు గారితో , ముళ్ళపూడి వెంకట రమణ గారితో అనిపించుకున్న సర్జనుడు -సజ్జనుడు . 'నవ్య ' మ్యాగజిన్ లో కొన్ని వారాల పాటు మంచి మంచి వ్యాసాలు రాసి తనలోని సంగీత సాహిత్యాభిలాష నీ, అభిరుచి నీ చాటుకున్నరస హృదయుడు - సరస హృదయుడు . అటువంటి వ్యక్తీ నుండి పర్సనల్ గా ఆహ్వానం అందుకోవడం , వెళితే నన్ను సంగీతానికి సంబంధించిన వ్యక్తీ గా ఆయన అప్యాయం గా రిసీవ్ చేసుకోవడం ఇవన్నీ నన్ను ఎంత గానో కదిలించాయి . ముఖ్యం గా ఫార్మాలిటీస్ కన్నా పేషెంట్ బ్రతకడం ఇంపార్టెంట్ అనే ఆయన సిద్ధాంతం నన్ను బాగా ఆకర్షించింది . ఆ సమయం లోనే నా మనసులో ఓ ఆలోచన స్ఫురించింది . అది గనుక ఫలిస్తే ' రాగానికి రోగానికి ముడి పెట్టె ఓ ప్రాజెక్ట్ ' గా రూపు దిద్దు కునే అవకాశం వుంది. అందుకు స్ఫూర్తి నిచ్చిన గురవారెడ్డి గారికి కృతజ్ఞతలు .

Monday, May 10, 2010

శ్రీ శ్రీ కి నివాళి గా ...

శ్రీ శ్రీ శతజయంతి సందర్భంగా ఏప్రిల్ ముప్పై న హైదరాబాద్ జూబిలీ హాల్ లో ఓ పెద్ద ఫంక్షన్ జరిగింది. బెంగుళూరు లో ఉంటున్న రాయుడు గారు, విశాఖపట్నం లో ఉంటున్న చలసాని ప్రసాద్ గారు కలిసి శ్రీ శ్రీ వర్క్స్ అన్నిటినీ మూడు పుస్తకాలు గా 'శ్రీ శ్రీ ప్రస్తాన త్రయం ' పేరుతో ప్రింట్ చేయించారు. ఆ పుస్తకాల ఆవిష్కరణ ఆ రోజు ఉదయం జరిగింది . ఎందరెందరో ' గొప్ప గొప్ప' అభిమానులు వచ్చారా సభ కి. నిజంగా ఆ పుస్తకాలు ప్రింట్ చేయించి తిరుగులేని సాహితీ సేవ చేసారు రాయుడు గారు , చలసాని ప్రసాద్ గారు. భవిష్యత్ తరాలకు నిలిచిపోయే సేవ ఇది. ప్రముఖ రచయిత్రి శ్రీమతి మృణాళిని అధ్యక్షతన మధ్యాహ్నం జరిగిన సెమినార్ లో శ్రీ శ్రీ గురించి ఎందరో మేధావులు ప్రసంగించారు . ఇక సాయంత్రం జరిగిన సంగీత కార్యక్రమం లో ఒక చోట నేను వేదిక మీదికి వెళ్లక తప్పలేదు. అది ఎందుకో , అక్కడ నేను ఏం మాట్లాడానో జత పరిచిన వీడియో క్లిక్ చేసి చూడండి . అర్ధమైపోతుంది ...

Monday, May 3, 2010

బుల్లితెర పై విశ్వనాథ్ గారి పక్కన ... పూర్వ జన్మ సుకృతం ..

ఎన్ టీవీ వారికి భక్తీ టీవీ , వనితా టీవీ వున్నాయి. శంకరాభరణం రిలీజై ముప్పై ఏళ్ళు ఐన సందర్భంగా ఓ కార్యక్రమాన్ని చెయ్యాలనుకున్నారు వనితా టీవీ వారు. సంధానకర్త గా ప్రముఖ నృత్య కళాకారిణి శోభానాయుడు గారిని పిలిచారు. ఇక నిర్మాత ఏడిద నాగేశ్వర రావు గారు , దర్శకుడు కె. విశ్వనాథ్ గారు లేకుండా కార్యక్రమమే లేదు కనుక వారిని పిలిచారు. వీరందరితో పాటు నన్ను కూడా పిలవడమే ఆశ్చర్యం , ఆనందం కూడా. లిస్ట్ లో నా పేరు చూసి ' కరెక్ట్ పర్సన్ ని పిలిచారు' అని అన్నారట విశ్వనాథ్ గారు. అది ఇంకా ఆనందం ... ఓ విధంగా అవార్డ్ లాంటిది కూడా. ఇదిలా వుండగా ఈ ప్రోగ్రాం లో నేను పాల్గొనడానికి నేను పని చేస్తున్న మా టీవీ వారు పర్మిషన్ ఇవ్వడం వారు నాకిచ్చే గౌరవానికి ఓ ఉదాహరణ . ఏప్రిల్ ఇరవై ఐదు సాయంత్రం ఆరున్నర నుంచి ఏడున్నర వరకు ప్రసారమైన ఆ 'మూడు పదుల శంకరాభరణం ' కార్యక్రమం కి వనితా టీవీ వారు ఇచ్చిన ప్రోమో ని దిగువన జత పరుస్తున్నాను . (షూటింగ్ జరుగుతున్నప్పుడు తీసిన ఫోటో ని శోభా నాయుడు గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని మరీ పంపారు).

మూడు పదుల శంకరాభరణం గురించి ...

పైన చెప్పిన కార్యక్రమం నిడివి సుమారు నలభై నిముషాలు. బ్లాగు లో అంత కార్యక్రమాన్ని పెట్టలేం. పైగా నేరం కూడా. అంచేత నేను మాట్లాడిన భాగం లో కొంత భాగాన్ని జత పరుస్తున్నాను .