Monday, May 10, 2010

శ్రీ శ్రీ కి నివాళి గా ...

శ్రీ శ్రీ శతజయంతి సందర్భంగా ఏప్రిల్ ముప్పై న హైదరాబాద్ జూబిలీ హాల్ లో ఓ పెద్ద ఫంక్షన్ జరిగింది. బెంగుళూరు లో ఉంటున్న రాయుడు గారు, విశాఖపట్నం లో ఉంటున్న చలసాని ప్రసాద్ గారు కలిసి శ్రీ శ్రీ వర్క్స్ అన్నిటినీ మూడు పుస్తకాలు గా 'శ్రీ శ్రీ ప్రస్తాన త్రయం ' పేరుతో ప్రింట్ చేయించారు. ఆ పుస్తకాల ఆవిష్కరణ ఆ రోజు ఉదయం జరిగింది . ఎందరెందరో ' గొప్ప గొప్ప' అభిమానులు వచ్చారా సభ కి. నిజంగా ఆ పుస్తకాలు ప్రింట్ చేయించి తిరుగులేని సాహితీ సేవ చేసారు రాయుడు గారు , చలసాని ప్రసాద్ గారు. భవిష్యత్ తరాలకు నిలిచిపోయే సేవ ఇది. ప్రముఖ రచయిత్రి శ్రీమతి మృణాళిని అధ్యక్షతన మధ్యాహ్నం జరిగిన సెమినార్ లో శ్రీ శ్రీ గురించి ఎందరో మేధావులు ప్రసంగించారు . ఇక సాయంత్రం జరిగిన సంగీత కార్యక్రమం లో ఒక చోట నేను వేదిక మీదికి వెళ్లక తప్పలేదు. అది ఎందుకో , అక్కడ నేను ఏం మాట్లాడానో జత పరిచిన వీడియో క్లిక్ చేసి చూడండి . అర్ధమైపోతుంది ...

Monday, May 3, 2010

బుల్లితెర పై విశ్వనాథ్ గారి పక్కన ... పూర్వ జన్మ సుకృతం ..

ఎన్ టీవీ వారికి భక్తీ టీవీ , వనితా టీవీ వున్నాయి. శంకరాభరణం రిలీజై ముప్పై ఏళ్ళు ఐన సందర్భంగా ఓ కార్యక్రమాన్ని చెయ్యాలనుకున్నారు వనితా టీవీ వారు. సంధానకర్త గా ప్రముఖ నృత్య కళాకారిణి శోభానాయుడు గారిని పిలిచారు. ఇక నిర్మాత ఏడిద నాగేశ్వర రావు గారు , దర్శకుడు కె. విశ్వనాథ్ గారు లేకుండా కార్యక్రమమే లేదు కనుక వారిని పిలిచారు. వీరందరితో పాటు నన్ను కూడా పిలవడమే ఆశ్చర్యం , ఆనందం కూడా. లిస్ట్ లో నా పేరు చూసి ' కరెక్ట్ పర్సన్ ని పిలిచారు' అని అన్నారట విశ్వనాథ్ గారు. అది ఇంకా ఆనందం ... ఓ విధంగా అవార్డ్ లాంటిది కూడా. ఇదిలా వుండగా ఈ ప్రోగ్రాం లో నేను పాల్గొనడానికి నేను పని చేస్తున్న మా టీవీ వారు పర్మిషన్ ఇవ్వడం వారు నాకిచ్చే గౌరవానికి ఓ ఉదాహరణ . ఏప్రిల్ ఇరవై ఐదు సాయంత్రం ఆరున్నర నుంచి ఏడున్నర వరకు ప్రసారమైన ఆ 'మూడు పదుల శంకరాభరణం ' కార్యక్రమం కి వనితా టీవీ వారు ఇచ్చిన ప్రోమో ని దిగువన జత పరుస్తున్నాను . (షూటింగ్ జరుగుతున్నప్పుడు తీసిన ఫోటో ని శోభా నాయుడు గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని మరీ పంపారు).

మూడు పదుల శంకరాభరణం గురించి ...

పైన చెప్పిన కార్యక్రమం నిడివి సుమారు నలభై నిముషాలు. బ్లాగు లో అంత కార్యక్రమాన్ని పెట్టలేం. పైగా నేరం కూడా. అంచేత నేను మాట్లాడిన భాగం లో కొంత భాగాన్ని జత పరుస్తున్నాను .

Sunday, December 6, 2009

ఒక హిందీ - రెండు తెలుగులు

1957 లో హిందీలో ' బడాభాయ్ ' అనే సినిమా వచ్చింది. అందులో రెండు పాటలు బాగా పాప్యులర్. రెండో పాట గురించి , సినిమా గురించి, ఆ సినిమా సంగీత దర్శకుడి గురించి తర్వాత చెప్పుకుందాం. పాప్యులర్ అయిన మరో పాట ' చోరి చోరి దిల్ కా ' . బడాభాయ్ అధారం గా తెలుగులో 1959 లో ' శభాష్ రాముడు ' వచ్చింది. కనుక హిందీ లోని ' చోరి చోరి దిల్ కా ' పాట ట్యూన్ ని ' కల కల విరిసి జగాలే పులకించెలే ' కి వాడుకున్నారు.అదే సంవత్సరం విడుదలైన ' మాంగల్యబలం ' సినిమాలోని ' ఆకాశ వీధిలో అందాల జాబిలి ' పాటకి కూడా ఆ హిందీ సినిమా ట్యూన్ ని చాలా తెలివిగా వాడుకున్నారు. ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఒరిజినల్ ఆధారం గా తీసుకుని చేసిన ' కల కల విరిసి ' పాట కన్నా - ఏ సంబంధం లేకుండా తీసుకుని చేసిన ' ఆకాశ వీధిలో ' పాట హిట్ అవడం. ఇక ' ఆకాశ వీధిలొ ' పాటను సుశీల తో పాడిన ఘంటసాలే ' కల కల విరిసి ' పాటకు సంగీత దర్శకుడు అవడం, ఈ రెండు తెలుగు పాటల్నీ శ్రీ శ్రీ యే రాయడం మరో విచిత్రం .
0

Tuesday, December 1, 2009

' అనగనగా ఆకాశం వుంది ' పాట గురించి ...


మలయాళ గాయకుడు జయచంద్రన్ గురించి తెలుగు వాళ్ళకి చాలా తక్కువ తెలుసు. జాతీయ స్థాయిలో తమిళ , మలయాళ సినీ రంగాల నుండి బహుమతులనందుకున్న గాయకుడాయన. సంగీత దర్శకుడు చక్రవర్తి 1980లలో ఈయనతో ఓ రెండు పాటలు పాడించారు. ఇక్కడ చెప్పొచ్చేదేమిటంటే సెంటిమెంట్స్ తెలుగు వాళ్ళకు తెగ ఎక్కువ కదా అది వర్కవుట్ అయ్యేసరికి ఆయన మన వాళ్ళకి ఓ పాట విషయం లో కంపల్సరీ అయిపోయాడు. ఉషా కిరణ్ వారి ' నువ్వే కావాలి ' సినిమా అందరికీ గుర్తుండే వుంటుంది. అందులో ' అనగనగా ఆకాశం వుంది ' పాట పెద్ద హిట్టు. ' నువ్వే కావాలి ' ఒరిజినల్ వెర్షన్ మలయాళం లో 'నిరం', అందులోని ఆ కాలేజి వార్షికోత్సవాల గీతాన్ని జయచంద్రనే పాడడం, అది పెద్ద హిట్ అవడం తో తెలుగులో కూడా ఆయనతోనే పాడించారు. జత పరిచిన వీడియోలను చూడండోసారి.

Sunday, November 22, 2009

రాజా కు అక్కినేని ప్రశంసలు

జీవితాంతం గుర్తుంచుకొదగ్గ సంఘటన ఇటీవల నా జీవితం లో జరిగింది. మా టీవీ లో ఉద్యోగం చేస్తున్నాను కనుక అక్కడ 'గుర్తుకొస్తున్నాయి ' అనే ప్రోగ్రాం గత మూడున్నర సంవత్సరాలుగా చేసేను. 2006 సంవత్సరానికి ఆంధ్రప్రదెశ్ ప్రభుత్వం మొదటి బహుమతినిచ్చి నందీ అవార్డు తో సత్కరించింది. ఆ తర్వాత ఆ కార్యక్రమాన్ని అక్కినేని నాగేశ్వరరావు గారితో కొనసాగించడం జరిగింది.ఆయన జీవితం లోని అన్ని అంశాలను స్పృశిస్తే సుమారు 74 ఎపిసోడ్ లు అయ్యాయి. ఆవన్నీ కలిపి 25 సీడీలు గా విడుదల అయ్యాయి. ఆ సీడీల ఆవిష్కరణ సభలో శ్రీ అక్కినేని నాగెశ్వర రావు గారు నా గురించి ఎంతో గొప్పగా చెప్పారు. తెలుగు చలనచిత్ర పరిశ్రమ,ప్రేక్షకులు గర్వించే ఓ లెజెండ్ నా గురించి మాట్లాడడం, ఎక్నాలెడ్జ్ చెయ్యడం నాకు నందీ అవార్డ్ కన్నా గొప్పగా అనిపించాయి.ఏయన్నార్ గారి ద్వారా ప్రశంసలు అందుకోవడం మాటలు కాదని పరిశ్రమలోని వారందరికీ తెలుసు. ఇన్నాళ్ళుగా నేను పడిన శ్రమకి భగవంతుడు ఈ రూపంలో గుర్తింపునిచ్చాడనిపించింది.నా ఆనందంలో పాలుపంచుంటారిని ఆశిస్తూ ఏయన్నార్ ప్రసంగం లో కొంత భాగాని వీడియోగా జతపరుస్తున్నాను.చూస్తారు కదూ ?

Tuesday, October 13, 2009

రాజా గురించి హెచ్ ఎం టీవి లో రామజోగయ్య శాస్త్రి

రామజోగయ్య శాస్త్రి గురించి ఇవాళ్టి సినీ శ్రోతలకు ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అతి తక్కువ కాలంలో సింగిల్ కార్డ్ లిరిక్ రైటర్ గా ఎదిగిన వినయశీలుడైన ప్రతిభావంతుడు. ఇటీవల ఆయన్ని హైదరాబాద్ లో వున్న మరో శాటిలైట్ చానల్ హెచ్ ఎం టీవి ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూ లో నా గుంచి చెప్పి నన్ను ఎక్నాలెడ్జ్ చెయ్యడం నా జీవితం లో మరొక మరపురాని సంఘటన. సినీ పరిశ్రమ లో నాతో ప్రత్యక్ష సంబంధాలు గలవారున్నారు. పరోక్ష సంబంధాలు వున్నవారున్నారు. కొద్దో గొప్పో ఇప్పటికీ నన్ను సంప్రదించే వారున్నారు. మీ సలహా నా కెరియర్ కి , నా నాలెడ్జ్ కి వుపయోగపడిందన్నవారున్నారు. ఇవన్నీ తెర వెనుకే. సినిమా వారితో ముడిపడిన ముప్పై ఐదేళ్ళ నా కెరియర్ లో నన్ను పబ్లిక్ గా ఒక చానెల్ ద్వారా ఎక్నాలెద్జ్ చేసింది ఒక్క రామజోగయ్య శాస్త్రి గారు మాత్రమె . అందుకు ఆయనకు నా ప్రత్యేక కృతజ్ఞతలు . ఓ జ్ఞాపకంగా చూసుకోడానికి ఆయన ఇచ్చిన అర గంట ఇంటర్వ్యూ లో నా వరకు వున్న భాగాన్ని, నా మాటలతో సహా జత పరుస్తున్నాను.

Monday, August 17, 2009

భాష తెలిసినా పాడడానికి , రాయడానికి కష్టమైన పాట ఇది...

ఓ సారి వృత్తి రీత్యా ఓ ఇంటర్వ్యూ కోసం సంగేత దర్శకుడు కీరవాణి గారిని కలవడం జరిగింది.ఆయన కున్న టైట్ షెడ్యూల్ వల్ల కారులోనే ఇంటర్వ్యూ చేయక తప్పలేదు. ఇంటర్వ్యూ అయ్యాక, జర్నీ ఇంకా వుండడం చేత ఆయన తన దగ్గరున్న ల్యాప్ ట్యాప్ ని ఆన్ చేశారు. అప్పుడు వినిపించింది ఓ తమిళ గీతం. వినడానికి ఎంత గొప్ప గా అనిపించిందో పాడడానికి అంత కష్టం గా వుంటుందంపించిందా పాట.ఇది సుమారు ఏడు సంవత్సరాల క్రితం సంగతి. అప్పట్నుంచి సుమారు ఓ రెండేళ్ళ పాటు సాగింది వేట - ఆ పాట వివరాలు కనుక్కోడానికి. మా టీవీ లో ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగ రీత్యా చెన్నై వెళ్ళడం జరిగింది. అక్కడ కనబడ్డ ప్రతి వీడియో షాపులోనూ ఎంక్వైరీ చేయడం జరిగింది. ఒక షాపులో మాత్రం నా అవస్థ గమనించి ఆ పాటని ముత్తైతరు పాట అని అంటారని , అది అరుణగిరి నాదర్ 'సినిమాలోనిదని, ఆ వీడియో కాపీ తన దగ్గర ఒక్కటి మాత్రమే వుందని,దాని ఖరీదు రెండు వందల డబ్భై అయిదు అయినా హైద్రాబాద్ నుంచి వచ్చాను కనుక నూటా యాభై కి ఇస్తానని అన్నాడు. (మూసార్ బేర్ కంపెనీ రాకముందు వీసీడీల ధరలు అలాగే వుండేవి). అదికూడా మర్నాడు పదిన్నరకి వస్తేనే ఇస్తానన్నాడు. మర్నాడు సరిగ్గా అదే సమయానికి మణిశర్మతో ఇంటర్వ్యూ షూటింగ్.షెడ్యూల్ ప్రకారం ఆయన ఇంటికి వెళ్తే తెమలడానికి మరో అరంగంట కావాలన్నారు లక్కీగా.ఆ అరగంట నాకోసమే అన్నట్టుగా సెట్ అయింది. వెంటనే వెళ్ళి అ వీడియోని చేజిక్కించుకున్నాను. తిరిగి వచ్చాక చేతిలో ఉన్న వీడియోని చూసి, జరిగిన కథని మొత్తం విన్నాడు మణిశర్మ." ఆ ముత్తైతరు పాటని ప్రాక్టీస్ చెయ్యడాని చచ్చేవాళ్ళమండీ బాబూ ...."అంటూ ఆ పాటలో ఎక్కడెక్కడ కష్టం గా వుంటుందో వాటన్నిటినీ పాడి వినిపించాడాయన." ఇంత కష్టమైన సాహిత్యాన్ని తెలుగులో ఇప్పుడెవరైనా రాయగలరా ? " అని అడిగాను. దానికాయన " వేటూరి గారు ఒక్కరే రాయగలరు . ఐనా సంగీతం మీద ఇలాంటి ప్రయోగాలు ఇవాళ ఎవరు చెయ్యనిస్తారు ?" అన్నారు. విన్నాక మీకూ అనిపిస్తుంది ఇలాంటివి పాడడం ఎంత కష్టమో... అన్నట్టు ఈ పాటను పాడిందీ, పాటకు నటించిందీ తమిళ నాట అలనాటి ప్రముఖ గాయకుడు టి.యం.సౌందర్రాజన్.

Wednesday, August 5, 2009

ప్రే 'రణ ' రంగం లో సృజనాత్మకత


ఈ ఫొటోలో వున్నావిడ పేరు లీలానాయుడు. ఈ మధ్యనే చనిపోయింది. ఆ రోజుల్లో మంచి అందగత్తె గా ఈవిడ గురించి చెప్పుకునేవారు. ఈవిడ నటించిన సినిమాల్లో అందరికీ తెలిసిన సినిమా - ' ఏ రాస్తే హై ప్యార్ కి ' . అందులో రఫీ , ఆశా పాడిన ' ఎ ఖామోషియా ఎ తన్ హాయియా ' పాట చాలా పెద్ద హిట్. ఈ పాట ట్యూన్ ని కూడా మనవాళ్ళు వదలలేదు. 'మనుషులు - మమతలు ' సినిమాలో 'నిన్ను చూడనీ నన్ను పాడనీ ' పాటకి వాడుకున్నారు. కాకపోతే అప్పట్లో ఇటువంటి విషయాల్లో కొంత నిజాయితీ కూడా చూపే వారు. పల్లవినో, చరణాన్నో ప్రేరణగా తీసుకున్నా మిగతా భాగాన్ని అధ్భుతంగా స్వంతం గా చేసి, ప్రేరణగా తీసుకున్న భాగం తో కలిపి టోటల్ గా వచ్చిన అవుట్ పుట్టే ఒరిజినల్ అవుట్ పుట్టేమో అన్నంత బాగా పాటని తయారు చేసే వారు. అందుకు వుదాహరణ గా ' ఎ ఖామోషియా ' , 'నిన్ను చూడనీ ' పాటల్నే చెప్పుకోవాలి. రెండు పాటల్నీ మొత్తం గుర్తుకు తెచ్చుకునో లేదా డవున్ లోడ్ చేసుకుని వినో చూడండి. ప్రస్తుతానికి పల్లవులని మాత్రం క్లిక్ చెసి చూడండి.